ఆదిపర్వం. తృతీయాశ్వాసం.
సౌతి శౌనకాది మహామునులకు చెబుతున్నాడు.
వైశంపాయనుడు దేవయాని వృత్తాంతం చెప్పసాగాడు, జనమేజయునకు.
' నూతిలో పడివుండు. ' అని దేవయానిని, ప్రక్కనే వున్న బావిలోకి త్రోసి, శర్మిష్ట, మిగిలినవారంతా వెళ్లిపోయారు.
అదేసమయంలో, నహుష చక్రవర్తి కుమారుడైన యయాతి, అడవిలో వేటకై తిరుగుతూ, దాహం వేసి, విధి వశాత్తూ, దేవయాని పడివున్న నూతిగట్టుకే వచ్చాడు. దాహం తీర్చుకుందామని నూతిలోకి తొంగిచూడగా, నీటిలో వున్న దేవయాని కనిపించింది. ఆమెను చూసి ఆశ్చర్య చకితుడై, ' ఓ సుందరాంగీ ! ఎవరు నీవు ? ఒంటరిగా యీనూతిలో ఈస్థితిలో ఎందుకు వున్నావు ? ' అని అడిగాడు.
అందుకు దేవయాని, నూతిలో పడిన కారణం చెప్పకుండా, యయాతి వివరాలు అడిగి తెలుసుకుని, ' ఓ యయాతి మహారాజా ! నేను బ్రాహ్మణకన్యను. శుక్రాచార్యుని పుత్రికను. ఏమరుపాటున ఈ బావిలో పడ్డాను. దయచేసి పైకి తీసి రక్షించు. ' అని తన కుడి హస్తాన్ని పైకి చాపి, యయాతి వామ హస్తం తో బయటకు తీయబోతుండగా, అడిగి ప్రత్యేకంగా, కుడి హస్తముతో నే తనను బయటకు తీసేటట్లు చేసుకున్నది.
యయాతి కూడా బ్రాహ్మణకన్యను రక్షించాననే దయతో ఆమె కోరినట్లుగానే ఒడుపుగా కుడిచేత్తో, దేవయాని కుడిహస్తాన్ని పట్టుకుని పైకి లాగాడు. ఆతరువాత, ఏమీ జరగనట్లే, యయాతి తమ రాజ్యానికి వెళ్ళిపోయాడు. కానీ దేవయాని మాత్రం తనకు యయాతితో పాణిగ్రహణం అయినట్లుగానే భావించింది.
అయితే, శర్మిష్ట చేసిన అవమానానికి దేవయాని హృదయం మండిపోతున్నది. వృషపర్వుని రాజ్యంలో అడుగు పెట్టడానికి యిష్టపడక, తమ తండ్రికి అక్కడనుండే కబురుపంపి, తక్షణం రమ్మనమని చెప్పింది. వాయువేగంతో శుక్రుడు రాగానే, ' తండ్రీ ! మన దయమీద ఈరాజ్యం బ్రతుకుతున్నదా ? ఈరాజు భిక్ష వలన మనము జీవిస్తున్నామా ? 'అని సూటిగా అడిగింది. దానికి శుక్రుడు, కుమార్తె మనసు ఏ విషయంలోనో బాధపడినదని గ్రహించి, ' నా మృత సంజీవనీ విద్య వలననే రాక్షసరాజు అతని ప్రజలు సురక్షితంగా వున్నారు. అందులో సందేహం యేమున్నది ? ' అని చెప్పి, జరిగిన విషయం దేవయాని ద్వారా తెలుసుకుని కూడా, కోపంచెందక శుక్రాచార్యులు, ' శర్మిష్ఠ చిన్నపిల్ల. ఆమె నీకు చెల్లెలు లాంటిది. పద. మన గృహానికి వెళ్దాం. ' అని దేవయానికి సర్దిచెప్పబోయాడు.
అయితే దేవయాని, తోక తొక్కబడిన త్రాచుపాము వలే లేస్తూ, ' తండ్రీ ! శర్మిష్ట వున్న రాజ్యం లోనికి నేను అడుగుపెట్టను. ఆ తరువాత మీ ఇష్టం ' అన్నది. ఆమె మాట కాదనలేక, శుక్రుడు కూడా ఆమెతో పాటు రాజ్యం వదలి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. ఈవిషయం వేగులవారి ద్వారా తెలుసుకుని, వృషపర్వుడు, హుటాహుటిన అక్కడకు వచ్చి, శుక్రుని కుమార్తెతో సహా రాజ్య ప్రవేశం చెయ్యమని అభ్యర్ధించసాగాడు.
దేవయాని, మహారాజు మాటలను కూడా లెక్కచేయలేదు. ఆమెకు ' కావలసినది కోరుకుంటే, ఏమి కావాలంటే అది ఇస్తాను. ' అని మహారాజు చెప్పిన తరువాత, ' నాకు శర్మిష్ఠతో కలిపి వెయ్యిమందిని దాసీలుగా యేర్పాటుచేస్తే, రాజ్యంలోకి అడుగుపెడతాను. ' అని నిర్ద్వంద్వంగా చెప్పింది.
మహారాజు ఆప్రకారమే, శర్మిష్ఠను దేవయానికి దాసీగా చేసాడు. దానికి శుక్రుడూ, దేవయాని యెంతో సంతోషించారు. శర్మిష్ట కూడా జరిగిన విపరీత పరిణామాలకు కొద్ది రోజులు బాధపడినా, మహారాజు ఆజ్ఞ కాదనకుండా, దేవయాని చెప్పిన అన్ని పనులూ చేయసాగింది.
రోజులు అలా గడుస్తుండగా, ఒకరోజు దేవయాని, శర్మిష్ఠతోనూ, మిగిలిన పరిచారికలతోనూ, పూర్వము తనకు అవమానం జరిగిన వనానికే విహారానికి వెళ్ళింది. వారి వస్త్ర సౌందర్యంతో, అతివలనుండి వచ్చే మధురమైన సువాసనలతో, కేళీ కలాపాలతో, హావభావాలతో, ఆ ప్రదేశం చుట్టుప్రక్కల పండగ వాతావరణం నెలకొన్నది. మత్తెక్కించే వారి శరీర లేపనాలు ఆఘ్రాణిస్తూ యయాతి మహారాజు కూడా వేటకై వచ్చినవాడు, వీరి మధ్యకు వచ్చి చేరాడు.
హఠాత్తుగా, యయాతి మహారాజు తమ మధ్యకు రాగానే, దేవయాని మొదలైన వారంతా విభ్రమంగా యయాతి సౌందర్యాన్ని చూస్తూ, ఆనందించసాగారు. యయాతికూడా వారితో సరస సంభాషణలు చేస్తూ, వారి మధ్యలో ప్రముఖంగా మెరిసిపోతున్న దేవయానిని చూసి, ' తరుణీ ! నీవెవరు ? ' అని అడిగాడు.
దానికి దేవయాని, ' యయాతి మహారాజా ! నీవు నన్నుగుర్తించలేదా ! ఒకప్పుడు ఇదేప్రాంతంలో బావిలో చిక్కుకున్న నన్ను రక్షించి నా కుడిచేతిని, నీ కుడిచేతితో, ఆ సూర్యభగవానుని సాక్షిగా పట్టుకుని నీటిలోనుంచి బయటకు తీసావు. నేను దేవయానిని, శుక్రాచార్యుని కుమార్తెను. ఇక ఈమె శర్మిష్ట, ఈ దేశ మహారాజు కుమార్తె, కానీ నా దాసీ. నా అడుగులకు మడుగులొత్తుతూ వుంటుంది. ఈదాసదాసీ జనం అంతా నా వైభవంలోని వారే. '
' నీవు నాపాణిగ్రహణం చేసిన మధురమైన క్షణాలు నీవు మరచిపోయినా, నేనెలా మరచిపోగలను ? యయాతి మహారాజా ! నన్ను వివాహం చేసుకో ! ఈ దాస దాసీజనం మధ్యలో మనం స్వర్గలోక సౌఖ్యాలు అనుభవిద్దాం. ' అన్నది.
దానికి యయాతి, ' ఓ దేవయానీ ! నీకోరిక లోక విరుద్ధంగా వున్నది. క్షత్రియకన్యలను బ్రాహ్మణులు వివాహమాడవచ్చు. బ్రాహ్మణకన్యలను క్షత్రియులు వివాహమాడరాదు. ధర్మబద్ధంగా జీవించే నేనే ఇట్టి అపవిత్ర కార్యం చేస్తే, లోకం అస్తవ్యస్తం అయిపోదా ? నీ కోరికను అదుపు చేసుకో ! ' అని మందలించాడు.
యయాతి మాటలకూ దేవయాని యేదో సమాధానం చెబుతున్నది.
Source: Gandavarapu Prabhakar Garu
(Facbook)
No comments:
Post a Comment