Friday, 18 October 2019

వ్యాస మహాభారతం - 17 (S-2)

సౌతి శౌనకాది మహామునులకు చెబుతున్నాడు.
దేవదానవ గణాలు, భూమిమీద మహాభారతగాధ జరిగే నిమిత్తం, వృద్ధి చెందసాగాయి. 
ఎవరిఅంశతో మహాభారత గాధలో ఏ ముఖ్యవ్యక్తులు అవతరించారో చూద్దాం. :
శ్రీమహావిష్ణువు, ఆదిశేషుడు శ్రీకృష్ణ బలరాములు. లక్ష్మి రుక్మిణి., సనత్కుమారుడు ప్రద్యుమ్నుడు, అప్సరసలు పదహారువేలమంది గోపికలు, ఎనిమిదవ వసువు ప్రభాసుడు భీష్ముడు, బృహస్పతి ద్రోణుడు, యమధర్మరాజు విదురుడు, సిద్ధి బుద్ధి దేవతలు కుంతీ మాద్రి, యముడి మరో అంశ ధర్మరాజు, వాయుదేవుడు భీముడు, ఇంద్రుడు అర్జునుడు, అశ్వనీ దేవతలు నకులసహదేవులు, శక్తి ద్రౌపది, అగ్ని ధృష్టద్యుమ్నుడు గా జన్మించారు. 
ఆపై జనమేజయుని కోరికపై, వైశంపాయనుడు, కౌరవవంశం పుట్టుపూర్వోత్తరాలు గురించి చెప్పసాగాడు. 
ఆరోజులలో భూమిని పాలిస్తున్న చక్రవర్తులలో, పురు, కురు, పాండురాజుల వంశాలు చెప్పుకోతగ్గవి. అదితి కశ్యపులకు పుట్టిన వివస్వంతుడికి, అయిదుగురు సంతానం. వారిలో పెద్దవాడైన వైవస్వత మనువుకు వేనుడు మొదలైన ఏబది మంది పుట్టారు. వారు పెద్ద ప్రయోజకులు కారు. కారణాంతరాల వలన వారిలో వారు కలహించుకుని, యుద్ధాలు చేసుకుని మరణించారు. 
ఇక వైవస్వత మనువు కుమార్తె ఇల కు దురాశాపరుడైన పురూరవుడు జన్మించి, పదమూడు ద్వీపాలకు చక్రవర్తి అయినాడు. అయితే, పురూరవుడు బ్రాహ్మణుల ధనాన్ని కొల్లగొట్టడం వలన వారి శాపం తగిలి, వెర్రివాడై పోయాడు. అప్పటికే, పురూరవుడికి అప్సరస ఊర్వశి సంపర్కంతో, ఆరుగురు పుత్రులు కలిగారు. వారిలో నహుషుడు చెప్పుకోదగ్గవాడు. అతడు చతుస్సాగరముల మధ్యనున్న భూమండలాన్ని పరిపాలించి నహుష చక్రవర్తి గా వెలుగొందాడు. నూరు యాగాలు చేసి ఉత్తరోత్తరా, ఇంద్రపదవిని పొందాడు. 
నహుషుడికి ప్రియంవద వలన ఆరుగురు కుమారులు జన్మించారు. వారిలో యయాతి ప్రసిద్ధుడు. యయాతి శుక్రుని కుమార్తె అయిన దేవయానిని, వివాహమాడి యదువు, తుర్వసుడు అనే కుమారులను, శర్మిష్ట ద్వారా ద్రుహ్వి, అనువు, పూరువు అనే ముగ్గురు పుత్రులను, అంతా కలిపి అయిదుగురు కుమారులను కన్నాడు. 
తనకుమార్తెను, కష్టపెట్టి, రెండవభార్య శర్మిష్ఠతో సంసారం సాగించాడని కోపించి యయాతికి శుక్రుడు, ' ముసలివాడివి అయి పో ! ' అని భయంకరమైన శాపం ఇచ్చాడు. ఆ శాపం వలన తన కుమార్తె దేవయాని కూడా నష్టపోతుందని వెంటనే తెలుసుకుని, శుక్రాచార్యులు, ' నీపుత్రులలో ఎవరైనా తమ యవ్వనాన్ని నీకు ధారపోస్తే, నీ వృద్ధాప్యం పోతుంది. ' అని, శాప విమోచనం చెప్పాడు. 
కానీ, చూస్తూ చూస్తూ తమ యవ్వనాన్ని వదులుకోవడానికి, మొదటి నలుగురు కుమారులూ ఒప్పుకోలేదు. ఆశ్చర్యకరంగా చివరికుమారుడు పూరువు అందుకు సమ్మతించి, తన తండ్రిని యవ్వనవంతుడిగా చేసాడు. '
అని చెప్పిన వైశంపాయన మహర్షితో జనమేజయుడు, ' భూమండలాన్ని ఏకఛత్రాధిపత్య౦ గా ఏలిన యయాతి మహారాజు, బ్రాహ్మణస్త్రీ అయిన శుక్రాచార్యుని కుమార్తె దేవయానిని యెందుకు వివాహమాడాడు ? నాకు ఆవృత్తాంతం చెప్పండి. ' అని అడిగాడు. 
వైశంపాయనుడు దేవయాని వృత్తాంతం చెప్పసాగాడు, జనమేజయునకు.

Source: Gandavarapu Prabhakar 
(Facbook)

No comments:

Post a Comment