మేకవన్నె పులులు వున్న సమాజం మనకు తెలుసు. ఈరోజుల్లో కూడా, పవిత్ర స్థలాలలో, సాత్విక జీవితం గడుపుతున్నవారు, వున్నట్లుండి, పైశాచికంగా ప్రవర్తించే సంఘటనలు కొల్లలు. అలాగే, వయసు మీదపడిన రాజకీయ ప్రముఖులు, పెద్దమనుషులుగా చలామణీ అయ్యేవారు, చిల్లర వేషాలు వేస్తూ పట్టుబడే సందర్భాలూ చూస్తుంటాము. అప్పుడు ప్రతి సామాన్యుడూ అనుకునే మాటే, ' వేషం మారినా బుద్ధులు మారునా ! ' అని.
అయితే, పులి చర్మం కప్పుకున్న గాడిద సంగతి ఒకటి పంచతంత్రం లో వున్నది. అదేమిటో చూద్దాం !
కరిపురం అనేగ్రామంలో ఒక రజకుడు వున్నాడు. వెనుకటి రోజులలో, వారి వృత్తిరీత్యా బట్టలు మోయడానికి, గాడిద ముఖ్య మైన సాధనంగా వారికి వుండేది. అలాగే, ఇతను కూడా, ఒక గాడిదను పెంచుకుంటున్నాడు. అయితే, వాడు పరమలోభి. తనకు అంత సేవచేస్తున్న, గాడిదకు పెట్టే తిండిదగ్గర తటపటాయించేవాడు. దానికి తిండిపెట్టడం దండగ అని అనుకుని, ఒకరోజు, వుపాయం ఆలోచించాడు.
గాడిదకు సరిగ్గా సరిపడా పులితోలు సంపాదించి, ఆ రజకుడు, అది పగలంతా చాకిరీ
చేసి వచ్చాక, దానికి కప్పేవాడు. దగ్గరున్న తోటలోకి, చేలలోకీ వదిలేవాడు. అది తాను పులివేషంలో వున్నానని తెలుసుకోలేదు కదా ! దాని మానాన తాను, మామూలుగా తోటలోనికి, చేలలోనికి పోయి హాయిగా, సుష్టుగా భోంచేసి వచ్చేది.
చేసి వచ్చాక, దానికి కప్పేవాడు. దగ్గరున్న తోటలోకి, చేలలోకీ వదిలేవాడు. అది తాను పులివేషంలో వున్నానని తెలుసుకోలేదు కదా ! దాని మానాన తాను, మామూలుగా తోటలోనికి, చేలలోనికి పోయి హాయిగా, సుష్టుగా భోంచేసి వచ్చేది.
హఠాత్తుగా వచ్చిన యీ వుపద్రవం తట్టుకోలేక రైతులు బెంబేలెత్తి పోయేవారు. కానీ, పులితో యెవరు పోరాడగలరు ?. దానికి యథేచ్ఛగా మేత దొరుకుతున్నది. ఆ విధంగా, రజకునికి ఏమాత్రం ఖర్చు లేకుండా ఆ గాడిద సేవలు అందుతున్నవి. రైతులు గగ్గోలు పెడుతూనే వున్నారు. రోజులు గడిచిపోతున్నవి.
ఒకరోజు, ఒక తెలివైన రైతు ఆలోచించాడు. ' ఈ పులి గడ్డిమేస్తున్నది ! పంటను తింటున్నది ! అయితే యెక్కడా పులులు గడ్డిని, పంటను, తిన్న దాఖలాలు లేవుకదా ! పులి మాంసాహారి కదా ! యెందుకని ఈ పులి విపరీతంగా ప్రవర్తిస్తున్నది ? ' అని పరిపరివిధాలా ఆలోచించాడు. ఇందులో ఏదో మోసం వున్నదని గ్రహించాడు. దాని సంగతి తేల్చాలని ఆ రైతు ఒక బాణ౦, తీసుకుని, పైన బూడిదరంగు దుప్పటి కప్పుకుని, పులివచ్చే ప్రదేశంలో, ఒక చెట్టుప్రక్కన నాలుగుకాళ్ల జీవిలాగా దాక్కున్నాడు.
చీకటిపడగానే, పులితోలు క్రప్పిన గాడిద, అలవాటు ప్రకారం అటుగా వచ్చింది. చేలోకి దిగుతూ, యదాలాపంగా, చెట్టువైపు చూసింది. అక్కడ బూడిదరంగులో ఒకఆకారం కనిపించగానే, సరిగా పోల్చుకోలేక, ఆ ఆకారం, తమ తోటిగాడిదే అయివుంటుందని, పెద్దగా తనభాషలో ఓ౦డ్రపెట్టింది. తనతో రమ్మని సంజ్ఞ చేసినట్లు.
ఇంకేముంది. దుప్పటి కప్పుకున్న రైతు, కనిపెట్టనే కనిపెట్టేశాడు, అది పులితోలు కప్పుకున్న గాడిద అని. దగ్గరగా వచ్చి బాణంతో దాని పులితోలు వలిచాడు. గాడిద అసలు రంగు బయట పడ్డిె్ది. రహశ్యం కని పెట్టేశానన్న సంతోషంతో పెద్దగా అరచి అందరు రైతులనీ కూడగట్టుకుని ఆ రజకుని పిలిపించి బడితెపూజ చేశారు. గాడిద తప్పేమీలేదని తేల్చారు.
రజకుడు తాను చేసినతప్పు వప్పుకుని, ప్రాయశ్చిత్తంగా కొన్నిరోజులపాటు, వూరి వారందరి బట్టలనూ, వుచితంగా శుభ్రం చేస్తానని లెంపలు వేసుకున్నాడు.
రజకుడి కష్టాలకు కారణం అత్యాశ. ' పులితోలు కప్పినా గాడిద గాడిదే కదా ! ' అన్న ఆలోచన రాకపోవడంతో, ఆ రజకుడు అభాసుపాలయ్యాడు. అందుకనే వేషభాషలతో పాటు, డొక్కశుద్ధి కూడా ఉంటేనే పండితుడు రాణిస్తాడు. నాయకుడు తన మంచి ప్రవర్తనతోనే యెక్కువకాలం ప్రజల మన్ననలను పొందుతాడు. ఇవన్నీ రావాలంటే, మంచి పుస్తకాలు చదవాలి, మంచి వారితో స్నేహం చెయ్యాలి. చెడు ఆలోచనలను మొగ్గలోనే త్రుంచివేయాలి. లేకపోతే, ఎప్పుడో అవమానంపాలు కాక తప్పదు.
Source: Gandavarapu Prabhakar Garu
(Facbook)
No comments:
Post a Comment