Friday, 18 October 2019

మిత్రలాభం.

స్నేహానికి పునాది నమ్మకం. ఆనమ్మకం వుంటే, మిత్రత్వం బలంగా వుంటుంది. ఒకరి వలన ఒకరు లాభం పొందుతూ, ఒకరిని ఒకరు కాపాడుకుంటూ, ఆ స్నేహాన్ని నిలబెట్టుకుంటారు. అలాంటి స్నేహితుల కథ ఇది.
మహిళారోప్యం అనేవూరికి దక్షిణంగా, ఒకపెద్ద మర్రిచెట్టు ఉండేది. అనేకపక్షులు ఆమర్రిచెట్టువద్దకు వచ్చి, దాని కొమ్మలనీడలో, పళ్ళుతింటూ, సేదతీరేవి. బాటసారులకు యెండవేళ ఆచెట్టు నీడనిచ్చేది. అయితే, ఆ చెట్టుతొర్రలో సర్పజాతులు కూడా కాపురం వుండేవి.
అన్ని పక్షులలాగే, ' లఘుపతనకుడు ' అనేకాకి కూడా అక్కడ స్థావరం యేర్పరచు కున్నది. ఒకరోజు ఆకాకి ఆహారంకోసం బయలుదేరుతుండగా, కొద్దిదూరం వెళ్లేసరికి, ఒక పక్షులవేటగాడు, తన వలతో సహా చెట్టుకేసి రావడం కాకికి కనిపించింది.
వెంటనే రానున్న అపాయం గ్రహించి ఆకాకి, వెనుదిరిగివచ్చి, మిగిలిన పక్షులతో, ఆవిషయం చెప్పి, ' వాడువేసే ఆహరం కోసం మీప్రాణాలు బలియివ్వవద్దు. వాడిని నమ్మవద్దు. ఆ ఆహారాన్ని, విషంగా భావించి దూరంగా తొలగిపొండి. ' అని హితవు చెప్పింది. కాకి చెప్పినట్లుగానే ఆ వేటగాడు రావడమూ, వలవేసి విత్తనాలు అటు, యిటూ విసరివెళ్ళడమూ జరిగింది. కానీ పక్షులేవీ వాటి జోలికి వెళ్ళలేదు, లఘుపతనకుని సలహా మేరకు.
అయితే, చిత్రగ్రీవుడు అనే పావురాల నాయకుడు, తన సమూహంతో అటునుండి వెళుతూ, లఘుపతనకుడు చెబుతున్నా వినకుండా, ' కనబడుతున్న ఆహారం యెవరైనా వదులుకుంటారా ! ' అని లఘుపతనకుని యెగతాళిజేస్తూ, తన పావురాల గుంపుతో సహా, అక్కడవున్న విత్తనాలు తినదానికి క్రిందకు దిగడమూ, వేటగాడి వలలో చిక్కుకోవడమూ వెంటవెంటనే, జరిగిపోయాయి. అందుకే గదా పెద్దలు అన్నారు,
' మూర్ఖులు రాబోయే ఆపదను గ్రహించలేరు, మంచి చెప్పినా వినరు. ' అని.
అయితే చిత్రగ్రీవుడు వచ్చిన ఆపదకు బెదరలేదు. తన సహచర పావురాలకు ధైర్యం చెబుతూ, నిజమైన నాయక లక్షణాలతో, ' ఆపదలో వున్నప్పుడే నిబ్బరంగా వుండాలి. అప్పుడే మనకు వుపాయం తోస్తుంది. ఇప్పుడు నాకొక వుపాయం తోస్తున్నది. మనమంతా ఒక్కసారిగా, యెగిరి యీ వలను మనతో వచ్చేట్లుగా ప్రయత్నించి, దూరంగా, వేటగానికి అందనంత దూరం, వెళదాము. ఐకమత్యంగా ప్రయత్నిస్తే, యెంతటి ఆపదనైనా దాటవచ్చు. ' అని వారందరినీ ఉత్సాహపరచి, ఆ వలతోసహా పావురాలని ఒక్కసారిగా యెగిరేటట్లు చేసింది.
వేటగాడు కూడా కొద్దిదూరం వాటిని ఆకాశమార్గాన చూస్తూ, వాటి వెనుకపరిగెత్తాడు. అయితే, ' అవి కలసికట్టుగా యెగురుతున్నాయి. వాటిని పట్టుకోవడం యిప్పుడు నావల్లగాదు. వాటిలో అవి విభేదించి క్రిందకుపడే అవకాశం కోసం చూస్తాను. ' అని మరికొద్దిసేపు వెంబడించి, అవి అలాగే ఒక్కమాటమీద యెగిరిపోవడంతో చేసేది యేమీలేక దిగాలు పడి, ' అయ్యో పావురాలూ పోయాయి, వలకూడా పోయింది. ' అని చింతిస్తూ వెళ్ళిపోయాడు.
అవి యెంత దూరం అలా వెళ్లగలవు ? అందుకనే చిత్రగ్రీవుడు, వారిని వలతోసహా తన స్నేహితుడైన మూషికరాజు హిరణ్యకుని కోటకు తీసుకువెళ్లి, తన స్నేహితునితో, ' మాకు ఆహారము మీద వుండే కోర్కె వలన యీ దుస్థితి యేర్పడి, వలలో చిక్కుకున్నాము, విధినెవరూ తప్పించలేరు గదా ! ఇప్పుడు మిత్రమా ! నువ్వే మమ్ములను రక్షించాలి. ' అని వేడుకుని, మూషికరాజు వలకొరికి వారికి స్వేచ్ఛ కలిపించగా, వలలోనుండి బయటపడ్డాయి.
పరిశీలిస్తే, ఇక్కడ మనకు కనబడే అంశం, లఘుపతనకుని సలహాతో కొన్నిపక్షులు ఆపద తప్పించుకోగా, చిత్రగ్రీవుడు మాత్రం ఆ సలహా లక్ష్యపెట్టక ఆపదలో ఇరుక్కున్నాడు. అయినా, తాను చేసిన తప్పు గ్రహించి, ఏమాత్రం బెదరకుండా, సహచర పావురాల ఐకమత్యంతో, మిత్రుని సహాయంతో, తనను, తన సహచర పావురాలనీ రక్షించుకున్నాడు.
అందుకనే, మంచి మిత్రులని సంపాదించుకోవాలన్నా, ఆస్నేహం నిలబెట్టుకోవాలన్నా, నిలకడగల ఆలోచనలు, మంచిమనసు ముఖ్యం.

Source: Gandavarapu Prabhakar Garu
(Facbook)

No comments:

Post a Comment