ఏదైనా పనిమీద, ముఖ్యకార్యాలయాలకు వెళ్ళినప్పుడు, ఆ అధికారి అనుగ్రహం యెంత అవసరమో, ఆయనవద్దవున్న ఆంతరంగిక సేవకుల అనుగ్రహం కూడా అంతే అవసరం. వారితో, ఏ కారణము చేతనైనా, స్పర్ధ వస్తే జరిగే పరిణామాలు, తెలిపే చక్కని పంచతంత్రం లోని కథ, ఈ రోజు చదువుదాం.
వర్ధమాన నగరంలో, ' దంతిలుడు ' అనే ధనవంతుడైన వ్యాపారి ఉండేవాడు. ఒకరోజు తన వివాహ సమయంలో పెద్దవిందు యేర్పాటుచేసి, రాజుగారిని ఆహ్వానించాడు. ఆ విందుకి ' గోరంభుడు ' అనే రాజుగారి గదులు శుభ్రంచేసే పనివాడు వచ్చి, రాజుగారి మంత్రులకు కేటాయించిన వరసలో కూర్చున్నాడు. అదిచూసి గోరంభుని, తన పనివాళ్ల చేత బయటకు గెంటించాడు, దంతిలుడు.
అలా అవమానం పొందిన గోరంభుడు, ' నేను బీదవాడిని. దంతిలుని హోదాకు సరిపోలేదు. అయినా, ఇప్పుడు నేను, దంతిలునికి సరిఅయిన గుణపాఠం చెప్పే రోజు కోసం యెదురుచూడడం తప్ప యేమి చెయ్యగలను ? ' అని అనుకున్నాడే తప్ప, తాను చేసిన పొరబాటును తెల్సుకొనలేదు. దంతిలుడు కూడా ఆవిషయం అంతటితో మర్చిపోయాడు.
సమయం కోసం వేచివున్న గోరంభుడు, ఒకరోజు రాజుగారు నిద్రిస్తున్న పడకగదిని యెప్పటిలానే వూడూస్తూ, ఆయన మెలకువగా వున్నాడని తెలుసుకుని, రాజుగారికి వినబడేట్లుగా, ' ఈ మధ్య దంతిలునికి రాణీవాసం రాకపోకలు యెక్కువైనవి. ఎందుకో యేమిటో ! పాపం రాణీగారి అవస్థ చూడలేకపోతున్నాము . ' అని గొణిగినట్లుగా, రాజుగారికి వినబడేంత దూరంనుంచి అన్నాడు.
అదివిన్న రాజుగారు ధిగ్గునలేచి, ' గోరంభా ! యిటురా ! యేదో రాణీవాసం అంటున్నావు. యేమిటది ? ' అని అడిగాడు. తొట్రుపాటు నటించి గోరంభుడు ' తప్పైపోయింది ప్రభూ ! రాత్రి కొద్దిగా ఆలశ్యంగా పడుకోవడం వలన యేదో పలవరించినట్లున్నాను. ' అని తప్పుకున్నాడు.
రాజుగారిలో అనుమాన బీజంపడి, దంతిలుని, అంత:పురం రాకపోకలు, వెంటనే, కట్టుదిట్టం చేశాడు. దంతిలునికి యెన్నో సంవత్సరాలుగా, అక్కడకు రావడం, అంత:పురంలో వుండే వారికీ కావలసిన వస్తువులు కనుక్కుని సరఫరా చేయడం, తన వృత్తిలో భాగంగా అలవాటు. అందరితో యెంతో మర్యాదగా మసలేవాడు. అయితే, ఇలా ఇప్పుడు యెందుకయ్యిందో అర్ధం కాలేదు.
అతని వర్తక కార్యకలాపాలు స్తంభించి యెంతో నష్టంవచ్చే పరిస్థితి వచ్చింది. ఒకరోజు రాజభటులు దంతిలుని, అంత:పురం వద్ద అడ్డగిస్తుండగా, గోరంభుడు పక్కనే వుండి, వెటకారంగా, ' అయ్యో ! దంతిలుని యేమీ అనకండి. రాజుగారి ముఖ్యస్నేహితుడు. ఆయనతో సమానంగా విందువినోదాలలో పాల్గొనేవాడు. మనమెంత ? . ఆయనకి కోపంవస్తే, మనమీద రాజుగారికి చెప్పి, మన వుద్యోగాలు తీసివేయించగలడు. ' అన్నాడు.
అదివిని దంతిలునికి వెనుకటి సంఘటన గుర్తుకువచ్చి, గోరంభుని పాత్ర యిందులో వుండివుంటుందని పసిగట్టి, అతనిని ప్రసన్నం చేసుకునే ఉద్దేశ్యంతో, అతనిని ప్రత్యేకంగా తనయింటికి పిలిపించి, మంచి భోజనం పెట్టి, ఖరీదైన వస్త్రాలు బహుమతిగా యిచ్చాడు. వస్తూపోతూ వుండమని చెప్పాడు. ఈ సత్కారంతో గోరంభుడు తృప్తి చెంది, నేను మీ సమస్య చక్కబెడతానని దంతిలునికి చెప్పి, వెళ్లి పోయాడు.
గోరంభుడు, దంతిలునికి మాట యిచ్చినట్లుగానే, వేరొకరోజు , రాజుగారు నిద్రనుండి మేలుకునే సమయంలో, అటుగా శుభ్రంచేస్తూ, ' ఈ రాజుగారు తింగరవాడు లాగా వున్నాడు. మరుగుదొడ్లో దోసకాయలు తింటున్నాడు. ' అంటూ యేవేవో అసందర్భ ప్రేలాపనలు చేశాడు. వెంటనే నిద్రమత్తు వదిలి రాజుగారు ' ఏమిరా ! చెత్తచెత్తగా మాట్లాడుతున్నావు. నన్నెప్పుడైనా అలాచెయ్యడం చూశావా ? ' అని అడిగాడు. అప్పుడు కూడా వెనుకటి లాగే గోరంభుడు, తొట్రుపడుతూ, ' ఓ రాజా ! నేను యేమి మాట్లాడానో నాకు గుర్తులేదు. నిన్నరాత్రి అంతా జూదశాలలో గడిపి సరిగా నిద్రపోలేదు ' అని బదులిచ్చాడు.
వెంటనే రాజుకు వెనుకటి సంఘటన స్ఫురణకు వచ్చి, ' అయ్యో ! దంతిలుని విషయం లో కూడా వీడి అసందర్భ ప్రేలాపన నిజమని నమ్మి ఆంక్షలుపెట్టానే ! అతని రాకపోయాలు తగ్గిపోవడం వలన అంత:పురంలో వారికి కావలసిన వస్తువులు సరిగా అందడం లేదని ఫిర్యాదులు కూడా వస్తున్నవి. ' అని బాధపడి, ఆతని రాకపోకలపై ఆంక్షను యెత్తివేశాడు. అతని కార్యకలాపాలు అంత:పురం లో యధావిధిగా జరిగేటట్లు చేశాడు.
అందుకే, ' పెద్దవారి వద్ద పనిచేసే ఆంతరంగిక ఉద్యోగులదే ఒక్కొక్కప్పుడు తప్పు అయినా, కొద్ది సహనంతో, నవ్వుతూ వారితో మాట్లాడి, పనులు చక్కబెట్టుకోవాలి. ' అని అంటారు, అనుభవజ్ఞులు. ఆ రోజు విందులో గోరంభునికి, ' ఇది నీవుకూర్చునే చోటుకాదు, వేరే ప్రదేశంలో కూర్చోమని సున్నితంగా చెబితే, ఇంత జరిగి వుండేది కాదుకదా ! ఉద్యోగి చిన్నవాడైనా, యెవరిదగ్గర, యేమి అధికారం వుంటుందో, తెలివితేటలు వుంటాయో, అంచనా వెయ్య కలగాలి. లౌక్యంగా మెలగాలి. ' చెరపడానికి చేట పెయ్య చాలు ' అనేకదా నానుడి.
ముఖ్య కార్య నిర్వహణాధికారుల వద్దవుండే సిబ్బందితో, మరీజాగ్రత్తగా వుండాలి.
Source: Gandavarapu Prabhakar Garu
(Facbook)
No comments:
Post a Comment