మంచివాళ్లను, దుర్మార్గులు అకారణంగా ఇబ్బందులపాలు చేస్తాము అనుకుంటే, దైవంకూడా అతివారిపై, కన్నేర్ర జేస్తుందనీ, సజ్జనులను రక్షిస్తుందని, చెప్పే పంచతంత్ర కథ.
ఒక చిన్ననగరంలో ' ద్రోణుడు ' అని నిరుపేద యువకుడు వుండేవాడు. అతడు యెంత పేదవాడంటే, చిరిగినబట్టలతో, తైల సంస్కారంలేని జుట్టుతో, పెరిగినగోళ్ళతో, పోషణలేని చర్మఛాయతో, చూడగానే, పిల్లలే గాదు, పెద్దలూ భయపడేటట్లు వుండేవాడు. తనకు మంచిరోజులు రావాలని, ద్రోణుడు, ఆ దుర్గామాతను యెప్పుడూ మనసులోనే ధ్యానించుకునేవాడు,
ఈతని దరిద్రాన్నిచూసి, ఒకధనవంతుడు జాలిపడి, , రెండు మంచిజాతి దూడలను దానమిచ్చి, వానిని పోషించడానికి కొంత ధనంకూడా ఇచ్చాడు. వానిని సరిగ్గా పోషణ చేసి, జీవనం గడుపుకొమ్మని చెప్పాడు. ద్రోణుడు కూడా, ఎంతో నిజాయితీతో, ఆ దూడలను పెంచి, పెద్దచేసి, మంచి పుష్టిగల ఆవులుగా తయారుచేసి, దానిమీద వచ్చే ఆదాయంతో శుభ్రమైన జీవితం గడుపుతూ, అమ్మవారి మీద భక్తి సడలకుండా, జీవించ సాగాడు.
సజ్జనులు వారి మటుకు వారు జీవిస్తున్నా, దుర్జనులు వుండనీయరు కదా ! అలాగే, ' క్రూరకర్ముడు ' అనే ఒకదొంగ కన్ను, ఈ ఆవులమీద పడి, ఒకరోజు రాత్రి ద్రోణుడి యింటికివెళ్లి, ఆ ఆవులను దొంగిలించాలని పధకం వేశాడు. అదేరోజు రాత్రి, ఆ దొంగ ద్రోణుడి యింటి ముంగిటి లోనికి ప్రవేశిస్తుండగా, రాక్షసునివంటి ఆకారంతో ఒకడు, అదే యింటిలోనికి ప్రవేశిస్తూ, దొంగకు కనిపించాడు.
దొంగ అతనితో మాటలు కలుపగా, ' నేను రాక్షసుని వంటివాడనుకాను, రాక్షసుడినే, నాపేరు, పూర్వజన్మలో ' సత్యవచనుడు. '. పేరుకు తగినట్లు వుండకపోవడంతో, నాకు యీ రాక్షసజన్మ వచ్చింది. ఈ ద్రోణునికి భక్తి యెక్కువై, , మమ్ములను, యీవీధిలో వుండనీయకుండా చేస్తున్నాడు. ఈరోజు అతనిని చంపిగానీ బయటకువెళ్ళను. ' అన్నాడు. ' సరేపద ! ఇద్దరికీ పనియిక్కడే ! ' అంటూ ' నువ్వు ఆ యువకుడిని ఈ రాత్రికి విందారగించు, నేను అతని ఆవులను ఎత్తుకెళతాను. ' అని దొంగ, రాక్షసునితో కలిసి యింటిలోనికి వెళ్ళాడు.
ద్రోణుడు, మాములుగా నిద్రకుపక్రమించగానే, రాక్షసుడు అతనిమీద బడి చంప బోయాడు. అయితే, దొంగ అందుకు వప్పుకోలేదు. ' ముందు నేను ఆవులు తోలుకెళ్లిన తరువాతే, నీవు ఈ ద్రోణుడిని చంపు. లేకుంటే, నీ ప్రయత్నం తప్పితే, నాకు ఆవులు దొరకవు, చుట్టుప్రక్కల వాళ్ళు దేహశుద్ధి చేస్తారు నాకు. .' అని చంపకుండా అడ్డుపడ్డాడు.
' మరి ఆవులు అరిస్తే, యీబ్రాహ్మణుడు లేచి దైవప్రార్ధన చేస్తే, నాకు దొరకడుకదా ! ముందు నేనే చంపుతాను. ' అని రాక్షసుడు గద్దించాడు. ఈ విధంగా వాళ్ళు యెవరి పని ముందు జరగాలి అని వాదులాడుకుంటుండగా, ఆ గుసగుసలు తారస్థాయి చేరి, ఆశబ్దాలకి, ద్రోణునికి మెలుకువ వచ్చింది. వీరినిచూసి దిగ్గున లేచి, ద్రోణుడు, 'ఎవరు మీరు ? యిక్కడ మీకేమి పని ? ' అని ఆందోళనగా అడిగి, వెంటనే వారి అవతారాలు చూసి, తనకు కీడు చెయ్యడానికి వచ్చారని తెలుసుకుని, చేతులు జోడించి, కనులు మూసుకుని, ' దుర్గాస్తవం ' చదవడం ప్రారంభించాడు.
ఆ యువకుడు, అలా పఠించడం ప్రారంభించగానే, అతని దృష్టి తీక్షణంగా మారి అతని కనులనుండి, అద్భుతమైన కాంతి ప్రసరించింది. ఆకాంతికి తట్టుకోలేక రాక్షసుడు పరుగు లంఖించుకున్నాడు. దుష్ట శక్తులున్న రాక్షసుడే పారిపోతే, ఇక ఆదృశ్యం చూసిన దొంగకు, అక్కడ నిలబడ గలిగే ధైర్యం యెక్కడనుంచి వస్తుంది ? దొంగకూడా పలాయన మంత్రం పఠించాడు.
ఈ విషయం తెల్లవారగానే తెలిసి, చుట్టుప్రక్కల వారంతా ద్రోణుని దైవభక్తికి యెంతో అబ్బురపడి, ఆతనికి తగినరక్షణ కలిగించారు.
అందుకనే, సజ్జనులతో, అకారణవైరం పెట్టుకొనకూడదు. చేతనైతే, వారి దైనందిక జీవితం సుఖంగా సాగడానికి సహాయపడాలి. లేదా వారి దారిన వారిని బ్రతకనివ్వాలి. సజ్జనుల మీద కాలుదువ్వితే, ఫలితం యెలా వుంటుందో, చెప్పే కధ ఇది.
Source: Gandavarapu Prabhakar Garu
(Facbook)
No comments:
Post a Comment