ఆదిపర్వం- పంచమాశ్వాసము.
సూర్యభగవానుడు వెళ్లిపోయిన తరువాత, ఆ తేజోమూర్తి అయిన పిల్లవాడిని దగ్గర పెట్టుకోలేక, దూరంగా వదలలేక, మానసిక వేదన అనుభవించింది ముక్కుపచ్చలారని కుంతీదేవి.
ఆమె తనలో, తాను కుమిలిపోతూ, ' దుర్వాసమహర్షి నాకు ఈ మంత్రం యెందుకు ఉపదేశించినట్లు ? ఉపదేశించినా, ఆ మంత్ర ప్రభావం పరీక్షించాలని నాకెందుకు కోరిక కలిగినట్లు ? నేనెందుకు సూర్యుడిని స్మరించినట్లు ? స్మరించానే అనుకో, నాకెందుకు ఈ సద్యోగర్భము ప్రసాదించాలి సూర్యభగవానుడు ? ఈ బాలుడు నావెంటవుంటే, లోకులు అనే సూటిపోటి మాటలకు నేనెలా తట్టుకోగలను ? నన్ను అందరూ దూషించరా ? పోనీ, ఈ పిల్లవాడిని యిలా వదిలివెళదామంటే, చేతులు రావడం లేదు. '
అని ఈ విధంగా పరితపిస్తూ, కుంతీదేవి నదీతీరంలో కూర్చుని వుండగా, సూర్యభగవానుని అనుగ్రహంతో పంపబడిన, ఒక పెట్టె నదీ ప్రవాహంలోవచ్చి ఆమె కాళ్ల దగ్గర నిలిచింది. ఆశ్చర్యంగా, కుంతి, ఆపెట్టె తెరచి చూడగా, దాని నిండా అమూల్యమైన రత్నాలు, బంగారం నిండివుండి, బాలుడిని అందులో పెట్టే వీలుగా అమర్చి వున్నది.
' నాతో యింతవరకు ఆడుకున్న విధి ఈ విధంగా నాకు పరిష్కారం చూపించింది. ' అని తలచి సూర్యభగవానుడికి కుంతి నమస్కరించి, ఆపిల్లవాడిని, ఆ పెట్టెలో వుంచి అమూల్య సంపదతో సహా నీటిలోనికి వదిలింది. ఆ పిల్లవాని భవిష్యత్తు బాగుండాలని, మాతృమూర్తిగా అనేక దేవతలకు మ్రొక్కుకున్నది.
ఆమె మొర ఆలకించినట్లు, ఆ పెట్టె ప్రవాహంలో కొట్టుకుపోతూ, సూతుడనే రధం నడిపేవృత్తిలోని ఆయనకు దొరికింది. లోపల అమూల్య సంపదతో, అంతకు మించి వైభవంతో ప్రకాశిస్తున్న బాలుని చూసి, సూతుడు యెంతో సంతోషించి, తన భార్య రాధకు ఆ పిల్లవాడినీ, సంపదను ఒప్పజెప్పాడు. ఆ పిల్లవాడిని చేతులోకి తీసుకోగానే, రాధకు స్తన్యం వచ్చింది. దానితో ఆ బాలుడి ఆకలి తీర్చింది. బంగారం, రత్నాలతో దొరికాడు కాబట్టి ఆ పిల్లవానికి వసుషేణుడు అనీ, సహజకవచకుండలాలతో వున్నాడు కాబట్టి కర్ణుడు అనీ, రాధా కుమారుడు కాబట్టి రాధేయుడనీ పేర్లు వచ్చాయి. కర్ణుడు సూత పుత్రునిగానే పెరుగుతున్నాడు.
అక్కడ హస్తినలో, పాండురాజు, తన పరాక్రమంతో, శత్రువులందరినీ జయిస్తూ, రాజ్యం విస్తరింపజేసాడు. స్వయంవరంలో కుంతీదేవిని వివాహం చేసుకున్నాడు. భీష్ముని అనుమతితో మాద్రిని కూడా వివాహం చేసుకున్నాడు. వివాహానంతరం మళ్లీ పాండురాజు జైత్రయాత్ర ప్రారంభించి, లొంగిపోయిన వారిపై కరుణ చూపిస్తూ, యెదిరించిన వారి పొగరు అణచి, సామంతులుగా చేసుకున్నాడు. వార౦తా అనేకమైన కానుకలు సమర్పించుకుని స్నేహం ప్రకటించారు. ఆవిధంగా కానుకలను తీసుకు వెళ్ళడానికే, నూరు ఏనుగులను వినియోగించవలసి వచ్చింది.
పాండురాజు ప్రభావం వల్లనే హస్తినకు వైభవము సంతరించు కున్నది. ధృతరాష్ట్ర పాండురాజులు కూడా యెంతో సఖ్యంగా అరమరికలు లేకుండా వుండడము వలన నీ నా భేదం లేకుండా పాండురాజు రాజ్య వ్యవహారాలు చక్కబెట్టేవాడు, అంధుడైన అన్నగారి పేరుమీదుగా.
దిగ్విజయ యాత్రలో పోగుజేసిన ధనాన్ని, ధృతరాష్ట్రుని అనుమతితో, భీష్మునికి, సత్యవతికి, ఇతరతల్లులకూ, విదురునికీ, మిత్రులకూ, బ్రాహ్మణులకు పంచిపెట్టి, వారి ఆశీర్వచనాలు పొందాడు పాండురాజు. అతనిలోని సద్గుణాలను చూసిన పుర ప్రముఖులంతా, పాండురాజు కూడా, పూరువు, కురు, భరత చక్రవర్తుల సరసన స్థానం సంపాదిస్తాడని అనుకునేవారు.
ఈ విధంగా రోజులు ఆనందంగా గడుస్తుండగా, విశ్రాంతి కోసమై, అందమైన తన భార్యలు కుంతీ, మాద్రి లను వెంటబెట్టుకుని, హిమాలయాలకు దక్షిణాన వుండే అడవుల లోనికి వెళ్ళాడు పాండురాజు. ఆవిహార సమయంలో, రెండు ఆడఏనుగుల మధ్య మదపుటేనుగు వలే ప్రకాశించాడు పాండురాజు. వారి కావలసిన దినసరి తినుబండారాలు, శృంగార సామాగ్రి మొదలైనవన్నీ, ప్రతి దినం, తమ్ముని సుఖం కోసం, ధృతరాష్టుడు పంపేవాడు.
అలా వారు ముగ్గురూ విహరిస్తుండగా, ఒకచోట, జింకల జంట శృంగార కలాపంలో వుండగా, వాటిపై అయిదు బాణాలను ఎక్కుపెట్టి ప్రయోగించాడు, పాండురాజు. అప్పుడు కొనవూపిరితో వున్న మగజింక, ' ఓ పరాక్రమశాలీ ! నేను కిందముడనే మునిని. నేనూ నా భార్యా, వినోదార్ధము జింకల రూపం ధరించి సంగమిస్తూ వుండగా, అది చూసికూడా దయలేని వాడవై, మా ప్రాణాలు పోయేటట్లు కొట్టావు, నీ బాణాలతో. ఇది నీకు తగునా ? మేము నీకేమీ అపకారం చేయలేదే ! '
' వేటాడడం, జింకలను చంపడం క్షత్రియలక్షణమే అయినా, పరుగెత్తలేనివి, సంభోగములో వున్నవి, ప్రసవించబోయే మృగాలు, వేటకు నిషిద్ధమని నీకుతెలియదా ? నీకు రాజధర్మాలు తెలిసి కూడా, ఇట్టి అధర్మమైన పని చేసావు. ' అని పాండురాజుతో అన్నాడు. అయితే, పాండురాజు ఏమాత్రం పశ్చాత్తాపం చూపించకుండా, తన తప్పేమీ లేదని, వితండవాదం మొదలుపెట్టాడు.
దానికి, కిందముడు కోపించి, ' ప్రాణులకు ఇష్టమైన సహజమైన మైధునసుఖాన్ని అనుభవిస్తున్న మమ్ము అకారణంగా కొట్టావు కాబట్టి, నీవుకూడా నీ ప్రియురాండ్లతో కలిసే ప్రయత్నం చెయ్యగానే, మరణిస్తావు. ఇది నా తిరుగులేని శాపం. ' అని చెప్పి ప్రాణాలు విడిచాడు.
ఈ హఠాత్ పరిణామానికి, పాండురాజు తల్లడిల్లిపోయాడు. తరువాత తెప్పరిల్లి, ' కర్మఫలాలను తపించుకోలేము కదా ! ' అని సర్ది చెప్పుకున్నాడు. ' నేనిక కఠిన తప్పస్సులో వుంటాను. మునివృత్తిని అవలంబిస్తాను. రోజుకు ఒక్క ఫలాన్నే ఆహారంగా స్వీకరిస్తాను. ఇంద్రియాలను నిగ్రహిస్తాను. తాపసజీవితం గడుపుతాను. ' అని నిశ్చయించుకున్నాడు. పాండురాజు ఇద్దరు భార్యలు కూడా వారూ ఆయనతోనే వానప్రస్థానికి వస్తామని వత్తిడి చేసారు.
వెంటనే వానప్రస్థ జీవితానికి ఏర్పాట్లు చేసుకుని, పాండురాజు తనకు చెందిన సంపదను బ్రాహ్మణులకు పేదలకు, దానం ఇచ్చి, మిగిలినదంతా ధృతరాష్ట్రునికి యిచ్చివేశాడు.
అహంకార మమకారాలను విడిచిపెట్టి, పాండురాజు తన ఇద్దరు భార్యలతో సహా, ఉత్తరదిక్కుగా ప్రయాణించి, దేవతలు, సిద్ధులకు నిలయమైన గంధమాదన పర్వతాన్ని చేరుకొని, అక్కడనుండి హంసకూటాన్ని కూడా దాటి, మునులు, సిద్ధులు, యక్షులు నివసించే, ఎత్తైన శతశృంగం అనే పర్వత శిఖరం మీద వుండి తీవ్రమైన తపస్సు ప్రారంభించాడు.
విధి విలాసమంటే ఇదే ! అడుగడుగునా మహాభారత గాథలో మనకు ద్యోతకమయ్యేది అదే ! వారు జీవితంలో సుఖపడిన క్షణాలు తక్కువ. శరీరాన్ని కష్ట పెట్టుకుంటున్న కాలం ఎక్కువ. ఎవరి జీవితాలు ఎలా మలుపులు తిరిగి సుఖదుఃఖాల పరిభ్రమణంలో వుంటాయో చెప్పలేమని, చెప్పేదే పంచమ వేదం, మహాభారతం.
Source: Gandavarapu Prabhakar Garu
(Facbook)
No comments:
Post a Comment