Friday, 18 October 2019

మిత్రలాభం - 2

నిస్వార్ధ స్నేహాల గురించి మనం పంచతంత్ర కధల ద్వారా తెలుసుకుంటున్నాం కదా ! ఇక చదవండి.
హిరణ్యకుడి ( ఎలుక ), లఘుపతనకుని ( కాకి ), స్నేహం యెంతో అన్యోన్యంగా సాగిపోతుండగా, ఒకరోజు, కాకి కళ్ళనిండా నీళ్లతో బాధపడుతూ వచ్చింది. ' ఏమిటి మిత్రమా ! ఏమిటి సంగతి ! యెందుకు బాధగావున్నావ్ ? ' అని యెలుకరాజు అడిగింది. దానికి, ' నేను యీ రాజ్యంలో ప్రజలతో బాగా విసిగిపోయాను. ఎటైనా పోదామని
అనుకుంటున్నాను. ' అన్నది కాకి. ' కానీ కారణం వుండాలిగా, అదేంటో చెప్పు. ' అని అనునయంగా, హిరణ్యకుడు అడిగాడు.
' ఏం చెప్పమంటావు మిత్రమా ? ఇక్కడ కరవుసూచనలు కనిపిస్తున్నాయి. ఎవరూ పితృ దేవతలకు పిండాలుకూడా పెట్టడంలేదు. నా ఆకలితీరే మార్గమే లేదు. ఎక్కడైతే పితృకార్యాలు చెయ్యరో అక్కడ వుండకూడదని పెద్దలు చెప్పారు కదా ! ఇంకోప్రక్క వేటగాళ్లు యెప్పుడూ యేపక్షిని పట్టుకుందామా అని చూస్తున్నారు. ఆ మధ్య తృటిలో తప్పించుకున్నాను. మృత్యువు చెప్పిరాదు కదా ! నా జాగ్రత్తలో నేను వుందామని
అనుకుంటున్నాను. ఈరాజ్యం వదలిపోతాను. ' అని దీనంగా అన్నది లఘుపతనకుడు, యెలుకతో.
' సరే యెక్కడికి పోదాం అనుకుంటున్నావు ? ఆదికూడా చెప్పు. ' అన్నది ఎలుక. 
దక్షిణదేశాన, ఒక కీకారణ్యంలో పెద్దసరస్సు వున్నది. అక్కడ నాస్నేహితుడు ఒకడు వున్నాడు. ' మందరకుడు ' అనే తాబేలు. నీలాగే, అతను చక్కని స్నేహహృదయం కలవాడు. నాకు మంచిమంచి చేపలూ, మాంసం ముక్కలు తెచ్చిపెడతాడు. అతనితో నా జీవితం సంతోషంగా గడిచిపోతుంది. కాలక్షేపం కబుర్లు చిన్నవీ, పెద్దవీ బోలెడు చెప్పుకుంటూ, నా జీవితం గడిపేస్తాను. ఈ వేటగాళ్ల బారిన పడే ఖర్మ లేకుండా, కాపాడే స్నేహితుడు వున్నాడుకదా ! ' అన్నది లఘుపతనకుడు.
లఘుపతనకుడు యింకా యిలా చెబుతున్నాడు. ' అందుకే పెద్దలు అన్నారు, కరవు కోరలలో చిక్కుకున్న నిర్భాగ్యులను చూడడంకంటే దురదృష్టం యింకొకటి లేదు. నాలాంటి తెలివిగలవానికి, అసాధ్యం యేమిలేదు. పండితులైనవారికి, యేదేశమైనా, తమ దేశంలాంటిదే, యెవరైనా మిత్రుడే, తమ అమృతవాక్కుల ద్వారా. నోరు మంచిదైతే వూరు మంచిది అవుతుంది. '
' నేర్చుకునేవాడికీ, అధికారికి తేడా యెప్పుడూ వుంటుంది. మనం దూర దేశంలో యెవరికైనా క్రొత్తవిషయం నేర్పగలిగితే, వాళ్ళే మనలను ఆదరిస్తారు. నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో, హిరణ్యకా ! ఏ దేశపురాజైనా ఆ దేశంలోనే గౌరవింపబడతాడు. కానీ పండితుడు యెక్కడికివెళ్లినా గౌరవ మర్యాదలకు లోటు వుండదు. ' అన్నది కాకి ఎలుకతో. ' అలాగైతే, నేనుకూడా నీతోవస్తాను, నేనుకూడా యిక్కడ అంతసంతోషంగా యేమీలేను. ' అన్నది హిరణ్యకుడు లఘుపతనకునితో.
' అయ్యో ! నీకుకూడా కష్టాలా ! యేమికష్టం వచ్చింది ? ' అని అడిగింది కాకి ఆశ్చర్యంగా.
' అది పెద్దకధలే, నీ స్నేహితునివద్దకు జేరిన తర్వాత, నా కష్టాలు చెబుతాను. ' అన్నది హిరణ్యకుడు. దానికి లఘుపతనకుడు, ' కానీ నువ్వునాతో యెలా రాగలవు. నేనంటే, పక్షిని. యెగురుకుంటూ పోగలను. నువ్వు యెగరలేవుకదా ! ' అని సందేహం ప్రకటించింది. ' అదేం పెద్దసమస్య కాదు. నేను నీ వీపుమీద యెక్కికూర్చుని కబుర్లు చెబుతుంటాను, మార్గాయాసము తెలియకుండా. నువ్వు నన్ను మోసుకుంటూ, అక్కడకు తీసుకెళ్ళు. ' అన్నది యెలుక.
' ఓ ! తప్పకుండా ! అంతకంటే కావలసినది యేమున్నది. నాకు నువ్వు, మంధరకుడు తోడుగా వుంటే, మీ మిత్రత్వం లో యింకా అధికమైన ఆనందం దొరుకుతుంది. తక్షణమే వెళదాం. ' అన్నది లఘుపతనకుడు.
ఒక మంచిరోజు చూసుకుని, అనుకున్న ప్రకారం, యిద్దరూ, అరణ్యమధ్యం లోని సరస్సుకు బయలుదేరారు. హిరణ్యకుడు దారిలో లఘుపతనకునికి యెన్నో ఆహ్లాద కరమైన తన అనుభవాలు చెప్పాడు, యెగురుతున్నశ్రమ తెలీకుండా.

Source: Gandavarapu Prabhakar Garu
(Facbook)

No comments:

Post a Comment