Friday, 18 October 2019

వ్యాస మహాభారతం - 18 (S -3)

ఆదిపర్వం. తృతీయాశ్వాసం.
సౌతి శౌనకాది మహామునులకు చెబుతున్నాడు.
వైశంపాయనుడు దేవయాని వృత్తాంతం చెప్పసాగాడు, జనమేజయునకు.
' వృషపర్వుడనే రాక్షసరాజు వద్ద శుక్రాచార్యులు రాజపురోహితులుగా వుండేవారు. శుక్రాచార్యుల వద్ద 'మృత సంజీవని ' విద్య వుండడం చేత, యెప్పుడు దేవదానవ సంగ్రామంలో రాక్షసులు మరణించినా, వారిని బ్రతికించి రాక్షసజాతికి మేలు చేసేవాడు. ఆకారణంగా, దేవతలు రాక్షసులపై యేనాటికీ విజయం సాధించలేకపోగా, వారు దేవతలకు పక్కలో బల్లెం లాగా వుండి దైవకార్యాలకు అడ్డుతగులుతూ వుండేవారు. 
ఈ ఆపదనుండి గట్టెక్కడానికి, దేవతలు కుటిలోపాయంతో బృహస్పతి కుమారుడైన కచుని శుక్రాచార్యుని వద్దకు శిష్యరికం చేయడానికి వెళ్లి, ఆ మృతసంజీవనీ విద్యను నేర్చుకుని రమ్మని పంపించారు. అంతేగాక, శుక్రాచార్యుని కుమార్తె అయిన దేవయాని మనసు దొంగిలించి, ఆమెద్వారా శుక్రాచార్యుని ప్రాపకం పొంది, విద్యను సంగ్రహించి, స్వర్గలోకానికి రమ్మని చెప్పారు. 
అయితే, కచుడు వారి మాటలు విన్నట్లే విని, సరాసరి శుక్రాచార్యుని వద్దకు వెళ్లి, ' ఓ సూర్య తేజస్సు గల మహర్షీ ! శుక్రాచార్యా ! నేను దేవగురువైన బృహస్పతి కుమారుడను. నన్ను కచుడు అంటారు. మీకు శుశ్రూష చేసి, మీవద్ద విద్యలు నేర్చుకోవడానికి వచ్చాను. నన్ను అనుగ్రహించండి. ' అని వినయంగా పలికాడు. 
శుక్రుడు కచుని మృదు వచనాలకు ముగ్ధుడై, అతడిని తన శిష్యుడిగా తీసుకున్నాడు. కచుడు కూడా యెప్పుడు యెవరు యేపని చెప్పినా తు. చ. తప్పక చేసిపెట్టేవాడు. శుక్రుడి మనస్సు కి సంతోషం కలిగేది, అతని కార్యశూరతకు. దేవయాని పట్ల కూడా అతను ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ, అరణ్యంలో దొరికే పూలూ, మధురఫలాలు ఆమెకు తీసుకువస్తూ, అతడిపై ఆమె దృష్టి మరలేటట్లు చేసుకున్నాడు. అయితే యేనాడూ దేవయానితో కచుడు ప్రేమపాఠాలు చెప్పలేదు. 
రాక్షసులకు కచుడి కదలికలు నచ్చలేదు. ముఖ్యంగా కచుడు రాక్షసుల విరోధులైన దేవతల గురువు బృహస్పతి కుమారుడు కావడమే, వారి విరోధానికి కారణం. రాక్షసగణం వారిలో వారు కూడబలుక్కుని, గోవులను అడవికి తీసుకువెళ్లిన కచుడు మళ్ళీ ఆశ్రమానికి రాకుండా చేసారు. గోవులన్నీ తిరిగి వచ్చినా కచుడు రాకపోవడంతో, దేవయాని మనసు కీడుని శంకించింది. 
ఈవిషయం దేవయాని తండ్రి శుక్రునికి చెప్పగానే, ఆయన దివ్యదృష్టితో చూసి, కచుని మృతకళేబరం వున్న చోటుని తెలుసుకుని, మృతసంజీవనిని ప్రయోగించి, కచుడు క్షణాలమీద ఇంటికి వచ్చేటట్లు చేసాడు. దేవయాని సంతోషించింది. కచుడు కూడా శుక్రునికి కృతజ్ఞతతో పాదాభివందనం చేసాడు. 
ఇంకొన్నాళ్ళకి రాక్షసులు మళ్ళీ కచుని చంపే ప్రయత్నంలో, కచుడ్ని నిర్దాక్షిణ్యంగా చంపి, అతని శవాన్ని కాల్చి, ఆ బూడిదను మద్యంలో కలిపి, శుక్రాచార్యునికి యిచ్చారు. మళ్ళీ కచుడు సాయంత్రమైనా రాకపోయేసరికి, ఈసారి, కచుడు తన పొట్టలోని మద్యం తో కలిసి ఉన్నట్లు గుర్తించి, ' ఆహా ! నా మద్యపాన అలవాటు యెంత పనిచేసింది, ' అని దుఃఖించి, ' అమ్మా ఈసారి కచుని శరీరాన్ని బూడిదగా నా ఉదరం లోకి రాక్షసులు ప్రవేశ పెట్టారు. నేను అతడిని రక్షించలేను. అతడికి ఉత్తమగతులు వచ్చేటట్లు ప్రార్ధన చేయగలను. ' అని కుమార్తె దేవయానితో అన్నాడు. 
దానికి దేవయాని సుతరామూ ఒప్పుకోలేదు. ' నిన్ను ఆశ్రయించిన వాడిని, బృహస్పతి పుత్రుడిని, అందగాడిని, యెలా అంత నిర్దాక్షిణ్యంగా వదలి వేస్తావు తండ్రీ ! కచుడు తిరిగి రాకుండా నేను ముద్దైనా ముట్టను. ' అని దేవయాని మారాం చెయ్యసాగింది. 
దేవయాని కోర్కె తీర్చడానికి తండ్రి శుక్రుడు ఏమి చేసాడో !

No comments:

Post a Comment