ఒక పెద్దచెట్టు తొర్రలో ' కపింజలం ' అనే పక్షి వుండేది. అది ఒకనాడు ఆహారం కోసం బయటకువెళ్లి తిరిగి వచ్చేసరికి, దానితొర్రలో ' దీర్ఘ కర్ణుడు ' అనే కుందేలు జేరి యెంత చెప్పినా కదలకుండా, స్వంతయింటిలో వున్నట్లు పడుకునే వున్నది . పైగా యిది నాయిల్లు, లెమ్మనమంటే, ' చెట్టు తొర్రలు, నీటిచెరువులు ముందుగా యెవరు స్వాధీనం చేసుకుంటే వారివే ' అని చెప్పింది. వీటిపై యెవరికీ శాశ్వత అధికారం లేదని నొక్కి వక్కాణించింది.
పాపం కపింజలం యెంతో బాధపడింది. వాదించింది. చాలా కాలం నుంచి యిక్కడే వుంటున్నానని మరీ మరీ చెప్పింది. అక్కడే తిరుగాడే పైనున్న కాకినీ, క్రిందనున్న తాబేలుని కూడా సాక్ష్యం తీసుకు వచ్చింది. ఎన్నో సాక్ష్యాధారాలు చూపించింది. అయినా దీర్ఘ కర్ణుడు వినలేదు. అసలు ఆతొర్ర తిరిగి యిచ్చే ఉద్దేశ్యం వుంటే కదా !
కుందేలు తనమాట మీదే తాను నిలబడింది. పైగా ' నామాట మీద నమ్మకంలేకపోతే, ఇక్కడే దగరలో ' దధికర్ణుడు ' అనే పిల్లి వున్నది. అది గొప్ప పండితురాలు. దానిని తీర్పు అడుగుదాం. ' అనికూడా సలహా యిచ్చింది.
కుందేలు మాటవిని కపింజలం వణికి పోయింది. ' అయ్యయ్యో ! మణి ధరించింది కదా అని పామునెవరైనా నమ్ముతారా ! పండితుడైనా నీచబుద్ధి వాడిని దరి జేరనీయకూడదు. ఆపిల్లి నీచజాతికి చెందినది. పైగా మాంసాహారి. దానిని నమ్మరాదు. ' అన్నది. కుందేలు పెద్దగా నవ్వి, చెవులు అటూ ఇటూ ఆడించి వేళాకోళంగా, ' నీకు ఈ తొర్ర కావాలంటే పిల్లి తీర్పు కోరదాం. లేకుంటే నీ దారిన నీవు ఫో ! ' అని గద్దించింది.
విధిలేక ఆపక్షి, పిల్లి తీర్పుకు వప్పుకుంది. ఇద్దరూ, పిల్లికి నమస్కరించి సంగతి చెప్పారు. దధికర్ణుడు కుందేలుని పక్షిని మార్చి మార్చి చూసింది. తలపంకించింది. నాలుకతో పెదాలు సవరించుకుంది. గుడ్లు అటూ యిటూ త్రిప్పింది. క్షణకాలం ఆలోచిస్తున్నట్లు కళ్ళు మూసుకుని తెరచి, తాపీగా యిరువురి వాదనలు విన్నది.
ఆపై ' చిరంజీవులారా ! వయసుచేత అనుభవంచే పండిపోయిన వాడను. దగ్గరగా రండి. నా మాటలు వినండి. నేను మిమ్ములను ముట్టను. మాంసాహారం మానివేశాను . శాకాహారినై, ప్రశాంతజీవితం గడుపుతున్నాను. నాకు సరిగా వినబడడం లేదు. ఇంకా దగ్గరగా వచ్చి మీ వాదనలు చెప్పండి. ' అన్నది.
దధికర్ణుని మాటలునమ్మి, యిరువురూ అమాయకంగా దాని వద్దకువచ్చి రెండు చెవులవద్దా తమ వాదనలను వినిపింపసాగారు . ' నాయనలారా ! ఈ శరీరాలు శాశ్వతం కాదు. యెప్పుడో నశించిపోయేవే. ఆ గూడూ శాశ్వతం కాదు. మనతో వచ్చేది మంచి మాత్రమే. అందుకే పరోపకారం చెయ్యాలి, ' అని అరమోడ్పుకన్నులతో చెప్పింది.
ఆ రెండు జీవాలు, పక్షీ కుందేలూ తన మాటలను విని పరిసరాలు మరచిపోతున్నారని గ్రహించిన దధికర్ణుడు వారికి మైకం పెంచాలని వెనుకటి దానచరిత్ర కలిగిన మహాత్ముల కధలు చెప్పసాగింది.
ఆ మాటలకు కపింజలం, దీర్ఘకర్ణుడు నిజంగానే, మైమరచిపోయారు. అలా మాటలను చెబుతూ అవి ఏమరుపాటుగా వున్నాయని నిశ్చయించుకుని, దధికర్ణుడు అనబడే పిల్లి హఠాతుగా రెంటినీ ఒడిసిపట్టుకుని చంపి తినేసింది. ' బ్రేవ్ ' మని త్రేనుస్తూ, అవి తగవులాడుకున్న తొర్ర వైపు అడుగులు వేసింది.
అల్పుడికి అధికారమిచ్చి పైన కూర్చుండబెట్టిన వాని బుద్ధి యెలా మారుతుంది.
ఈకధ చదివి సెటిల్మెంటు రాజకీయాలు, కుహనాబాబాలు మీకు గుర్తువస్తే నా తప్పుకాదు. ఎందుకంటే కొందరు నాయకుల పరిస్థితీ, కొన్ని మఠాల పరిస్థితి అట్లాగే వుంది మరి.
Source: Gandavarapu Prabhakar
(Facbook)
No comments:
Post a Comment