Friday, 18 October 2019

మిత్రలాభం - 4

నిస్వార్ధ స్నేహం చేసేవారు అవతలివారు కష్టాలలో ఉంటే, ప్రాణాలు సైతం లెక్కచేయకుండా, యెలా స్నేహభావం ప్రదర్శిస్తారో చెప్పే, పంచతంత్ర కథ ఈరోజు చెప్పుకుందాం.
ఒకరోజు లఘుపతనకుడు ( కాకి ), హిరణ్యకుడు ( ఎలుక ) మందరకుడు ( తాబేలు ) యధాప్రకారం సరస్సు గట్టున కబుర్లు చెప్పుకుంటుండగా, ఎక్కడినుండో ఒక జింక, తనను వేటగాడు తరుముతుండగా, ప్రాణభయంతో వీళ్ళ దగ్గరకు వచ్చింది. 
ఆ జింకకు, వీరు ముగ్గురూ ధైర్యంచెప్పి, యోగక్షేమాలు విచారించి, దాని పేరు ' చిత్రాంగుడు ' అని తెలుసుకుని, దానితో స్నేహం చెయ్యడానికి అంగీకరించాయి. ఇప్పుడు నలుగురూ మంచి స్నేహితులయ్యారు..
ఒకరోజు వాళ్ళ సమావేశానికి, చిత్రాంగుడు రాకపోయేటప్పటికి, ' అయ్యో ! జింకకు యేమయిందో ! ఎవరైనా వేటగాడికి చిక్కలేదు కదా ! ఏదైనా గుంటలో పడి లేవలేక తన్నుకుంటున్నాడో ఏమో ! ' అని పరిపరి విధాలా ఆలోచించాయి. ఎక్కడ ప్రేమ వుంటుందో, అక్కడే భయం కూడా వుంటుంది. మాములుగా. దగ్గరవాళ్ళు రావలసిన సమయానికి రాకపోతే, యిలాంటి ఆలోచనలు రావడం సహజమేకదా !
వెంటనే మందరకుడు, కాకిని కొంతదూరం వెళ్లి, చెట్టుయెక్కి చూసి రమ్మని సలహా యిచ్చింది. అనుకున్నట్లుగానే, వీరు భయపడినట్లుగానే, దూరంగా, జింక, ఒక వేటగాని వలలో చిక్కుకుని ప్రాణభీతితో విలవిలలాడుతున్నది. ఇది చూసి వెంటనే, హిరణ్యకుని తన వీపుమీద ఎక్కించుకుని, కాకి, జింకవద్దకు చేరింది.
వీళ్ళను చూడగానే, ప్రాణం లేచివచ్చింది ఆజింకకు. వాళ్ళు చూపుతున్న స్నేహ ధర్మానికి, తన అందమైన కళ్ళనుండి, ఆనందబాష్పాలు వ్రాల్చింది. ఇదికదా మంచిస్నేహితులతో లాభం అనుకుని ఆనందించింది. వారుకూడా, సమయం వృధాచెయ్యకుండా, చెయ్యవలసిన పని గురించి ఆలోచించి, అనుకున్న విధంగా, హిరణ్యకుడు ( ఎలుక ) , వలకొరికి జింకను రక్షించాడు. అంతా బాగుంది అనుకున్న సమయంలో, అక్కడ, సరస్సుదగ్గర, వుండబట్టలేక, స్నేహధర్మంతో, మంధరకుడు ( తాబేలు ) కూడా గునగునా నడుచుకుంటూ, అక్కడకువచ్చాడు.
' అయ్యో ! మంధరకా ! యిప్పుడు నీవెందుకు వచ్చావు ? వేటగాడు వస్తే, మేమెలాగైనా పారిపోగలము. నీసంగతి యేమిటి ? ' అని చింతించారు, మిగిలిన స్నేహితులు. వారు అలా అనుకుంటున్న తడవులోనే, వేటగాడు రావడం జరిగింది. అల్లంత దూరంలో వాడిని చూసి, అన్ని జంతువులూ పారిపోయాయి గానీ, పాపం, తాబేలు, వెళ్లలేక పోయింది, తన మంద గమనంతో.
వేటగాడు, జింక దొరకనందుకు బాధపడి, ' పోనీలే, తాబేలు అయినా దొరికింది ' అని దానిని కర్రకుకట్టుకుని, భుజానికి తగిలించుకుని బయలుదేరాడు. అప్పుడు, మిగిలిన స్నేహితులు, ' మనమందరమూ, మంధరకుని ఆశ్రయంలో చల్లగా వుంటున్నాము. ఇప్పుడు అతనికే ఆపదవచ్చింది, ఎలాగైనా అతడిని రక్షించే ఉపాయం ఆలోచించాలి ' అని చకచకా ఒక పధకం వేశాయి.
అందులో భాగంగా, చిత్రాంగుడు ( జింక ), వేటగాడు వచ్చేదారిలో చనిపోయినట్లు పడివున్నది. దాని కండ్లలో కాకి పొడుస్తున్నట్లుగా నటిస్తూ, వేటగానికి, జింక మీద మళ్ళీ ఆశ కలిగేటట్లు చేశాయి. వేటగాడుకూడా, వీళ్ళు అనుకున్నట్లుగానే, తాబేలును క్రింద వదిలిపెట్టి, జింక వేపు వడివడిగా అడుగులువేశాడు, దానిని లాక్కువద్దామని. ఎప్పుడైతే తాబేలును క్రిందకు దింపాడో, అది త్వరత్వరగా, పొదలలోనికి వెళ్లిదాక్కుంది.
వేటగాడు రావడం చూసి, జింక చెంగునలేచి, ఒక్కగెంతులో అడవి లోనికి దూసుకు వెళ్ళింది. వేటగాడు బిక్కమొగంవేసి, కనీసం తాబేలును తీసుకు వెళదామని వస్తే, ఇంకెక్కడి తాబేలు. అదీ కనబడలేదు. ఆవిధంగా, స్నేహితులు, వారిలోవారు యెంతో సహాయకారులుగా వుంటూ, మిత్రులవలన లాభమేమిటో, అడుగడుగునా ఆస్వాదిస్తూ వున్నారు.
మిత్రప్రేమ, భ్రాతృ ప్రేమతో సరితూగేది. ఒక్కొక్కప్పుడు, తోడబుట్టినవారు దగ్గర లేకపోయినా, స్నేహితుడు ఆ లోటు లేకుండా, నేనున్నానని ముందుకు వచ్చే సందర్భాలు ఎన్నో వుంటాయి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆ స్నేహాన్ని జీవితాంతం నిలుపుకోగలిగే, ఆత్మీయత, కృతజ్ఞతా భావం, స్నేహితులు ఇరువురిలో వుండాలి.

Source: Gandavarapu Prabhakar Garu
(Facbook)

No comments:

Post a Comment