ఆదిపర్వం. తృతీయాశ్వాసం.
సౌతి శౌనకాది మహామునులకు చెబుతున్నాడు.
వైశంపాయనుడు దేవయాని వృత్తాంతం చెప్పసాగాడు, జనమేజయునకు.
తనని వివాహం చేసుకొమ్మని అడిగిన దేవయానికి యయాతి, ' అది తగనిపని ' అని చెప్పగా, దేవయాని ఈవిధంగా, సమాధానం చెబుతున్నది :
' యయాతి మహారాజా ! నేను బ్రాహ్మణస్త్రీని అయినందున నాతో వివాహము, వర్ణ సంకరం అవుతుందని నీవు బాధపడుతున్నావు కదా ! నా తండ్రి శుక్రాచార్యుడు, లోకాలన్నింటికీ ధర్మం చెప్పే జ్ఞాని. అటువంటి పుణ్యాత్ముడైన శుక్రుడు మన వివాహానికి సమ్మతిస్తే నన్ను పరిణయమాడతావా ? ' అని అడిగింది. దానికి ' సరే ' అన్నాడు యయాతి.
దేవయాని వెంటనే శుక్రాచార్యుని పిలిపించగా, ఆయనరాగానే, యయాతి, మిగిలినవారు అందరూ, నిలబడి నమస్కరించిన తరువాత, దేవయాని తండ్రి తో, ' తండ్రీ ! ఈ రాజశ్రేష్ఠుడు యయాతి, యింతకు పూర్వమే, నా కుడిచేతిని గ్రహించి, నన్ను పరిణయమాడినాడు. ఆ సంగతి తెలిస్తే, యిప్పుడు నన్ను వేరెవరైనా గ్రహిస్తారా ? నాకు యయాతియే భర్త. ఇది నానిశ్చయము. నేను బ్రాహ్మణకన్యను అని యయాతి నన్ను వివాహం ఆడడానికి తటపటాయిస్తున్నాడు. మీరు మీ ధర్మశాస్త్ర విజ్ఞానంతో యయాతి కి చెప్పి, మా వివాహానికి అనుమతివ్వండి. ' అని కోరింది.
దేవయాని మాటలకు శుక్రాచార్యుడు, ' ఆమె యయాతిని గాఢంగా ప్రేమించింది. ' అని గ్రహించి, మారుమాటాడలేక, ' మహారాజా ! నీవు దేవయానిని వివాహమాడు. అందువలన ఏ అధర్మ దోషం కలుగకుండు గాక ! ' అని దీవించాడు. ఆ తరువాత శుక్రుడు శర్మిష్ఠను చూపిస్తూ, ఈమె వృషపర్వుడనే ఈ రాజ్యాధినేత కుమార్తె. ఈమెకూడా, మిగిలిన దాసీలతో పాటు దేవయానికి అరణంగా మీతో వస్తుంది. శర్మిష్ఠకు కూడా రాచమర్యాదలతో కూడిన నివాసం యేర్పాటు చేయించు. అయితే, ఆమెతో యెట్టి పరిస్థితులలోనూ శారీరిక సంబంధము పెట్టుకోకు. ఇది నా ఆజ్ఞ గా భావించు. ' అని చెప్పాడు.
శుక్రాచార్యుడు ఆదేశించిన విధంగానే యయాతి దేవయానిని వివాహం చేసుకుని శర్మిష్ఠతో సహా వెయ్యిమంది దాసదాసీ జనాలను తన రాజ్యానికి తీసుకు వెళ్ళాడు . తన అంత:పురంలో దేవయానికి, ప్రక్కనే వున్న అశోకవనంలో శర్మిష్ఠకూ మిగిలిన దాసీ జనానికి నివాసాలు యేర్పాటు చేసాడు. వారికీ ఏ లోటూ రాకుండా చూసుకోసాగాడు. కొంత కాలానికి, యయాతి దేవయానులకు యదువు, తుర్వసుడు అనే కుమారులు జన్మించారు.
అయితే, శర్మిష్ఠకు తన యవ్వనమంతా అడవిగాచిన వెన్నెల అవుతున్నదని భావం కలిగింది. ' నిండు యవ్వనంలో వుండి నేనిక్కడ ఈ కోటలో బంధించబడ్డాను. ప్రక్కన అంత:పురంలో దేవయాని సర్వ సుఖాలు అనుభవిస్తున్నది. ' అని వేదన పడడం మొదలు పెట్టింది.
శర్మిష్ట ఆలోచనలు అంతటితో ఆగలేదు. ' ఈ యయాతి మహారాజు పైనే నా మనసంతా నిండివున్నది. నామీద కూడా ఆయన మనసు నిలబడేటట్లు చేసుకుంటాను. ఈ నహుష చక్రవర్తి కుమారుడు యయాతి, నాకు అన్నివిధాలా తగినవాడు. 'అని మనసులో భావించి, ఆ దిశగా తన పధకం నడిపి, ఆయన దృష్టిలో ప్రత్యేకంగా పడే విధంగా నడుచుకున్నది.
ఆమె అనుకున్న సమయం రానే వచ్చింది. ఒక రోజు వంటరిగా ఉద్యానవనంలో వున్న శర్మిష్ఠకు యయాతి మహారాజు కనిపించాడు. క్రీగంట ఆమె యయాతి చూస్తూ, ఆయన ప్రసన్నుడుగా వున్నాడని గ్రహించి, ' మహారాజా! నేను దేవయాని దాసిగా వచ్చిననాటి నుండే నీ సొత్తును. కాబట్టి నన్ను కూడా మీ భార్యగానే భావించి, ఋతుకాలానికి తగిన సమయాన్ని యెంచుకుని నాతో సంగమించి పుత్రభిక్ష పెట్టు. నా అందం అడవి గాచిన వెన్నెల గానీకు. ' అని విన్నవించుకున్నది .
యయాతి కొద్దిగా మెత్తబడుతున్నట్లు వున్నా, శుక్రుని మాటలు గుర్తుకువచ్చి, ' నీతో పడక నిషిద్ధమని శుక్రాచార్యులు చెప్పారు. వారి కోపానికి గురి అవుతానేమో ! ' అనే అనుమానం వెళ్లబుచ్చాడు. ఇంతవరకు వచ్చిన యయాతిని శర్మిష్ట వదల దలుచుకోక, ' మహారాజా ! ప్రాణం పోయే సమయంలో, ధనం కొల్లగొట్టబడుతున్నప్పుడు, బ్రాహ్మణుని కాపాడే విషయంలో, స్త్రీల విషయాలలో, వివాహవిషయాలలో అసత్యం ఆడొచ్చని శుక్రాచార్యుల వారే చెప్పారు కదా ! ' అని ఆమె యయాతి మనసును గెల్చుకున్నది.
ఆ విధంగా శర్మిష్ఠ కూడా యయాతి వలన ద్రుహ్వుడు, అనువు, పూరుడు అనే ముగ్గురు పుత్రులు కలిగారు. కొన్ని రోజులు శర్మిష్ట వారు తనకు ఋషి ప్రసాదితములు
అని బుకాయించినా, తరువాత, పిల్లలు పెద్ద అవుతున్న కొద్దీ, వారి పోలికలు యయాతిని పోలివుండడం చూసి, దేవయాని, అసలు విషయం తెలుసుకున్నది.
అని బుకాయించినా, తరువాత, పిల్లలు పెద్ద అవుతున్న కొద్దీ, వారి పోలికలు యయాతిని పోలివుండడం చూసి, దేవయాని, అసలు విషయం తెలుసుకున్నది.
వెంటనే ఆలశ్యం చెయ్యకుండా, దేవయాని తండ్రి వద్దకు పోయి, తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకుని బాధపడింది. యయాతి కూడా దేవయానిని ఓదారుస్తూ, ఆమె వెంట శుక్రుని ఇంటికి వెళ్లి ఆయనకు భక్తితో నమస్కరించాడు.
శుక్రాచార్యులు జరిగిన పరిణామాలకు ఏ విధంగా స్పందిస్తారో !
Source: Gandavarapu Prabhakar Garu
(Facbook)
No comments:
Post a Comment