ఒకవూరిలో బాగా చదువుకున్న ఒక బ్రాహ్మణుడు వుండేవాడు. కానీ ఆయనకు లౌక్యం, కల్మషము తెలియదు. ఇవి లేకపోతే వెర్రిబాగులవాడి క్రిందే లెక్కకదా యేరోజుల్లో అయినా..
ఆయన యజ్ఞం చేయాలనే, సద్భావనతో, అన్ని లక్షణాలూ బాగున్న ఒక మంచిమేకను కొనుక్కుని సంతనుండి తన వూరికి తీసుకువెళుతున్నాడు. యజ్ఞం చెయ్యవలెనంటే మేక ఎందుకనుకుంటున్నారా ? ఆ రోజుల్లో యజ్ఞక్రియ లో భాగంగా బలి యిచ్చేవాళ్ళు. ఇప్పుడిప్పుడు ఆ ఆచారం తగ్గిపోయింది లెండి !
ఇక కథలోకి వద్దాం. ఆయన ఆమేకతో ఒంటరిగా నిర్మానుష్యంగా వుండే దారిగుండా వెళుతుంటే, బ్రాహ్మణుని మోసం చేసి మేకను కాజేయాలని నలుగురు దొంగలు పధకంవేశారు. పధకంలో భాగంగా నలుగురూ, నాలుగు చోట్ల దూరం దూరంగా, ఆయన వెళ్లే దారిలో కాపుగాశారు.
బ్రాహ్మణుడు వడివడిగా భయంభయంగా దారిన వెళుతుంటే, మొదటి దొంగ యెదురుపడ్డాడు. ' అయ్యా ! తమరు శాస్త్రాలు చదివిన బ్రాహ్మలు లాగా వున్నారు, తమరు కుక్కను ముట్టుకోవచ్చా ? అందునా అంత నల్లటిదానిని. ' అని ముక్కుమీద వేలువేసుకుని ఆశ్చర్యం ప్రకటించాడు. దానికి బ్రాహ్మణుడు నవ్వి, ' ఓరీ వెర్రిబాగుల వాడా ! మేకనుచూచి కుక్క అంటావేమిరా ? ఇది యెంతో మంచిజాతి మేక. యజ్ఞం కోసం కొన్నాను. ' అని కోప్పడి ముందుకువెళ్ళాడు.
మరికొంచెం దూరం వెళ్ళగానే, రెండవవాడు యెదురై, ' పంతులుగారూ ! నల్లకుక్కను తీసుకు వెళ్లుతున్నారేమిటీ ? మీ వాళ్ళు చూస్తే వెలివేస్తారు జాగ్రత్త. ' అని ఆయన స్పందనకై ఎదురుచూడకుండా వెళ్లిపోయాడు. ఇప్పుడు కొంచెం అనుమానం వచ్చింది ఆ బ్రాహ్మణునికి. వీళ్ళు నా నుంచి యేమీ ఆశించలేదు కదా ! అబద్ధం యెందుకు చెబుతారు. కొంపదీసి యిది కుక్క కాదుకదా అనుకుని, మళ్ళీ ధైర్యం కూడదీసుకుని ముందుకువెళ్ళాడు.
అయితే, మరికొద్ది సేపటికి మూడవదొంగ యెదురుపడి, ' స్వామీ ! ఏ సంతలో కొన్నారు యీకుక్కని. నల్లగా భలే మెరుస్తున్నదే ! ' అని వేళాకోళం చేశాడు. ఇప్పుడు బ్రాహ్మణునికి కోపంవచ్చింది. ' ఏమిరా ! మదిర సేవించివున్నావా యేమి ? ఇది జాతి మేక. కుక్కకు మేకకు తేడా తెలియకుండా వున్నావా ? ' అని గద్దించి ముందుకు వెళ్ళాడు.
అయితే, వాడిని గదమాయించి పంపినా, ఆయనలో అనుమానం బాగా బలపడింది, ఇది కుక్కే అయివుంటుందని. ఒకడుకాదు, ఇద్దరుకాదు, ముగ్గురు దీనిని కుక్క అన్నారు. నేనే సంతలో మోసపోయానా ! ' అని ఆలోచించడం మొదలుపెట్టాడు.
ఇంకాసేపటికి నాలుగోదొంగ యెదురై, ' అయ్యోరు బాగా మోసపోయినట్లున్నారే ! మేక అని చెప్పి యెవడో మీకు కుక్కను అంటగట్టాడు. ఎంత అపచారం చేశాడు మాయదారి వెధవ ! ' అని ఆయనమీద సానుభూతి చూపించడం మొదలు పెట్టాడు. ఇప్పుడు ఆ అమాయక బ్రాహ్మణునిలో కంగారు మొదలైంది. ఇది నిజంగా కుక్కేనేమో ! నా జాతివాళ్ళు చూస్తే యెంత అప్రదిష్ట. ' అనుకుంటూ కులంలోనుంచి యెక్కడ వెలివేస్తారో అని, చటుక్కున ఆ మేకను కుక్కగా భావించి, క్రింద వదిలివేసి వెనుకకు చూడకుండా వెళ్లిపోయాడు.
ఆ నలుగురు దొంగలూ మేకతో పండగ చేసుకున్నారని వేరేచెప్పాలా !
నలుగురు దొంగలూ యెంతో మేధావితనంతో, మనిషి మానసిక బలహీనతను ఆధారం చేసుకుని, బ్రాహ్మణుని మీద ఒక్కదెబ్బ వేయకుండా, పదుగురాడిన మాట యెవరైనా నమ్ముతారని గ్రహించి, ఆ సూత్రాన్ని ప్రయోగించారు. విజయం సాధించారు.
అందుకనే, యిప్పటికీ యిలాంటి మోసాలు జరుగుతున్నాయి.
ప్రక్కవీధిలో దొంగలు వున్నారు, మీ నగలన్నీ మూటకట్టి యీ రుమాలులో కట్టండని వరుసగా యిద్దరు ముగ్గురు చెప్పి, నగలు గృహిణుల నుంచి కాజేసిన సంఘటనలు వింటూనే వుంటాం.
మీ గృహం వాస్తు బాగాలేదని, నలుగురి చేత చెప్పించి, చుట్టుప్రక్కల వాళ్ళు చౌకగా ఆ ఇంటిని క్రయం చేసే సంఘటనలు మన చెవినబడుతూనే వుంటాయి.
సాంఘిక మాధ్యమాలలో ఎడతెరిపి లేకుండా, మనలను ఆలోచించుకోనీకుండా, అనేక మంది వారి వారి అభిప్రాయాలను మనమీద రుద్దడానికి, వెంట వెంట వారి భావజాలాన్ని మనమీద కుమ్మరించి, వారి మతంలోకి, వారు అనుకుంటున్న సమూహంలోకీ, మనలను లాగాలని ప్రయత్నిస్తారు.
అల్లాంటప్పుడు యిలాంటి కధలు గుర్తుకువచ్చి విచారణ చేసుకుంటే, ఆ మాయనుంచి గట్టెక్కవచ్చు.
Source: Gandavarapu Prabhakar
(Facbook)
No comments:
Post a Comment