ఆదిపర్వం. తృతీయాశ్వాసం.
సౌతి శౌనకాది మహామునులకు చెబుతున్నాడు.
వైశంపాయనుడు దేవయాని వృత్తాంతం చెప్పసాగాడు, జనమేజయునకు.
యయాతి తనకు యౌవనభిక్ష పెట్టమని కనిష్ఠ కుమారుడైన పూరువును అడిగాడు. ఆశ్చర్యకరంగా పూరువు తన తండ్రి కోర్కెను అంగీకరించాడు. వెంటనే యయాతి పూరువు యౌవనాన్ని స్వీకరించి వెయ్యి సంవత్సరాలు అన్ని సుఖాలూ అనుభవించి తనముసలి దేహాన్ని తిరిగి పూరువునుండి తీసుకున్నాడు.
పూరువుకు రాజ్యాభిషేకం జరిగింది. ' మిమ్ము తప్పు పట్టలేము కానీ జ్యేష్ఠకుమారుడు యదువును కాదని, దాసీ పుత్రునికి రాజ్యాభిషేకం భావ్యమేనా ! ' అని పుర ప్రముఖులు అడుగగా, ' నా జ్యేష్ఠకుమారుడు యదువు గానీ, తరువాతి వారు గానీ, తండ్రి మాటకు విలువ యివ్వలేదు. తండ్రిని ఆనందింపజేసే ఆలోచనే చేయలేదు. అయితే నా కనిష్ఠుడు పూరుడు రెండో ఆలోచన లేకుండా, నన్ను సంతోషపెట్టాడు. ఇతడు వయసులో మాత్రమే చిన్నవాడు, గుణాలలో కాదు. అందు వలన ఈభూమిని పాలించే యోగ్యత పూరువుకే వున్నది. ' అని బదులిస్తూ, ' శుక్రాచార్యులు కూడా యెవరైతే నాకు యవ్వనాన్ని ధారపోస్తారో వారికే రాజ్యాభిషేకం చెయ్యమని చెప్పారు కదా ! ' అని అందరినీ ఒప్పించి పూరువుకు పట్టాభిషేకం చేసాడు.
పూరువు పట్టాభిషేకానంతరం, ఉత్తములైన బ్రాహ్మణులూ అనుసరించగా, యయాతి తపోభూములకు వెళ్ళిపోయాడు. పితృదేవతలతో సహా అందరినీ ఆరాధిస్తూ, వెయ్యేళ్ళు తపస్సు చేసాడు. ఆతరువాత, ముప్పై యేళ్ళు నిరాహారంగా, కేవలం గాలిని సేవిస్తూ ఒకసంవత్సరం, ఒంటికాలి తపస్సుతో ఒక సంవత్సరం, ఇలా అనేక విధాల ఇంద్రుని మెప్పించి, దేవతావిమానంలో స్వర్గానికి వెళ్ళాడు. యయాతి చేసిన తప:ఫలం వలన ఆయన బ్రహ్మలోకానికి కూడా వెళ్లి, అక్కడ అందరి మన్ననలూ పొంది, ఇంద్రలోకానికి తిరిగి వచ్చాడు.
స్వర్గలోకంలో ఇంద్రుడు యయాతిని, ' యయాతి మహారాజా ! రాజ్యాభిషిక్తుని చేసిన తరువాత పూరువునకు నీవేమని బోధించావు ? నాకు తెలుసుకోవాలని వున్నది. చెప్పు. ' అనగా, యయాతి ఇలా చెప్పసాగాడు :
' పూరు కుమారా ! జ్ఞానుల జీవితసరళి తెలుసుకో ! అందులోని ధర్మాన్ని గ్రహించు. ఆ గ్రహించింది మననం చేసుకుంటూవుండు. ఆచరణ సమయంలో అవి ఉపయోగిస్తాయి.
అర్హులనిపించిన వారికీ దానం చెయ్యాలి. ఇంకొకరినివారు యాచించకుండా వారిని సంతృప్తులను చెయ్యాలి. నీకు ఎదురైన యాచకులకు కొద్దో గొప్పో దానం చేస్తూ వుండాలి. సమస్త జీవులనూ సమదృష్టితో చూడాలి.
సభనుద్దేశించి మాట్లాడేటప్పుడు ధర్మబద్ధంగా, సభలో వున్నవారికి ప్రీతికరంగా, సత్యమైనదిగానూ, మధురమైనదిగానూ వుండేటట్లు మాట్లాడాలి. ఎవరి ముఖాలనుండి వాడి అయిన బాణాల్లాంటి మాటలు వస్తూ వుంటాయో, ఎవరు ఎదుటి వారి మూల భాగాలకు గ్రుచ్చుకునేట్లు కఠినంగా మాట్లాడుతారో, అటువంటి వారితో స్నేహం చెయ్యరాదు. వారి సాంగత్యం ఆశించకూడదు. శాంతబుద్ధితో అరిషడ్వార్గాలను జయించినవారిని నీ కొలువులోవుంచుకో ! ' అని హితబోధ చేశాను, దేవేంద్రా ! ' అని యయాతి ఇంద్రునికి చెప్పాడు.
ఆ తరువాత, యయాతి తన తపో బలానికి గర్వించ ప్రారంభించాడు. ఇంద్రుడు అది గ్రహించి, యయాతి తన అహంకారంతో చేసిన పుణ్యాన్ని త్వరగా క్షీణింప చేసుకున్నాడని తెలుసుకుని, స్వర్గలోకం నుండి బయటకు పంపి వేస్తుండగా, యయాతి, ' తనను కనీసం నక్షత్ర లోకం లోవుండేటట్లు చెయ్యి. ' అని ప్రార్ధించాడు. యయాతి కోరిక మేరకు నక్షత్రలోకంలో, తన కుమార్తె పిల్లలైన అష్టకుడు, ప్రతర్దనుడు, వసుమంతుడు అనే వాళ్లతో వుండసాగాడు. ఆయన తమ తాతగారిని తెలుసుకుని, వారెంతో ఆదరించారు. యయాతి నుండి ధర్మాధర్మాలను, మంచి చెడ్డలను, జీవుల పిండోత్పత్తి విధానాన్ని అడిగి తెలుసుకున్నారు.
వారికి యయాతి ఇంకా ఇలా చెప్పాడు : అన్నిజీవులయందు దయ కలిగి వుండాలి. వేదకర్మలను ఆచరించాలి. నిషేధించబడినవి వదలి పెట్టాలి. గర్వంతో కూడిన అగ్నిహోత్రం, ఆడంబరానికి చేసే వేదాధ్యయనం, గర్వంతో కూడిన మౌనం, జ్ఞానం లేకుండా చేసే యజ్ఞం, ఇవన్నీ నిరుపయోగమైనవి. ' అని ఈ విధంగా ఉత్తములైన మనుమలతో, యయాతి, కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ, వారి స్నేహం వలన మరల పుణ్యం సంపాదించి వారితో కలిసి ఊర్ధ్వలోకాలకు వెళ్ళాడు.
ఆదిపర్వం - తృతీయాశ్వాసం సమాప్తమ్.
Source: Gandavarapu Prabhakar Garu
(Facbook)
No comments:
Post a Comment