క్షుద్భాద్ధతో ఏదో ఒక ఉద్యోగమని, ముందుకెళితే, పడే ఇబ్బందులు తెలియజెప్పే పంచతంత్రకథ ఇది.
ఒకప్పుడు, ఒకపల్లెటూరిలో ' యుధిష్టరుడు ' అనే కుమ్మరి వుండేవాడు. ఆజానుబాహుడు, స్ఫురద్రూపి. చూడడానికి యోధుడివలె వుండేవాడు. కుండలుచేసి నగరానికి తీసుకు వెళ్లి లాభానికి అమ్మడము అతనివృత్తి. ఆక్రమంలో అతడు చెడు సహవాసాలకు అలవాటుపడి, వచ్చిన డబ్బులతో, నగరంలో మద్యం సేవించి తూలుతూ యేదో సమయానికి యిల్లు చేరేవాడు.
ఒకసారి అదేవిధంగా తాగి, తూలుతూ వస్తూ, ఒక పగిలిపోయిన గాజుపాత్ర మీద పడిపోయాడు. గాజుముక్కల పదునుకి, అతని ముఖంమీద అక్కడక్కడా గీసుకు పోయింది. ఎలాగో అలాగ యిల్లు చేరాడు. అయితే ముఖంమీద దెబ్బలు తగ్గినా కత్తిగాట్లలాగా మచ్చలు, ముఖంమీద కనిపిస్తూనే వున్నాయి.
ఆసమయంలోనే పొరుగు రాజ్యంతో, యుద్ధ వాతావరణం ఏర్పడింది. అందువలన, గ్రామంలో కరువు పరిస్థితులు యేర్పడగానే, అందరిలాగానే, యుధిష్టరుడు కూడా పెట్టే, బేడా సర్దుకుని రాజుగారు వుండే నగరానికివచ్చాడు. అప్పుడు రాజుగారి సైన్యంలోకి హడావుడిగా నియామకాలు జరుగుతుండగా, ఆవరుసలో తనుకూడా అప్రయత్నంగా నిలబడ్డాడు. అతనిని చూడగానే, రాజోద్యోగులు, ముఖంమీద కత్తిగాట్లు పరికించి, యేమీప్రశ్నలు అడగకుండానే, రాజాస్థానంలో ఉన్నత పదవిలో నియమించారు.
యుధిష్టరుడుకూడా మారుమాట్లాడకుండా, గొప్ప యోధుడివలె, విధులు నిర్వర్తిస్తుండేవాడు. ఒక్కొక్కప్పుడు మౌనంగా వుండడం యెంత లాభమో తెలుసుకున్నాడు. క్రమంగా త్రాగుడికి స్వస్తిచెప్పాడు. రాజ్యంలో, యుద్ధవాతావరణం సద్దుమణిగింది. రోజువారీ యుద్హ ప్రావీణ్యత చూపించవలసిన అవసరం లేకపోవడంతో, యుధిష్ఠరుని గుట్టు బయటపడకుండా కొన్నాళ్ళు సాగిపోయింది.
అయితే, ఒకసారి మళ్ళీ యుద్ధపరిస్థితులు నెలకొని, పొరుగురాజుతో యుద్ధానికి సైన్యం సిద్ధపడుతూ, ఒక పటాలానికి, యుధిష్ఠరుని అగ్రస్థానంలోవుంచి, యుద్ధానికి పంపే తరుణం వచ్చింది. ఇంకేముంది ! యుధిష్ఠరుని గుండె గుభేలుమంది. సేనాధిపతి వంక బిత్తరచూపులు చూస్తూ నిలబడ్డాడు. ' ఇప్పుడు యుద్ధం అంత అవసరమా ? సంధి చేసుకునే అవకాశంలేదా ? ' అని పై అధికారులను, బేలగా అడిగాడు. ఇతని వాలకం చూసి, పై అధికారులు వెనుకటి చరిత్ర కూపీలాగగా, అతను కుండలవృత్తిలోనివాడనీ, యేనాడూ కత్తిపట్టలేదనీ తెలిసిపోయింది.
జరిగిన తప్పిదం తెలుసుకుని, అతనిని వుద్యోగం నుండి తీసివేసే ప్రయత్నం చెయ్యబోతుండగా, సంపాదన పోతుందనే భయంతో, యుధిష్టరుడు ' నేను యుద్ధానికి వెళ్లి, శత్రువులను జయిస్తాను, సన్ను పంపండి. ' అని బీరాలు పలుకసాగాడు. అయితే అతని పరిస్థితికి జాలిపడి, జరిగినదానిలో అతని తప్పిదంతో బాటు, తమది కూడా వున్నదని నాలుక కరుచుకుని, రాజుగారి వంటశాలలో పాత్రల కొనుగోలు విభాగంలో అతనికి, కొలువుయిచ్చారు. ' బ్రతుకు జీవుడా ' అని యుద్ధదుస్తులు త్వరత్వరగా తీసివేసి, అక్కడనుంచి యుధిష్టరుడు జారుకున్నాడు.
ఏ వృత్తిలోవారికి ఆ వృత్తికి సంబంధించిన పనులలో చాకచక్యం వుంటుంది. యుద్ధరంగంలో అనుభవంలేకుండా నిలబడడం తమ ప్రాణాలకూ, తోటి సైనికుల ప్రాణాలకు ముప్పుకదా ! ' జీవనోపాధి కోసం యేవృత్తిబడితే ఆ వృత్తి యెంచుకుంటే, యిలాంటి పరిస్థితులే వస్తాయి ' అని చెప్పే కథ,ఇది.
Source: Gandavarapu Prabhakar Garu
(Facbook)
No comments:
Post a Comment