Friday, 18 October 2019

మిత్రుల సలహా.

ఒకసారి ఎవరితోనైనా స్నేహం కలిసిన తరువాత, వారు చెప్పే సలహాలు ఎప్పుడూ పెడచెవిన పెట్టకూడదు. పోగాలము దాపురించినవారు మిత్రుని మాటను, ముఖ్యంగా, ఆపత్కాలంలో. వినరని తెలియజెప్పే, ఈ పంచతంత్రం కధలో చూద్దాం.
ఒక సరస్సులో ' కంబుగ్రీవుడు ' అనేతాబేలు వుండేది. అది గొప్ప మాటకారి. ఎప్పుడూ యేదో ఒకటి మాట్లాడుతూనే వుండే అలవాటు. దానికి సంకటుడు , వికటుడు అనేపేర్లు గల రెండు బాతులు స్నేహితులుగా వుండేవి. ఈ మూడూ కూడా ప్రతిరోజూ సరస్సు గట్టుమీద కలుసుకుని గంటలతరబడి కబుర్లు చెప్పుకుని, సూర్యాస్తమయం కాగానే యెవరి స్థావరాలకు వారు వెళ్ళిపోయేవారు. స్నేహధర్మం గురించి యెన్నో మంచి మాటలు చెప్పుకునేవారు.
కాలమెప్పుడూ ఒక్కలా వుండదుకదా ! అనుకోకుండా, ఆ సంవత్సరం యెక్కువ వర్షాలు కురవక బోవడం వలన, వర్షాభావ పరిస్థితులు యేర్పడి, సరస్సులో నీరు మెల్లగా యింకిపోవడం ప్రారంభించింది. అప్పుడు ఆబాతులు, తాబేలుమీద యెంతో జాలిచూపిస్తూ, ' కంబుగ్రీవా ! కొన్నిరోజులకు యీసరస్సులో నీరు మొత్తం యింకిపోయే పరిస్థితివున్నది. నీవు నీరులేకుండా మనుగడ సాగించలేవు. నీ ప్రాణాలు యెలా కాపాడుకోవాలనుకుంటున్నావు ? ' అని అడిగాయి.
అప్పుడు తాబేలు, ఏమాత్రం ఆందోళన లేకుండా అనర్గళంగా, ' నామీద మీకున్న అభిమానానికి కృతజ్ఞతలు. ఎప్పుడైనా సమస్యలోనుంచే పరిష్కారం ఆలోచించాలి. నిరాశ చెందకూడదు. మనుధర్మ ప్రకారం, మంచి స్నేహితులు, ఆపదలోవున్న స్నేహితులను, బంధువులను, రక్షించడానికి యెప్పుడూ ముందు వుండాలి. మీరు అలా ముందుకువచ్చారు కాబట్టి, మీకు నా ధన్యవాదములు. నాదగ్గర ఒకవుపాయం వున్నది. ' అని అనగానే, బాతులు రెండూ కుతూహలంగా చూశాయి, కంబుగ్రీవుని వైపు.
కంబుగ్రీవుడు మళ్ళీ చెప్పసాగాడు. ' మీరు యెక్కడైనా ఒక బలమైన కర్ర నాబరువు మోయగలిగినది సంపాదించండి. దాని మధ్యలో నేను వ్రేలాడుతాను. మీరు చెరి ఒకఅంచును పట్టుకుని, నన్ను సురక్షితప్రాంతానికి చేర్చండి. ' అని చెప్పింది.
తాబేలు తెలివితేటలకు బాతులు యెంతోసంతోషించి, వెంటనే దాని అతి వాగుడు సంగతి తెలుసు కాబట్టి, అవి తాబేలుతో ' మాకైతే నిన్ను తీసుకుని ఎగరడానికి ఇబ్బంది లేదు. కానీ నువ్వు అసలే వాచాలుడివి. నోరుమూసుకుని కేవలం కర్రపట్టుకుని మేము చెప్పేదాకా వుండగలవా ? ' అని సందేహం వెలిబుచ్చాయి. దానికి తాబేలు ' సలహా చెప్పిన తెలివిమంతుడిని నేనేకదా ! నాకు ఆమాత్రం తెలీదా ? ' అని వాటిని బయలుదేర దీసింది, అనుకున్న ప్రకారం.
ఒక్కసారిగా ఆ రెండు బాతులూ, అలా గాలిలోకి తాబేలుతోసహా లేవగానే, తాబేలు ఆవిచిత్ర అనుభవానికి యెంతో ఉక్కిరిబిక్కిరి అయ్యింది.' ఇన్నాళ్లూ తనను ఉభయ చరమనే అనేవారు. ఇప్పుడు గాలిలో కూడా ఎగురుతున్న్నాను.' అని సంతోషించింది. ఆ సంతోషంలో యేదో మాట్లాడబోతుంటే, దానిసంగతి తెలిసి బాతులు, ' ఇప్పుడు నువ్వు నోరు తెరిచావంటే నీపని ఇంతేసంగతులు. , మనం ఇపుడున్న యెత్తునుంచి క్రిందబడితే, నువ్వు నుజ్జు నుజ్జు అవుతావు జాగ్రత్త ! నోరుమూసుకుని వుండు ' అన్నాయి. వెంటనే, వాళ్ళు స్నేహితులు తనకు సహాయం చేస్తున్నారన్న మాటకూడా మరచిపోయి, వాళ్ళ మాటలను యెంతో అవమానం గా భావించింది, తాబేలు. చెబుతున్నది తనగురించే కదా అని అనుకోలేక పోయింది. అయినా తమాయించుకున్నది. ఆవిధంగా రెండు, మూడు మార్లు జరిగింది. తాబేలు మనసు కుతకుతలాడి పోతున్నది.
ఇంతలో, నేలమీద నుండి, ఆ అద్భుతదృశ్యం చూస్తున్న జనాలు, ' ఆహా ! చూడండి, ఆ పక్షులు యెంత తెలివితేటలుగా తమ ఆహారాన్ని తీసుకువెళ్తున్నాయో ! ' అని పక్షులను పొగడడం తాబేలుకు వినబడింది. ఇంకేముంది. దానికి ఉక్రోషం తన్నుకువచ్చింది. ఈ ఆలోచన నాదైతే, వీళ్ళు బాతులను పొగుడుతున్నారు. నాఆలోచన అని నేను యెక్కడ చెబుతానో అని, యీబాతులు నన్ను నోరుమూసుకుని వుండమంటున్నాయి కాబోలు ! ' అని అతితెలివిగా ఆలోచించింది.
వెంటనే, అక్కడి ప్రజలతో, ' ఇదంతా తన ఆలోచన ' అని చెబుదామని నోరుతెరిచింది, తాబేలు. అంతే, ఇంకేముంది, మరుక్షణంలో గాలిలో గిరికీలు కొడుతూ, జనం మధ్యలో పడి చనిపోయింది, పాపం తాబేలు ! . స్నేహితులు స్నేహధర్మంతో తమ చెలికానికి మేలు చేద్దామని అనుకున్నా, అతి తెలివితేటలతో, తన ప్రాణం తానే పోగొట్టుకున్నది.
అందుకే నిజమైనస్నేహంలో యెక్కువ తక్కువలూ, మానావమానాలు గురించి ఆలోచించరు మంచి స్నేహితులు. స్నేహం కలకాలం నిలవాలంటే, ' ఎదుటివారి బాధలు మనవి ' అని అనుకుంటూ, వారికి సహాయపడడం అవసరం. ఆసహాయం అందుకునేటప్పుడు సంయమనం అవసరం
Source: Gandavarapu Prabhakar Garu
(Facbook)

No comments:

Post a Comment