ఆదిపర్వం. చతుర్దాశ్వాసం.
సౌతి శౌనకాది మహామునులకు చెబుతున్నాడు.
దుష్య౦తుడు, శకుంతలను, క్షత్రియ సమ్మతమైన గాంధర్వ వివాహానికి సమ్మతించమని కోరి, ఆమె సమాధానానికై తమకంతో యెదురుచూస్తున్నాడు.
అందుకు శకుంతల, తనకు దుష్య౦తునితో వివాహము సమ్మతమే కానీ, ' తన తండ్రి చేతులమీదుగా కన్యాదానం చేస్తేనే నిన్ను వివాహం చేసుకుంటాను ' అని ఖచ్చితంగా చెప్పింది. అయినా దుష్య౦తుడు వదలలేదు. మనమిరువురమూ మన్మధ పీడితులము అయి వున్నాము, ఒకరికొకరం ఇష్టపడుతున్నాము. ఇరువురమూ రాజవంశస్తులము. క్షత్రియ వంశస్తులకు, గాంధర్వ, రాక్షస వివాహాలు సమ్మతమైనవే, అది నీ తండ్రి కణ్వమహర్షికి కూడా తెలుసు కాబట్టి, మనలను తప్పుగా అనుకోడు. ' అని పరిపరి విధాలా శకుంతలను తొందర పెట్టసాగాడు,దుష్య౦తుడు.
శకుంతల మెత్తబడినట్లు కనిపించినా, తనకు పుట్టబోయే బిడ్డకు సామ్రాజ్యాధికారం దక్కవలెననే తీక్షణమైన కోరికతో, ఆవిధంగా దుష్య౦తుడు ఒప్పుకుంటేనే తాను గాంధర్వ వివాహం చేసుకుంటానని నిబంధన విధించింది. శకుంతల మాటలకు దుష్య౦తుడు సంతోషించి, ఆమెకు సరే అని మాట ఇచ్చి, గాంధర్వ వివాహం చేసుకుని, ఆమెతో సంసారం సౌఖ్యాలు అక్కడే అనుభవించాడు. కణ్వమహర్షి రాకుండానే తిరిగి వెళ్ళిపోయాడు.
ఆరోజులలో ఆకాశవాణి, అశరీరవాణి సత్య వాక్యాలను పరిరక్షిస్తూ వుండడం వలన, వారు మాటకు అంత విలువ యిచ్చేవారు. ఏమాత్రం మాట తప్పినా అశరీరవాణి స్పందించి పరిస్థితులను చక్కదిద్దేది. ఈరోజులలో ఆ పరిష్టితి లేదు కాబట్టి, అలాంటి సాహసాలు ఇప్పటి యువతీ యువకులు చేయకూడదు. వివాహం తల్లిదండ్రుల సమక్షంలోనే జరగాలి.
కణ్వమహర్షి ఆశ్రమానికి తిరిగి వచ్చిన తరువాత, జరిగిన విషయం దివ్యదృష్టి ద్వారా తెలుసుకుని, శకుంతల చేసిన పని ఆమోదించి ఆశీర్వదించాడు. కొన్నిరోజులకు, దుష్య౦తునితో గడిపిన సౌఖ్యం వలన శకుంతలలో గర్భస్థ చిహ్నాలు కనిపించసాగాయి. కణ్వమహర్షి సంతోషించి, ఆమెకు పుట్టబోయే పిల్లవాడు దీర్ఘాయువుతో, ఆరోగ్యం, ఐశ్వర్యం, బలం కలవాడై వుండాలని ఆశీర్వదించాడు. గర్భవతికి చేయవలసిన సంస్కారాలన్నీ తన ఆశ్రమంలో ముని పత్నుల ద్వారా జరిపించాడు. శకుంతల గర్భం మూడు సంవత్సరాల పాటు ధరించింది.
గ్రహాలన్నీ శుభ స్థానాలలో వుండగా, ఒక మహత్తరమైన రోజున శకుంతల పండంటి పిల్లవాడిని ప్రసవించింది. పసివయస్సులోనే, ఆ పిల్లవాడు అమిత బలాఢ్యునిగా, అందగాడిగా తయారయ్యాడు. అతడికి ' భరతుడు ' అని కణ్వమహర్షి నామకరణము చేసాడు. ఆశ్రమ వాసులు మాత్రం అతడిని, 'సర్వదమనుడు ' అని గారాబంగా పిలిచేవారు. భరతుడు పుట్టగానే, దేవతలూ గంధర్వులూ నాట్యం చేస్తుండగా, దేవ దుందుభులు మ్రోగుతుండగా, మహేంద్రుడు శకుంతలకు ప్రత్యక్షమై, ' శకుంతలా ! నీ కుమారుడు చక్రవర్తియై, అశ్వమేధయాగాలు, రాజసూయ యాగాలు అసంఖ్యాకంగా చేసి, అన్ని వర్గాలవారిని సంతృప్తి పరుస్తాడు. ' అని దీవించి వెళ్ళాడు.
బాలుడు పెరిగి పెద్ద అవుతున్నకొద్దీ, కణ్వమహర్షిలో ఆత్రుత పెరిగింది. దుష్యన్త మహారాజు శకుంతలను తీసుకువెళ్లే ప్రయత్నం యేమీ చెయ్యక పోవడంతో, ఆయన శకుంతలతో, ' అమ్మా ! యెటువంటి పతివ్రతలైనా పుట్టిన ఇంట్లో యెక్కువకాలం వుండడం మంచిది కాదు. ఇల్లాలు భర్త సంరక్షణలోనే ఉండాలి. అదే ధర్మం. ' అని ఆమెను కుమారునితో సహా దుష్య౦తుని వద్దకు పంపాడు.
శకుంతల వెళ్లేసరికి, దుష్య౦తుడు, మంత్రులు,సామంతులు, పురోహితులు, పురప్రముఖులతో రాజసభలో కొలువుతీరి వున్నాడు. శకుంతల తనను చూడగానే దుష్య౦తుడు పరుగున వచ్చి ఆలింగనం చేసుకుని, సింహాసనం దగ్గరకు తీసుకు వెళ్తాడని వూహించింది.
కానీ జరిగింది ఏమిటి ?
Source: Gandavarapu Prabhakar Garu
(Facbook)
No comments:
Post a Comment