ఆదిపర్వం. తృతీయాశ్వాసం.
సౌతి శౌనకాది మహామునులకు చెబుతున్నాడు.
వైశంపాయనుడు దేవయాని వృత్తాంతం చెప్పసాగాడు, జనమేజయునకు.
' నిన్ను ఆశ్రయించిన వాడిని, బృహస్పతి పుత్రుడిని, అందగాడిని, యెలా అంత నిర్దాక్షిణ్యంగా వదలి వేస్తావు తండ్రీ ! కచుడు తిరిగి రాకుండా నేను ముద్దైనా ముట్టను. ' అని దేవయాని మారాం చెయ్యసాగింది.
దేవయాని అడిగిన తీరుకు తండ్రి శుక్రాచార్యుడు కరిగిపోయాడు. తాను మద్యపాన వ్యామోహం లో చేసినపని యేవిధంగా పరిణమించిందో తెలుసుకుని శుక్రాచార్యులు, ఇకనుండి యే బ్రాహ్మణుడైనా సురాపానం చేస్తే, వారి పాపములకు నిష్కృతి లేదు. ' అని శాపం పెట్టాడు. వెంటనే, తన సంజీవనీ విద్యతో తనపొట్టలో బూడిదరూపంలో మరణించి వున్న కచుని బ్రతికింపజేసాడు. అయితే, కచుడు బయటకు వచ్చే మార్గం చెప్పమని ప్రాధేయపడడంతో, పరిస్థితి అర్ధమై, శుక్రుడు కచునికి సంజీవనీ విద్యను ప్రసాదించి, ' నీవు బయటకు వచ్చిన తరువాత, నన్ను ఈ విద్యతో బ్రతికించు. ' అని కచుడితో చెప్పాడు. కచుడు కూడా సరే అనగానే, అతడిని తన నాభిగుండా బయటకు వచ్చే వీలు కలిపించి తాను ప్రాణత్యాగం చేసాడు.
కచుడు తాను అన్నమాట నిలబెట్టుకుంటూ, అప్పటికే తాను నేర్చుకున్న సంజీవనీ విద్యతో తన గురువుగారైన శుక్రుని బ్రతికించాడు. ఈ విధంగా రాక్షసులు తనకు ప్రమాదం కలిపించినా కూడా, విధి విలాసం వలన కచునికి, శుక్రుడు తనంతతానే మృత సంజీవనీ విద్యను నేర్పవలసి వచ్చింది. ఆ తరువాత కొంతకాలానికి, కచుడు దేవలోకానికి వెళ్ళడానికి గురువుగారి అనుమతి తీసుకుని, దేవయానికి చెప్పగా, ఆమె కూడా కచునితో దేవలోకానికి వెళ్ళడానికి సిద్ధపడింది. తనను మనువాడమని కోరింది.
ఆమాటలకు కచుడు చాలాబాధపడ్డాడు. ' నేను నిన్ను గురు పుత్రికగా, సోదరీ సమానంగా చూసాను. మన బంధం వేరే విధంగా మారితే అది గురుశిష్యుల బంధానికి మచ్చగా మారుతుంది. కాబట్టి నీవు నన్ను కోరుకోవడం తగదు. ' అని దేవయానితో చెప్పాడు. ఆ సమాధానానికి దేవయాని కోపించి, ' నా కోరిక తీరకుండా నన్ను బాధపెట్టి వెళుతున్నావు కాబట్టి, నీకు ఈ మృతసంజీవనీ విద్య నిష్ఫలం అవుతుంది. ' అని శాపమిచ్చింది.
అయితే, కచుడు ఆమె మాటలను లక్ష్యపెట్టక, ' నేను ధర్మ బుద్ధితో తీసుకున్న నిర్ణయం నిన్ను బాధపెట్టినా, ఈ విద్య నాకు పనిచేయక పోయినా, నా ద్వారా నేర్చుకున్న వారికీ పనిచేస్తుంది. కానీ నీ దుందుడుకు తనానికి, నేను ప్రతిశాపం యిస్తున్నాను చూడు. అధర్మ మార్గంలో సోదర సమానుడనైన నన్ను భర్తగా కోరావు కాబట్టి, నీకు బ్రాహ్మణ యువకులెవరితోనూ వివాహం కాదు. నిన్ను క్షత్రియ కులంలో పుట్టిన రాజు వివాహం ఆడుతాడు. ' అని చెప్పి వెళ్ళిపోయాడు.
మరికొంత కాలానికి రాక్షసరాజు వృషపర్వుని కుమార్తె శర్మిష్టతో కలిసి దేవయానీ మరి కొందరు చెలికత్తెలూ వన విహారానికి వెళ్లారు. వారు వస్త్రాలను గట్టుపై పెట్టి, కొలనులో స్నానం చేస్తుండగా, ఆసమయంలో వచ్చిన పెద్దగాలి, గట్టుపైన వున్న వస్త్రాలను కలగాపులగం చేసింది. ఎవరి వస్త్రాలు యేవో గుర్తు పట్టలేని స్థితిలో, కొలనునుండి బయటకువచ్చిన వారంతా, తమకు దగ్గరలోని వస్త్రాలు ధరించారు. అయితే ఎవరూ ఆవిషయంపై పెద్దగా పట్టించుకోలేదు.
కానీ, రాకుమార్తె శర్మిష్ట, దేవయాని దుస్తులు కట్టుకోవడం చూసిన దేవయాని, కోపం పట్టలేక, ' నేను శుక్రాచార్యుని కుమార్తెను, బ్రాహ్మణకన్యను. నీకు పూజ్యురాలను. నువ్వు కట్టుకున్న మలిన వస్త్రాలను నేను కట్టుకోను. ' అని దుర్భాషలు ఆడింది. ఆమాటలకు శర్మిష్ట కూడా అలిగి, ' నాతండ్రిని ఆశ్రయించి నీ తండ్రి బ్రతుకు తున్నాడు. అటువంటి నన్ను తక్కువ చేసి మాట్లాడతావా ? నేను కట్టుకున్న బట్టలు నీకు పనికిరాకపోతే, ఈ నూతిలో పడివుండు. ' అని ఆమెను ప్రక్కనే వున్న బావిలోకి త్రోసి, శర్మిష్ట, మిగిలినవారంతా వెళ్లిపోయారు.
ఇక దేవయాని పరిస్థితి ఏమిటి ? విధి యెందుకు ఆమెతో ఇలా పదే పదే ఆడుకుంటున్నది. దీనికి ఆమె అహంభావమే కారణమా ? చూద్దాం ఏమి జరుగుతుందో !
Source: Gandavarapu Prabhakar
(Facbook)
No comments:
Post a Comment