ఆదిపర్వం. చతుర్దాశ్వాసం.
సౌతి శౌనకాది మహామునులకు చెబుతున్నాడు.
శకుంతల వెళ్లేసరికి, దుష్య౦తుడు, మంత్రులు,సామంతులు, పురోహితులు, పురప్రముఖులతో రాజసభలో కొలువుతీరి వున్నాడు. తనను చూడగానే దుష్య౦తుడు పరుగునవచ్చి ఆలింగనం చేసుకుని, సింహాసనం దగ్గరకు తీసుకువెళ్తాడని వూహించింది, శకుంతల, .
కానీ, దుశ్యంతుడు అసలు ఆమెను పట్టించుకొనలేదు. శకుంతల హృదయం బాధతో బ్రద్దలైంది. ' ఈ మహారాజు నన్ను నిజంగానే మర్చిపోయాడా ? అయితే ఫరవాలేదు, నా జ్ఞాపకాలను తట్టిలేపి ఇతడికి జ్ఞాపకం చెయ్యవచ్చు. లేదా అసలు మా సమాగమమే అతడికి గుర్తులేదా ? అప్పుడైనా ఏదో విధంగా స్ఫురణకు తేవచ్చు. కానీ, తెలిసికూడా తెలియనట్లు మోసగిస్తుంటే మాత్రం ఇతడికి చెప్పాలంటే, ఆ కమలగర్భుడి దిగి రావాలేమో ! ' అనుకున్నది.
ఈ విధంగా ఆలోచించి ఆ సాధ్వీ శిరోమణి శకుంతల, ' ఇంతదూరం వచ్చి వట్టి చేతులతో వెళ్తామా ? నలుగురిలో నగుబాటు కదా ! జరిగినదంతా చెప్పి, ఈ మా కుమారుడిని తండ్రివద్దకు చేరుస్తాను. నాకు అంతకంటే కావలసినది లేదు. ' అని దృఢంగా భావించి మహారాజుకు జరిగినదంతా సభాసదులముందే పూసగుచ్చినట్లు వివరించి, ' ఈ బాలుడు మన యిద్దరకూ రాక్షస వివాహం ద్వారా పుట్టిన కుమారుడు. పురువంశానికే అలంకార ప్రాయుడు. నీవు నాకు చేసిన వాగ్దానాన్ని గుర్తు తెచ్చుకుని, ఇతడిని పురువంశ చక్రవర్తిగా పట్టాభిషిక్తుడను చెయ్యి.' అని ధైర్యంగా చెప్పింది. .
కానీ దుశ్యంతుడు ఆమె మాటలు పట్టించుకోకుండా, ' అసందర్భపు మాటలాలడకు ' అని తూలనాడాడు. ' నేను నిన్నెప్పుడూ చూడలేదు వచ్చిన దారినే పో ' అన్నాడు . దుశ్యంతుని ఆ విధమైన సమాధానానికి రోషంతో శకుంతల కళ్ళు ఎర్రబడ్డాయి. తెల్లబోయి, క్రీగంటిచూస్తూ, 'మహారాజా ! అన్నీ తెలిసీ తెలియని వానివలె మాట్లాడుతున్నావు. మన వివాహానికి సాక్ష్యం లేదనే ధైర్యంతో ధర్మాత్ముడవని కీర్తి గడించిన నీవు, అసత్యం ఆడుతున్నావు.
'ఓ కీర్తివంతుడా ! మన వివాహానికి వేదాలు, పంచభూతాలు ఉభయసంధ్యలు, యముడు,సూర్యచంద్రులు, పగలు, రాత్రీ సాక్ష్యాలుగా వున్నాయి. వాటిని ధిక్కరించి ఏమానవుడూ మనలేడు. నువ్వు నన్ను మోసం చేసే ప్రయత్నం చెయ్యకు. నన్ను అవమానించే ప్రయత్నం మానుకో ! పతివ్రతా, గుణవంతురాలు, సంతానవతి అయిన భార్యను నిరాదరించినవాడు ఇహపరాల్లో సుఖాన్ని పొందలేడు. '
' రాజా ! అనుకూలమైన భార్య కలవాడే కర్మలు చేయగలడు. పురుషుడికి ఇల్లాలికంటే, ఆనందం ఇచ్చే వ్యక్తి యెవరూ వుండరు. భార్యాపిల్లలను కంటికి రెప్పలా చూసుకునే వారు, యెలాంటి దుఃఖాన్ని అయినా మంచులా కరిగింప జేసుకుంటారు. భార్య యందు భర్త వీర్యం ప్రవేశించి, భర్తే, పుత్రుడి రూపంలో వస్తాడు. ఒక దీపం నుండి ఇంకొక దీపానికి వెలుగు ప్రసరించినట్లు, నీ పుత్రుడు నీ అంశగా ప్రకాశిస్తున్నాడు. '
'ఓ రాజా ! ఇన్ని మాటలెందుకు ? నీ పుత్రుని దగ్గరకు తీసుకుని కౌగలించుకో ! పుత్రగాత్రపరిష్వ౦గమును మించి ఆనందం వుండదు. నీ కుమారుడు వేయి యాగాలు చేస్తాడని అతడు పుట్టినప్పుడు స్వయంగా దేవేంద్రుడే చెప్పాడు. అలాంటి నీ కుమారుడిని తిరస్కరిస్తున్నావు, కారణం లేకుండా. '
' ఓ మహారాజా ! నూరు బావులకన్నా ఒక దిగుడు బావిమేలు. అట్టి నూరు దిగుడు బావులకన్నా, ఒక యజ్ఞము మేలు. అలాంటి నూరు యజ్ఞాలకన్నా ఒక పుత్రుడు మేలు. అటువంటి నూరు పుత్రులకన్నా, ఒక సత్యవాక్యం మేలు. కణ్వాశ్రమంలో నీవు నాకిచ్చిన మాట గుర్తుకు తెచ్చుకో ! ఈ బాలుడిని చూడు. రాజర్షి విశ్వామిత్రుడికీ, దేవతాస్త్రీ మేనకకు పుట్టిన నేను సత్యంమీద ప్రమాణం చేసి చెబుతున్నాను. ' అని శకుంతల ఎన్నో రకాల చెప్పిచూసింది.
అయినా దుశ్యంతుడు చెవిని పెట్టక, ' ఓ అతివా ! చూడు. స్త్రీలు అతికినట్లు అబద్ధాలు చెప్పగలరన్న మాటను నువ్వు ఋజువు చేస్తున్నావు. నిన్ను యింతకు పూర్వం యెన్నడూ చూడలేదు. ఏదో నాలాగా ఆజానుబాహువుగా వున్నాడని ఈ కుర్రవాడిని నా కుమారుడిగా నమ్మించే ప్రయత్నం ఈ సభలో చేయడానికి సాహసిస్తున్నావు. నీ కట్టుకథలు ఆపి ఈ పిల్లవాడిని తీసుకుని నీ ఆశ్రమానికి తిరిగి పో ! ' అన్నాడు.
దానికి శకుంతల క్రుద్ధురాలై, ' చిన్నప్పుడు నన్ను తల్లీదండ్రీ వదిలివేశారు, ఇప్పుడు భర్తకూడా కాదంటున్నారు. విధి నాతో ఆటలాడుకుంటున్నది. ' అని భోరున విలపిస్తూ శకుంతల సభలో నుండి బయటకు వెళ్లబోతుండగా, ఆశ్చర్యంగా అశరీరవాణి సభలో అందరికీ వినబడేటట్లు, ' ఓ మహారాజా ! ఈ శకుంతల గొప్ప పతివ్రత. ఈ పిల్లవాడు, భరతుడు అనే నామధేయం కలవాడు, మీ ఇరువురకూ జన్మించినవాడు. ఇతడిని ఆదరించి పట్టాభిషిక్తుడను చెయ్యి. ఆమె చెప్పినదంతా యదార్ధం. ' అని చెప్పింది.
అప్పుడు దుష్య౦తుడు, ' సభాసదులారా ! ఈమెను నేను గాంధర్వ పద్ధతిన కణ్వాశ్రమం లో వివాహం చేసుకున్నాను. ఆ విషయం మా ఇరువురకే తెలుసు. లోక నిందకు భయపడి, నేను బయటకు చెప్పలేకపోయాను. కానీ అద్భుతంగా అశరీరవాణి మీ అందరి సంశయాలను తీర్చింది. ' అంటూ భరతుని దగ్గరకు తీసుకుని ముద్దాడాడు. పుత్రగాత్ర పరిష్వ౦గంలో తేలిపోయాడు. శకుంతలను పట్టమహిషిగా గౌరవించాడు.
ఆ తరువాత కొన్నాళ్ళకు భరతునికి రాజ్యం అప్పజెప్పి, శకుంతలతో భోగభాగ్యాలను అనుభవించి, తపోవనానికి వెళ్ళిపోయాడు. భరతుడు అనేక సంవత్సరాలు ప్రజారంజకంగా పాలన చేసి అనేక యజ్ఞాలు చేసాడు. దేవతలనూ బ్రాహ్మణులనూ సంతోషపెట్టాడు.
Source: Gandavarapu Prabhakar Garu
(Facbook)
No comments:
Post a Comment