Friday, 18 October 2019

దురాశ.

ఎవరైనా ఏదైనా సహాయం చేస్తే, ' వీడి దగ్గర యెంతో వుంటే మనకు యింత సహాయం చేస్తున్నాడు. ఆ వున్నదంతా, మనకే యిస్తే బాగుండు, ' అనే ఆశతో వుండే మనుషుల గురించి ఈ పంచతంత్ర కధలో ప్రస్తావించడం జరిగింది.
ఒకానొక వూరిలో ' హరిదత్తుడు ' అనే గృహస్తు వుండేవాడు. అతనికి భార్యా, ఒక పిల్లవాడు వున్నారు. తనకున్న చిన్నపొలం లో వ్యవసాయం చేసుకుంటూ, గుట్టుగా జీవనం సాగిస్తూ వుండేవాడు, భార్యా పిల్లవానితో, హరిదత్తుడు.
అయితే, వర్షాలులేక పంటలు సరిగా పండకపోవడంతో, యెంత శ్రమించినా అర్ధాకలితో వారి కుటుంబం జీవించే పరిస్థితివచ్చింది. ఒకరోజు మండుటెండలో తన పొలంలో పనిచేసి, తన పొలంలోనే వున్న ఒక చెట్టునీడలో హరిదత్తుడు, విశ్రమిస్తుండగా, అతనికి ఒకనాగుబాము పడగవిప్పి దగ్గరలోని ఒక పుట్టవద్ద కనబడింది.
అది తనపొలం కాపాడుతున్న నాగదేవత అని తలచి, హరిదత్తుడు, వెంటనే యింటికి వెళ్లి ఒకపాత్రలో చిక్కటిపాలు తీసుకువచ్చి, నైవేద్యంగా పెట్టి, ' యింతకు ముందు నిన్నెప్పుడూ చూడలేదు. నన్ను క్షమించు. రేపటినుండి, నీకు రోజూ యీవిధంగానే పాలు సమర్పించుకుంటాను. కాపాడు తల్లీ ! ' అనిప్రార్ధించి, పాలపాత్ర అక్కడే వుంచి, వెళ్ళిపోయాడు.
ఆశ్చర్యంగా, మర్నాడు తాను పాలతోవచ్చే సమయానికి, ముందురోజు వుంచినపాత్రలో, ఒక బంగారునాణెం కనిపించింది. అది నాగదేవత యిచ్చిన కానుకగా భావించి ఆనందంతో యింటికి తీసుకువెళ్ళాడు. భార్యకూ, పిల్లవానికి కూడా జరిగింది చెప్పాడు. ఈవిధంగా రోజూ ఒక బంగారునాణెం, ముందురోజు వుంచిన పాలపాత్రలో దొరకసాగింది. అప్పటినుండి, హరిదత్తుడు, తనకుటుంబంతో, యెంతో ఆనందంగా వుండసాగాడు.
ఒకరోజు హరిదత్తుడు, యేదో పనిమీద వేరేవూరు వెడుతూ, పాలు నైవేద్యం పెట్టేపని, తన కుమారునికి అప్పగించాడు. ఆ కుర్రవాడు, ముందురోజు పాత్రలో బంగారునాణెం చూసి, ' ఓహో ! ఈ నాగుబాము రోజూ ఒక బంగారునాణెం మాత్రమే యిస్తున్నది, ఇంకా బోలెడు నాణేలు, ఈపుట్టలో వుండివుంటాయని, పుట్టను త్రవ్వే ప్రయత్నంచేశాడు. నాగదేవత అడ్డుపడగా, ప్రక్కనవున్న కర్రతో ఒక్క దెబ్బవేశాడు. ఆదెబ్బ తప్పించుకున్నది, నాగదేవత.
అయితే, ఆ పిల్లవాడు చేసిన పనికి నాగదేవత కోపగించి, అతడు చేసినపనికి దండనగా, తన విషపుకోరలతో కాటువేసింది. వెంటనే, ఆ పిల్లవాడు స్పృహ తప్పి పడిపోయాడు. అక్కడ ప్రక్కన పొలంలో వున్నవారు చూసి, అతనిని వైద్యానికి పంపించారు.
సాయంత్రానికల్లా, హరిదత్తుడు తిరిగివచ్చాడు. కుమారుని పరామర్శించి, మళ్ళీ పుట్ట వద్దకు వచ్చి, పాలు సమర్పించాడు. ఈసారి, నాగదేవతకు కోపంవచ్చింది. ' నీ కుమారుని అత్యాశ, నా మరణానికి దారితీసే పరిస్థితి వచ్చింది. ఇపుడు అతడే చావు బ్రతుకులలో వున్నాడు. నీవు, నీ కుమారుని సంరక్షణ చూడకుండా, కేవలం బంగారు నాణెం కోసం యిక్కడకు పరిగెత్తుకుంటూ వచ్చావు. నీముఖం నేను చూడదలుచు కోలేదు. వెళ్ళిపో ! ' అని గద్దించింది.
హరిదత్తుడు కంటతడి బెట్టుకుంటూ, ' అమ్మా ! ఈరోజు నేను బంగారునాణెం కోసం రాలేదు. నా కుమారునికి ప్రాణభిక్ష పెట్టమని కోరడానికి వచ్చాను. నీవు యికముందు బంగారు నాణెములు యివ్వకున్నా ఫరవాలేదు. కానీ పుత్రభిక్ష పెట్టు. ' అని రోదించాడు.
నాగదేవత కరుణించి, ఒక విలువైన వజ్రం ప్రసాదించి, ఇది నీ పిల్లవానికి నా కోరలు తగిలినచోట వుంచు. విషం దిగిపోతుంది. మాములుగా అవుతాడు ' అని చెప్పి, ' ఇకనైనా దురాశకు లోనుకాకుండా, కష్టపడి తగిన వృత్తి చేసుకుని ఆనందంగా జీవించ౦డి. ' అని చెప్పి పంపింది.
దురాశ వలన యెన్ని అనర్ధాలు జరుగుతాయో, కష్టపడకుండా వచ్చే డబ్బువలన, బుద్ది ఎలా పెడదారులు పడుతుందో చెప్పే కధ ఇది. కుటుంబపెద్ద అనుసరించిన ధర్మబుద్ధి ఆదర్శంగా, కుటుంబమంతా మెలగాలని అంతర్లీనంగా చెప్పిన సందేశం. 
Source: Gandavarapu Prabhakar Garu
(Facbook)

No comments:

Post a Comment