Friday, 18 October 2019

మిత్రలాభం. - 3

మంచిమిత్రుల వలన కలిగే లాభాల గురించి చెప్పే, పంచతంత్ర కథ మనం చెప్పుకుంటున్నాము కదా !
ఒక మంచిరోజు చూసుకుని, అనుకున్న ప్రకారం, కాకివీపుమీద కూర్చుని ఎలుక గూడా, అరణ్యమధ్యంలోని సరస్సుకు బయలుదేరింది. హిరణ్యకుడు ( ఎలుక ) దారిలో లఘుపతనకునికి ( కాకికి ) యెన్నో ఆహ్లాదకరమైన తన అనుభవాలు చెప్పాడు, యెగురుతున్న శ్రమ తెలీకుండా.
లఘుపతనకుడు ( కాకి ) వీపుమీద యెలుకను యెక్కించుకుని రావడం దూరంనుంచే మంధరకుడు ( తాబేలు ) చూసి, లఘుపతనకుని గుర్తుపట్టక, ' ఈకాకి యెవరో అసాధ్యురాలు. నాకేదో ఆపద తెచ్చేటట్లు వున్నది ' అనుకుని, వెంటనే, బుడుంగున, నీటిమడుగులో దాక్కుంది. అది అలా దాక్కోవడం కాకి చూడనే చూసింది. తనను గుర్తు పట్టలేదనుకుని, హిరణ్యకుని ( యెలుక ) చెట్టుమొదట్లో దించి, తాను చెట్టు యెక్కి ' ఓ మంధరకా ! నేను నీస్నేహితుడిని, లఘుపతనకుడిని. బయటకువచ్చి నన్ను, నా స్నేహితుడిని, ఆహ్వానించవా, నీ పాతస్నేహితుడిని కదా అని వచ్చాను. ' అన్నది కాకి.
మందరకుడు తెప్పరిల్లి, నీటిలోనుండి చెంగున బయటకు వచ్చి, ఆనందబాష్పాలతో స్నేహితుని దగ్గరగావెళ్లి, ' లఘుపతనకా ! నీరాకకు నేను చాలా ఆనందిస్తున్నాను. చాలారోజుల తరువాత కలిసాము కదా ! వెంటనే గుర్తుపట్టలేకపోయాను. నీకు తెలుసుకదా ! అవతలివ్యక్తి శక్తి యుక్తులు తెలియకుండా, మనము వారితో, స్నేహము చేయలేము కదా ! ' అన్నది.
ఆ మాటలకు సంతోషించి, కాకి చెట్టు దిగివచ్చి, మందరకుని కౌగలించుకుని, సంగతులు ముచ్చటించుకుంటుండగా, నెమ్మదిగా, హిరణ్యకుడు కూడా వచ్చి, కాకి ప్రక్కన చేరి, మంధరుడిని నవ్వుతూ పలకరించింది. తాబేలు, ' లఘుపతనకా ! ఈ బుల్లి స్నేహితుడు యెవరు ? అతడు నీ ఆహారం వంటివాడు అయినాకూడా, నీ వీపుమీద యెక్కించుకుని తీసుకువచ్చిన కారణమేమిటి ? ' అని ఆశ్చర్యంగా అడిగింది.
' ఇతడు నాస్నేహితుడు హిరణ్యకుడు. అతడు లేకుండా నేనుండలేను. ఆకాశంలో నక్షత్రాలవలే, సముద్రతీరంలో ఇసుకవలే, యితని మంచిగుణాలని, నేను లెక్క చెప్పలేను. ఇతడు, యీప్రపంచమంటే విరక్తి పెంచుకున్నాడు. అతనికి మళ్ళీ వుత్సాహం నింపడానికి, నీవద్దకు తీసుకువచ్చాను. ' అని యెలుకను పరిచయం చేసింది. ' అతని విరక్తి కారణం, నిన్ను కలిసిన తరువాత చెబుతానన్నది. ' అని కూడా చెప్పింది. అలా చెబుతూ, కాకి హిరణ్యకుని వైపు తిరిగి, ' ఇప్పుడు నీ విరక్తి కారణమైన కథ చెప్పగలవా ! ' అని అడిగింది. ' అలాగే ' అంటూ తనకధ చెప్పసాగింది హిరణ్యకుడు:
మహిళారోప్యానికి దక్షిణంగా వున్న శివాలయంలో, ' తామ్రచూడుడు ' అనేసాధువు వుండేవాడు. రోజూ అతడు భిక్షాటనం చేసుకుని తెచ్చుకున్న వస్తువులతో, వండుకు తినేవాడు. తాను తినగా మిగిలిన పదార్ధాలను, గుడిలో సేవకులకు పెట్టేవాడు. వారుకూడా, ప్రతిఫలంగా గుడి శుభ్రం చేసి ముగ్గులు పెట్టేవారు. వండకుండా వున్న పదార్ధాలు వుట్టిలోకట్టి, వేలాడదీసి పడుకునేవాడు.
నేను మా మూషికాలకు రాజును అవడం వలన, నా బంధువులు నాకు ఆ సాధువుపై ఫిర్యాదు చేశారు. ' ఆయన బియ్యం, పప్పులు వుట్టిలో మాకు అందకుండా పెడుతున్నాడు. నీవే వాటిని తీసుకురాగల సమర్థుడవు. నీవుండగా వేరే యెక్కడకువెళ్లి చెప్పుకోవాలి, అని నీకుచెప్పడానికి వచ్చాము. నువ్వు మాతో వచ్చి ఆపదార్ధాలు మాకు అందేటట్లు చెయ్యి. ' అని ప్రార్ధించాయి.
అవికోరినట్లుగానే, ఆ పదార్ధాలు దించడంలో విజయం సాధించి మా బంధువులకు ఆనందం కలిగించాను. రోజూ అలా ఉట్టిలో పదార్ధాలు తీసుకు వచ్చి విందు చేసుకునేవాళ్లం, ఇది ఆ సాధువు కనిబెట్టి, మమ్ములను భయపెట్టాలని గిన్నెమీద వెదురుకర్రతో కొట్టి చప్పుడు చేస్తూ వుండేవాడు. మేము భయపడి, అతడు యెప్పుడు శబ్దము ఆపుతాడా అని యెదురు చూసేవాళ్ళం. అయితే, ఆయన ఆపేవాడు కాదు.
ఒకరోజు ఆ యన మిత్రుడు ' బృహత్ ' అనే ఆయన వచ్చి తామ్రచూడుని ఆతిధ్యం స్వీకరించాడు. ఆయన తన యాత్రావిశేషాలు చెబుతుంటే, తామ్రచూడుడు గిన్నెమీద శబ్దంచేసే పనిలో వుండిపోయి, ఆయన చెప్పేది, అన్య మనస్కంగా వినడం మొదలు పెట్టాడు. అడిగిన దానికి, పొంతనలేని సమాధానాలు చెప్పసాగాడు.
అతని పరధ్యానానికి కారణం తెలుసుకుని, ' బృహత్ ' యీ విధంగా అన్నాడు : ' ఈ మూషికం స్థావరం యెక్కడ వుందో తెలుసుకుని వెళ్లిచూడు, అక్కడ నీకు అపార ధాన్యరాసులు కనిపిస్తాయి. వాటిని తినడం వలననే, యిది ఇంత బలిష్టంగా తయారై, నీ నిల్వలమీదకు వచ్చే సాహసం చేస్తున్నది. ధనసంపాదన, ఆర్ధిక వనరులు ఉన్నవాళ్లకు వారిశక్తి,పై వారికి అపారనమ్మకం పెరుగుతుంది. ' అని చెప్పాడు.
అదే సమయంలో, నేను రోజులాగానే, నా బంధువులముందు పరిహాసం అవకుండా, మళ్ళీ మళ్ళీ వుట్టిమీదకు వెళ్లేప్రయత్నం చేస్తుంటే, వారి ఆలోచన ప్రకారం, నా మీద దాడి చేసి కొట్టబోయారు. తప్పించుకున్నాను. మా అనుచరులు నన్ను యెగతాళి చేసి వెళ్లిపోయారు.
నా కాలిగుర్తులు, నేను మధ్యలో పిల్లి వాతబడి రక్తం మరకలతో వస్తుంటే, ఆ ఆనవాళ్లతో, నా ధాన్యరాశులు వాళ్ళ వశం చేసుకున్నారు. రేపో, మాపో నా కోటమీదకుకూడా వచ్చే ప్రమాదం వుంది, అందుకే, బ్రతుకు జీవుడా అని పారిపోయివచ్చాను. నా సంపద పోయినా పరవాలేదు, నా శక్తిని నా అనుచరులు కించపరిచారు. ఇక అక్కడ వుండబుద్ధి కాలేదు. ' అని తన కథ వినిపించింది హిరణ్యకుడు మూషికరాజు, సానుభూతితో వింటున్న మందరకునికి, లఘుపతనకునికి. తన బాధలు మిత్రులకు చెప్పుకున్న తరువాత, గుండె బరువు తగ్గినట్లు అనిపించింది హిరణ్యకుడికి.
చూసారా ! మంచిమిత్రులు దొరికితే, వారికి తమ కష్టాలు చెప్పుకుంటే, ఎంత స్వాంతనగా వుంటుందో ! అవతల ప్రక్కన సాధువు కూడా, తనను వేధిస్తున్న మూషికాల బెడదకు శాశ్వత పరిష్కారం చూసుకోకుండా, ఎప్పటికప్పుడు చప్పుళ్ళు చేస్తూ, ఇబ్బంది పడుతున్నాడు కానీ, ఆ సమస్యకు అసలు కారణం వెదికే ఆలోచన రాలేదు. మిత్రుడి సలహాతోనే, మూషిక స్థావరాన్ని కనిబెట్టి, సమస్యకు పరిష్కారం కనుక్కోగలిగాడు.
సాధువు యొక్క మిత్రుడు కూడా, తన స్నేహితుడు అన్య మనస్కంగా, సంభాషణ వింటుంటే, అంతటితో వదిలివేయక, అతని పరధ్యానానికి కారణం అడిగి, అతని సమస్య తన సమస్యగా అలోచించి, మిత్రుడికి తోడ్పడ్డాడు.

Source: Gandavarapu Prabhakar Garu
(Facbook)

No comments:

Post a Comment