అతి వినయం ధూర్త లక్షణం అనే నానుడి మనమందరం వింటూనే వుంటాము కదా ! అదే విధంగా, అలా వుండేవారిని, ' ఆషాఢభూతి ' పేరుతో, వ్యవహరించడంకూడా, అందరూ, గమనిస్తూ వుండే విషయమే. దానికి సంబంధించిన కథా, కమామిషు ఏమిటో ఒకసారి పరికిద్దాం.
' దేవశర్మ ' అనే సాధువు వూరికి దూరంగా ఒకఆశ్రమం కట్టుకుని వుండేవాడు. ఆయన భక్తుల వద్దనుంచి వచ్చే కానుకలతో బాగా డబ్బు కూడబెట్టాడు. దానిని కాపాడుకోవడం తలకుమించిన భారం అయింది, ఆయనకు. ఆయన యెవరినీ నమ్మేవాడుకాదు. తన ఆస్తినంతా, డబ్బూ, బంగారం రూపం లోనికి మార్చుకుని, ఒకసంచీలో పెట్టుకుని, యెక్కడికిపోయినా తనతో తీసుకువెళుతుండేవాడు. కంటికి రెప్పలాగా ఆ నిధిని కాపాడుకునే వాడు. ఈ లంపటంతో, వేదాంతధోరణిని అటక యెక్కించాడు.
ఇదంతా ' ఆషాఢభూతి ' అనే మోసగాడు కనిబెట్టాడు. ఎలాగైనా ఈ చరాస్థిని కాజేయాలి అనుకున్నాడు, ఆ సాధువు దగ్గరనుండి. వెంటనే పధకం రచించాడు. అందులో భాగంగా వెళ్లి, ఆసాధువు కాళ్లపై బడి సాష్టాంగనమస్కారం చేసాడు. ' స్వామీ ! యీజీవితం నీటిబుడగ లాంటిదని తెలుసుకున్నాను. ఈ యవ్వనము, కుటుంబబంధాలు యివన్నీ ఒట్టిభ్రమ అని అర్ధమైంది. నాకు సరిఅయిన మార్గంచూపి యీ బంధాలనుండి విముక్తిచెయ్యండి. ' అని అతి వినయంగా అడిగాడు. సాధువు సమాధానం చెప్పేదాకా, అదే భంగిమలో వుండిపోయాడు.
దేవశర్మ వాని వినయానికి, మాటలకు యెంతో సంతోషించి, ' నాయనా ! నీ కోరిక యెంతోమంచిది. శివధ్యానం చేస్తూ విబూది ధరించి దీక్షస్వీకరించు. నిన్ను నా శిష్యునిగా స్వీకరిస్తున్నాను. ఐతే ఒక షరతు. నీవు యెట్టి పరిస్థితులలోనూ, రాత్రి సమయంలో నా గదిలో ప్రవేశించే ఆలోచన చెయ్యరాదు, యెందుకనగా, సాధువులకు యేకాంతవాసం వుండవలెను. ' అని చెప్పాడు.
ఆషాఢభూతి, అందుకు వెంటనే ఒప్పుకుని, అప్పటినుండి, గురువుగారు చెప్పే పనులన్నీ తు. చ. తప్పక నిర్వహిస్తూ వున్నాడు. దేవశర్మకు అడుగడుగునా సపర్యలు చేస్తూ, యెంతో సంతోషం కలుగ జేస్తున్నాడు. అతివినయంతో వుక్కిరిబిక్కిరి చేస్తున్నాడు, గురువుగారిని. ఒకరోజు రాత్రి అయి, బయటకు పోబోతూ, తనబట్టకు గరిక అంటుకుంటే దానినిదులిపి, స్వామి దగ్గరపెట్టి, ' స్వామీ ! ఈ గరిక పొరబాటున నాతో తీసుకువెళ్లేవాడిని. క్షమించండి. పరుల సొమ్ము పాము వంటిది కదా ! ' అన్నాడు. శిష్యుని వినయానికి సాధువుకు ఆనందబాష్పాలు వచ్చాయి.
ఎన్నిరోజులకూ, దేవశర్మ తన డబ్బుమూటను, దొంగిలించే వీలుగా పెట్టకపోవడంతో, సహనం కోల్పోతూ ఆషాఢభూతి, దేవశర్మకు యేదైనా హానిచేసి, డబ్బుమూట యెత్తుకుపోదామా అని తలపోయసాగాడు. ఇలా ఉండగా, ఒకరోజు పొరుగూరి నుండి, ఎవరో, దేవశర్మను, వారి కుమారుని ఉపనయనం కోసం రమ్మని ఆహ్వానించారు. సరే అని ఆ రోజున, ఆషాఢభూతిని వెంటబెట్టుకుని దేవశర్మ, ఆవూరికి బయలుదేరాడు.
దారిలో వీరు యిద్దరూ, ఒకనదిని దాటవలసి వచ్చింది. అక్కడ కాలకృత్యాలు తీర్చుకుని, స్నానం చేద్దామని దేవశర్మ, తన డబ్బుసంచీని ఒక గొయ్యితీసి దానిలో పాతిపెట్టి, పైన శివలింగం లాగా చేసి, దానికి పూజచేస్తూ వుండమని ఆషాఢభూతికి చెప్పివెళ్ళాడు. అలా గురువుగారు, వెళ్ళినదే తడవుగా, ఆషాఢభూతి, శివలింగం అడుగున వున్న డబ్బుసంచీ తీసుకుని, శివలింగం మళ్ళీ యేర్పాటు చేసి పరారయ్యాడు. పక్కన ' స్వామీ ! మీ శివలింగం భద్రంగా వున్నది నాకు మాత్రం విముక్తి అయ్యింది. ' అని చీటీలో వ్రాసిపెట్టాడు.
వీడిమీద నమ్మకంతో, దేవశర్మ నింపాదిగా, కాలకృత్యాలు తీర్చుకుని, అక్కడ పొట్టేళ్ల పందెం జరుగుతుంటే చూసుకుని, పొట్టేళ్లమధ్య చిక్కుకుని చనిపోయిన, నక్కను గురించి ఆలోచిస్తూ, తాను డబ్బుసంచీ పెట్టినచోటికి వచ్చాడు. అక్కడ ఆషాఢభూతి పెట్టిన చీటీ చూసి, ఘొల్లుమన్నాడు. ఆలోచించగా, ' నాకుకూడా యీ డబ్బుసంచీ కాపాడే శ్రమనుంచి విముక్తి కలిగించాడు కదా యీ ఆషాఢభూతి ' అని తన్నుతాను ఓదార్చుకున్నాడు,
' ఈనగాచి నక్కలపాలు ' అన్నట్లు, సాధువు దానధర్మాలు చెయ్యక, తానూ అనుభవించక కూడబెట్టినదంతా, అతివినయంతో ఆషాఢభూతి తన్నుకుపోయాడు.
అప్పటినుండి, ఆషాఢభూతి అనేపేరు అతివినయం చూపించి, నమ్మకద్రోహం చేసేవారికి స్థిరపడి పోయింది.
అప్పటినుండి, ఆషాఢభూతి అనేపేరు అతివినయం చూపించి, నమ్మకద్రోహం చేసేవారికి స్థిరపడి పోయింది.
Source: Gandavarapu Prabhakar Garu
(Facbook)
No comments:
Post a Comment