Friday, 18 October 2019

వ్యాస మహాభారతం - 28 (S-13)

ఆదిపర్వం. చతుర్దాశ్వాసం.
సౌతి శౌనకాది మహామునులకు చెబుతున్నాడు.
వైశంపాయనునితో, జనమేజయుడు, ' ఈ వంశక్రమంలో నాకు ఆశ్చర్యకరంగా అనిపిస్తున్న విషయం, శంతనునికీ, గంగాదేవికీ పొత్తు ఎలా కలిగింది ? వారికి భీష్ముడు యెలా జన్మించాడు ? ' ఆ వృత్తాంతం చెప్పమని వినయంగా అడిగాడు.
వైశంపాయనుడు చెప్పసాగాడు.
ఇక్ష్వాకు వంశ చక్రవర్తులలో ఒకడైన మహాభిషుడు అనేక అశ్వమేధ యాగాలూ, నూరు రాజసూయయాగాలూ చేసి ఇంద్రాదిదేవతలను తృప్తి పరచి, స్వర్గలోకంలో స్థిరనివాసం సంపాదించాడు. ఒకరోజు ఆయన దేవసభలో అందరితో వున్నప్పుడు గంగాదేవి, దేవతా రూపంలో అక్కడకు వచ్చింది. 
అనుకోకుండా ఆమె ధరించిన చీర, గాలికి పైకియెగిరి ఆమె ఊరువుల భాగము కనబడగా, మిగిలిన దేవతలంతా ఆ దృశ్యం చూడకుండా ముఖం తిప్పుకున్నారు. కానీ మహాభిషుడు మాత్రం ఆసక్తిగా ఆ ఆచ్చాదనా లేని భాగం చూసాడు. అలా చూడడం బ్రహ్మ కంటపడి, ఈతని చర్యకు కోపం తెచ్చుకుని, ' నీకు ఇక్కడ వుండే అర్హత పోయింది. తక్షణం వెళ్లి మానవకాంత కడుపున పుట్టు. ' అని శపించాడు. మహాభిషుడు తనను మానవజన్మ యెత్తమన్నందుకు బాధపడి, తనకు ఉత్తమ రాజర్షి అయిన ప్రతీపుని కుమారుడిగా పుట్టే అవకాశం కలిపించమని కోరాడు. 
ఇక గంగాదేవి కూడా జరిగినదంతా తెలుసుకుని, ఆమె మహాభిషుని గడసరి మన్మధ భావాన్ని మెచ్చుకుని, అతనినే తలుచుకుంటూ భూలోకానికి రాసాగింది. దారిలో ఆమెకు వశిష్ఠముని శాపానికి గురి అయి భూలోకానికి జన్మనెత్తడానికి వెళ్తున్న అష్ట వసువులు కనిపించారు. వారు గంగాదేవికి మ్రొక్కి, ' అమ్మా ! నీకన్నా పవిత్రమైన జనని ఎక్కడ దొరుకుతుంది. మహాభిషుడు శంతనునిగా భూమిపై జన్మిస్తున్నాడు. నువ్వు దయచేసి, మా ఎనిమిది మందిని మీ ఇద్దరి సంగమంలో జన్మించేటట్లుగా అనుగ్రహించు. ' అని కోరారు. 
దానికి గంగా దేవి సంతోషించి, ' నేనూ మహాభిషుడి పొందు కోరుతున్నాను. కాబట్టి మీ కోరిక తీర్చడం నాకూ సంతోషమే. ' అన్నది. అయితే వారు గంగాదేవిని, ' తాము ఒకరి తరువాత ఒకరు పుట్టగానే, చనిపోయేట్లు నీటిలో వదిలితే, తమ మానవజన్మలు తృటిలో అంతరించిపోయాయి. ' అనగా, ఆమె సరేనంటూ, కనీసం ఒక పిల్లవాడు దీర్ఘమైన ఆయుష్షుతో వుండేటట్లు చేయండి. ' అని అడిగింది. దానికి వారు కూడా, వారిలో ఎనిమిదవవాడికి, తాము ఏడుగురు, ఒక్కరిలో నాలుగవ వంతు అంశను యిచ్చి, ఉత్తముడిగా, దీర్ఘాయువుగా, పరాక్రమవంతునిగా, నీ కుమారుడిగా వుండే ఏర్పాటు చేస్తాము. ' అని చెప్పారు. 
ఈ విధమైన ఒప్పందం గంగాదేవికి, అష్టవసువులకూ కుదిరిన తరువాత, శంతనుని ఆవిర్భావానికి ముందు, ప్రతీపుడు, గంగాతీరంలో తీక్షణంగా తపస్సు చేసుకుంటూ వుండగా, గంగాదేవి వచ్చి సరాసరి ప్రతీపుని కుడితొడపై వచ్చి విలాసవంతంగా కూర్చున్నది. కళ్ళు తెరచి చూసి ప్రతీపుడు ఆమె రాకకు కారణం అడుగగా, నేను నీ అందాన్ని మెచ్చి, నీకు భార్యని అవుదామని వచ్చాను. నన్ను దయతో స్వీకరించు. ' అన్నది. 
అయితే, సకల ధర్మాలు తెలిసిన ప్రతీపుడు, ' నీకు నా భార్య అయ్యే యోగ్యత లేదు. ఎందుకనగా, కుడి తొడపై పుత్ర సామానులు మాత్రమే కూర్చుంటారు. నేను నా భార్యను తప్ప యితరులను కామించలేను. కాబట్టి నిన్ను నాకు పుట్టబోయే కుమారునికి యిచ్చి వివాహం చేసి, కోడలుగాతెచ్చుకుంటాను. ' అని గంగాదేవికి చెప్పాడు. 
తరువాత శంతనుడు జన్మించి అతనికి యుక్తవయస్సు వచ్చిన తరువాత, ప్రతీపుడు, ' నీకు గంగా తీరంలో ఎవరైనా దేవతా ఛాయలు గల స్త్రీమూర్తి కనబడితే, ఆమెను వివాహం చేసుకో ! నేను సంతోషిస్తాను. ' అని చెప్పాడు. 
అదే విధంగా శంతనుడు ఒకరోజు అలసిపోయి, గంగానదీ తీరంలో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు, గంగాదేవి మనుష్యరూపంలో ప్రత్యక్షమై, శంతనునికి కనబడింది. ఇద్దరూ మాటామాటా కలుపుకుని, వివాహానికి ఇష్టపడ్డారు. అయితే, ఆమె ఒక నిబంధన పెట్టింది, తమ వివాహానికి. అదేమంటే, ' మహారాజా ! మన వివాహం అయిన తరువాత, నేను చేసే పనులకు నీవు అడ్డుచెప్పకూడదు. పరుషమైన పదాలతో నన్ను నొప్పించరాదు, నేను చేసిన పని యెంత బాధించేది అయినా. ' అని చెప్పింది. 
శంతనునికి, ఆమె అన్నమాటలలో గూఢార్థము బోధపడక, ' అలాగే ' అని మాట యిచ్చి వివాహం చేసుకున్నాడు. వారి దాంపత్యం,యెంతో ఆనందంగా సాగుతుండగా, ఆమె గర్భం ధరించింది. ఆ విధంగా ఏడు సార్లు, పుట్టిన పిల్లవాడిని పుట్టినట్లు, ఆమె తీసుకువెళ్లి, గంగా ప్రవాహంలో పడవేస్తూ వచ్చింది. శంతనుడు యిదంతా ఖిన్నుడై చూస్తున్నాడు. ప్రశ్నించలేక పోతున్నాడు. 
ఆ సమయంలో గంగాదేవి, ఎనిమిదవ సారి గర్భం ధరించింది. చూద్దాం ! ఈసారి ఏమి జరగబోతున్నదో !

Source: Gandavarapu Prabhakar Garu
(Facbook)

No comments:

Post a Comment