ఒకానొక అడవిలో పరమ దుర్మార్గుడైన ఒకవేటగాడు తిరుగుతుండేవాడు. వాడి క్రూరత్వానికి భయపడి, వాడికి స్నేహితులుగానీ చుట్టపక్కాలుగానీ యెవరూ లేకుండా పోయారు.
ఒకరోజు వాడు అడవిలో వేటాడుతూ, ఒక ఆడపావురాన్ని పట్టి బంధించి, పంజరంలో వుంచాడు. ఉన్నట్లు వుండి, భీభత్సమైన తుఫాను వాతావరణం నెలకొన్నది. ఈదురుగాలులు వీయసాగాయి. అంత కౄరుడైనా ప్రకృతికి భయపడవలసినదేకదా ! వాడు అలాగే భయం భయంగా ఆ పంజరంతో సహా తిరుగుతూ, ఒకపెద్ద వృక్షం క్రిందికి చేరుకున్నాడు. ఆకలి, నీరసం ఆవహించడంతో ఆ వేటగాడు నిస్సహాయంగా, ' ఈ సమీపంలో ఎవరైనా వుంటే నాకు సహాయం చెయ్యగలరా ! నేను చలితో, ఆకలితో బాధపడుతున్నాను. ' అని గట్టిగా పిలిచాడు.
ఆ చెట్టు మీద ఎప్పటినుండో ఒక పావురాల జంట నివసిస్తున్నది. ఆరోజు ఆడపావురం బయటకు వెళ్లి యింకా తిరిగి రాకపోవడంతో యెంతో ఆతృతగా ఎదురు చూస్తున్నది, మగ పావురం. ఇంతలో, ఈ వేటగాడి అభ్యర్ధన విని అతనితో, ' ఓ వేటగాడా ! నా భార్య యింకా బయటకు వెళ్లి తిరిగి రాలేదు. నాకు ఆందోళనగా వున్నది. నీకు తెలియనిది యేమున్నది ? ఇంటిలో ఇల్లాలు లేకపోతే అంతా సూన్యమే కదా ! నేను నీకు ఏ విధంగా సహాయ పడగలను ! ' అని బాధపడింది.
అయితే, ఈపావురం ఏ ఆడ పావురం గురించి బాధపడుతున్నదో, దానినే ఆ వేటగాడు పంజరంలో బంధించి వుంచాడు. తన భర్త పలుకులు వినగానే, ఆడ పావురం పంజరం లో నుండి పెద్దగా, ' ఓ చెలికాడా ! నేను ఇక్కడే నీ చెంతనే వున్నాను. కానీ బంధించబడి వున్నాను. నీకు ఈ అతిథికి సేవ చేయవలసిన బాధ్యత వున్నది, ప్రాణాలు ధార పోసి అయినా సరే ! ' అన్నది.
ఆ మాటలతో మగ పావురం, భార్య బంధింపబడి వున్నా ఆమె స్వరం విన్న సంతోషంతో, అతిధి సేవ జేయడానికి సంకల్పించి, వెంటనే, ఎగురుకుంటూ వెళ్లి, ఎక్కడినుండో ఎండిన కట్టెపుల్లలూ, ఆకులూ తెచ్చి, మంటచేసి, వేటగానికి చలి కాచుకునే యేర్పాటు చేసింది. వాడు కొద్దిగా తెప్పరిల్లాగానే, ' ఆకలి ఆకలి ' అంటూ అరవసాగాడు. వాడి క్షుద్బాధను తీర్చడానికి, ఆమగ పావురం, అడపావురం పంజరంలో నుండి చూస్తూ వుండగానే, వేటగాడి కళ్ళముందే, అగ్ని చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి, అగ్నిలో దూకి ప్రాణాలు విడిచింది. ఆ వేటగాడి ఆహారంగా మారిపోయింది.
ఈ హఠాత్ పరిణామం, వేటగాడిని దిగ్భ్రాంతికి గురి చేసింది. గుడ్లప్పగించి అలా చూస్తూ వుండిపోయాడు. ఆ పావురం చేసిన త్యాగానికి తట్టుకోలేక పోయాడు. వైరాగ్యదశకు చేరుకున్నాడు. తాను ఇన్నిరోజులూ చేసిన క్రూరమైన పనులు జ్ఞప్తికి వచ్చాయి. ' ఇక జీవితంలో తుచ్చమైన సుఖాల కోసం ఇతరులను కష్టపెట్ట కూడదు. ' అని నిర్ణయించుకున్నాడు. వెంటనే తన వద్దవున్న పంజరంలోనుండి ఆడపావురాన్నీ విడుదల చేసి, కుప్పకూలిపోయాడు.
ఆడపావురం, విడుదల అయినా, భర్త మంటలో దహనమైన చోటే తిరుగుతూ, కన్నీరుమున్నీరుగా విలపించి, ఆ మహోన్నత త్యాగాన్ని ప్రశంసించి, తనుకూడా భర్త తో పాటు అగ్నికి ఆహుతి అయింది. ఆ పావురాల జంట ఆ విధంగా దైవత్వం పొంది తమ జీవితాలను సార్ధక పరుచుకున్నాయి.
ఈ సంఘటన కూడా చూసిన ఆ వేటగాడికి మరింత బాధ కలిగింది. అప్పటినుండి అడవిలోనే విరాగిలా తిరుగుతూ, ఒకనాడు అడవిలో పెద్దమంటలు రేగుతుండగా, ఆఅగ్నిలోకి నిశ్చలంగా నడుచుకుంటూ వెళ్లి ఆహుతి అయినాడు. తాను చేసిన దుష్ట కార్యాలకు ఆ విధంగా తానే శిక్ష విధించుకున్నాడు.
చూసారా ! తన భార్యని బంధించాడని తెలిసికూడా, భార్య చేసిన హితబోధతో, శత్రువుకి సహాయం చేసి ఆత్మార్పణ గావించుకున్న మగ పావురము, దాని మార్గాన్నే అనుసరించిన ఆడ పావురం, ఒక క్రూరుడి జీవితాన్ని మలుపుతిప్పాయి. అతని జీవన సరళిని మార్చివేసాయి. లోకానికే ఆదర్శంగా నిలిచాయి.
Source: Gandavarapu Prabhakar Garu
(Facbook)
No comments:
Post a Comment