అపాయం దాటడానికి ఉపాయం కావాలి. కానీ, ఆ ఉపాయం మరి కొన్ని అవాంతరాలు తెచ్చిపెటేటట్లు వుండకూడదు. బలవంతుని ఎదిరించడానికి సత్తువ లేకపోతే, ఇంకో బలవంతుని ఆశ్రయించి, వాడికి బానిస అయితే, అది ఉపాయం అనిపించుకోదు. అలాంటి పని చేయకుండా, తన చేతికి మట్టి అంటకుండా, తన శత్రువుని మట్టుపెట్టిన కాకి దంపతుల కథ చూద్దాం :
ఒక అడవిలో ' మేఘవర్ణుడు ' అనేకాకి తనభార్యతో యెంతో అన్యోయంగా వుంటూ, ఒక చెట్టుమీద చక్కనిగూడు నిర్మించుకుని, సంతానాభివృద్ధికై గుడ్లనుపెట్టి వాటిని రక్షించుకుంటూ వుంటున్నది..
రోజులు అన్నీ ఒకలాగా వుండవు కదా !. ఆ చెట్టుక్రిందే ఒక మహాసర్పం పుట్టపెట్టుకుని జీవిస్తూ వున్నది. ఈ పక్షిజంట, ఆహారం కోసం బయటకు వెళ్ళగానే, ఆసర్పం చల్లగా చెట్టెక్కి కాకిగుడ్లు పొదగడానికి సిద్ధంగా ఉన్నవాటిని, గుట్టు చప్పుడు కాకుండా తినేస్తుండేది. ఈ ఘోరాన్ని ఆడకాకి సహించలేక, తన గర్భశోకం తప్పించమని ' మేఘ వర్ణుని ' వేదనతో అడిగింది. తాము బలహీనులమని తెలిసికూడా యెలాగైనా ఆసర్పాన్ని అంతమొందించాలని ఆ కాకిజంట నిర్ణయించుకున్నది..
అదనుకోసం యెదురు చూస్తూ, తన ఆప్తులతో వుపాయం గూర్చి విచారిస్తూ వున్నది, ఆ జంట. . అంతలో దేవుడు పంపినట్లు, వారివద్దకు, కడుపునిండా వుపాయాలున్న నక్కబావ వచ్చాడు. నక్కబావతో యీ విషయం చెప్పగా, అది ఒక అద్భుతమైన వుపాయం, అవలీలగా చెప్పాడు.
ఆ పధకం ప్రకారమే, మగకాకి, చడీచప్పుడు కాకుండా, రాణీగారి అంత: పురం ప్రవేశించి రాణీగారి స్నానసమయంలో, ఆమె రత్నాలహారం ముక్కున కరుచుకుని అక్కడే కాపలాకాస్తున్న రాజభటులు, తనను చూసేలా గింగిరాలు తిరుగుతూ, వారు ఒక్కసారి తేరుకుని వెంటబడుతుంటే, వారికి కనబడుతూ వారికి చిక్కకుండా సమమైన వేగంతో ప్రయాణిస్తూ, ఒక్కమాటలో చెప్పాలంటే, ఒకప్పుడు బంగారుజింక శ్రీరాముని తిప్పలు పెట్టినట్లు, రాజభటుల దృష్టి మరలకుండా, ఆ రత్నాలహారాన్ని తీసుకువచ్చి తిన్నగా ఆ పాముపుట్టలో చక్కావేసింది. ఇక ' కాగల కార్యం గంధర్వులే తీర్చాలి ' అన్న చందంగా, వూపిరి బిగబట్టుకుని వెళ్లి, తనగూడులో నుంచి చూస్తున్నది, మగకాకి, తన భార్యతో సహా. .
ఇది చూడగానే రాజభటులు, యేమాత్రం ఆలశ్యం చెయ్యకుండా, పుట్ట వెడల్పు చేసి చూస్తే, రత్నాలహారం పొందికగా పుట్టలో సర్పం మెడభాగంలో ప్రకాశిస్తూ కనబడింది. వెంటనే రెట్టించిన ఉత్సాహంతో, ఆ రాజభటులు పుట్టను త్రవ్వి, , మీదకు వస్తున్న సర్పాన్ని తుత్తునియలు చేసి, ఆ రత్నాలహారం చేజిక్కించుకున్నారు.
పోతూపోతూ, చెట్టుమీదకు చూసి కాకికి కృతజ్ఞతగా, ' హారం తెస్తేతెచ్చావు, మేము చూసేటట్లు పుట్టలో వేసి మాకు శ్రమ తప్పించావు, లేకుంటే దీనికోసం మా గాలింపు మొదలయ్యేది. నీ మేలు మరువలేము. ' అని నవ్వుతూ అన్నారు. కాకిజంటగూడా, అంతే కృతజ్ఞతతో, ' మీరూ మాపీడ వదిలించారు, గర్భశోకం తప్పించారు. ' అని మిక్కిలి సంతోషంతో, ' కావు కావు ' అని ప్రత్యుత్తరం ఇచ్చారు. ఆపై నక్కబావని పొగడ్తలతో ముంచెత్తారు.
ఎప్పుడైనా అకారణంగా యెవరైనా బలవంతుడు మనతో శత్రుత్వం వహిస్తే, నష్టం కలుగ చేస్తున్నాడని తోస్తే, వగచి ప్రయోజనం లేదు . యుక్తితో అంతకన్నా బలవంతుని ఆశ్రయం పొంది ఆపదనుంచి గట్టెక్కవలెనని అర్ధం చేసుకోవాలి. అయితే, మనం ఆశ్రయం పొందే బలవంతుడు తరువాత మనకు గుదిబండ కాకూడదు. అలా అయితే, వేరొక బలవంతుని చేతులో బందీగా మిగులుతాము, పెనం మీదనుండి పొయ్యిలో పడినట్లు.
ఎప్పుడైనా, ఎవరైనా, బాధను తమలో మ్రింగుకొనకూడదు. సమాజంలో, తమ సన్నిహితులతో, పంచుకోవాలి. వారిచ్చే సలహాలు, యెంతో మేలు చేస్తాయి, విశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది. ఈ కాకిజంట నక్కబావతో తమ గోడు చెప్పుకోబట్టే కదా, మంచి ఉపాయం తట్టింది.
Source: Gandavarapu Prabhakar
(Facbook)
No comments:
Post a Comment