మనకు అనుకోని పరిస్తతులు ఎదురైనప్పుడు, సమస్యాపూరక వాతావరణం తలెత్తినప్పుడు, సంయమనంతో, వేగంగా, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలనే, విషయం, ఈ పంచతంత్ర కథ ద్వారా మనకు తెలుస్తుంది.
ఒక అగ్రహారంలో దేవశర్మ, యజ్ఞసేన అనే దంపతులు వుండేవారు. వారికి లేకలేక ఒక పిల్లవాడు జన్మించాడు. వారు ఆపిల్లవాడిని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. పిల్లవానికి తోడుగా, ముచ్చటపడి, వారొక ముంగిసను కూడా పెంచుతున్నారు. అది పిల్లవాడిని యెంతో ప్రేమగా చూసుకునేది.
ఒకసారి దేవశర్మ యేదో పనిమీద పొరుగువూరికి వెళ్ళాడు. తన దినచర్యలో భాగంగా యజ్ఞసేన మంచినీళ్ల చెరువుకు వెళ్ళింది, నీళ్లు తెద్దామని. వెళుతూ వెళుతూ వుయ్యాలలోని పిల్లవానికి కాపలాగా, ముంగిసను వుంచి, జాగ్రత్తగా పిల్లవానిని చూస్తూ వుండమని చెప్పింది. వాడు హాయిగా నిద్రపోతున్నాడు. ముంగిస వాకిలిలో కాపలాగా వున్నది.
ఆ సమయంలో యెక్కడ నుంచి వచ్చిందో ఒక నల్లని త్రాచుపాము వూయలమీదుగా ప్రాకుతూ పిల్లవాని వైపు వెళుతూ,ముంగిసకు, కనిపించింది. ముంగిస వెంటనే గమనించి, అసలే జాతివైరం వుండడం వలన, అంతేకాకుండా, పిల్లవానికి ఆ పాము హాని చేస్తుందేమో అని పిల్లవాని మీద ప్రేమతో, శత్రుసైనికుని మట్టుపెట్టే యోధునివలే ఒక్క వుదుటున వూయలపైకి యెగిరి, పామును, పిల్లవానికి దూరంగా విసరి పారవేసింది.
పాము తిరిగి బుసకొట్టుతూ పిల్లవానివైపు వస్తూవుంటే, ముంగిస యెగిరి ఆ త్రాచుపాము పీకపట్టుకుని, వీరావేశంగా దానితో పోరాడి, మెడకొరికి చంపివేసింది. ఆ తరువాత,
తననోటికి అంటిన రక్తం నాలుకతో తుడుచుకుంటూ, ముంగిస విజయగర్వంతో గుమ్మంవైపు వచ్చింది, యజమానురాలి రాకకోసం.
తననోటికి అంటిన రక్తం నాలుకతో తుడుచుకుంటూ, ముంగిస విజయగర్వంతో గుమ్మంవైపు వచ్చింది, యజమానురాలి రాకకోసం.
అప్పుడే నీళ్ళబిందెతో లోనికి అడుగుపెడుతున్న
యజమానురాలిని చూసి, మూతి నాలుకతో తుడుచుకుంటూ, ఆ ముంగిస ఎదురు వెళ్ళింది. తాను చేసిన సాహసకార్యం యెప్పుడు యజమానురాలు చూస్తుందా, తనను మెచ్చుకుంటుందా అని ఆ ముంగిస, ఆమె ప్రక్కనే తిరగసాగింది.
యజమానురాలిని చూసి, మూతి నాలుకతో తుడుచుకుంటూ, ఆ ముంగిస ఎదురు వెళ్ళింది. తాను చేసిన సాహసకార్యం యెప్పుడు యజమానురాలు చూస్తుందా, తనను మెచ్చుకుంటుందా అని ఆ ముంగిస, ఆమె ప్రక్కనే తిరగసాగింది.
అయితే, ముంగిస నోటినవున్న రక్తంచూసి, ముంగిస పిల్లవానిని చంపింది అని భావించి, బాధతో, ఆవేశం తట్టుకోలేక, ఆమె, తనచేతిలో వున్న నీళ్ళబిందెను, గట్టిగా ముంగిస ముఖానికి తగిలేటట్లు విసిరింది. ఈ పరిణామము వూహించని ముంగిస, ఆదెబ్బను యెదుర్కొనలేక గుటుక్కున ప్రాణాలు విడిచింది.
ఆ తరువాత యజ్ఞసేన పరుగెత్తుకుంటూ వెళ్లి, వూయలలో బాబునుచూడగా, ప్రశాంతం గా బోసి నవ్వులతో నిద్రపోతూ కనిపించాడు. ఆప్రక్కన నేలపై, ముక్కలైన పాముశరీరం, రక్తంమరకలు కనిపించాయి. యజ్ఞసేన, అసలు జరిగినవిషయం తెలుసుకుని, ' మూగజీవి, తనకుమారుని ప్రాణం కాపాడితే, అన్నీతెలిసిన తాను, అన్యాయంగా తనకు మేలుచేసిన ముంగిసను చంపివేశానే ' అని కుమిలిపోయింది.
కానీ, యేమిలాభం ? పోయిన ముంగిసప్రాణం తిరిగిరాదుకదా ! అదే ఒక్కక్షణం తన పెంపుడుజంతువు మీద నమ్మకంతో, యేమి జరిగివుంటుందో, లోపలికి వెళ్లి చూద్దాము అనే, ఆలోచన, సంయమన దృష్టి వుంటే, యీ దారుణం జరిగేది కాదుకదా !
కాబట్టి, కొద్ది ఆలోచనాధోరణి, యెన్నో అనర్ధాలని, తప్పిస్తుంది. అదే లేకపోతే, అనర్ధాలను తెప్పిస్తుంది. అదే విధంగా, మన జీవితాలలో కూడా, కొన్ని సంఘటనలు, మనం యెంతో ప్రేమించే వ్యక్తుల మీద అనుమానించేటట్లు జరుగవచ్చు.
అంతమాత్రం చేత, వారితో విరోధం పెంచుకోకుండా, ఆ సమయంలో, వారితో మనకు వున్న అనుబంధాన్ని, వారు మన మీద చూపించే ప్రేమను గుర్తుకు తెచ్చుకుని, సంయమనంతో ఆలోచిస్తే, ఎన్నో చిక్కులు విడిపోయి, కుటుంబాలలో, సుహృద్భావ వాతావరణం నెలకొనే వీలు వుంటుంది.
Source: Gandavarapu Prabhakar Garu
(Facbook)
No comments:
Post a Comment