Friday, 18 October 2019

వ్యాస మహాభారతం - 16 (Starting)

ఆదిపర్వం. తృతీయాశ్వాసం ప్రారంభం.
సౌతి శౌనకాది మహామునులకు చెబుతున్నాడు.
వైశంపాయనుడు వేదవ్యాసుల జన్మ వృత్తాంతం చెప్పడానికి ఉద్యుక్తులైనారు. జనమేజయుడూ, మిగిలినవారు, శ్రద్ధగా వింటున్నారు.
మత్స్యగంధి అని పిలువబడే సత్యవతి, తండ్రి దాశరాజుకు, యమునానదిలో బల్లకట్టు నడపడంలో సహాయం చేస్తూ వుండేది. ఒకరోజు పరాశర మహర్షి ఆబల్లకట్టు పై ప్రయాణిస్తూ, ఆమె పూర్వవృత్తాంతం దివ్యదృష్టి తో చూసి, ఆమె కారణ జన్మురాలని తెలుసుకున్నాడు. ఆమెను తాను మోహిస్తున్నట్లు గ్రహించి, అది కూడా విధి విలాసమే అనుకున్నాడు. ఆమెతో మాట కలుపుతూ, మాటల మధ్యలో తన మనసులోని కోరికను పరాశరుడు సత్యవతి ( మత్స్యగంధి ) తో చెప్పాడు. 
ఆమె జవాబుకోసం మహర్షి ఆత్రుతతో యెదురుచూసాడు. పరాశరుడి మనసు తెలుసుకున్న మత్స్యగంధి, ఆయన మాటను కాదంటే శపిస్తాడేమో అని భయపడింది. అందువలన, మధ్యేమార్గంగా, ' ఓ మహర్షీ ! నేను మత్స్యకన్యను. శరీరమంతా చేపలవాసనతో కంపుకొడుతున్నది. నేను నీ కోరిక యేవిధంగా తీర్చగలను ? తీర్చి యే ముఖంతో నా తండ్రిని తిరిగి ఆశ్రయించగలను ? కాబట్టి, నాకు దోషం అంటకుండా, కన్యత్వం చెడకుండా, నీ మహిమను ప్రత్యక్షంగా నా తండ్రి గ్రహించేటట్లు నన్ను అనుగ్రహించు. ' అని వేడుకున్నది. 
ఆమె మాటలకు పరాశరుడు యెంతో సంతోషించాడు. ఆమె ఉత్తమ స్త్రీ కాబట్టి అంత చక్కగా చెప్పింది. అనుకున్నాడు. వెంటనే అయన మత్స్యగంధితో , ' చూడు బాలికా ! నువ్వు నాతో కలిసినందున నీ కన్యత్వాన్ని నీవు కోల్పోవు. నీకా వరం యిస్తున్నాను. నీ మూలములు రాజర్షి వంశంలో వున్నవి కాబట్టి, నీవు మత్స్యకన్యవు కావు. కాబట్టి నీ జన్మ వృత్తాంతము నలుగురికీ తెలిసేటట్లు, నీకు ఈ చేపలకంపు నుండి విముక్తి కలిగిస్తున్నాను. నీ శరీరం నుండి, యోజనం పొడుగు వరకు, సుగంధ పరిమళాలు వచ్చేటట్లు నిన్ను అనుగ్రహిస్తున్నాను. ' అని చెప్పి ఆమెను యోజనగ౦ధిగా మార్చివేసాడు. 
సత్యవతి కూడా ఈ పరిణామానికి యెంతో సంతోషించి, ఆయనను మహానుభావుడిగా గుర్తించి, నిర్భయంగా, నావను, యమునా ద్వీపానికి చేర్చింది. ఆసమయంలో, ఆమె, పరాశరునితో, ' మహర్షీ ! అందరూ చూస్తూ వుండగా, మన కలయిక యెలా సాధ్య పడుతుంది? ' అని బేలగా సందేహం వెలిబుచ్చగా, పరాశరుడు, అక్కడవున్న వారి దృష్టికి తామిరువురూ కనబడకుండా, మంచుతో చీకట్లు ఆవరించేటట్లు చేసి తమ సంగమానికి అవరోధం లేకుండా చేసాడు. 
వారి ఇరువురి కలయికకు ఫలితంగా, సత్యవతికి సద్యోగర్భం కలిగి సూర్యసమానుడు, తేజోసంపన్నుడు, జ్ఞానవంతుడు అయిన వేదవ్యాసుడు జన్మించాడు. ఆయన పుట్టినంతనే పెద్దవాడిగా పెరిగి, తల్లి సత్యవతితో, ' అమ్మా ! నేను తపస్సు చేసుకోవడానికి తపోవనానికి వెళ్ళాలి. నాతో ఎప్పుడైనా యేదైనా అవసరం వున్నప్పుడు నన్ను తలుచుకోండి. నేను వెంటనే ప్రత్యక్షమవుతాను. ' అని చెప్పి తిరిగి చూడకుండా యమునా తీరంలో నల్లనివాడిగా పుట్టి, కృష్ణ ద్వైపాయనుడిగా పేరు తెచ్చుకున్న సద్యోగర్భ సంజాతుడు, వ్యాసుడు, వెళ్ళిపోయాడు. ఆయనతో సత్యవతికి ముందు ముందు యేమి పనిపడుతుందో, అది యెంతవరకు వ్యాసుడు నెరవేరుస్తాడో కాలమే చెప్పాలి. 
అప్పుడు పూర్తిగా అవగాహన అయింది సత్యవతికి, తాను పరాశర మహర్షిని కలవడానికి ఐతిహాసిక ప్రాముఖ్యత వున్నదని. ఆ తరువాత కృష్ణ ద్వైపాయనుడు వేదాలను విభజించి వేదవ్యాసుడిగా ఖ్యాతి గడించాడు. 
జనమేజయ మహారాజా ! ఆ విధంగా వేదవ్యాసుడు భూమిమీద అవతరించగానే, బ్రహ్మ మానస పుత్రులుగా మరీచి, అంగీరసుడు, అత్రి, మొదలైన వారు కూడా భూమిమీద జన్మించారు. మరీచికి కశ్యప ప్రజాపతి , ఆయన ద్వారా స్థావర జంగమాలన్నీ ఉద్భవించాయి. బ్రహ్మదేవుని కుడిచేతి బ్రొటనవేలినుండి దక్షప్రజాపతి, ఎడమచేతి బ్రొటనవేలినుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వీరిరువురికీ, వెయ్యి మంది పుత్రులు, ఏబది మంది పుత్రికలు జన్మించారు. వారిలో పదమూడు మందిని దక్షుడు కశ్యప ప్రజాపతికి ఇచ్చి వివాహం జరిపించాడు. 
ఆ పదమూడు మందిలో వారే దితి, అదితి అనేవారు.. అదితికి ద్వాదశ ఆదిత్యులు జన్మించగా, దితికి జన్మించిన వార0తా దైత్యులు అయినారు. ఈమెకు హిరణ్య కశిపుడు, ఆ హిరణ్యకశిపునికి ప్రహ్లాదుడు మొదలైన అయిదుగురు కుమారులు జన్మించారు. 
ఈ విధంగా దేవదానవ గణాలు వృద్ధి చెందసాగాయి.

Source: Gandavarapu Prabhakar 
(Facbook)

No comments:

Post a Comment