Friday, 18 October 2019

తాడిదన్నే వాని తల దన్నేవాడు.

' జీర్ణధనుడు ' అనే గొప్పవ్యాపారస్థుని కుమారుడు, వ్యాపారంలో అన్నీపోగొట్టుకుని, తిరిగి ధనార్జనకోసం విదేశాలకువెళ్లి వ్యాపారం చేయాలి అనుకున్నాడు. గొప్పగా బ్రతికినచోట పేదగావుండి, అందరి సానుభూతి పొందేకంటే అదే మేలనుకున్నాడు. ' పూలు అమ్మినచోట కట్టెలు అమ్మలేరు ' కదా !
కానీ జీర్ణధనునికి విదేశాలకు వెళ్ళడానికి డబ్బు అవసరం వచ్చింది. తన దగ్గరవున్న అతి ఖరీదైన పెద్ద ఇనుపత్రాసును, స్థానికవ్యాపారి వద్ద తాకట్టుపెట్టి, కొంత డబ్బు తీసుకుని, విదేశాలకు వెళ్లి తెలివితేటలతో తిరిగి డబ్బుసంపాదించి తనవూరికి వచ్చాడు. ఇక్కడ తిరిగి వ్యాపారం మొదలుపెట్టాలని, స్థానిక వ్యాపారిని, తాను కుదువబెట్టిన త్రాసును యివ్వమని, తగిన డబ్బు వడ్డీతోసహా చెల్లించాడు.
అయితే దుష్టబుద్ధిగల ఆవ్యాపారి, ' జీర్ణధనుడు యిక తిరిగిరాడు, తానే దానిని వాడుకోవచ్చు ' అని ఇన్నిరోజులూ అనుకున్నాడు. అతడు తిరిగి రావడం జీర్ణించుకోలేక, ' ఇంకెక్కడి త్రాసు బాబూ ! దానిని ఎలుకలు తినేసినవి కదా ! ' అని విచారం ప్రకటించి తిరిగియివ్వలేనని తన అశక్తతను ప్రకటించాడు. జీర్ణధనుడు వ్యాపారి కుటిలబుద్ధిని కనిబెట్టికూడా, బయటపడకుండా తనలోనే ఆగ్రహం అణచివేసుకుని, ' ఫరవాలేదు. యేమిచేస్తాం ? ఎలుకలు చేసినపనికి నిన్ను నిందించలేనుకదా ! యేది శాశ్వతము . ' అని కొద్దిసేపు మిన్నకుండి, ' నేను చాలారోజుల తరువాత యీవూరు వచ్చాను, పక్కన నదీస్నానం చేయాలని వున్నది. నీకు అభ్యంతరం లేకపొతే, మీ అబ్బాయి ' ధనదేవుడు ' ని నాతో కొద్దిగా సహాయం పంపగలవా ! ' అని అడిగాడు.
' అసలే త్రాసు యివ్వకుండా యెగగొట్టాను. ఇప్పుడు పిల్లవాడిని తోడు పంపించకుంటే కోపగించుకుంటాడేమో ! ' అని ఆవ్యాపారి పదిసంవత్సరాల వయసుగల ధనదేవుడిని, జీర్ణధనునితో నదిదగ్గరకు పంపించాడు. నదీస్నానం అయినతరువాత, పిల్లవానిని, జీర్ణధనుడు, ఒకగుహలాంటి దానిలో దాచిపెట్టి, తిరిగి వ్యాపారివద్దకు బిగ్గరగా యేడ్చుకుంటూ వచ్చాడు. ' నా పిల్లవాడు యేడి ? ఎందుకు యేడుస్తున్నావ్ ? ' అని గాభరాగా అడిగాడు, వ్యాపారి. దానికి యేడుపు ఆపి నింపాదిగా జీర్ణధనుడు, ' ఏం చెప్పమంటావు ? మీపిల్లవానిని, ఒకపెద్ద గ్రద్ద యెక్కడినుంచో యెగురుకుంటూ వచ్చి, ఒక్క వుదుటున యెగరేసుకుపోయింది. నాకేమీతోచక నీవద్దకు పరిగెత్తుకు వచ్చాను. ' అనిచెప్పాడు.
వెంటనే, దు:ఖంతో ఆవ్యాపారి, జీర్ణదనుని చొక్కాపట్టుకుని గట్టిగాగుంజుతూ, ' ఓరీ మోసగాడా ! వుండు. నీ సంగతి తేలుస్తాను యిప్పుడే... ' అని న్యాయాధికారి దగ్గరకు తీసుకువెళ్లి, ' అయ్యా న్యాయాధికారిగారూ ! యెక్కడైనా పదేళ్ల పిల్లవాడిని గ్రద్ద యెత్తుకు వెళ్తుందా ? అడగండి, యీ నీచుని, నాకుమారుడిని యేమిచేశాడో ! ' అని కోపంగా అన్నాడు. న్యాయాధికారి కూడా, ' ఇది యెక్కడి విడ్డూరం. ఇప్పుడే నిన్ను దండిస్తాను. ఏమైందో చెప్పు పిల్లవానికి. ' అని జీర్ణధనుని గద్దించాడు.
అప్పుడు జీర్ణధనుడు నిబ్బరంగా, ' అయ్యా ! వెయ్యివీశల ( వీశ = 1400 గ్రాములు ) బరువుండే నా ఇనుపత్రాసును యెలుకలు ఫలహారంగా స్వీకరించగా లేనివిడ్డూరం, పదేళ్ల పిల్లవానిని గ్రద్ద యెగరేసుకువెళ్తే ఆశ్చర్యం యెలాఅవుతుంది. ముందు యీ విషయం అడగండి వ్యాపారిని. ' అని అన్నాడు.
వెంటనే,సంగతి అర్ధమై, న్యాయాధికారి, అసలువిషయం వ్యాపారినుండి కక్కించి, త్రాసు జీర్ణధనునికి యిచ్చే యేర్పాటుచేసి, పిల్లవానిని వ్యాపారికి అప్పగించే విధంగా చేయించాడు. వ్యాపారి చేయదలచుకున్న మోసానికి పరిహారంగా, ఒకనెలరోజులపాటు జీర్ణధనుని వ్యాపారి యింట్లో, అతిధిగా వుంచేవిధంగా కూడా వుత్తర్వులుయిచ్చారు.
తామే తెలివిగలవారమని, యెవరైనా, యితరులతో ఆడుకుంటే, అవతలివారి బుద్ధికుశలత వీరిని మరీ యిక్కట్లపాలు చేస్తుంది. ' తాడిదన్నే వాని తలదన్నేవాడు ' వుంటాడని అందుకే అంటారు.

Source: Gandavarapu Prabhakar Garu
(Facbook)

No comments:

Post a Comment