ఎవరైనా మనతో స్నేహం చేస్తామని ముందుకువస్తే, ముందూ వెనుకా ఆలోచించకుండా స్నేహానికి తెరదీయకూడదనీ, దానిలో అవతలి వారి స్వార్ధం యేమైనా వుందేమోనని తరచి చూడాలనీ, ఈ పంచతంత్ర కథ మనకు తెలియజేస్తుంది.
చిత్రగ్రీవుని (పావురము ) , అతని సహచరులని, వలకొరికి హిరణ్యకుడు ( ఎలుక ) రక్షించడం లఘుపతనకుడు ( కాకి ) చెట్టుమీదనుంచి చూశాడు. హిరణ్యకుని స్నేహధర్మానికి అబ్బురపడ్డాడు. తానుకూడా హిరణ్యకునితో స్నేహం చేయాలని ఉబలాట పడ్డాడు.
వెంటనే చెట్టు మీదనుండి క్రిందకు దిగివచ్చి, చిత్రగ్రీవుని గొంతు అనుకరిస్తూ,
' హిరణ్యకా ! హిరణ్యకా ! ' అని పలుమార్లు పిలిచాడు. అయితే, యేదో అనుమానం వచ్చి, కలుగులోనుండి బయటకు రాకుండా, ' ఎవరదీ ? ' అని అడిగింది హిరణ్యకుడు. ' నన్ను లఘుపతనకుడు అంటారు. నేను కాకిజాతికి చెందినవాడను. ' అన్నాడు, లఘుపతనకుడు.
' హిరణ్యకా ! హిరణ్యకా ! ' అని పలుమార్లు పిలిచాడు. అయితే, యేదో అనుమానం వచ్చి, కలుగులోనుండి బయటకు రాకుండా, ' ఎవరదీ ? ' అని అడిగింది హిరణ్యకుడు. ' నన్ను లఘుపతనకుడు అంటారు. నేను కాకిజాతికి చెందినవాడను. ' అన్నాడు, లఘుపతనకుడు.
అది వినగానే, . ' వెళ్ళిపో ! వెంటనే వెళ్ళిపో !, నీవు నా వైరజాతివాడివి. నీతో నాకు మాటలేమిటి ? ' అని లోపలినుండి హిరణ్యకుడు, ' తాను యెలుకజాతివాడననీ, కాకులు తమని చంపడానికి యెదురుచూస్తూ వుంటాయని, కాకులతో స్నేహం తమకు తగదని ' ఖరాఖండీగా చెప్పింది.
అయితే, లఘుపతనకుడు వదిలిపెట్టకుండా, ' నేను నీ స్నేహధర్మం చూశాను. నీతో చెయ్యికలిపి స్నేహం చెయ్యాలని వచ్చాను. నన్ను నీస్నేహితునిగా చేసుకో ' అని మరీమరీ అడిగింది. నెయ్యము, వియ్యము ఎప్పుడైనా కులములో, సంపదలో సరిసమానులతో చేసుకోవాలి. ఏవిధంగా మనయిద్దరకూ సరిపోదు. దయచేసివెళ్ళిపో ! ' అని యెంతోమర్యాదగా హిరణ్యకుడు మళ్ళీచెప్పింది.
' హిరణ్యకా ! నీ కలుగుముందే నిలబడివుంటాను, నాతో స్నేహానికి నువ్వు వొప్పుకునే దాకా. లేకుంటే, ఇక్కడే ప్రాణత్యాగం చేస్తాను. ' అని దీక్షలో కూర్చుంది, లఘుపతనకుడు అనే కాకి. కాకి మొండిదనం చూసి, మళ్ళీ హిరణ్యకుడు అనే ఎలుక, ' లఘుపతనకా ! వైరమనేది రెండువిధములు. ఒకటి కల్పితమైన వైరము. అది యేవిధంగా అయినా రావచ్చును. రెండవది జాతివైరము. సహజవైరము. దానికి ప్రత్యేక కారణం అక్కరలేదు. పాము-ముంగిస. నీరూ- నిప్పు. దేవతలు- రాక్షసులు. కుక్కలు- పిల్లులు, ధనికులు-పేదలు. చదువుకున్నవారు-, నిరక్షరాస్యులు. మంచి స్త్రీలు- చెడ్డస్త్రీలు. ఆవిధంగా అన్నమాట. ' అని మళ్ళీ లఘుపతనకునికి వివరించి చెప్పాడు.
లఘుపతనకుడు యీవాదనకి వొప్పుకొనక, ' నీలాంటి తెలివైనవారు, ఆమాత్రం మంచిమిత్రులను గుర్తించలేరా ! నన్ను నీమిత్రులలో చేర్చుకో, నేను ప్రమాణం చేస్తున్నాను, నీకెలాంటి హానీ నావలన కలగదని. ' అన్నది. కానీ, హిరణ్యకుడు చెడ్డవారితో స్నేహం మట్టికుండ వంటిది. పగిలితే అతుకుపడదు. అదే మంచివారితో స్నేహం బంగారంతో చేసిన కుండవంటిది. అది పగులదు, మహా అయితే, కొద్దిగా వంకర పోతుందేమో ! ' అని ఘాటుగా చెప్పింది.
' పైగా, నాకు ప్రమాణాల మీద నమ్మకం లేదు. ప్రమాణాలను నమ్మి స్నేహంచేస్తే, యెంత బలవంతుడైనా, అతిబలహీనుని చేతిలో చావుతెచ్చుకుంటాడు. కాబట్టి ఇక్కడినుంచి వెళ్ళిపో ! ' అనికూడా అన్నది.
లఘుపతనకునికి ఏమి సమాధానం యివ్వాలో తోచలేదు. అయితే, హిరణ్యకుడు, చాలా తెలివిగలవాడు, అతనితో స్నేహం తనకు మంచిది అనిమాత్రం నిర్ణయించుకున్నాడు. వెంటనే హిరణ్యకునితో, ' మామూలుగా యెవరైనా స్నేహితులు అవ్వాలీ అంటే, యేడు మాటలు చాలు అంటారు. నీకూ నాకూ యింతవాదన జరిగింది. దీని పర్యవసానంగా అయినా మనం మంచిమిత్రులం అవుదాము. నన్నునమ్ము. నేను వచ్చినప్పుడు నీవు కలుగులో వుండే సంభాషించు, నేను బయటవుండి నీతో స్నేహంచేస్తాను, ఇప్పుడు యే అభ్యంతరం నీకు వుండకపోవచ్చు. ' అని మళ్ళీ ప్రాధేయపడింది.
ఆ మాటలకు, హిరణ్యకుడు సంతోషించి, ' నీవు, నాకలుగులోనికి వచ్చే ప్రయత్నం చెయ్యనంత కాలం, నీకునేను స్నేహితునిగా వుంటాను. ' అని సుముఖత తెలియ జేసింది. అప్పటినుండి, యిరువురూ, రోజూ కలుసుకుంటూ, అనేకవిషయాలు మాట్లాడుకుంటూ, యెంతో ఆనందంగా స్నేహితులుగా వుండసాగాయి. ఒకరికొకరు సహాయం చేసుకుంటూ.
లఘుపతనకుడు, తాను కాకి కాబట్టి, దేవాలయంలో ప్రసాదమూ, యెక్కడైనా దొరికిన మాంసం ముక్కలూ, పట్టుకొచ్చి హిరణ్యకునితో కలిసి పంచుకునేది. హిరణ్యకుడు ఎలుక గనుక, తనకు అందిన ధాన్యపు గింజలు, యితర ఆహారపదార్ధాలు లఘుపతనకునితో పంచుకునేది . ఈ విధంగా, ఇరువురి స్నేహం, ఏ ఇబ్బందీ లేకుండా అన్యోన్యంగా సాగిపోతున్నది.
Source: Gandavarapu Prabhakar Garu
(Facbook)
No comments:
Post a Comment