Friday, 18 October 2019

చెట్టుతొర్రలో గుండెకాయ.

మంచిమంచి పళ్ళచెట్లు, చెరువులు వున్న ఒకఅడవిలో, ' రక్తముఖుడు ' అనే చురుకైన కోతి ఒకటి, కావలసిన పళ్ళన్నీతింటూ, యెంతో బలిష్టంగా వుండేది. అది ఒకరోజు, చెరువుప్రక్కన వున్న నేరేడుచెట్టుమీద తియ్యని నేరేడుపళ్ళు తింటూ వుండగా, చెరువులోనుండి, ' కరాళముఖుడు ' అనేమొసలి చూసి, ఒడ్డుకువచ్చి, ' తమ్ముడూ ! నాకూ కొన్ని నేరేడుపళ్ళు పెట్టావా ! ' అని అడిగింది. స్వతహాగా స్నేహశీలి అయిన కోతి, ' అయ్యో ! దానికేం భాగ్యం ' అంటూ రెండుగుప్పిళ్ళతో మొసలికి అందేటట్లు పళ్ళు విసిరింది. మొసలి ఆనందంగా తింటూ కృతజ్ఞతలు చెప్పింది.
అప్పటినుండి, యిద్దరూ యెంతోస్నేహంగా, అక్కడ కలుస్తూ, తియ్యని నేరేడుపళ్ళు తింటూ, సాయంత్రంపూట కాలక్షేపం చేసేవాళ్ళు. పోతూపోతూ ఇంటికి ఆలశ్య౦గా వచ్చినందుకు తన భార్య అలగకుండా, తనభార్యకు కూడా యిమ్మనమని, మొసలి మరికొన్ని నేరేడుపళ్ళు కోతిని అడిగి, తీసుకెళ్తూ వుండేది.
ఇలా కొన్నిరోజులు గడిచాయి. ఒకరోజు ఇంటి దగ్గరవున్న ఆడమొసలికి దుర్బుద్ధి పుట్టింది. ' ఈ నేరేడు పళ్ళు యింత తియ్యగావున్నాయి. వీటిని రోజంతా తిని, కోతి పుష్టిగా పెరిగిందని మా ఆయన చెప్పాడు. దాని గుండెకాయను తింటే, ఇంకెంత ఆనందంగా వుంటుందో కదా ! ' అని తలపోసింది. ఆ ఆలోచన రావడమే తడవుగా, తనభర్తను, ' యెలాగైనా, ఆ కోతిని యిక్కడకు తీసుకురా. దానినిచంపి, దాని గుండెకాయను తింటేకానీ, నాకు తృప్తిగా వుండదు. ' అనిచెప్పింది.
ఆడమొసలి ఆలోచనకు కరాళముఖుడు వణికిపోయాడు. ' స్నేహితుడిని మోసంచేసి తీసుకువచ్చి చంపడం పాపం. నీకు కావాలంటే, యింకోజలచరాన్ని దేనినైనా ఆహారంగా తీసుకువస్తాను, ఆకోతి నాకు సోదరసమానుడు. ' అని యెంతో ఆవేదనగా చెప్పాడు. ఊహూ ! ఆడ మొసలి, ' ససేమిరా ' అన్నది. ' తమసంసారం సజావుగా సాగాలంటే, తనకు కోతిగుండె కావలసిందే. ' అని పోరుపెట్టింది. ఇంటిపోరుకి మగమొసలి లొంగక తప్పలేదు, యెట్టకేలకు.
మరురోజు కరాళముఖుడు విచారంగా కోతితో సంభాషిస్తూ, యేవిధంగా దీనిని తమ యింటికి తీసుకువెళ్లగలనా అని ఆలోచిస్తున్నాడు. మొసలి విచారంగావున్న విషయం గమనించి రక్తముఖుడు, ' ఏమిటి సంగతి మిత్రమా ! ఎందుకు విచారంగా వున్నావు ? ' అని అడిగాడు. దానికి బదులుగా మొసలి, ' ఏమి చెప్పమంటావు మిత్రమా ! వారం రోజులనుంచి, మీవదిన అదే, నాభార్య నామీద చాలా కోపంగా వున్నది. నీలాంటి మంచి స్నేహితుడిని, ఒక్కరోజైనా, యింటికి పిలిచి మంచివిందు యివ్వలేదని నామీద నిందలువేస్తున్నది. నువ్వు యీరోజు మాయింటికి భోజనానికి రావాలి. ' అని అడిగింది.
' అలా యిచ్చిపుచ్చుకునే ధోరణి స్నేహం నిలబడడానికి ఆస్కారమిస్తుంది. ఎపుడూ నీవే పళ్ళు ఇస్తున్నావు మాకు, మేము నీకుతిరిగి మర్యాదచేసే అవకాశంయివ్వు. ' అనికూడా తొందరచేసింది.
' ఓ ! నాకేమీ అభ్యంతరంలేదు. కానీమీరు నీళ్లలో యిల్లుకట్టుకుని మమ్ములను పిలిస్తే యెలా ? అని హాస్యమాడింది, కోతి. ' నీకు యిబ్బందిలేకుండా నేను తీసుకెళ్తాను. ' అని కోతిని తన మూపున కూర్చుండబెట్టుకుని, చెరువు మధ్యలోకి తీసుకెళ్లింది. అప్పుడు కోతికి కొద్దిగా భయంవేసింది. ఆవిషయమే బయటపెట్టింది, మొసలితో.
' ఇంకెంత ! కొద్దిదూరమే. అయినా యింకొద్దిసేపటిలో, నాభార్యకు నీగుండెను ఆహారం గా యిస్తున్నవుగా ! కొద్దిసేపు ఓపికపట్టు. నీకు ఉత్తమగతులు వచ్చే యేర్పాటుచేస్తాను. ' అని కొద్దిగా వంకర సంభాషణ మొదలుపెట్టింది కరాళముఖుడు. ఇప్పుడు విషయం అర్ధమైంది రక్తముఖుడికి, తాను మోసపోయానని. 
అయినా యెంతమాత్రమూ తొట్రుపాటు చూపించకుండా, ' ఏమిటీ నాగుండెకాయ కావాలని అడిగిందా, నీభార్య ? దానికేముంది. ఇంతకంటే పుణ్యం సంపాదించే మార్గం యింకేముంటుంది ? కానీ, నువ్వు ముందు చెప్పవద్దా మిత్రమా ! నీకు మోయడానికి బరువు యెక్కువవుతుందని, వస్తూవస్తూ నా గుండెను, చెట్టుతొర్రలో దాచివచ్చానుకదా ! ఇప్పుడెలా ? ' అని అమాయకమైన స్వరంతో అన్నది. అంతేకాకుండా, ఉపాయం చెబుతున్నట్లుగా, 'ఒక్కసారి నన్నుమళ్ళీ ఆనేరేడుచెట్టు దగ్గరకు తీసుకువెళ్ళు. క్షణంలో నాగుండె తీసుకునివస్తాను. ఆనందంగా దాన్ని నీభార్యకు అప్పజెబుతాను. ' అన్నది.
' సరే ' అని మొసలి దానిని ఒడ్డుకు తీసుకువచ్చీ రాగానే, చెంగున కోతి చెట్టుకొమ్మలలోకి యెగబాకి, ' మంచిదిమిత్రమా ! నీభార్యకు నావందనములు చెప్పు ' అన్నది. ' అదేమిటి గుండెను తీసుకునిరావా ? నా భార్యముందు నా పరిస్థితి యేమిటి ? ' అని గగ్గోలుపెట్టింది మొసలి. ' నీలాంటి మూర్ఖుడికి, గుండె యెక్కడవుంటుందో తెలీనివాడికి, అలాంటి దుష్టురాలైన భార్య వుండవలసిందే. అనుభవించు. ' అని కిచకిచ నవ్వి, రెండు గుప్పెళ్ళ నేరేడుపళ్ళు, మొసలిభార్యకు కానుకగా పంపించింది.
ఆపదలో తొట్రుపడక, తనప్రాణం కాపాడుకున్న కోతి నేర్పినపాఠం, యెంతో విలువైనది కదా !

Source: Gandavarapu Prabhakar Garu
(Facbook)

No comments:

Post a Comment