Friday, 18 October 2019

దుష్టులతో సహవాసం.

చెడ్డవారితో సహవాసం, మొదట్లో భలే బాగుంటుంది. ఎందుకంటే, వారి మాటలలో చేతలలో యెంతో ప్రేమ ఒలకబోసి, వారు మనలను వారినుండి దూరంగా వెళ్లకుండా, కట్టిపడవేయాలి కదా ! పోనుపోను వారివలన ప్రమాదంలో యిరుక్కుంటే, అప్పుడు వగచినా ప్రయోజనం లేదు. దీనికి తార్కాణంగా పంచతంత్రం లోని కథను చూద్దాం :
ఒక కీకారణ్యంలో ' మదోత్కటుడు ' అనే సింహ౦ , తనను ఒక పులి, నక్క, కాకి సేవిస్తుండగా, తన దర్పం చూపిస్తుండేది, మృగరాజుహోదాలో. ఒకరోజు ' క్రదనకుడు ' అనే ఒంటె, దారితప్పి, వీళ్ళ కంటబడింది. 
అయితే, యెప్పుడూ ఆజంతువులు, ఒంటెను చూడకపోవడంతో, అది యెంత ప్రమాదకర జంతువో అని భయపడ్డాయి. సింహము తనపరివారాన్ని అది యెలాంటి జంతువో చూసిరమ్మని పంపించింది. అవి దగ్గరకెళ్ళి విచారించి, అది క్రూరజంతువు కాదనీ, ఒంటె మానవులకు పెంపుడు జంతువుగా బరువులుమోస్తూ వుంటుందనీ తిరిగివచ్చి సింహానికి తెలియజేశారు. ' దానిమాంసం రుచిగా వుంటుందేమో అనిపిస్తున్నది. చంపి తినేద్దామా ! ' అని సలహా యిచ్చాయి.
మృగరాజు అయిన సింహము, అందుకు వప్పుకోలేదు. అది మనకు అతిధి. అతిధిని చంపితే నూరుగురు బ్రాహ్మణులను చంపిన పాపంవస్తుంది. అందువలన, దారితప్పి
వచ్చిన ఆ సాధుజంతువుకు తాను ఆశ్రయం యిస్తున్నానని ప్రకటించి, ఒంటెనుకూడా తన పరివారంలో కలుపుకున్నది.
ఒంటె మంచితనము, సాధుస్వభావము, అది కష్టపడి బరువులుమోసే విధానం తెలుసుకుని, యెంతో ప్రేమతో, ' క్రధనకా ! నీవుతిరిగి నీ యజమానివద్దకు వెళ్లనక్కర లేదు. మాతోనే వుండు. ఇక్కడి మంచి ఆహారం తింటూ, నీ దాస్యంనుంచి విముక్తికలిగి స్వేచ్ఛగా వుండు. ' అని సింహము, ఒంటెతో చెప్పింది. ఆ ఒంటె కూడా వాళ్ళతో సంతోషంగా ఆ కీకారణ్యంలో వుండసాగింది.
ఇలా వుండగా, ఒకనాడు సింహము అనుకోకుండా, ఒక ఏనుగుతో తలపడవలసిన పరిస్థితి వచ్చింది. ఆ ఏనుగు బాగా కుమ్మివేయడంతో, దానిని చివరకు తరిమికొట్ట
గలిగినా, ఆ దెబ్బలకు నీరసించి, తన ఆహారం తాను సంపాదించుకోలేని స్థితిలో వున్నది. విధిలేక, తనపరివారం నుంచి సహాయం ఆశించి, ఏదైనా జంతువును వేటాడి తనకు ఆహారం తీసుకురమ్మని చెప్పింది, తన సహజమైన పరాక్రమానికి విరుద్ధంగా.
ఆ సమయంలో యిదే అదను అని, నక్క, పులి, మళ్ళీ సింహానికి ఒంటెనుతిని, ఆకలి తీర్చుకొమ్మని సలహా యిచ్చాయి. కానీ సింహం వారిపై, కోపగించి, అక్కడనుంచి, పంపివేసింది.
అడవి అంతా తిరిగినా కూడా నక్కకూ, పులికీ, కాకికి, యేజంతువూ కనబడలేదు. సమయం వృధాచెయ్యడం యిష్టంలేక పులి, నక్క, కాకి అక్కడనుంచి ఒంటెకు దూరంగా వెళ్లి ' మన దగ్గర ఇంత కండకలిగిన ఒంటెను పెట్టుకుని, అనవసర ప్రయాసగా అడవి అంతా వెదుకుతున్నాము. ఏదైనా ఉపాయం ఆలోచించి యీ ఒంటెను, సింహానికి ఆహారంగా చేసి, దీనిమాంసము మనమూ రుచిచూద్దాము. దాని ప్రక్కన తిరుగుతూ 
వున్నాము కానీ, దాని మాంసం రుచే యెప్పుడూ ఆలోచనకు వస్తున్నది. ' అని తమలోతాము పధకం వేసుకున్నాయి, ఒంటెను సంహరించడానికి.
వెంటనే ఒంటెనుకూడా కలుపుకుని వెళ్లి సింహంతో ' మహారాజా ! ఈరోజు ఒక్క జంతువూ కనబడలేదు. మీకు ఆహారం అందించలేనందుకు మాకు సిగ్గుగావున్నది. ఈరోజుకు మీరు మాలో యెవరినైనా భక్షించండి. ప్రభుసేవలో ప్రాణాలు వదలడానికి మేము సిద్ధంగావున్నాము. ' అని ఒంటెను కూడా కలుపుకుని చెప్పినట్లు మిగిలిన ముగ్గురూ చెప్పారు. కాకీ, నక్క మొదటగా తినమని ముందుకు రాగా, సింహం వాటిని వారించింది. మరల సింహం ఆలంచించే లోపే, పులి ముందుకువచ్చి, ' మీ శరీరాలు మృగరాజుకు యేమూలకు ? నన్ను నేను అర్పించుకుంటున్నాను. ' అన్నది.
అప్పుడు ఒంటె, తానూ మాట్లాడకపొతే బాగుండదని, ' పులి రాజా ! నీవూ సింహము లాంటి దానివే. నీ కన్నా నాలాంటి భృత్యుడు సింహానికి ఆహారమైతే, అన్నివిధాలా బాగుంటుంది. ' అని ' యెలాగూ సింహము వద్దంటుందిలే ! ' అని ధైర్యంగా అన్నది. కానీ, ఒంటె, ఆమాటలు అన్నదే తడవుగా, పులీ, నక్కా ఒక్కసారి ఒంటెమీదకు లంఘించి ముక్కలుముక్కలుగా చంపివేసి, ఒంటె మాంసాన్ని, సింహానికి భోజనంగా ఆఘమేఘాల మీద సమర్పించాయి.
సింహం ఆ హఠాత్పరిణామానికి అవాక్కయి చూస్తూ వుండిపోయింది, యేమీచెయ్యలేక. ఆకలి ఎక్కువగా ఉండడంతో, వారితో వాదించే ఓపికలేక, మిగిలినవారితో కలిసి ఒంటెను, విందారగించింది.
దుష్టుల సాంగత్యం మొదటమొదట, యెంతో సరదాగా, ఆనందంగా వుంటుంది. వారు తన ఆప్తబంధువులలాగా కనబడతారు. ఆ భ్రమలోనుండి బయటపడకపొతే, వారి వుచ్చులోబడి బయటకు రాలేని పరిస్థితులలో చిక్కుకుంటారు. దీపంపురుగుల వలె మసి అయిపోతారు.

Source: Gandavarapu Prabhakar Garu
(Facbook)

No comments:

Post a Comment