ఆదిపర్వం. తృతీయాశ్వాసం.
సౌతి శౌనకాది మహామునులకు చెబుతున్నాడు.
వైశంపాయనుడు దేవయాని వృత్తాంతం చెప్పసాగాడు, జనమేజయునకు.
దేవయాని తండ్రి వద్దకు పోయి, శర్మిష్ట, తమ దాంపత్య జీవితం లోనికి ప్రవేశించిన విషయాన్నీ,తనకు జరిగిన అన్యాయాన్ని తండ్రి శుక్రాచార్యునికి చెప్పుకుని బాధపడింది. యయాతి కూడా దేవయానిని ఓదారుస్తూ, ఆమె వెంట శుక్రుని ఇంటికి వెళ్లి ఆయనకు భక్తితో నమస్కరించాడు.
యయాతినిచూసి కూడా దేవయాని ఏమాత్రం తగ్గకుండా, ' తండ్రీ ! ఈరాజు అధర్మ పరుడై నన్ను అవమానించాడు. నీ ఆజ్ణను అతిక్రమించి నాదాసి శర్మిష్ఠతో రాక్షస దాంపత్యం కొనసాగించి రహస్యంగా ముగ్గురు పుత్రులను కని, నన్ను, నాపిల్లలను అనాథలను చేసాడు. అంత:పురంలో నాకు అవమానం కలుగజేసాడు. ' అని దేవయాని శుక్రుని కాళ్లపై పడి రోదిస్తుండగా, తట్టుకొనలేక ఆ పితృ హృదయం తల్లడిల్లిపోయింది.
వెంటనే శుక్రుడు కమండలంలోని నీటిని మంత్రించి, ' యయాతి మహారాజా ! నీవు యవ్వన గర్వంతో, మదాంధుడవై, నాకుమార్తె వైవాహిక జీవితం నాశనం చేసావు. కాబట్టి నీకు యిక స్త్రీస్పర్శ కలుగకుండా, ముసలితనంతో పీడింపబడతావు. ' అని యయాతి పై ఆ మంత్రజలం చల్లి శపించాడు.
దానికి బెదిరిపోతూ, యయాతి, ' గురుదేవా ! కోరి ఋతుకాలంలో వచ్చిన స్త్రీని సుఖపెట్టకపోతే, గర్భస్థ శిశువును చంపినంత పాపమని శాస్త్రాలు చెబుతున్నాయి కదా ! అందువలన శర్మిష్ట కోరిక నేను మన్నించాను. అంతకు మించి నాకు దేవయానిని కష్టపెట్టాలనే ఉద్దేశ్యం లేదు. నాకింకా దేవయానితో సుఖాలు అనుభవించాలనే కోరిక చావలేదు. కాబట్టి ఈ అకాల వృద్ధాప్యాన్ని సహించలేను. ' అని హృదయ విదారకంగా మొరపెట్టుకున్నాడు.
ఇంతలో శుక్రుడు, తాను కూడా క్షణికావేశంలో యిచ్చిన శాపము తనకుమార్తె దేవయాని దాంపత్య జీవితానికి అవరోధ౦ కలిపిస్తుంది అని గ్రహించాడు. అందువలన, శుక్రుడు, కొద్దిగా యయాతి పై దయదలచి, ' అయితే, నీ కుమారులలో ఎవరైనా, నీ వార్ధక్యాన్ని తమంత తాముగా, ఐచ్చికంగా, తీసుకోవడానికి యిష్టపడితే, నీవు యవ్వన సుఖాలు పొందవచ్చు. నీకు ఆసుఖాలపై మోజు తీరగానే, ఆ కుమారుడికి అతని యవ్వనాన్ని తిరిగి ఇచ్చి వేయవచ్చు. ఆ కుమారుడే ఉత్తరోత్తరా నీ వంశోద్ధారకుడు అవుతాడు. ' అని కొద్దిగా శాపానికి వెసులుబాటు కలిగించాడు శుక్రుడు.
అదే మహాద్భాగ్యంగా తలచి యయాతి దేవయానితో సహా రాజ్యానికి తిరిగి వచ్చాడు. వెంటనే శుక్రుని శాపం పనిచేయడం మొదలు పెట్టింది. వృద్ధాప్యఛాయలు వచ్చి మీద పడ్డాయి, యయాతికి. ఇంద్రియ పటుత్వం తగ్గిపోయింది. శరీరానికి ముడతలు వచ్చాయి. తల నెరిసిపోయింది. కంఠనాళాలు కఫంతో నిండిపోయి మాట రావడం లేదు. తల వణక సాగింది. అయితే, కామాగ్ని మటుకు రగులుతూనే వున్నది. యవ్వన భోగాలు పూర్తిగా అనుభవించలేదనే వ్యధ వదలడంలేదు.
శుక్రాచార్యులు చెప్పిన వెసులుబాటు గుర్తుకు తెచ్చుకుని, యయాతి తన అయిదుగురు పుత్రులను వెంటనే, పిలువనంపించాడు, వారి సహాయం కోసమై. మొదటగా జ్యేష్ఠకుమారుడు యదువును పిలిచి, జరిగినదంతా చెప్పి, యౌవనభిక్ష పెట్టమని అడిగాడు. అయితే, యదువు, ' తండ్రీ ! వృద్ధాప్యమనేది అతి భయంకరమైనది. వృద్ధులను స్త్రీలు ఇష్టపడరు. అందరికీ చులకన అయిపోతాము. కాబట్టి నేను మీకు సహాయం చేయలేను. ' అని నిర్ద్వంద్వం గా చెప్పాడు, తండ్రి యయాతికి.
ఆ తరువాత రెండవ కుమారుడైన తుర్వసుడు కూడా, ' పితృదేవా ! యౌవనం లేని రాజరికం ఎందుకు. నన్ను మన్నించండి. ' అన్నాడు. అలా దేవయాని కుమారులు ఇరువురూ, విముఖత చూపిన వేళ, శర్మిష్ట యొక్క జ్యేష్ఠకుమారుడు ద్రుహ్యుని పిలిచి యయాతి అదే కోరిక కోరాడు. ' నేను వృద్ధాప్యంలో వచ్చే వికృతరూపం ధరించలేను. నన్ను క్షమించండి. ' అన్నాడు, ద్రుహ్యుడు. . ఆతరువాత శర్మిష్ట రెండవ కుమారుడు అనువు కూడా తండ్రికి సహాయం చేయడానికి ముందుకు రాలేదు.
ఈవిధంగా తనకు ఏవిధంగా ఉపయోగ పడని నలుగురు కుమారులను యయాతి ఈ విధంగా శపించాడు.:
మొదటి కుమారుడు యదువు వంశస్తులంతా రాజ్యార్హత లేనివారుగా అయిపోతారనీ, రెండవ కుమారుడు తుర్వసుని వంశస్తులంతా, ధర్మాధర్మ జ్ఞానం లేకుండా ఆటవికులుగా, సంకరజాతులకు రాజులూ అవుతారని, ద్రుహ్యుని వంశస్తులంతా నిలకడ లేకుండా,ఎప్పుడూ తెప్పల మీద తిరుగుతూ జలజీవనం చేసే వారుగా వుంటారనీ, యిక అనువు వంశస్తులంతా అల్పాయుష్కులై అర్ధాంతరంగా మరణిస్తూ వుంటారనీ శాపం ఇచ్చాడు.
ఇప్పుడు కనిష్ఠుడైన పూరువు వంతు వచ్చింది. చూద్దాం ! పూరువు ఎలా స్పందిస్తాడో !
Source: Gandavarapu Prabhakar Garu
(Facbook)
No comments:
Post a Comment