Friday, 18 October 2019

వ్యాస మహాభారతం - 24 (S-9)

ఆదిపర్వం. చతుర్దాశ్వాసం ప్రారంభం.
సౌతి శౌనకాది మహామునులకు చెబుతున్నాడు.
పురువంశం, పూరువు వలన, యయాతి మహారాజు ఆశీర్వాదంతో ప్రారంభమై, యెందరో చక్రవర్తులకు ఆలవాలమైంది. ఒక్కమాటలో చెప్పాలంటే, పూరువు వంశంతోనే మహాభారతగాధ ప్రారంభం అయిందని చెప్పవచ్చు. 
ఇక ఈ వంశక్రమం గురించి తెలుసుకుందాం. పూరుడివంశంలోని వాడైన మతినారుడు, సరస్వతీనదీ తీరాన పన్నెండు సంవత్త్సరాలు అద్భుతంగా సత్రయాగం చేసాడు. అతడి తపోనిష్ఠకు, ధర్మబుద్ధికి అన్నిరోజులనుండీ అతడు ఆచరిస్తున్న నియమ నిష్ఠలకు, సరస్వతీనది అచ్చెరువంది, మనస్సులో అనురాగం అంకురించగా , ధర్మబద్ధంగా అతడిని వివాహం చేసుకున్నది. 
మహాభారత గాథలో ఈ సరస్వతీ నది సాక్షిగా, ముందు ముందు ఎన్నో అద్భుతాలు జరుగబోతున్నాయి. మతినారుడు, సరస్వతీ ఇరువురూ, తమ వైవాహిక జీవితానికి గుర్తుగా త్రసుడు అనే వానికి జన్మనిచ్చారు. త్రసుడికి కాళింది ద్వారా ఇలిలుడు, అతనికి రధంతరి ద్వారా దుష్య౦తుడు జన్మించారు. దుష్య౦తుడు గొప్ప పరాక్రమ వంతుడు, వేటయందు మిక్కిలి ఆసక్తి, నైపుణ్యము కలవాడు. 
ఒకరోజు మృగయా వినోదంలో దుష్య౦తుడు తనపరివారంతో కలిసి, పులులనూ, సింహాలనూ తరుముతూ, తనకు తెలియకుండానే చాలా దూరం వచ్చి, కణ్వాశ్రమం వున్న నదీ తీరానికి చేరుకున్నాడు. తన పరివారాన్ని అక్కడే వుండమని ఆశ్రమ నియమాలకు భంగం కలుగకుండా, తానొక్కడే దుష్య౦తుడు ఆశ్రమప్రవేశం చేసాడు, దాహార్తితో. ఆశ్రమం లోకిప్రవేశిస్తుండగానే, తుమ్మెదరెక్కల వంటి జుట్టుతో వున్న ఒక కన్యకామణిని చూసాడు, దుష్య౦తుడు. 
ఆమెకూడా దుష్య౦తుని చూసి అతని అందానికి మైమరచి, ' ఈతడు ఇంద్రుని కుమారుడైన జయంతుడు కాదు కదా ' అని అనుకోసాగింది. ఆశ్రమ నియమాల ప్రకారం అతిథికి అర్ఘ్య పాద్యాలు సమర్పించి ఆదరంగా పూజించింది. ఆ సమయంలో,
దుష్య౦తుడు తన గురించి చెప్పుకుని కణ్వమహర్షి దర్శనార్ధం వచ్చానని చెప్పాడు. అందుకు శకుంతల యెంతో వినయంగా, ' మహర్షి పూజా ద్రవ్యాల కోసమై అడవికి వెళ్లారు. తమరి రాక నేను వారికి తెలియజేస్తాను. వెంటనే వస్తారు. ' అన్నది. 
ఆమె మాట్లాడే విధానమూ అణకువ చూసి, ఆమె తప్పక వివాహం కాని స్త్రీ అయివుంటుందని వూహించి, ' లలనా ! నీ వెవ్వరు ? ఈఆశ్రమంలో యెందుకు వున్నావు ? ' అని లాలనగా అడిగాడు, దుష్య౦తుడు, ఆమెను. దానికి ఆమె ధర్మస్వరూపుడైన కణ్వమహర్షియే తన తండ్రి అని చెప్పింది. అందుకు దుష్య౦తుని మనస్సు అంగీకరించలేదు. ఆమె బ్రాహ్మణ కన్య అయితే, తన మనస్సు ఆమెపై లగ్నమయ్యేది కాదు, ఈమె తప్పక క్షత్రియజాతి కన్య అయివుంటుందని తలచాడు. 
వెంటనే, ' అంతటి తపో నిష్టా గరిష్ఠుడైన కణ్వమహర్షికి నీవు కుమార్తె అవడం అసంభవం. నీకు అభ్యంతరం లేకుంటే, నీ జన్మ వృత్తాంతం చెప్పు. నేను నీకు ఏ హానీ చేయను. ' అని అనునయంగా అడిగాడు దుష్య౦తుడు శకుంతలని. అందుకు శకుంతల, ' మహారాజా ! నా జన్మ వృత్తాంతము పూర్వం ఒక మునిశ్రేష్ఠునికి నా తండ్రి కణ్వమహర్షి, నేను వినేటట్లుగా చెప్పిన సంగతి చెబుతాను, విను. ' అని తన జన్మ వృత్తాంతము చెప్పసాగింది. 
విశ్వామిత్ర మహర్షి తపస్సు భగ్నం చేయడం కోసం ఇంద్రుడు మేనకను నియమించడం, ఆమె తన హొయలు ప్రదర్శించి, అంతటి రాజర్షిని ఆకర్షించి ఆయన తపస్సు భగ్నం చెయ్యడం, ఆతరువాత, వారిద్దరూ దాంపత్య భోగాలు అనుభవించడం ద్వారా ఒక ఆడశిశువుకు జన్మనివ్వడం అంతా శకుంతల చెప్పింది. 
ఆ ఆడశిశువునే నేను. తాను వచ్చినపని అయిపోగానే, మేనక, నా తల్లి, నిర్దాక్షిణ్యంగా నన్ను మాలినీ నదీతీరాన ఇసుక తిన్నెలపై వుంచి, దేవలోకానికి వెళ్ళిపోయింది. విశ్వామిత్రుడు కూడా జరిగినది తెలుసుకుని, తన తపోదీక్షలోనికి వెళ్ళిపోయాడు. దిక్కులేక పడివున్న నన్ను, కొన్ని పక్షులు గుంపులు గుంపులుగా నాకు రక్షణ కలిపించి క్రూర మృగాలనుండి నన్ను కాపాడాయి. అటుగా శిష్యులతో వెళ్తున్న కణ్వమహర్షి, శకుంతముల చేత రక్షింప బడుతున్న నన్ను చూసి, జాలిపడి, నాకు శకుంతల అని పేరు పెట్టి తన ఆశ్రమంలో నన్ను గారాబంగా పెంచాడు. 
' మహారాజా ! మీకు తెలియంది ఏమున్నది ? లోకంలో కన్నవాడు, అన్నంపెట్టి పోషించిన వాడు, భయంనుండి రక్షించినవాడు, వీరు ముగ్గురూ స్త్రీకి పితృ సామానులు కదా ! ఆ విధంగా కణ్వమహర్షి నాకు తండ్రి,గురువు. ' 
ఆమె తన జన్మ వృత్తాంతం చెప్పగానే, దుష్య౦తుడు, ' ఆహా ! ఈమె తనెక్కడ ముని కుమార్తెను అని చెబుతుందో అని నిస్పృహకు లోనయ్యాను. ఇప్పుడు రాచవంశపు స్త్రీ అని తెలిసి నా మనస్సును మన్మధుడు ఆక్రమించి విరహం కలుగ జేస్తున్నాడు. నేనంటే తనకూ ఇష్టమేనని ఆమె ముఖకవళికలు, ప్రసన్న వదనం, నాతో మాట్లాడే తీరు,తెలియజేస్తున్నాయి. ' అని దుష్య౦తుడు మనసులో తలుస్తూ, క్షత్రియ సమ్మతమైన గాంధర్వ వివాహానికి ఆమెను సమ్మతించమని కోరాడు. 
శకుంతల సమాధానానికై తమకంతో యెదురుచూస్తున్నాడు దుష్య౦తుడు.

Source: Gandavarapu Prabhakar Garu
(Facbook)

No comments:

Post a Comment