Friday, 18 October 2019

వ్యాస మహాభారతం - 29 (S-14)

ఆదిపర్వం. చతుర్దాశ్వాసం.
సౌతి శౌనకాది మహామునులకు చెబుతున్నాడు.
గంగాదేవి, ఎనిమిదవసారి గర్భం ధరించింది. వెనుకటివలెనే, ఈసారికూడా, గంగాదేవి ఎనిమిద సంతానాన్ని నదిలో వదలడానికి సిద్ధపడగా, శంతనుడు ఇక తట్టుకోలేక పోయాడు. ఆ బాలుడిని వదులుకోలేనని నిక్కచ్చిగా చెప్పాడు. ' అందరు శిశువులను నట్టేట ముంచిన నీ మాతృ హృదయాన్ని ఏవిధంగా నిందించాలో కూడా తెలియడం లేదు. ' అని ఆమెను తూలనాడాడు. 
వెంటనే గంగాదేవి, శంతనునితో, ' మన వివాహ ఒప్పందం నేటితో తీరిపోయింది. నీవు, నేను చేస్తున్న పనులకు అడ్డుపడడమే కాకుండా, పరుషవాక్యాలు పలికావు నాగురించి. ' అని అంటూ గంగాదేవి, అష్టవసువులు భూమిపైన జన్మించిన కారణమూ, దానికి వారు తనను కోరిన సహాయం అంతా వివరంగా చెప్పింది. 
' ఈ ఎనిమిదవ వసువు దీర్ఘకాలం జీవిస్తాడు. ఇతడు లోక కళ్యాణం కోసమే పుట్టాడు. ' అని చెప్పగా, శంతనుడు ఆశ్చర్యపోయి, ' వసువులంతా పుణ్యాత్ములు, దేవతల పూజలు అందుకునేవారు కదా ! వారిని వశిష్ఠుడు యెందుకు శపించాడు ? ఏడుగురు వెళ్ళిపోయి, ఎనిమిదవ వాడిని యిక్కడ దీర్ఘాయుష్షుతో యెందుకు వదిలివేశారు ? ' అని శంతనుడు గంగను అడిగాడు. 
దానికి గంగాదేవి ఈ విధంగా సమాధానం చెప్పింది. : 
' వరుణుడు అనే మునికి బ్రహ్మ సమానుడైన వశిష్ఠుడు జన్మించాడు. అలాంటి వశిష్ఠుడు మేరు పర్వతం మీద ఒక గుహలో తపస్సు చేసుకుంటూ వుండేవాడు. ఆయనకు నిత్య అవసరాల గురించి, నందిని అనే ధేనువు రోజూ పాలు,వివిధ సామాగ్రి ఇస్తూ వుండేది. ఒకరోజున అష్టవసువులు విహారం కోసం ఆ ప్రాంతానికి రాగా, వశిష్టమహర్షి వారిని దర్శించుకున్నాడు. వారి ముందరే నందిని తన వైభవం ప్రదర్శించింది. అది చూసి ఎనిమిదవ వసువుయొక్క భార్య, ' నాధా ! ఈ నందినిని మనం బహుమతిగా తీసుకుని నా స్నేహితురాలు భూలోకంలోని జితమతి కి యిస్తే యెంతో సంతోషిస్తుంది. ' అని చెప్పింది. 
భార్య కోరిక కాదనలేక, వశిష్టునికి తెలీయకుండా, మిగిలిన ఏడుగురి సహాయంతో చివరివాడైన ప్రభాసుడు, నందినిని తోలుకుపోయాడు. వశిష్ఠుడు వారుచేసిన నికృష్ట చోరత్వానికి నిరసించి, అష్ట వసువులను అందరినీ భూలోకం లో పుట్టమని శపించాడు. ఇది తెలుసుకున్న అష్టవసువులు, వశిష్టుని క్షమింపమని వేడుకుని, ' నీశాపం వృధా పోకుండా మేము భూలోకంలో పుట్టగానే మరణించేటట్లు శాప విమోచనం ప్రసాదించు మహర్షీ ! ' అని ప్రార్ధించారు. 
అయితే, వశిష్ఠుడు, ' మీరు ప్రభాసుడి ప్రోద్బలం తో యీపని చేసారు గనుక, మిగిలిన వారికి అల్పాయుష్షుతో మరణించేటట్లుగా విమోచనం ప్రసాదిస్తున్నాను. కానీ ఎనిమిద వసువు అయిన ప్రభాసుడు, దీర్ఘాయువు గా, సంసార, సంతాన విహీనుడిగా భూలోకంలో వుంటాడు. ' అని వశిష్ఠుడు చెప్పాడు. ' అని గంగాదేవి శంతనునికి వివరించింది. 
అంతటితో వూరుకోకుండా, గంగాదేవి ఆ పిల్లవానికి ' దేవవ్రతుడు ' అని నామకరణం చేసి, తనతో అతడు పెద్దవాడయ్యేంత వరకు వుంటాడని, శంతనునితో చెప్పి, తనతో తీసుకు వెళ్ళింది. శంతనుడు విచారంగా హస్తినాపురానికి తిరిగి చేరుకున్నాడు. 
ఆ తరువాత శంతనుడు చాలాకాలం జనరంజకంగా పరిపాలన చేసాడు. రాజ్యాన్ని విస్తరించి తన సార్వభౌమత్వాన్ని నిలబెట్టుకున్నాడు. ఒకరోజు శంతనుడు గంగా తీరంలో విహరిస్తూ వుండగా , గంగాదేవి వుద్హృతంగా ప్రవహించవలసిన చోట, చిన్నపాయ వలే వుండడం చూసి ఆశ్చర్యపోయాడు. విచారించి చూడగా, దేవవ్రతుడు ధనుర్విద్య నేర్చుకుంటూ, అందులో భాగంగా,గంగానదిని తన బాణాలతో కుంచింప జేయడం గమనించాడు. 
ఆ బాలుడిని శంతనుడు తన కుమారుడే అని గుర్తించలేదు. అయితే, గంగాదేవి, ఆ సమయంలో అక్కడకు వచ్చి, ' ప్రభూ ! ఇతడు మన కుమారుడే ! ఇతడు వశిష్టుని వద్ద వేదాలు చదివాడు. శుక్రుడు, బృహస్పతికి సాటిగా ధర్మ శాస్త్రాలు అవపోశన పట్టాడు. అస్త్రాలు ప్రయోగించడంలో పరశురాముని తలపిస్తాడు. ఆత్మజ్ఞానంలో సనత్కుమారులకు తీసిపోడు. ' అని దేవవ్రతుని గురించి చెప్పి, తన శిక్షణలో యెలా పెద్దవాడైనదీ తెలియ జేసింది. శంతనునికి కుమారుడిని వప్పజెప్పి, వెళ్ళిపోయింది. బాల్యంలో మాతృ శిక్షణలో పెరిగినవాడికి యిక తిరుగేముంటుంది ? 
శంతనుడు గాంగేయుడిని తీసుకువచ్చి, యువరాజ పట్టాభిషేకం చేసాడు. రోజులు ప్రశాంతంగా గడుస్తున్నాయి. అయితే, ఒకరోజు శంతనుడు యమునాతీరంలో వేటాడుతూ వెళ్తుండగా, హఠాత్తుగా అపూర్వమైన సుగంధ వాసనలు ఆయన నాసికా పుటాలకు సోకాయి. ఆ వాసనలు వస్తున్న దిక్కుగా శంతనుడు వెతుక్కుంటూ వెళ్ళాడు. 
అలా శంతనుడు యెంత దూరం వెళ్ళాడో ! ఏమి చూశాడో !

Source: Gandavarapu Prabhakar Garu
(Facbook)

No comments:

Post a Comment