ఇరుగుపొరుగులతో వుండాల్సింది, కలుపుగోరు తనం గానీ, కుటిలత్వం కాదని సున్నితంగా చెప్పిన పంచతంత్ర కథ.
ఒకానొక గ్రామంలో ఒక పేద యువకుడు, ' శాండిలి ' అనే పేరుగల తనభార్యతో కాపురం వుండేవాడు. వారు పేదవారే అయినా, వున్నంతలో దానధర్మాలు, పూజలూ చేసుకునేవారు. ఒకరోజు, ఆ యువకుడు, తన భార్యతో ' శాండిలీ ! ఈ రోజు మహాలయా అమావాశ్య. పెద్దల పేరు చెప్పి, సూర్యనారాయణుడి ప్రీతి కొరకు, అపరాహ్ణము లోపు యెవరైనా బ్రాహ్మణునికి భోజనం పెడితే బాగుంటుంది. ఆ యేర్పాట్లుచెయ్ ! ' అని చెప్పాడు.
అయితే యింటిలో సరుకులన్నీ నిండుకున్నవనీ, తాను భోజనం యేర్పాట్లు చేయలేనని చెప్పి, కొన్నినువ్వులు మాత్రం యింట్లోవున్నాయి, దానితో యేదైనా చేసి, బ్రాహ్మణునికి సమర్పించుకుందాం. మన అశక్తత ఆ భగవంతునికి తెలియదా ! ' అని బదులిచ్చింది.
' సరే ! అలాగేచేద్దాం. ' అని ఆ యువకుడు, యేదో పనిమీద బయటకువెళ్ళాడు. అతని భార్య శుచిగా నువ్వులను శుభ్రంచేసి, బాగాతడిపి, పెరటిలో యెండబెట్టింది. ఇంతలో యేదో పనిచేసుకుంటూ, నువ్వులవైపు చూడగా, ఆ యెండుతున్న నువ్వులను, ఒకకుక్క ముట్టుకుని, తినబోతున్నది.
అది చూసి, శాండిలి, పెద్దగా అరుస్తూ, దానిని వెళ్లగొట్టి, ' అయ్యో ! వున్న ఒక్కవస్తువు బ్రాహ్మణునికి సమర్పించుదామంటే, ఈ మాయదారి కుక్క ముట్టుకున్నదే, యేమి చెయ్యడం ? ' అని ఆలోచిస్తుండగా, ఇంటికి తిరిగివచ్చిన భర్త, ' ఆ నువ్వులను యెవరికైనా సగం కొలతకు మారకం చేసి తీసుకురా ! ' అని ఆమెను పంపాడు.
ఈ ఆలోచన బాగానేవున్నదని, శాండిలి, పొరుగింటికివెళ్ళి, ' నేను శుభ్రంచేసి ఆరబోసిన నువ్వులను, సగం మామూలు నువ్వులకు యిద్దామని వచ్చాను వదినా ! తీసుకుంటావా ! ' అని అడిగింది. ఇది యేదో మంచి లాభసాటిబేరం అనుకుని, పొరుగింటి ఆమె,
' తప్పకుండా వదినా ! ' అని మంచినువ్వులు తేవడానికి లోపలికి వెళ్ళింది.
' తప్పకుండా వదినా ! ' అని మంచినువ్వులు తేవడానికి లోపలికి వెళ్ళింది.
అయితే, యిదంతా ప్రక్క గదిలో నుండి వింటున్న ఆమె కుమారుడు, ' అమ్మా ! శుభ్రం చేసిన ఆరబోసిన నువ్వులను యే కారణంలేకుండా యెవరైనా సగంధరకే యిస్తారా ? ఇందులో యేదో మోసంవున్నది. నీవు తీసుకోవద్దు. ' అనిచెప్పాడు. కుమారుడు చెప్పింది సబబుగానే వున్నదని, తడినువ్వులు తీసుకోకుండానే శాండిలినిని తిప్పి పంపివేస్తుండగా, , శాండిలి తన తప్పు వప్పుకుని, అసలుసంగతి చెప్పింది.
' అయ్యో ! అలాగా ! యిబ్బందులు యెవరికైనా వస్తాయి వదినా ! ఈ సారికి నా దగ్గర వున్న నువ్వులు తీసుకుని, నీవు అనుకున్నపని జరుపుకో, తరువాత యిద్దువుగానిలే ' అని ఆపొరుగింటి యిల్లాలు, స్నేహంగా సహాయం చేసింది.
శాండిలిని కూడా, ఆమె స్నేహభావానికి యెంతో సంతోషించి, మనసు తేలికపడి, తాను తప్పు వప్పుకుని, నిష్కల్మషంగా బయటకు వచ్చినందుకు సంతోషించింది.
అనుకోని అవాంతరాలను స్నేహితుల ద్వారా సులభంగా గట్టెక్క వచ్చు. కుటిలనీటితో కాదని, చెప్పేకథ యిది.
Source: Gandavarapu Prabhakar Garu
(Facbook)
No comments:
Post a Comment