మానవులలో లాగా కాకుండా, అడవిలో తిరిగే జంతువులలో క్రూరమృగాలు, సాధు జంతువులూ ఆకారం బట్టి దాదాపు తెలిసిపోతుంటాయి. అందుకే క్రూరమృగాలనుంచి తప్పించుకోవడానికి, చిన్న జంతువులు, ఎప్పటికప్పుడు మేధస్సుకు పదును పెట్టుకుంటూ, వాటి బారినుంచి తప్పించుకుంటాయి. అలాంటిదే ఈ పంచతంత్రకథ !
వర్షాలు బాగాకురిసే ఒకానొక దట్టమైన అడవీప్రాంతంలో, ' ఖరనకరుడు ' అనే సింహం అధికారం చెలాయిస్తూ వుండేది. ఒకసారి బాగా వర్షాలుపడడంతో, జంతువులన్నీ, తలా ఒకదిక్కున గూడుచూసుకుని, మునగదీసుకుని వెచ్చగా పడుకున్నాయి.
ఖరనకరుడు వేటకు బయలురితే, ఒక్క జీవీ చిన్నదీ, పెద్దదీ, యేదీ దాని కంట బడలేదు. విపరీతమైన ఆకలితో అరణ్యమంతా తిరుగుతూ, ఒక గుహలాంటి ప్రదేశానికి వచ్చి ఆగింది. ' ఇందులో తప్పకుండా చాలా జంతువులు వుండేవుంటాయి, ఈ రోజు మంచిభోజనం దొరుకుతుంది నాకు ' అనుకుంటూ, మెల్లగా లోపలకు ప్రవేశించింది.
అయితే, దాని దురదృష్ఠ౦. దానికి ఒక్కజంతువుకూడా లోపల కనబడలేదు. కానీ, యేదో జంతువు అందులో నివాసం వుంటున్నట్లుగా ఆనవాళ్లు దొరికి, ' మళ్ళీ యిప్పుడు ఆహరంకోసం, యెక్కడ తిరుగుతానూ, యిక్కడే పొంచివుండి, ఆ జంతువు రాగానే దానిని గుటకాయ స్వాహా చేస్తాను. ' అని ఓపికగా ఆగుహలోనే కూర్చుంది.
సూర్యాస్తమయం అవుతుండగా, ఆ గుహని స్థావరంగా ఏర్పరచుకున్న ' దధిపుచ్చుడు ' అనే జిత్తులమారి నక్క, అడవిఅంతా తిరిగి, దాని స్థావరానికి రానేవచ్చింది. లోపలికి వెళ్ళబోతూ, హఠాత్తుగా, ఆగిపోయింది. ఆ నక్క అలా ఆగిపోవడానికి కారణం, గుహలోకి ఒక సింహం లాంటి క్రూరజంతువు వెళ్తున్నట్లుగా వున్న కాలిజాడలు. నక్క భయంతో వణికిపోయింది. బాగా పరికించి చూసినా, ఆనక్కకు, యెక్కడా కూడా సింహం గుహలో నుండి తిరిగి వెళ్లిన గుర్తులు కనబడలేదు.
వెంటనే, నక్కకు అర్ధమైపోయింది, ' లోపల సింహంవున్నది, తనను ఆహారంగా చేసుకోవడానికి యెదురుచూస్తున్నది' , అని. ' అయ్యో ! నా గుహ దీనిపాలు అయ్యింది. నా ప్రాణమూ దీనికి ఆహారం అవుతున్నదేమో ! ' అని తలపోసి, అసలు సింహం అందులో వున్నదో లేదో నిర్ధారణ చేసుకుందామని, ఒక వుపాయం ఆలోచించింది.
వెంటనే నక్క, గుహకు దగ్గరగావెళ్లి, ' గుహా ! ఓ గుహా ! నీ స్నేహితుడిని వచ్చాను. ' అన్నది. సమాధానం కోసం వేచినదానిలాగా కొద్దిసేపు వుండి, ' గుహా ! మన యేర్పాటు ప్రకారం నీవు నన్ను లోపలకు పిలవాలికదా ! లోపలిరమ్మని నీవు పిలువకుండా నేనెలా రాగలను ? నన్ను పిలువవా ? ఇక్కడ బయట చాలాచలిగా వున్నది. ఇప్పుడు నీవు నిశ్శబ్దంగా వున్నావంటే, నేను యింకోచోటు చూసుకోవలసిందే కదా ! ' అని సమాధానం కోసం చెవులు రిక్కించి వినసాగింది.
నక్క బుట్టలో సింహం పడనేపడింది. పిలవకపోతే, యెక్కడ నక్క గుహలోకిరాదో అని, ' నక్కగారూ ! రండి, రండి. స్వాగతం. మీగురించే యెదురుచూస్తూవున్నాను. ' అని యెంతో ఆప్యాయంగా సింహం, గుహ పిలిచినట్లుగా, నక్కని పిలిచింది. అంతే ! నక్కకు అర్ధమైపోయింది, దానివూహా నిజమైందని. ' ఇదుగో వస్తున్నా వస్తున్నా. చిన్న పని వుంది, ఇప్పుడే గుర్తుకొచ్చింది. మళ్ళీ వస్తాను. ' అని అక్కడ నుంచి నక్క పరుగో పరుగు.
నక్క ఏమాత్రం ఏమరుపాటుగా, గుహలోకి ప్రవేశించినా, దానికి ఆరోజుతో నూకలు చెల్లేవే ! సింహానికి విందుభోజనం అయిపోయేదే ! అందుకే పెద్దలు అన్నారు ' అపాయాన్ని పసిగట్టి, వుపాయంగా తప్పించుకునే వాడే, సంఘంలో బ్రతికి బట్టకట్టగలుగుతాడు ', అని.
Source: Gandavarapu Prabhakar Garu
(Facbook)
No comments:
Post a Comment