Friday, 18 October 2019

సజ్జన సహవాసం.

మంచి వాళ్ళు చెడ్డవారితో చేరితే యెలా ఇబ్బందులు పడతారో ఇంతకుముందు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ కధలో, ఒక దుర్మార్గపు ఆలోచనలో వున్నవాడు, సజ్జనులను చేరి జీవిత పరమార్ధం యెలా తెలుసుకున్నాడో ఈ పంచతంత్రం కధ ద్వారా చూద్దాం.
ఒకవూరిలో, పూర్వజన్మ పాపాలవలన , ' కృష్ణశర్మ ' అనే ఒక యువకుడు, దొంగతనం వృత్తిగా జీవిస్తున్నాడు. వేరే వూరిలో నలుగురు వ్యాపారులు, ధర్మబుద్ధితో వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారు ఒకసారి, వ్యాపారరీత్యా, కృష్ణశర్మ వుండే వూరికి వచ్చారు. 
కృష్ణశర్మ, ఈనలుగురినీ కొంతదూరం అనుసరించి వారితో వినయంగా వుండి, వారిదగ్గర ధనం దొంగిలించాలని పధకంవేశాడు. వారు వచ్చినప్పటినుంచీ కృష్ణశర్మ వారితో వుంటూ, వారికి కావలసిన సదుపాయాలు చూస్తూ, నీడలా వెన్నంటివున్నాడు. వారందరికీ యితనంటే మంచి అభిప్రాయం కలిగేటట్లు చేసుకున్నాడు. వీలైనప్పుడల్లా వారు కూడా తాము మాట్లాడుకునే మంచిమాటలలో అతడినీ పాలు పంచుకునేటట్లు చేసేవారు. 
ఆ నలుగురువ్యాపారులు, ఇతని మాయలో పడకుండా, జాగ్రత్తగా వారి అమ్మకాలు జరుపుకుని, వచ్చిన ధనం యెవరికీ కనబడకుండా, వారి తొడభాగాలు కోసుకుని అందులో పెట్టుకుని, మరలా కుట్టి వేసుకున్నారు.
వారు, తిరిగి అరణ్యమార్గంలోనే వెళ్ళాలి కాబట్టి, ఆనలుగురూ, అలాంటి బాధాకరమైన, సాహసోపేతమైన చర్యద్వారా, తప్పని పరిస్థితులలో, డబ్బు భద్ర పరుచుకున్నారు. అయితే, కృష్ణశర్మ వారు తమధనాన్ని తొడలలో దాచుకోవడం చూడనే చూశాడు.
దారిలో యెక్కడైనా వారిధనం దొంగిలించాలని, కృష్ణశర్మ తననుకూడా వారితో తీసుకెళ్లమని, ఆ యువవ్యాపారులని మరీమరీ అభ్యర్ధించాడు. వారికి అంగరక్షకుడుగా వుంటానన్నాడు. వారుకూడా అందుకు సమ్మతించగానే, ఐదుగురూ అరణ్యమార్గం గుండా ప్రయాణించసాగారు.
దారిలో ఆ వ్యాపారులు, కృష్ణశర్మకు అనేక విధములైన మంచివిషయాలు చెప్పి, సంఘంలో మంచివాడిగా నడవడంలో గల ఆనందం తెలియజెబుతూ వచ్చారు. కృష్ణశర్మ కూడా యేకళన వున్నాడో, వాళ్ళు పెడుతున్న రకరకాల కమ్మని తినుబండారాలు తింటూ, వారి తియ్యనైనమాటలు వింటూ, కలిసి ప్రయాణం సాగిస్తున్నాడు.
కొంతదూరం వెళ్లేసరికి, వారినిచూసి, ఒక కాకులగుంపు, ' అరణ్యదొంగలారా ! ధనవంతులు వస్తున్నారు. దోచుకోండి, వాళ్లను దోచుకొండి. ' అని అరవడం మొదలుపెట్టాయి. వెంటనే, యెక్కడినుంచో కొందరు దొంగలు వచ్చి, వారిపైబడి వారివద్ద ఖరీదైన వస్తువులు యేమైనా వున్నాయేమో అని వెదుకసాగారు. అయితే, తినుబండారాలు, నీరుతప్ప వారికి యేవిధమైన డబ్బుకానీ, నగలుకానీ కనబడలేదు. ' ఆ కాకులగుంపు అబద్ధం చెప్పవు , తియ్యండి డబ్బు యెక్కడ పెట్టారో ' అని వారందరిమీదా కత్తులుదూసి చంపడానికి సిద్ధమయ్యారు, దొంగలు నిర్దాక్షిణ్యంగా.
ఇదంతా వ్యాపారులతో ఒకడుగావున్న, కృష్ణశర్మ చూసి, ఆ ధర్మాత్ములైన వ్యాపారులను యెక్కడ చంపుతారో దొంగలు, అనిభావించి, తనకు అన్నంపెట్టినవారిని రక్షించాలనే ఉద్దేశ్యంతో, ' నాయనాలారా ! మావద్ద యెట్టి ధనమూలేదు. వ్యాపారంలో నష్టపోయాము. కావాలంటే, నా వళ్ళంతా కోసిచూడండి, మేము మాశరీరాలలో, డబ్బుదాచుకున్నామని, మీకు అనుమానం అయితే, ' అని ముందుకువచ్చి దొంగలముందు నిలబడ్డాడు.
' నెమలికన్నీరు వేటగానికి ముద్దా ? ' అన్నట్లు, ఆ దొంగలు వెంటనే, కృష్ణశర్మ వళ్ళంతా విచ్చలవిడిగా కోసిచూశారు. వారికి యేవిధమైన ధనం కనిపించక పోవడంతో, మిగిలిన వారివద్దకూడా, యేమీ వుండవనిభావించి, వారిని వదలివెళ్లిపోయారు. 
కొనవూపిరితో వున్న కృష్ణశర్మ, వారిని తాను రక్షించగలిగినందుకు యెంతో సంతోషంగా వారివైపు చూస్తూ, వూపిరి వదిలాడు. ఆ యువకులు నలుగురూ, ' అయ్యో ! ఈ అశాశ్వతమైన సంపదకోసం మంచిమిత్రుడిని కోల్పోయామే ! ' అని కృతజ్ఞతతో అతనికి అంత్యక్రియలు చేసి, కంట తడిపెట్టారు.
కృష్ణశర్మ, ఎంత దుర్మార్గపు ఆలోచనతో వచ్చినా, మార్గంలో, వ్యాపారులు ఇచ్చిన కమ్మని పదార్ధాలు తిని, వారు చెప్పిన తియ్యని మాటలు విని, తనకు తెలీకుండానే, వారి సాహచర్యంలో, మారిపోయాడు. ఎంత దుర్మార్గుడైనా, స్నేహబంధం కలిస్తే, ముందూ వెనకా చూడకుండా, తమ ప్రాణాలైనా అర్పిస్తాడని చెప్పే కధ యిది.

Source: Gandavarapu Prabhakar Garu
(Facbook)

No comments:

Post a Comment