Friday, 18 October 2019

వ్యాస మహాభారతం - 27 (S-12)

ఆదిపర్వం. చతుర్దాశ్వాసం.
సౌతి శౌనకాది మహామునులకు చెబుతున్నాడు.
దుశ్యంతుడు భరతునికి పట్టాభిషేకం చేసి తపోవనాలకు వెళ్లాడని చెప్పుకున్నాము కదా ! . ఇక ఇక్కడనుండి మహాభారత గాధ భరతుని వంశక్రమం ద్వారా యెలా అల్లుకుని పోయిందో చూద్దాం. 
భరతవంశానికి భరతుడు మూలపురుషుడు కాగా, భరతునికి భూమన్యుడు, భూమన్యునికి సుహోత్రుడు జన్మించారు. సుహోత్రునికి హస్తి జన్మించాడు. ఉత్తరోత్తరా ఇతని పేరు మీదనే హస్తినాపురం అనే పేరుతో రాజధానిని నిర్మించుకున్నారు. 
హస్తికి వికుంఠనుడు, అతనికిఅజమీధుడు పుట్టారు. అజమీధుడికి ముగ్గురు భార్యల ద్వారా 124 మంది పుత్రులు జన్మించారు. వారిలో అందరికంటే శ్రేష్ఠుడైన సంవరణుడికి కురుడు అనే పుత్రుడు కలిగాడు. ఈ కురుడి పేరు మీదనే కురు వంశం, కురుక్షేత్రం నామాలు వచ్చాయి. కురుడికి విదూరథుడు, అతనికి పరీక్షిత్తు పుట్టగా, పరీక్షిత్తుకు భీమసేనుడు, భీమసేనునికి ప్రదీపుడు పుట్టారు. 
ప్రదీపుడికి దేవాపి, శంతనుడు, బాహ్లికుడు అనే ముగ్గురు కుమారులు పుట్టారు. దేవాపి బాల్యం నుండే బ్రహ్మజ్ఞానిగా తపోవనాలలో తప్పసుకై వెళ్లగా, తరువాతి వాడు శంతనుడు రాజు అయ్యాడు. అతనికి గంగాదేవి వలన దేవవ్రతుడు పుట్టాడు. అతడే భీషణ ప్రతిజ్ఞ అనంతరం బీష్ముడు అయినాడు. ఆ ప్రతిజ్ఞ ఏమంటే, తన తండ్రి శంతనుడు, సత్యవతి ( యోజనగంధి ) ని మనువాడడానికి యిష్టపడగా, ఆమె తండ్రి కోరిక మేరకు, తాను ఆజన్మ బ్రహ్మచారిగా వుండి సత్యవతీ పుత్రులకే రాజ్యాభిషేకం చేస్తానని పంచభూతాల సాక్షిగా మాట ఇవ్వడం. 
శంతనునికి సత్యవతి ద్వారా చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు అని ఇద్దరు కుమారులు కలిగారు. చిత్రాంగదుడు యవ్వనం లోనే, తన పేరుగల గంధర్వునితో అనవసర అహంకారం కారణంగా పోటీపడి, అతడితో యుద్ధం చేస్తూ మరణించాడు. ఇక మిగిలిన వాడు విచిత్రవీర్యుడు ఒక్కడే ఒక్కడు. అతడే రాజయ్యాడు. 
కాశిరాజు తనకుమార్తెలైన అంబ అంబికా అంబాలికలకు స్వయంవరం ప్రకటించగా, భీష్ముడు తన తమ్ముని కొరకై, స్వయంవరంలో తోటి రాజన్యులను ఓడించి, ఆ ముగ్గురు రాచకన్యలను, తమ రాజ్యానికి తీసుకు వచ్చాడు. అంబ తాను అప్పటికే సాళ్వరాజుకు మనసిచ్చానని చెప్పగానే, ఆమెను వదిలిపెట్టి, అంబికా, అంబాలికలను భీష్ముడు, విచిత్ర వీర్యునికి కట్టబెట్టాడు. అయితే, విచిత్రవీర్యుడు అమిత శృంగార వ్యామోహంతో, స్త్రీ సంపర్కానికి అలవాటు పడి, క్షయవ్యాధితో పిన్నవయసులో మరణించాడు. ఇదీ ఆ సమయంలో కురువంశ పరిస్థితి. 
అలంటి సమయంలో దిక్కుతోచక, సత్యవతి, భీష్ముని గృహస్థాశ్రమం స్వీకరించి, కురువంశాన్ని నిలబెట్టమని ప్రాధేయపడింది. అయితే భీష్ముడు అందుకు ససేమిరా అన్నాడు. ఆ సమయంలో కేవలం భరతవంశాన్ని కాపాడడానికి, ' నియోగ న్యాయం ' అనీ ' దేవరన్యాయం ' అనీ పిలువబడే, ఒక ధర్మసూక్ష్మాన్ని అనుసరించి, వ్యాసమహర్షి సహాయం కోరే నిమిత్తం, సత్యవతీదేవి, తనకు పరాశరుని ద్వారా కలిగిన వ్యాసమహర్షిని మనసులో తలుచుకుని రప్పించింది. 
జరిగిన విషయం అంతా చెప్పి, ఈ విషయంలో ఆయన సహాయం కోరి, అంబికా, అంబాలికలకు సంతాన యోగ్యతా కలిగించమని వేడుకున్నది. ఆ విధంగా అంబికా ద్వారా పుట్టు గ్రుడ్డి అయిన ధృతరాష్ట్రుడు, అంబాలిక ద్వారా పాండురోగంతో బాధపడే పాండురాజును, ఇవ్వగా, మరియొక ఆవకాశం అంబికకు యివ్వాలని సత్యవతి ప్రయత్నించింది. కానీ, అంబికా వ్యాసునితో కలయికకు యిష్టపడక, తన వద్ద వున్న దాసీని ఆయన వద్దకు, తనకు బదులుగా పంపింది. ఆమెకు సకల శాస్త్ర కోవిదుడు అయిన విదురుడు జన్మించాడు. 
ఆ తరువాత, ధృతరాష్టుడు గాంధారిని వివాహమాడి నూర్గురు పుత్రులను కన్నాడు. వారే దుర్యోధనాది సంతానం. కౌరవులు. ఇక పాండురాజు తన ఇరువురు భార్యలైన కుంతీ, మాద్రిలకు దేవతల అంశతో అయిదుగురు పుత్రులను కన్నాడు. కుంతీదేవికి యమధర్మరాజు వరం వలన ధర్మరాజు, వాయుదేవుని వలన భీమసేనుడు, ఇంద్రుని అంశతో అర్జునుడు జన్మించగా, మాద్రికి అశ్వనీ దేవతల వరంతో నకుల సహదేవులు జన్మించారు. వీరే పాండవులు. 
అని తమ వంశక్రమం తన దాకా చెప్పిన వైశంపాయనునితో, జనమేజయుడు, ' ఈ వంశక్రమంలో నాకు ఆశ్చర్యకరంగా అనిపిస్తున్నది, శంతనునికీ, గంగాదేవికీ పొత్తు ఎలా కలిగింది ? వారికి భీష్ముడు యెలా జన్మించాడు ? ' ఆ వృత్తాంతం చెప్పమని వినయంగా అడిగాడు.

Source: Gandavarapu Prabhakar Garu
(Facbook)

No comments:

Post a Comment