Sunday, 20 October 2019

అసలైన ఆనందం.

ఒకానొకవూళ్ళో, సోమిలకుడు అనే నేతగాడు వుండేవాడు. అతడు యెంత చక్కని దుస్తులు నేసినా అమ్మకానికి పెట్టేసరికి, అతనికి దినసరి ఖర్చులకు సరిపడా డబ్బులు వచ్చేవికానీ, ధనం దాచుకుని పెద్ద అవసరాలు తీర్చుకునే అవకాశం రావడం లేదు. తోటివారు యింతకంటే, నాసిరకం బట్టలు నేసినా, వారికి పుష్కలంగా డబ్బువచ్చేది. 
ఈపరిస్థితి యెక్కువ రోజులు భరించలేక, ఒకరోజు సోమిలకుడు భార్యతో, ' నాకు వున్న వూరిలో అచ్చిరావడం లేదనుకుంటాను, భార్యామణీ ! నేను వర్ధమానపురం నగరానికి వెళ్లి అక్కడ బాగాకష్టపడి డబ్బు సంపాదించుకుని వస్తాను. అప్పటిదాకా కొద్దిగా జాగ్రత్తగా వుండి, ఇల్లు చూసుకో ! ' అని భార్యకు చెప్పాడు. 
సోమిలకుడు చెప్పిన దానికి అతని భార్య ఒప్పుకోలేదు. ' నువ్వు యెంతదూరం వెళ్లి కష్టపడినా, మనకు దక్కవలసిందే మనకు దక్కుతుంది. మనది కానిది ఒక్క నాణెం కూడా యెక్కువరాదు. ఎందుకు ఇంటిపట్టున వుండి పనిచేసుకోక దూరభూమి వెళ్లి బాధపడతావు ? నా మాట విను. మనం చేసే పనులకు, విధి కూడా సహకరించాలి. అంతవరకూ యెంత కష్టపడినా ఏమీ ప్రయోజనం వుండదు. ' అని చెప్పింది.
ఆమె చెప్పేమాటలు శుష్కవేదాంతం లాగా అనిపించింది సోమిలకుడికి. అందుకనే భార్యతో, ' మనం కష్టపడితే విధికూడా మనలను ఆదుకుంటుంది. నేను వెళ్ళవలసినదే.' అని పట్టుపట్టి వర్ధమానపురం నగరానికి బయలుదేరాడు. 
ఆవిధంగా నగరానికి వెళ్లిన సోమిలకుడు, మూడు సంవత్సరాలు అమితంగా కష్టపడి, 300 బంగారుకాసులు సంపాదించి, తన గ్రామానికి తిరిగి ప్రయాణమయ్యాడు. దారిలో అడవి మార్గం గుండా వస్తూ, చీకటిపడగానే ఒక చెట్టు యెక్కి పడుకున్నాడు, తన బంగారు కాసులు భద్రంగా మూటకట్టి పెట్టుకుని. 
అయితే అర్ధరాత్రి పూట యెవరో యిద్దరు మాట్లాడుకుంటున్నట్లు వినబడుతుంటే, చెవులు రిక్కించి వినసాగాడు. అందులో విధి అనబడేవాడు , ' సోమిలకుడు తన యెంత కష్టపడినా కేవలం తిండికీ, బట్టకూ సరిపడే సంపాదనే వుండాలని వ్రాసివున్నది కదా ! ఎందుకు అతనికి యిన్ని బంగారుకాసులు వచ్చేటట్లు చేసావు ? ' , అని పనిదేవతను అడిగాడు. దానికి పనిదేవత, ' అతడు కష్టపడ్డాడు, నేను యిచ్చాను. తరువాత నీ ఇష్టం. ' అన్నది. ఆమాటలువినగానే, సోమిలకుని నిద్ర అంతా ఎగిరిపోయి, తన బంగారు కాసుల మూట తడుముకున్నాడు. అంతే ! గుండె గుభేలుమన్నది. బంగారుకాసులు మాయమైనాయి. ఖాళీమూట మాత్రం మిగిలింది. 
సోమిలకుడు ఉస్సురంటూ, చెట్టు దిగి, ' ఇప్పుడు ఏమొహం పెట్టుకుని నావూరువెళ్లి, నా భార్యకు, స్నేహితులకు జరిగింది చెప్పగలను ? ' అనుకుంటూ, తిరిగి వర్ధమానపురం వచ్చాడు. ఈసారి ఇంకాబాగా కష్టపడి, సంవత్సర కాలంలోనే 500 బంగారు కాసులు సంపాదించుకుని, తమ వూరికి తిరిగి ప్రయాణమయ్యాడు. ఈసారి దారిలో యెక్కడా ఆగకుండా ఇంటికి సరాసరి వెళ్తూ వుండగా, బాగా అలసిపోయాడు. 
అయినా అలా సోమిలకుడు నడుస్తూ వుండగా, మళ్ళీ వెనుకటి వ్యక్తుల కంఠాలే వినబడసాగాయి. చెవులు రిక్కించి విన్న సోమిలకుడికి, మళ్ళీ అర్ధమైంది, తనకు కేవలం తిండి బట్ట మాత్రమే ప్రాప్తం, బంగారు కాసులు తనకు అందని విషయమని. వారు మాట్లాడుకోవడం. తరువాత చూసుకుంటే, ఈసారికూడా బంగారుకాసులు మాయమైనాయి. విధి తనకు ఆధనం చేరకుండా అడ్డుపడుతున్నదని తెలుసుకున్నాడు, సోమిలకుడు. ' పనిదేవత అనుగ్రహించినా, విధి నన్ను ధనవంతుని చేయడానికి ఒప్పుకోవడం లేదు. ' అని అర్ధం చేసుకున్నాడు. 
అయితే, ఈసారి జరిగిన భంగపాటుకు, సోమిలకుడు తట్టుకోలేక పోయాడు. తన కష్టానికి తగిన ఫలితం దక్కలేదని, నిస్పృహతో, ప్రక్కనే వున్న గడ్డిని ఉరిత్రాడుగా పేనుకుని, ఆత్మహత్యా ప్రయత్నం చేసుకోబోయాడు. 
సరిగ్గా అదేసమయంలోఆకాశం నుండి ఒక కంఠం, ' సోమాలికా ! ఆగు ! నేను విధిని మాట్లాడుతున్నాను. నేనే నీ బంగారు కాసులు మాయం చేశాను. నువ్వు నీ ఆహారం, దుస్తులకంటే ఎక్కువ సంపాదించుకుంటే నేను సహించలేకపోయాను. ఎందుకంటే, నీవు నీకు సరిపడా అవసరాల నిమిత్తమే ఆర్జించుకుని ప్రశాంతంగా బ్రతకాలని నీకు వ్రాసి పెట్టి వున్నది. అధిక సంపాదనతో నీవు లోభత్వం పొందే అవకాశం వున్నది. నీ జీవితమూ, నీ భార్య జీవితమూ ఆ లోభత్వం వలన కష్టాల పాలు అయ్యే సూచనలు వున్నాయి. అందుకనే, నీ మేలు కోరి నిన్ను కనీస ఖర్చులకు మాత్రం సంపాదించుకునే వాడిగా మాత్రమే చూసుకుంటున్నాను. ' అన్నది.
దానికి సోమిలకుడు ఒప్పుకోలేదు. ' ధనం వున్నవాడిని అందరూ గౌరవిస్తారు. భార్యకూడా అదుపు ఆజ్ఞలలో వుంటుంది. ధనంలేకపోతే కట్టుకున్న భార్య కూడా లెక్కజేయదు. స్నేహితులు దగ్గరకు రారు. నేను పిసినారివాడినైనా పరవాలేదు. కానీ ధనవంతుడిని కావాలి. ' అని విధితో గట్టిగా చెప్పాడు. 
అప్పుడు విధి, సోమిలకుని, వర్ధమానపురం లో వున్న ఇద్దరు వ్యక్తులు, గుప్తధనుడు,, ఉపభుక్తధనుడు అనే వారి జీవన విధానం పరిశీలించి వచ్చి తనకు చెప్పమన్నది. ఎవరి జీవన విధానం సోమిలకునికి నచ్చితే ఆవిధంగా చేద్దామన్నది. 
అదే విధంగా సోమిలకుడు ముందుగా గుప్తధనుడి ఇంటికి వెళ్లగా, వారు యెంతో అమర్యాదగా ఇతనిని వెళ్లగొట్టబోగా, ఒక్క పూట ఆశ్రయం అడిగాడు. వారు అతికష్టంమీద ఒప్పుకుని, తమతో పాటు ఉంచుకున్న ఉదయం వండిన ఆహార పదార్ధాలను వారు తినగా, మిగిలినవి పెట్టారు. ఒక చింకిచాప యిచ్చి దూరంగా పడుకోమన్నాడు. వారూ అలాంటి దుర్భరమైన జీవితాన్నే అనుభవిస్తున్నారు. అర్ధరాత్రి పూట వారిమాటలు విని తనను ఉదయాన్నే వెళ్లగొట్టమని అతని భార్యా పిల్లలూ గుప్తధనునికి చెబుతుంటే, తెల్లవారకుండానే అక్కడినుండి బయటపడ్డాడు సోమిలకుడు. 
ఇక ఉపభుక్తధనుని కలవగా ఆయన ఆదరంగా ఆహ్వానించి, ధనం లేకపోయినా కావలసిన సరుకులు అప్పుగా తీసుకువచ్చి, సోమిలకునికి ఏలోటూ లేకుండా రోజంతా చూసుకుని, తన పిల్లల పడకగదిలో చక్కని మంచం యేర్పాటు చేసి, ఆదరించాడు. ఎన్ని రోజులు కావాలంటే అన్నిరోజులువుండమన్నాడు. ఇతనికి ఇంతధనం ఎక్కడ నుండి వస్తున్నది అని ఆలోచిస్తుండగా, ఆనగరం అధికారివచ్చి ఆయన చేసే ధర్మకార్యాలు తన కళ్ళముందే ధనం ఇచ్చివెళ్ళాడు. 
అప్పుడు అర్ధమైంది, సోమిలకునికి కేవలం ధనం వుండగానే సరిపోదు. దానిని ఖర్చుపెట్టే విధానం తెలియాలి అని. అది తనకు తెలియజెప్పడం కోసమే, విధి ఈవిధంగా చేసిందని సంతోషించి, తిరిగి విధి దగ్గరకువచ్చి, తనకు ఉపభుక్తధనుని జీవితం నచ్చిందని, చెప్పాడు. ధర్మకార్యాలు చేస్తూ వుంటానని, ఆనందంగా సోమిలకుడు విధికి చెప్పాడు. విధి కూ

ఏకలవ్యుని విషయం లో గురు ద్రోణులు అన్యాయం చేసారా... ?

ఇటువంటి ఘట్టాల వద్ద ఏకాగ్రంగా పరిశీలించాలి. బుద్ధిని ఉపయోగించాలి. పాండవులు రాజ్యపాలన బాధ్యతగల కుటుంబంలోని వారు – అంటే క్షత్రియులు. నాటి సాంఘిక వ్యవస్థను అనుసరించి రాజ్యరక్షణ బాధ్యత వారి ధర్మం. అటువంటి క్షత్రియులకు రాజ్య రక్షణార్థం అవసరమైన విద్య ‘ధనుర్వేదం’. ఇది సమంత్రకమైన విద్య. దీనికొక తపశ్శక్తి, సంస్కార విశేషం అవసరం. అవి కలిగిన వారు పాండవులు, విశేషించి అర్జునుడు.
ఏకలవ్యుడు ప్రఙ్ఞాశాలి.ఏకాగ్రమైన చిత్తంతో సాధన చేసి కొంతమేరకు విద్యను సాధించిన ప్రతిభావంతుడు. అందులో సందేహం లేదు. కానీ అతడు ద్రోణుని గురువుగా భావించాడు. కనుక అతడు తన విద్యతో సాధించే ప్రతిపనికీ ద్రోణుని ‘గురుముద్ర’ ఉండి తీరుతుంది. తద్వారా ద్రోణుడూ బాధ్యుడవుతాడు. ఆ బాధ్యత కలిగియున్నవాడు కనుక ద్రోణుడు ధర్మాన్నీ, దేశక్షేమాన్నీ, దృష్టిలో ఉంచుకొని ఏకలవ్యుని బొటనవ్రేలిని దక్షిణగా అడిగాడు.
ఇందులో రాజకులానికి అమ్ముడుపోవడం లేదు. దేశపాలకులకు గురువైన వాడు, దేశరక్షణకు అవసరమైన యుద్ధ విద్యను, ఆ రక్షణ ధర్మం కలిగిన రాజులకు అందిస్తున్నాడు. దేశరక్షణకు ప్రధానమైన యుద్ధ విద్య సామాన్యులకు నేర్పుతారా! ఇప్పటికైనా రక్షణ శాఖారహస్యాలను ప్రభుత్వం ప్రజలకు బట్టబయలు చేస్తుందా? దానిలో సుశిక్షితులై, అంకితభావంతో నియమితులైన వారికి మాత్రమే కదా అవి తెలిసేవి! అలా కాదని ప్రజలందరికీ వాటిని తెలియజేస్తే ప్రమాదం కాదా!
ఒకవేళ పొరపాటున ఒక సామాన్యునికి తెలిస్తే అతడి నుండి సమాజానికి ప్రమాదం వస్తుందేమోననే ఊహతోనైనా ప్రభుత్వం శిక్షిస్తుంది కదా! ఇందులో ‘వర్గవివక్ష’ లేదు కదా. ‘డిఫెన్స్’(రక్షణశాఖ) వారి వద్దకు వెళ్ళి ‘మిస్సైల్స్’ ఎలా చేయాలో నేర్పండి అని ఎవరైనా వెళ్ళి అడిగితే నేర్పుతారా? అవి చేసే పరికరాలను ఏర్పాటు చేయమంటే చేస్తారా? అంతేకాక మరో రహస్య విషయమేమిటంటే ఆటవికుడైన ఏకలవ్యుడు, శబరులు వంటి వారికి అలవాటైన ఒక విధమైన ఉపాసనతో ద్రోణుని ప్రతిమ ద్వారా విద్యను గ్రహించాడు. అది కపటోపాసన. దానికి శిక్ష కూడా ధర్మపరంగా విధించాడు ద్రోణుడు.
అదేవిధంగా రహస్యమైన ధనుర్వేదం పాండవాదులకే నేర్పుతున్నాడు. ఆ విద్య ఏకలవ్యుని వద్ద ఉంటే భవిష్యత్తులో సమాజానికి హాని కలుగవచ్చు. ఎందుకంటే విద్యకు ప్రయోజనమనేది ముఖ్యం. ఆ ప్రయోజనం తెలియని విద్య ఏకలవ్యునిది. అతడు వృత్తిపరంగా నిషాదుడు. హింసా ప్రధాన ప్రవృత్తి గల విద్య అతనిది. క్షాత్రమైన ధనుర్వేద విద్య హింసా ప్రధానమో, పోషణ ప్రధానమో కాదు. ధర్మ దేశ పరిరక్షణార్థమైనది. సంస్కారాన్ని అనుసరించి విద్యను ఉపదేశిస్తేనే, విద్యా ప్రయోజనం నెరవేరుతుంది. ఇక్కడ వర్గ ప్రస్తావన కన్నా వారి వారి స్థానాల ప్రస్తావనను గమనించాలి. విద్యా స్వరూపమూ, ప్రయోజనమూ తెలియకపోవడం చేతనే వేటకుక్కపై విద్యా కౌశల్యాన్ని ప్రయోగించి ఏడు బాణాలను వేశాడు ఏకలవ్యుడు. ఇందులోనూ వృధాహింసాత్మకమైన రాక్షస వృత్తి గోచరిస్తుంది. విద్యాదుర్వినియోగం కనబడుతుంది. ఉత్తముడైన గురువు శిష్యుడి చిత్త సంస్కారాన్ని, లక్షణాలనీ కూడా గ్రహించగలడు. ద్రోణుడు అటువంటి ఉత్తమ గురువు. అందుకే ఏకలవ్యునిలోనూ ప్రమాదకర ప్రవృత్తిని గమనించాడు. ధనుర్వేదం కేవలం ‘విలువిద్య’ కాదు. అస్త్రవిద్య వేరు, శస్త్రవిద్య వేరు. మంత్రపూరితమైనది అస్త్రవిద్య. ఈ రెండూ కలిసి ధనుర్విద్య. దేశక్షేమంకరమైన ధనుర్వేదం రక్షణ బాధ్యతగల వారి వద్ద మాత్రమే ఉండవలసిన విద్య. అందుకే మొదటే ఆ విద్యను ఏకలవ్యునికి నేర్పడానికి నిరాకరించాడు. అది రాజగురు ధర్మం. పైగా అడవిలో ఏకలవ్యుడు తారసపడడం, ద్రోణుడు బొటనవ్రేలిని అడగడం వెనుక దైవసంకల్పం కూడా ఉంది. ఈ విషయం కర్ణపర్వంలో ఘటోత్కచ వధానంతరం శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా చెప్పారు. రాక్షసాంశతో ఉద్భవించిన పాత్రలలో కంస, జరాసంధ, ఘటోత్కచ, ఏకలవ్యుల పేర్లు చెప్పబడ్డాయి. అందుకే వారు వివిధ విధాలుగా దెబ్బతీయబడ్డారు. రాక్షస భావాలున్న వారి చేతిలో విఙ్ఞానశాస్త్రాలుంటే రణమూ, లోకవినాశనము కలుగుతాయి. పైగా గురు ముఖతః ప్రత్యక్షంగా నేర్వని విద్యలు ప్రమాదకరాలు అని శాస్త్రవచనం. అందుకే పరమాత్మ ప్రేరణ వల్లనే ఉత్తమ చిత్తవృత్తి కలిగిన ద్రోణునకు ఆ సంకల్పం కలిగింది.
ధర్మరక్షణకోసం సుక్షత్రియులకు శిక్షణనిస్తున్న ఆచార్యుడు తనను ఆరాధిస్తున్నాడనే మోహంతో ఒక నిషాదుని (హింసయే వృత్తిగా జీవించే వేటగాడిని) క్షమిస్తే విపత్కర పరిణామాలు ఎదురుకావా!
పాండవాదులను శిష్యులుగా అంగీకరించి విద్య నేర్పుతున్న గురువు ద్రోణుడు. తాను విద్యను నేర్పకపోయినా తనను గురువుగా అంగీకరించిన శిష్యుడు ఏకలవ్యుడు. కేవలం అంగీకరించిన మాత్రం చేతనే ఆ కళంకం ద్రోణునికి వచ్చే ప్రమాదముంది. తరువాత ఏవైనా విపరీత పరిణామాలొస్తే దానికి అతడు బాధ్యుడౌతాడు.
పాండవాదులు తనను పోషిస్తున్నారనే భావంతో ప్రవర్తించలేదు ద్రోణుడు. ఒక ధార్మిక మూర్తిగా వ్యవహరించాడు. ఒక సమిష్టిగతమైన శాశ్వత, ఉన్నత ధార్మిక ప్రయోజనంకోసం ఒక వ్యక్తికి అన్యాయం ‘జరిగినట్లు’ ప్రవర్తించడం అధర్మం కాదు. నిజానికి అది అన్య్తాయమూ కాదు. అదే న్యాయం కూడా.
ఇలా ఎన్నో కోణాలతో కూడుకున్నది ఈ ఘట్టం.
ధర్మ సూక్ష్మాలమయమైన భారత ఇతివృత్తాలను సూక్ష్మదృష్టితో పరిశీలించాలి. ద్రోణుడు వశిష్ఠాదుల వంటి ముని(ఋషి)జీవనం గలవాడు కాదు. కేవలం ఆచార్యుడు. వశిష్ఠుడు ఋషి, ఆచార్యుడు కూడా. ఇరువురికీ భేదముంది. ఏనాడూ గురుధర్మాన్ని అతిక్రమించలేదు ద్రోణుడు.

సంగ్రహణ: బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి Facebook Page నుండి 

Friday, 18 October 2019

వ్యాస మహాభారతం - 34 (S-19)

ఆదిపర్వం- పంచమాశ్వాసము.
సూర్యభగవానుడు వెళ్లిపోయిన తరువాత, ఆ తేజోమూర్తి అయిన పిల్లవాడిని దగ్గర పెట్టుకోలేక, దూరంగా వదలలేక, మానసిక వేదన అనుభవించింది ముక్కుపచ్చలారని కుంతీదేవి. 
ఆమె తనలో, తాను కుమిలిపోతూ, ' దుర్వాసమహర్షి నాకు ఈ మంత్రం యెందుకు ఉపదేశించినట్లు ? ఉపదేశించినా, ఆ మంత్ర ప్రభావం పరీక్షించాలని నాకెందుకు కోరిక కలిగినట్లు ? నేనెందుకు సూర్యుడిని స్మరించినట్లు ? స్మరించానే అనుకో, నాకెందుకు ఈ సద్యోగర్భము ప్రసాదించాలి సూర్యభగవానుడు ? ఈ బాలుడు నావెంటవుంటే, లోకులు అనే సూటిపోటి మాటలకు నేనెలా తట్టుకోగలను ? నన్ను అందరూ దూషించరా ? పోనీ, ఈ పిల్లవాడిని యిలా వదిలివెళదామంటే, చేతులు రావడం లేదు. ' 
అని ఈ విధంగా పరితపిస్తూ, కుంతీదేవి నదీతీరంలో కూర్చుని వుండగా, సూర్యభగవానుని అనుగ్రహంతో పంపబడిన, ఒక పెట్టె నదీ ప్రవాహంలోవచ్చి ఆమె కాళ్ల దగ్గర నిలిచింది. ఆశ్చర్యంగా, కుంతి, ఆపెట్టె తెరచి చూడగా, దాని నిండా అమూల్యమైన రత్నాలు, బంగారం నిండివుండి, బాలుడిని అందులో పెట్టే వీలుగా అమర్చి వున్నది. 
' నాతో యింతవరకు ఆడుకున్న విధి ఈ విధంగా నాకు పరిష్కారం చూపించింది. ' అని తలచి సూర్యభగవానుడికి కుంతి నమస్కరించి, ఆపిల్లవాడిని, ఆ పెట్టెలో వుంచి అమూల్య సంపదతో సహా నీటిలోనికి వదిలింది. ఆ పిల్లవాని భవిష్యత్తు బాగుండాలని, మాతృమూర్తిగా అనేక దేవతలకు మ్రొక్కుకున్నది. 
ఆమె మొర ఆలకించినట్లు, ఆ పెట్టె ప్రవాహంలో కొట్టుకుపోతూ, సూతుడనే రధం నడిపేవృత్తిలోని ఆయనకు దొరికింది. లోపల అమూల్య సంపదతో, అంతకు మించి వైభవంతో ప్రకాశిస్తున్న బాలుని చూసి, సూతుడు యెంతో సంతోషించి, తన భార్య రాధకు ఆ పిల్లవాడినీ, సంపదను ఒప్పజెప్పాడు. ఆ పిల్లవాడిని చేతులోకి తీసుకోగానే, రాధకు స్తన్యం వచ్చింది. దానితో ఆ బాలుడి ఆకలి తీర్చింది. బంగారం, రత్నాలతో దొరికాడు కాబట్టి ఆ పిల్లవానికి వసుషేణుడు అనీ, సహజకవచకుండలాలతో వున్నాడు కాబట్టి కర్ణుడు అనీ, రాధా కుమారుడు కాబట్టి రాధేయుడనీ పేర్లు వచ్చాయి. కర్ణుడు సూత పుత్రునిగానే పెరుగుతున్నాడు. 
అక్కడ హస్తినలో, పాండురాజు, తన పరాక్రమంతో, శత్రువులందరినీ జయిస్తూ, రాజ్యం విస్తరింపజేసాడు. స్వయంవరంలో కుంతీదేవిని వివాహం చేసుకున్నాడు. భీష్ముని అనుమతితో మాద్రిని కూడా వివాహం చేసుకున్నాడు. వివాహానంతరం మళ్లీ పాండురాజు జైత్రయాత్ర ప్రారంభించి, లొంగిపోయిన వారిపై కరుణ చూపిస్తూ, యెదిరించిన వారి పొగరు అణచి, సామంతులుగా చేసుకున్నాడు. వార౦తా అనేకమైన కానుకలు సమర్పించుకుని స్నేహం ప్రకటించారు. ఆవిధంగా కానుకలను తీసుకు వెళ్ళడానికే, నూరు ఏనుగులను వినియోగించవలసి వచ్చింది. 
పాండురాజు ప్రభావం వల్లనే హస్తినకు వైభవము సంతరించు కున్నది. ధృతరాష్ట్ర పాండురాజులు కూడా యెంతో సఖ్యంగా అరమరికలు లేకుండా వుండడము వలన నీ నా భేదం లేకుండా పాండురాజు రాజ్య వ్యవహారాలు చక్కబెట్టేవాడు, అంధుడైన అన్నగారి పేరుమీదుగా. 
దిగ్విజయ యాత్రలో పోగుజేసిన ధనాన్ని, ధృతరాష్ట్రుని అనుమతితో, భీష్మునికి, సత్యవతికి, ఇతరతల్లులకూ, విదురునికీ, మిత్రులకూ, బ్రాహ్మణులకు పంచిపెట్టి, వారి ఆశీర్వచనాలు పొందాడు పాండురాజు. అతనిలోని సద్గుణాలను చూసిన పుర ప్రముఖులంతా, పాండురాజు కూడా, పూరువు, కురు, భరత చక్రవర్తుల సరసన స్థానం సంపాదిస్తాడని అనుకునేవారు. 
ఈ విధంగా రోజులు ఆనందంగా గడుస్తుండగా, విశ్రాంతి కోసమై, అందమైన తన భార్యలు కుంతీ, మాద్రి లను వెంటబెట్టుకుని, హిమాలయాలకు దక్షిణాన వుండే అడవుల లోనికి వెళ్ళాడు పాండురాజు. ఆవిహార సమయంలో, రెండు ఆడఏనుగుల మధ్య మదపుటేనుగు వలే ప్రకాశించాడు పాండురాజు. వారి కావలసిన దినసరి తినుబండారాలు, శృంగార సామాగ్రి మొదలైనవన్నీ, ప్రతి దినం, తమ్ముని సుఖం కోసం, ధృతరాష్టుడు పంపేవాడు. 
అలా వారు ముగ్గురూ విహరిస్తుండగా, ఒకచోట, జింకల జంట శృంగార కలాపంలో వుండగా, వాటిపై అయిదు బాణాలను ఎక్కుపెట్టి ప్రయోగించాడు, పాండురాజు. అప్పుడు కొనవూపిరితో వున్న మగజింక, ' ఓ పరాక్రమశాలీ ! నేను కిందముడనే మునిని. నేనూ నా భార్యా, వినోదార్ధము జింకల రూపం ధరించి సంగమిస్తూ వుండగా, అది చూసికూడా దయలేని వాడవై, మా ప్రాణాలు పోయేటట్లు కొట్టావు, నీ బాణాలతో. ఇది నీకు తగునా ? మేము నీకేమీ అపకారం చేయలేదే ! '
' వేటాడడం, జింకలను చంపడం క్షత్రియలక్షణమే అయినా, పరుగెత్తలేనివి, సంభోగములో వున్నవి, ప్రసవించబోయే మృగాలు, వేటకు నిషిద్ధమని నీకుతెలియదా ? నీకు రాజధర్మాలు తెలిసి కూడా, ఇట్టి అధర్మమైన పని చేసావు. ' అని పాండురాజుతో అన్నాడు. అయితే, పాండురాజు ఏమాత్రం పశ్చాత్తాపం చూపించకుండా, తన తప్పేమీ లేదని, వితండవాదం మొదలుపెట్టాడు. 
దానికి, కిందముడు కోపించి, ' ప్రాణులకు ఇష్టమైన సహజమైన మైధునసుఖాన్ని అనుభవిస్తున్న మమ్ము అకారణంగా కొట్టావు కాబట్టి, నీవుకూడా నీ ప్రియురాండ్లతో కలిసే ప్రయత్నం చెయ్యగానే, మరణిస్తావు. ఇది నా తిరుగులేని శాపం. ' అని చెప్పి ప్రాణాలు విడిచాడు. 
ఈ హఠాత్ పరిణామానికి, పాండురాజు తల్లడిల్లిపోయాడు. తరువాత తెప్పరిల్లి, ' కర్మఫలాలను తపించుకోలేము కదా ! ' అని సర్ది చెప్పుకున్నాడు. ' నేనిక కఠిన తప్పస్సులో వుంటాను. మునివృత్తిని అవలంబిస్తాను. రోజుకు ఒక్క ఫలాన్నే ఆహారంగా స్వీకరిస్తాను. ఇంద్రియాలను నిగ్రహిస్తాను. తాపసజీవితం గడుపుతాను. ' అని నిశ్చయించుకున్నాడు. పాండురాజు ఇద్దరు భార్యలు కూడా వారూ ఆయనతోనే వానప్రస్థానికి వస్తామని వత్తిడి చేసారు. 
వెంటనే వానప్రస్థ జీవితానికి ఏర్పాట్లు చేసుకుని, పాండురాజు తనకు చెందిన సంపదను బ్రాహ్మణులకు పేదలకు, దానం ఇచ్చి, మిగిలినదంతా ధృతరాష్ట్రునికి యిచ్చివేశాడు. 
అహంకార మమకారాలను విడిచిపెట్టి, పాండురాజు తన ఇద్దరు భార్యలతో సహా, ఉత్తరదిక్కుగా ప్రయాణించి, దేవతలు, సిద్ధులకు నిలయమైన గంధమాదన పర్వతాన్ని చేరుకొని, అక్కడనుండి హంసకూటాన్ని కూడా దాటి, మునులు, సిద్ధులు, యక్షులు నివసించే, ఎత్తైన శతశృంగం అనే పర్వత శిఖరం మీద వుండి తీవ్రమైన తపస్సు ప్రారంభించాడు. 
విధి విలాసమంటే ఇదే ! అడుగడుగునా మహాభారత గాథలో మనకు ద్యోతకమయ్యేది అదే ! వారు జీవితంలో సుఖపడిన క్షణాలు తక్కువ. శరీరాన్ని కష్ట పెట్టుకుంటున్న కాలం ఎక్కువ. ఎవరి జీవితాలు ఎలా మలుపులు తిరిగి సుఖదుఃఖాల పరిభ్రమణంలో వుంటాయో చెప్పలేమని, చెప్పేదే పంచమ వేదం, మహాభారతం. 
Source: Gandavarapu Prabhakar Garu
(Facbook)

అతిధి మర్యాద.

ఒకానొక అడవిలో పరమ దుర్మార్గుడైన ఒకవేటగాడు తిరుగుతుండేవాడు. వాడి క్రూరత్వానికి భయపడి, వాడికి స్నేహితులుగానీ చుట్టపక్కాలుగానీ యెవరూ లేకుండా పోయారు. 
ఒకరోజు వాడు అడవిలో వేటాడుతూ, ఒక ఆడపావురాన్ని పట్టి బంధించి, పంజరంలో వుంచాడు. ఉన్నట్లు వుండి, భీభత్సమైన తుఫాను వాతావరణం నెలకొన్నది. ఈదురుగాలులు వీయసాగాయి. అంత కౄరుడైనా ప్రకృతికి భయపడవలసినదేకదా ! వాడు అలాగే భయం భయంగా ఆ పంజరంతో సహా తిరుగుతూ, ఒకపెద్ద వృక్షం క్రిందికి చేరుకున్నాడు. ఆకలి, నీరసం ఆవహించడంతో ఆ వేటగాడు నిస్సహాయంగా, ' ఈ సమీపంలో ఎవరైనా వుంటే నాకు సహాయం చెయ్యగలరా ! నేను చలితో, ఆకలితో బాధపడుతున్నాను. ' అని గట్టిగా పిలిచాడు. 
ఆ చెట్టు మీద ఎప్పటినుండో ఒక పావురాల జంట నివసిస్తున్నది. ఆరోజు ఆడపావురం బయటకు వెళ్లి యింకా తిరిగి రాకపోవడంతో యెంతో ఆతృతగా ఎదురు చూస్తున్నది, మగ పావురం. ఇంతలో, ఈ వేటగాడి అభ్యర్ధన విని అతనితో, ' ఓ వేటగాడా ! నా భార్య యింకా బయటకు వెళ్లి తిరిగి రాలేదు. నాకు ఆందోళనగా వున్నది. నీకు తెలియనిది యేమున్నది ? ఇంటిలో ఇల్లాలు లేకపోతే అంతా సూన్యమే కదా ! నేను నీకు ఏ విధంగా సహాయ పడగలను ! ' అని బాధపడింది. 
అయితే, ఈపావురం ఏ ఆడ పావురం గురించి బాధపడుతున్నదో, దానినే ఆ వేటగాడు పంజరంలో బంధించి వుంచాడు. తన భర్త పలుకులు వినగానే, ఆడ పావురం పంజరం లో నుండి పెద్దగా, ' ఓ చెలికాడా ! నేను ఇక్కడే నీ చెంతనే వున్నాను. కానీ బంధించబడి వున్నాను. నీకు ఈ అతిథికి సేవ చేయవలసిన బాధ్యత వున్నది, ప్రాణాలు ధార పోసి అయినా సరే ! ' అన్నది. 
ఆ మాటలతో మగ పావురం, భార్య బంధింపబడి వున్నా ఆమె స్వరం విన్న సంతోషంతో, అతిధి సేవ జేయడానికి సంకల్పించి, వెంటనే, ఎగురుకుంటూ వెళ్లి, ఎక్కడినుండో ఎండిన కట్టెపుల్లలూ, ఆకులూ తెచ్చి, మంటచేసి, వేటగానికి చలి కాచుకునే యేర్పాటు చేసింది. వాడు కొద్దిగా తెప్పరిల్లాగానే, ' ఆకలి ఆకలి ' అంటూ అరవసాగాడు. వాడి క్షుద్బాధను తీర్చడానికి, ఆమగ పావురం, అడపావురం పంజరంలో నుండి చూస్తూ వుండగానే, వేటగాడి కళ్ళముందే, అగ్ని చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి, అగ్నిలో దూకి ప్రాణాలు విడిచింది. ఆ వేటగాడి ఆహారంగా మారిపోయింది. 
ఈ హఠాత్ పరిణామం, వేటగాడిని దిగ్భ్రాంతికి గురి చేసింది. గుడ్లప్పగించి అలా చూస్తూ వుండిపోయాడు. ఆ పావురం చేసిన త్యాగానికి తట్టుకోలేక పోయాడు. వైరాగ్యదశకు చేరుకున్నాడు. తాను ఇన్నిరోజులూ చేసిన క్రూరమైన పనులు జ్ఞప్తికి వచ్చాయి. ' ఇక జీవితంలో తుచ్చమైన సుఖాల కోసం ఇతరులను కష్టపెట్ట కూడదు. ' అని నిర్ణయించుకున్నాడు. వెంటనే తన వద్దవున్న పంజరంలోనుండి ఆడపావురాన్నీ విడుదల చేసి, కుప్పకూలిపోయాడు. 
ఆడపావురం, విడుదల అయినా, భర్త మంటలో దహనమైన చోటే తిరుగుతూ, కన్నీరుమున్నీరుగా విలపించి, ఆ మహోన్నత త్యాగాన్ని ప్రశంసించి, తనుకూడా భర్త తో పాటు అగ్నికి ఆహుతి అయింది. ఆ పావురాల జంట ఆ విధంగా దైవత్వం పొంది తమ జీవితాలను సార్ధక పరుచుకున్నాయి. 
ఈ సంఘటన కూడా చూసిన ఆ వేటగాడికి మరింత బాధ కలిగింది. అప్పటినుండి అడవిలోనే విరాగిలా తిరుగుతూ, ఒకనాడు అడవిలో పెద్దమంటలు రేగుతుండగా, ఆఅగ్నిలోకి నిశ్చలంగా నడుచుకుంటూ వెళ్లి ఆహుతి అయినాడు. తాను చేసిన దుష్ట కార్యాలకు ఆ విధంగా తానే శిక్ష విధించుకున్నాడు. 
చూసారా ! తన భార్యని బంధించాడని తెలిసికూడా, భార్య చేసిన హితబోధతో, శత్రువుకి సహాయం చేసి ఆత్మార్పణ గావించుకున్న మగ పావురము, దాని మార్గాన్నే అనుసరించిన ఆడ పావురం, ఒక క్రూరుడి జీవితాన్ని మలుపుతిప్పాయి. అతని జీవన సరళిని మార్చివేసాయి. లోకానికే ఆదర్శంగా నిలిచాయి.
Source: Gandavarapu Prabhakar Garu
(Facbook)

వధువుకు తగిన వరుడు.

గంగానదీ తీరంలో ఒకచోట చాలా అందమైన ఆశ్రమం ఒకటి వుండేది. అందులో నిష్టాగరిష్టులైన బ్రహ్మచారులు, గృహస్థాశ్రమంలో వున్న మునిదంపతులు, సన్యాసులు, వేరు వేరు కుటీరాలలో వుంటూ, సదా దైవధ్యానంలో యోగాభ్యాసాలతో వుండేవారు. 
వారిలో యాజ్ఞ్యవల్కుడు అనే గృహస్తు, వుండేవాడు. అయన ఒకరోజు గంగానదిలో పవిత్రస్నానం చేస్తూ, అర్ఘ్యం యిస్తుండగా, ఆయన దోసిలి లోనికి చిన్న ఎలుకపిల్ల వచ్చింది. దానిని చూడగానే, గగుర్పాటుతో ప్రక్కనేవున్న లేతఆకుతో దానిని తప్పించి, ఆకులోనే వుంచి, దానిని తగిలిన దోష నివారణార్ధం మళ్ళీ స్నానం చేసి బయటకు వచ్చాడు. 
అయితే, ఆశ్చర్యకరంగా, ఆ యెలుకపిల్ల ఆకులో అలానే వుండి, యాజ్ఞ్యవల్కుని వైపు ప్రేమగా చూడసాగింది. దానిచూపులకు కరిగిపోయి, ఆయన, తనకు వున్న మంత్రబలంతో, ఆ ఎలుకపిల్లను చక్కని చిన్న పిల్లగా మార్చివేసాడు. ఆ చిన్నపిల్లను తన ఆశ్రమానికి తీసుకువెళ్లి, తన భార్యకు జరిగినదంతా చెప్పి, జాగ్రత్తగా పెంచమని అప్పజెప్పాడు. వాళ్లకు సంతానం లేనందున, ఆ భార్యాభర్తలు ఇద్దరూ చిన్నపిల్లను దైవమిచ్చిన సంతానంగా, అల్లారు ముద్దుగా పెంచసాగారు. 
ఇలావుండగా, ఆ మునిభార్య తమ పెంపుడు కుమార్తెకు యుక్తవయసు వచ్చిందని గ్రహించి, వివాహ సంబంధాలు చూడమని తన భర్తకు చెప్పింది. యాజ్ఞ్యవల్కుడు కూడా అది తన బాధ్యతగా భావించి, ఆమెకు తగిన చక్కని వరుడిని వెదుక ప్రారంభించాడు. ' తనకు ఆ కుమార్తె దైవికంగా సంప్రాప్టించింది కాబట్టి, దేవతలకు యిచ్చి వివాహం చేస్తే బాగుంటుంది. ' అనే ఆలోచన కూడా చేసాడు. 
ఏ తండ్రి అయినా, తమ కుమార్తెలను, మంచి కుటుంబంలో, మంచి నడవడిక వున్న , భార్యను పోషించుకునే స్తొమత వున్న, చదువూ సంస్కారం వున్న ఆరోగ్యవంతునికి యిచ్చి వివాహం చేద్దామనుకోవడం లో తప్పులేదు కదా ! అందుకనే, యాజ్ఞ్యవల్కుడు సరాసరి సూర్యదేవుని తమ అల్లుడిగా చేసుకోవాలనే కోరికతో, సూర్యుని ప్రసన్నం చేసుకుని, తనను పిలిచిన కారణం సూర్యుడు అడుగగా, ' ఈమె నాకుమార్తె. ఈమెకు అంగీకారం అయితే, దయచేసి, నీవు ఈమెను వివాహం చేసుకోవలసినది. ' అని అర్ధించాడు. 
ఈలోగా, తన కుమార్తె సమ్మతి కోసం అడుగగా, ఆమె, ' సూర్య దేవుడు తాపం ఎక్కువగా ప్రదర్శిస్తుంటాడు. నేను ఆయనను వివాహం చేసుకోలేను తండ్రీ ! ' అని చెప్పింది. వెంటనే ఆ ముని, సూర్యుడినే, ఆయనకంటే అధికులెవరైనా వుంటే మా అమ్మాయికి వరుడిగా చెప్పమని ప్రాధేయపడ్డాడు. ఇది అంతా విచిత్రం గా తోచిన సూర్యుడికి, వెంటనే, ' మేఘాలు నాకంటే అధికమైనవి. అవి వస్తే, నా ఉనికే ప్రజలకు కనబడదు. కాబట్టి మేఘుడికి యిచ్చి మీ అమ్మాయి వివాహము చెయ్యి. ' అని చెప్పి వెళ్ళిపోయాడు. 
మేఘుడిని అడగబోయేముందు, ఒక్కమాట అడుగుదామని, ఆ అమ్మాయిని, ' అమ్మా ! నీకు మేఘుడిని చేసుకోవడం ఇష్టమేనా ? ' అని లాలనగా అడిగాడు. దానికి ఆ కన్య, ' వద్దు నాన్నా ! మేఘుడు నల్లగా చల్లగా ఉంటాడు. ' అని చెప్పింది.. మేఘుడుకూడా, ' వాయువు నాకంటే అధికుడు, అతడు గట్టిగా వీస్తే నేను దూదిపింజలాగా ఎగిరిపోతాను, నీకు తెలుసు కదా ! ' అని మునితో అన్నాడు. అయితే, వాయుదేవుడు కూడా ఆ బాలామణికి నచ్చలేదు. ' ఎప్పుడూ, రకరకాలుగా వీస్తూ వుంటాడు. నాకు అతనిని చేసుకోవాలని లేదు, ఇంకెవరినైనా మంచివాడిని చూడు. ' అని తండ్రితో చెప్పింది. 
ఇక ఏమిచేయలో పాలుపోక, ముని వాయుదేవుడినే ' నీకంటే శక్తిమంతుడు ఎవరైనా వుంటే చెప్పు. ' అని అడిగాడు. దానికి వాయుదేవుడు, ' పర్వతరాజు నాకంటే శక్తిమంతుడు. ఎందుకంటే, నేనెంత శక్తితో వీచినా ఇసుమంతైనా చలించడు. ' అని సలహా ఇచ్చాడు. దానికి కూడా, ఆ అమ్మాయి, ' పర్వత రాజు కఠినంగా వుంటాడు, ఎక్కడకూ నన్ను తిప్పలేడు. కాబట్టి అతడిని నేను వివాహమాడలేను తండ్రీ ! ' అని చెప్పింది. ఇది కూడా పితృహృదయానికి సబబుగానే అనిపించి, ' పర్వతరాజా, నీకన్నా శక్తిమంతుడు, నాకుమార్తెకు తగిన వరుడిగా అనిపిస్తే చెప్పవా ! ' అని అడిగాడు. 
దానికి పర్వతరాజు, ' నాకంటే మూషికరాజు యెంతో శక్తిమంతుడు. నా శరీరం నిండా బొరియలు చేస్తూ సన్ను చాలా ఇబ్బంది పెడుతూ వుంటాడు. నీ కుమార్తెను ఆ మూషికరాజుకు యిచ్చి వివాహం చెయ్యి. ' అని చక్కని సూచన చేసాడు. 
వెంటనే ముని, మూషికరాజును ఆహ్వానించి, అతనిని వివాహం చేసుకునే విషయంలో ఆమె, అభిప్రాయం చెప్పమన్నాడు. ఆశ్చర్యకరంగా, మూషికరాజును చూడగానే, ఆ కన్య శరీరమంతా పులకించి, ' తండ్రీ ! ఈ మూషికరాజు నాకు తగిన వరుడు. తక్షణమే నన్ను అతనికి యిచ్చి వివాహం జరిపించండి. ' అని ప్రార్ధించింది. అంతేకాకుండా, తనను కూడా మూషికంగా మార్చమని వేడుకున్నది. 
వెంటనే తన మంత్రబలంతో మళ్ళీ యాజ్ఞ్యవల్కుడు, ఆ కన్యను మూషికంగా చేసి మూషికరాజుతో పరిణయం గావించాడు. 
చూసాము కదా ! సూర్యుని మొదలుకుని,పర్వతరాజు దాకా ఆమెకు ఎవరూ నచ్చలేదు. వారిలో ఏదో ఒక వంక చూసింది. కానీ తన జన్మ సంబంధమైన మూషికరాజు కనబడగానే, తన సమ్మతి తెలియజేసింది. అలాగే, పుట్టుకతో వచ్చిన వాసనలను వదిలిపెట్టడం అంత తేలికగా జరిగే పనికాదని చెప్పే కథయిది.
Source: Gandavarapu Prabhakar Garu
(Facbook)

వ్యాస మహాభారతం - 33 (S-18)

ఆదిపర్వం. చతుర్దాశ్వాసం.
సౌతి శౌనకాది మహామునులకు చెబుతున్నాడు.
మాండవ్యముని కోపించి, కంపిస్తున్న కంఠంతో, యమధర్మరాజుతో, ' యమా ! పధ్నాలుగు సంవత్సరాలు వచ్చేవరకు ఏ వ్యక్తిని అయినా బాలుడు అనే అంటారు. అప్పటివరకు ఆ బాలుడు చేసిన నేరాలకు అతనిని శిక్షించకూడదని ధర్మ శాస్త్రాలు చెబుతున్నాయి కదా ! అటువంటి బాలునికి నేరం ఆపాదించి శిక్షించే వారే నేరస్తులు అవుతారు. నీవు ఈ ధర్మాన్ని విస్మరించి పాపం చేసావు. కాబట్టి మువ్వు భూలోకంలో శూద్రవనితకు జన్మించు. ' అని శాపం ఇచ్చాడు. 
అందువల్లనే విదురుడుగా యమధర్మరాజు పుట్టవలసి వచ్చింది. ' అని జనమేజయునకు వైశంపాయనుడు చెప్పాడు. 
ఆదిపర్వం చతుర్దాశ్వాసం సమాప్తం. 
ఆదిపర్వం- పంచమాశ్వాసము ప్రారంభం. 
ఇక ధృతరాష్ట్రుడు, పాండురాజుల విషయానికి వస్తే, వారు రాజవిద్యలన్నింటిలో ఆరితేరారు. బీష్ముడి పాలనలో కురు రాజ్యం లో ధర్మం చక్కగా పరిరక్షించ బడుతున్నది. ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయి. వర్షాలు సకాలంలో కురుస్తున్నాయి. పంటలు సమృద్ధిగా పండుతున్నాయి. వృక్షసంపద, గోసంపద వృద్ధి అవుతున్నది. శిశుమరణాలు తగ్గాయి. 
ఇలా దేశం సుభిక్షంగా వున్న సమయంలో, భీష్ముడు ధృతరాష్ట్రునికి వివాహం చేయ సంకల్పించి, గాంధార రాజైన సుబలుని కుమార్తె గాంధారీ దేవి, అందమైనదనీ, ఆమె జాతకంలో, నూరుగురు పుత్రులు, ఒకకుమార్తె కలిగే సంతానయోగం వున్నదని తెలుసుకుని, ఆవిషయం విదురునితో చెప్పాడు. విదురుడు కూడా ' ఈ ఆలోచన యెంతో బాగున్నది. ' అని అన్నాడు. 
సుబలుడు, తనకుమార్తె కురువంశ పట్టమహిషిగా స్థానం సంపాదిస్తుందని, అంధుడైనా ధృతరాష్ట్రునికి గాంధారిని యివ్వడానికి సమ్మతించాడు. గాంధారి కూడా, బంధువుల యెగతాళి మాటలు భరించలేక, రోషంగా, తాను కూడా చూపును త్యాగం చేసి, భర్తతో పాటు అంధత్వం స్వీకరిస్తానని, ప్రతిజ్ఞ చేసింది. కళ్ళకు గంతలు కట్టుకున్నది. 
వివాహం అయిన తరువాత, శకుని, గాంధారి సోదరుడు అనేక విలువైన బహుమతులను పట్టుకుని గాంధారితో సహా హస్తినాపురానికి వచ్చాడు. 
ధృతరాష్ట్రుడు గాంధారితో పాటు ఆమె చెల్లెళ్ళు పదిమందిని కూడా వివాహం చేసుకున్నాడు. ఈపదిమందినే కాకుండా, మరో నూరుగురు కన్యలను భీష్ముడు ఎంపిక చెయ్యగా, వారిని కూడా ధృతరాష్ట్రుడు వివాహమాడాడు. మొత్తం కలిపి అంధుడైన ధృతరాష్ట్రునికి నూట పదకొండుమంది భార్యలైనారు, గాంధారితో సహా. 
ఇప్పుడు పాండురాజు సంగతి చూద్దాం. పాండురాజు వేదవేదాంగాలన్నీ అభ్యసించి, క్షత్రియ విద్యలు కూడా నేర్చుకుని, అన్నింటిలో అసమాన శూరుడయ్యాడు. అతనికి కూడా వివాహం చెయ్యాలని భీష్ముడు సంకల్పించి, విదురునితో తగిన వధువు గురించి ఆలోచనలు చేసాడు. 
యాదవవంశ మహారాజు అయిన శూరుడు అనే ఆయన పెద్దకుమార్తె పృధ. అయితే, శూరుని మేనబావ అయిన కుంతిభోజునికి సంతానం లేకపోవడంతో పృధను ఆయనకు దత్తతగా ఇచ్చాడు. పృధ కూడా కుంతిభోజుని స్వంతతండ్రిలాగానే చూసుకునేది. అప్పటినుండి ఆమె కుంతీదేవిగా పిలువబడసాగింది.
ఇంటికి వచ్చిన అతిధుల ఆలనా పాలనా అంతా ఆమే చూసుకునేది. వారిని యెంతో మర్యాదగా ఆహ్వానించి పూజలు జరిపి, వారికి కావలసినవి అన్నీ సమకూర్చేది. ఆ సమయంలో ఒకరోజు దుర్వాస మహాముని, అతిధిగా కుంతిభోజుని రాజ్యానికి రాగా, కుంతి ఆయనకు దగ్గరగా వుండి విశేష పూజలు జరిపి, ఆయన అభిమానం చూరగొన్నది. దుర్వాసుడు యెంతో సంతోషించి, ఆమె సేవలకు ప్రతిఫలంగా ఆమె అడగకుండానే, ఒక మంత్రం ఉపదేశించి, ' ఓ కన్యామణీ ! ఈ మంత్రం స్మరించి నీవు ఏ దేవతను ఆహ్వానిస్తావో, ఆదేవత ప్రత్యక్షమై, నీకు అప్పటికప్పుడు ఒకపుత్రుడిని ప్రసాదిస్తాడు. ఇది నీ భావి జీవితానికి యెంతో ఉపయోగపడుతుంది. ' అని చెప్పి వెళ్ళిపోయాడు. 
అయితే, ఒకరోజున కుంతీదేవి గంగానదీ స్నానానికి వెళ్లి, బాల్యచేష్టగా, దుర్వాసుని మంత్రమహిమ పరీక్షించాలనే కోరికతో, యెదురుగా కనబడుతున్న కర్మసాక్షి సూర్యభగవానుని ముందు నిలబడి, ఆ మంత్రం పఠించింది. ' నాకు నీలాంటి తేజోవంతుడైన కుమారుడిని ప్రసాదించు. ' అని ప్రార్ధించింది. 
వెంటనే సూర్యభగవానుడు ప్రత్యక్షమై. ఎదుట నిలవగానే, ఆమె భయపడిపోయింది. ఆమెకు అభయమిస్తూ, ' బాలికా ! నేను నీకు కుమారుడిని ప్రసాదించడానికి వచ్చాను. దీనివలన నీ కన్యత్వానికి ఏమీ భంగము వాటిల్లదు. ' అన్నాడు. ఆమె అనేకవిధాల బ్రతిమాలి తిరిగిపొమ్మని చెప్పింది. తన అజ్ఞానానికి మన్నించమన్నది. సహజమైన ఉబలాటంతో చేసిన బాల్యచేష్టగా పరిగణించి, తన తప్పును కాయమన్నది. నేను తల్లినైతే లోకం నవ్వదా ? ' అని వణికిపోయింది.
కానీ, సూర్యభగవానుడు, తాను వచ్చిన తరువాత వెనుకకు వెళితే, మంత్రాన్ని, మంతం ప్రసాదించిన మహర్షిని కించపరచినట్లు అవుతుందని, ఆమె మీద దయతో, ' నీకు పుట్టే కుమారుడు సద్యోగర్భంలో పుడతాడు. దీనివలన నీ కన్యత్వానికి ఎట్టి దోషం కలుగదు. ' అని చెప్పి ఆమెకు ఒకపుత్రుని ప్రసాదించాడు. ఆ బాలుడు సహజ కవచకుండలతో పుట్టి సూర్యబింబ౦ లాగా మెరిసిపోతున్నాడు.
సూర్యభగవానుడు వెళ్లిపోయిన తరువాత, ఆ తేజోమూర్తిని దగ్గర పెట్టుకోలేక, దూరంగా వదలలేక మానసిక వేదన అనుభవించింది ముక్కుపచ్చలారని కుంతీదేవి. ఆమె తనలో, తాను కుమిలిపోతూ ఏదో అనుకుంటున్నది. 
Source: Gandavarapu Prabhakar Garu
(Facbook)

నక్కజిత్తులు.

అవతలి వాళ్లకు భయపడినట్లు నటిస్తూ, భయపెట్టేచోట భయపెడుతూ, బ్రతిమిలాడవలసిన చోట హుందాగా బ్రతిమిలాడుతూ, తమపనిని సక్రమంగా నడిపించుకోవడానికి, నానారకాలుగా మాట్లాడుతూ పబ్బం గడుపుకునే వాళ్ళని మనం చూస్తూ ఉంటాము. అలాంటి నక్క చేసే జిత్తులని ఈ కధలో చూద్దాం. 
ఒక కీకారణ్యంలో, మహాచతురకుడు అనే నక్క వుండేది. 
అది ఒకరోజు, అడవిలో పోతూవుండగా, చనిపోయి పడివున్న పెద్దఏనుగును చూసింది. వెంటనే దానికి ఏనుగు మాంసం తినాలనే వూహరాగానే, నోరు వూరింది. చెంగున గెంతి, ఆ యేనుగుమీద పడి గోళ్ళతో దాని పైచర్మాన్ని చీల్చాలని ప్రయత్నించింది. అయితే ఏనుగు చర్మం మందం గా వుండడం వలన, దాని గోళ్ళతో దానికి ఏనుగు చర్మం చీల్చడం సాధ్యం కాలేదు. ' ఏదైనా పెద్దజంతువు వస్తుందేమో, దాని సహాయంతో ఈ ఏనుగు మాంసం ఆరగించాలి. ' అని నక్క అనుకున్నది. 
ఇంతలో అటుగా మృగరాజు సింహం వచ్చింది. దానిని చూడగానే, వినయంగా నక్క, ముందరి కాళ్ళు రెండూ నేలమీద ముందుకు చాచి, అభివాదం చేస్తూ, ' ప్రభూ ! తమకోసమే ఈ ఏనుగు కళేబరానికి కాపలా కాస్తున్నాను. తమరు వచ్చారు. నాకు సంతోషంగా వున్నది. మీరు ఈ ఏనుగు మాంసం ఆరగించండి. తాము తిన్న తరువాత మిగిలినది, ఈ భృత్యుడు తింటాడు. ' అని అతివినయంగా సింహం తో చెప్పింది. 
మృగరాజు నక్క మాటలకు సంతోషించి, ' నాగురించి నువ్వు ఆలోచించినందుకు ధన్యవాదాలు. అయితే, ఎవరో చంపిన జంతువును నేనుతినను అని నీకు తెలుసుకదా ! నీవే దీనిని బహుమతిగా నావద్దనుండి తీసుకో ! విందారగించు. ' అని చెప్పగా, నక్క ' ధర్మ ప్రభువులు. ' అని పొగిడి దానిని పంపివేసింది. 
ఇంకొద్ది సేపటికి, చిరుత ఒకటి అటుగా వచ్చింది. ' దానిని ఎలా వెళ్ళగొట్టాలా ' అని ఆలోచిస్తూ నక్క, ' వినయంతో సింహాన్ని పంపించాను, దీనికి ఏవిధమైన లంచం యిచ్చి పంపలేను. ఏదైనా కుటిలోపాయంతో, ఈ చిరుతను పంపించివేయాలి. ఎన్ని సుగుణాలు వున్న ధైర్యవంతుడినైనా, కుటిలత్వంతో జయించవచ్చు. ' అని మనసులో అనుకుని, లేని ధైర్యం నటిస్తూ, ' మామా ! ఇదిగో చూడు ! ఈ ఏనుగును మృగరాజు చంపి స్నానం చెయ్యడానికి వెళ్ళింది. దాని కోసం నేను ఇక్కడ కాపలాగా వున్నాను. ఎందుకు అనవసరంగా మృత్యువును కొనిదెచ్చుకుంటావు ? వెళ్లే ముందు నన్ను కాపలాగా వుంచి ఏదైనా చిరుతపులి వస్తే తనకు కబురు చెయ్యమని చెప్పింది. తాను వచ్చి ఈఅడవిలో యెక్కడా చిరుతపులి అనేది లేకుండా చేస్తానని చెప్పింది. ' అని లేనిపోనివి కలిపించి చెప్పింది. 
నక్క మాటలకు చిరుత భయపడి, ' అల్లుడా ! నన్నూమాజాతినీ రక్షించు. నేను ఇటు వచ్చినట్లు చెప్పబోకు. ' అని బ్రతిమిలాడి అక్కడినుంచి పరుగు చిత్తగించింది. ' అమ్మయ్య ' అని, నక్క, ఊపిరి పీల్చుకుంటుండగా, పెద్దపులి అటుగా వచ్చింది. వెంటనే వేగంగా నక్క బుర్ర పని చేయసాగింది. ' ఇలా నేను ఎంతమంది నుండి, ఈ ఏనుగు మాంసాన్ని కాపాడగలను ? ఒక పనిచేస్తాను. దీనికోరలు చాలా వాడి అయినవి కదా ! దీని చేత ఏనుగు చర్మాన్ని వలిపించే ఏర్పాటు చేసుకుంటాను. ' అని అనుకున్నది. 
అనుకున్నదే తడవుగా, ' అల్లుడూ ! పులిరాజా ! ఏమిటి ఈమధ్య యెక్కడా కనబడడం లేదు. చూస్తుంటే చాలా ఆకలిగా వున్నట్లున్నావు. నువ్వు నా అతిధివి అనుకో ! ఒకసింహము ఈ ఏనుగును చంపి నన్ను కాపలాగా పెట్టింది. అయినా నువ్వు నాకు కావలసిన వాడివి కదా. నీకు కావలసినంత ఆరగించు. భయపడవద్దు. నేను దూరంగా వుండి చూస్తుంటాను. సింహం వస్తుండగా నీకు సంకేతం ఇస్తాను. తిన్నంత తిని పారిపో ! ' అని చెప్పింది. 
పెద్దపులి భయపడుతూనే, ఏనుగు వద్దకువెళ్లి, దాని చర్మాన్ని క్షణాలలో చీల్చి మాంసం తినసాగింది. ఇదంతా దూరంగా గమనిస్తున్న నక్క, పెద్దపులి ఎక్కువ మాంసం తినడానికి అవకాశం ఇవ్వకుండా, ' అల్లుడూ ! త్వరగా పారిపో . సింహం వచ్చేస్తున్నది. ' అని గట్టిగా కేకపెట్టింది. అది వినగానే, పులి కాలికి బుద్ధి చెప్పింది. 
ఇక, ' అమ్మయ్య ఈ మాంసమంతా నేనే తినవచ్చు. ' అని ఆనందంగా ఏనుగుపైకి నక్క ఎగబాకుతుండగా, ఎక్కడినుంచో, వేరొక నక్క వచ్చింది, పోటీగా తినడానికి. ఆ వచ్చింది నక్క అయినా, తన జాతి వాడైనా, దానిని ఎదిరించే సత్తా వుండడం వలన, దానికి పిసరంత అయినా విందు దొరకకుండా, తరిమి తరిమి కొట్టింది. 
ఆ విధంగా ఏనుగు మాంసాన్ని తాను ఒక్కతే, ఎన్నో రోజులు ఆనందంగా ఆరగించింది. 
చూసారా ! అవే నక్కజిత్తులంటే. తగ్గివుండవలసినచోట తగ్గివుండి, సహాయం పొందవలసినచోట లౌక్యంగా సహాయం పొంది, సహాయం చేసినవాడికి కృతజ్ఞత చూపించకుండా, తాను భయపడవలసిన అవసరం లేని చోట వీరత్వం చూపించి, తన పని నెగ్గించుకుంది మహాచతురకుడు అనే నక్క. 
ఈ రోజుల్లో లౌక్యం అనే ముసుగులో, ఇవేతెలివితేటలు అనే పరిభాషలో, యిలాంటి మోసాలు చేసేవాళ్ళు చాలామంది వుంటారు. తస్మాత్ జాగ్రత్త !
Source: Gandavarapu Prabhakar Garu
(Facbook)

వ్యాస మహాభారతం - 32 (S-17)

ఆదిపర్వం. చతుర్దాశ్వాసం.
సౌతి శౌనకాది మహామునులకు చెబుతున్నాడు.
సత్యవతీదేవి, చెప్పవలసిన మాటలు అంబికకు కూడా చెప్పి, ఆమెను మానసికంగా తయారుచేసి, వ్యాసుని, ఋతుమతియైన అంబిక వద్దకు వెళ్ళమని కోరింది.
అయితే, విధి సంకల్పం వేరేవిధంగా వుంటే, అందమైన సౌందర్యరాశి అయిన అంబికకు, సత్యవతి మాటలు యెలా రుచిస్తాయి ? వ్యాసుని పొడవైన తెల్లటి గడ్డం, మునివేషంలో నల్లగా ఆజానుబాహువుగా వున్న ఆయన రూపం, ఆమెకు జుగుప్సాకరంగా కనిపించింది. అంతే అసహ్యంతో కన్నులు మూసుకుని, వ్యాసుని వద్ద గడిపింది. అది వ్యాసుడు గ్రహించి, ఆమెను అనుగ్రహిస్తూ, ' చక్కటి దేహదారుధ్యం వున్న పిల్లవాడు పుడతాడు కానీ, ఆమె కనులు మూసుకుని అసహ్యం చూపించిన కారణంగా, అంధుడుగా ఆ పిల్లవాడు పుడతాడు. ' అని చెప్పాడు. తాను చేయగలిగినది ఏమీలేక నిట్టూర్చాడు. 
ఆ మాటలు విన్న సత్యవతి, అంబాలికకు కూడా ఒక పుత్రుని ప్రసాదించమని వేడుకున్నది. అయితే ఆమెకూడా తాను ఊహించిన విధంగా వ్యాసభగవానుని రూపం లేకపోవడంతో తెల్లబోయి, తన శరీరం అంతా పాలిపోయినట్లు అగుపించింది. అన్యమనస్కంగా గడిపింది. వ్యాసుడు, ఆమెకు కూడా కుమారుడిని ప్రసాదించి, ' ఆ పిల్లవాడు కూడా దేహబలం, పౌరుషం, సద్గుణాలు కలవాడు అవుతాడు గానీ, అతడు పాండువర్ణంలో జన్మిస్తాడని చెప్పాడు. 
వ్యాసభగవానుడు చెప్పినట్లే అంబికకు పుట్టిన బాలుడు అమిత బలసంపన్నుడుగా పుట్టాడు. అంధుడైనా బుద్దితో చూడగల నేర్పును సంపాదించాడు. అతనే ధృతరాష్ట్ర నామధేయంతో, ఉత్తరోత్తరా, కురుసింహాసనం అధిష్టించాడు. అదేవిధంగా అంబాలికకు పాలిపోయిన, తెల్లనివర్ణంతో పాండురాజు జన్మించాడు. అతడు సద్గుణాల రాసి. పరాక్రమ వంతుడు. కురుసామ్రాజ్య రక్షణకు నిలబడే సామర్ధ్యం పొందినవాడు. బ్రాహ్మణులచేత, వీరిరువురకూ, జాతకర్మలు చేయించాడు యధావిధిగా భీష్ముడు. 
ఈ ఇద్దరు వంశోద్ధారకులూ ఈ విధమైన అవలక్షణాలతో పుట్టగా, అసంతృప్తితో సత్యవతీదేవి, మళ్ళీ వ్యాసుల వారిని స్మరించుకుని, ప్రత్యక్షమవగానే, ' అంబికకు మరియొక పుతృడిని ప్రసాదించు నాయనా ! ' అని బ్రతిమిలాడింది. దానికి వ్యాసులవారు, ' ఆమెకు నిగ్రహం కలిగిన మనస్సు వుంటే, సుపుత్రోదయం అవుతుంది. ' అని చెప్పారు. 
ఈసారికూడా అంబిక వ్యాసుని వికృతరూపం తలుచుకుని భయపడి, తనవద్ద వున్న దాసీని తనలాగా అలంకరించి, వ్యాసులవారి వద్దకు పంపింది. ఆ విధంగా వ్యాసుని వద్దకు వెళ్లిన ఆ దాసి, ఏ విధమైన తొట్రుపాటు పడకుండా, మునీశ్వరునికి భక్తితో పూజలు చేసింది. ఆమె చేసిన సేవకు సంతోషించి, వ్యాసభగవానుడు, ఆమె అంబిక కాదని తెలిసికూడా పుత్రుని ప్రసాదించారు. ఆయనే, మాండూక్యముని శాపఫలంగా యముని అంశతో, వేదవ్యాసుని ద్వారా విదురుడు గా అవతరించాడు. విదురుడు సకల శాస్త్ర నిష్ణాతునిగా, అమిత పరాక్రమవంతునిగా మహాభారత గాధకు అనేక చోట్ల ఆయువుపట్టుగా నిలిచాడు. 
విదురుని పుట్టుక గురించి విన్న జనమేజయుడు, వైశంపాయనునితో, ' మహర్షీ ! సమవర్తి అయిన అందరకూ నియమాలు వర్తింపజేసే, యమధర్మరాజుకు, భూమిమీద పుట్టవలసిన అవసరం ఏమి వచ్చింది ? ' ఆ విషయం గురించి చెప్పండి మహానుభావా ! ' అని వినయంగా అడిగాడు. 
వైశంపాయనుడు చెప్పసాగాడు : పూర్వం మాండవ్యుడనే మహర్షి అన్ని పుణ్యకార్యాలూ ఆచరించి అడవిలో ఒక పర్ణశాల నిర్మించుకుని, నిగ్రహంతో, తపస్సు చేసుకుంటున్నాడు. ఒకరోజు కొందరు దొంగలు, రాజుగారి సొమ్ము అపహరించి, రక్షకభటులు తరుముతుండగా, దిక్కుతోచక, మహర్షి పర్ణశాలలో ప్రవేశించారు. రక్షకభటులు అక్కడ కూడా వెదుకుతూ, దొంగలనూ, వారు కొల్లగొట్టిన ధనాన్ని తీసుకు వెళుతూ, వారితోపాటు మాండవ్యమహర్షిని కూడా దొంగలతో సంబంధం వున్నవాడిగా భ్రమించి, రాజుగారి వద్దకు తీసుకువెళ్లారు. 
రాజు దొంగలకు మరణశిక్ష విధించి, మాండవ్యుని మాత్రం, ఒక శూలానికి అతడి శరీరాన్ని గ్రుచ్చి ఆహారపానీయాలు లేకుండా వుంచమని ఆజ్ఞాపించాడు. ఆతరువాత కొంత కాలానికి, మాండవ్యుడు గొప్ప మహర్షి అని తెలుసుకుని, ఆయనకు విధించిన శిక్షనుండి తప్పించాడు, మహారాజు. అయితే, ఆయనను వ్రేలాడదీసిన శూలంలో కొంతభాగం ఆయనతో ఉండిపోయి, అయన ' అణి మాండవ్యుడు ' అని పిలువబడ సాగాడు. 
అయన, తనకు జరిగిన అవమానాన్ని దిగమింగుకుంటూ, నిత్యం జపతపాదులు చేసుకుంటూ, ముల్లోకాలు తిరుగుతుండేవాడు. ఆవిధంగా సంచరిస్తున్న సమయంలో యమధర్మరాజును చూడడం తటస్థించింది మాండవ్య మహర్షి. అప్పుడు ఆయన యముడిని, ' యమధర్మరాజా ! నాకు ఆరాజు చేత ఎందుకు అంత క్రూరమైన శిక్ష నా తప్పు ఏమీ లేకపోయినా విధింపజేసావు ? ఇది నీకున్యాయమా ! ' అని వేదనగా అడిగాడు. దానికి సమాధానంగా యముడు, ' నీవు చిన్నప్పుడు తూనీగలు వంటి అమాయక ప్రాణులను పట్టుకుని మేకుకు గ్రుచ్చి, అవి యెగరలేక పోతుంటే చూసి, ఆనందించేవాడివి. అందువలననే,నీకు ఈ శిక్ష ఈ జన్మలోనే విధించడం జరిగింది. ' అని చెప్పాడు. 
దానికి మాండవ్యముని కోపించి, కంపిస్తున్న కంఠంతో, యమధర్మరాజుతో యేదో అంటున్నాడు.
Source: Gandavarapu Prabhakar Garu
(Facbook)

చెట్టు చెప్పిన సాక్ష్యం.

ఒకానొక గ్రామంలో ధర్మబుద్ధి, పాపబుద్ధి అనే స్నేహితులు యిద్దరు వుండేవారు. వారి గుణాలుకూడా పేరుకు తగినట్లు వుండేవి. ధర్మబుద్ధి పాపబుద్ధితో స్నేహం చేస్తుంటే, ఊరిలోని వారంతా, ' ఎప్పుడో, ధర్మబుద్ధిని పాపబుద్ధి మోసం చేయడం ఖాయం. ' అనుకునేవారు. 
పాపబుద్ధి ఒకరోజు, ' నేను ఎన్నిరోజులైనా పేదరికంలోనే వుంటున్నాను. సంపాదనా మార్గాలు కూడా నేర్చుకోలేక పోతున్నాను. కనీసం ధర్మబుద్ధి సహాయంతో, అతనితో పాటు వేరే రాజ్యానికి వెళ్లి డబ్బులు సంపాదించి, అతని వాటాను కూడా మోసంతో లాగేసుకుని సుఖంగా వుంటాను. ' అని తలపోశాడు. 
ఆపధకంలో భాగంగానే, పాపబుద్ధి ధర్మబుద్ధితో, ' మిత్రమా ! మన వృద్ధాప్యంలో హాయిగా గడవడానికి డబ్బు కావాలి కదా ! పద ! వేరే ఏదైనా రాజ్యానికి వెళ్లి డబ్బులు సంపాదిద్దాం. మనం ఈ వయసులో ప్రయాణాలు, సాహసాలు చెయ్యకపోతే, రేపు మన మనవళ్ళకి ఏం చెబుతాం మన విజయగాధలు. నా దృష్టిలో, అనేక దేశాలు తిరగనివాడు, అనేక భాషలు నేర్వనివాడు, అనేక సంస్కృతుల గురించి తెలుసుకోనివాడు, దేశాలు తిరిగి డబ్బు సంపాదించనివాడు, వ్యర్థుడు, యెందుకూ కొరగానివాడు. ' అని ఉపోద్ఘాతంగా చెప్పాడు. 
ధర్మబుద్ధికి కూడా స్నేహితుడు చెప్పినదానిలో తప్పేమీ అనిపించలేదు. అతడుకూడా తల్లిదండ్రుల అనుమతి తీసుకుని, పాపబుద్ధి తో కలిసి వేరే రాజ్యానికి బయలుదేరాడు. స్వతహాగా తెలివి కలవాడు అవడం వలన ధర్మబుద్ధి న్యాయమార్గంలో ధనం సంపాదనకు ప్రణాళికలు వేసి, కొద్దికాలంలోనే, ఇద్దరు స్నేహితులకూ సరిపడా ధనం ఇబ్బడి ముబ్బడిగా సంపాదించాడు. 
ఇద్దరూ ఆ ధనంతో తిరిగి తమ గ్రామానికి వస్తుండగా, పాపబుద్ధి ధర్మబుద్ధితో, ' మిత్రమా ! మనం సంపాదించిన ఈధనమంతా ఊరిలోకి తీసుకెళ్ళడమంత మంచి ఆలోచనకాదు. ఎందుకంటే, స్నేహితులూ, బంధువులూ డబ్బువున్న వాడిని వేగనివ్వరు అనే విషయం నీకు తెలిసిందే కదా ! అందుకని, యేదో కొంతమొత్తం మనతో తీసుకువెళ్లి, అధికభాగాన్ని, ఈ అడవిలో ఎక్కడైనా పూడ్చి పెడదాము. అవసరం వచ్చినప్పుడు, ఇద్దరమూ కలిసి వచ్చి తీసుకుని వెళదాము. తెలివిగలవాడు, తన సంపదను అంత తేలికగా అందరిముందు ప్రరర్శించకూడదు. కాషాయం కట్టుకునే సాధువు కి కూడా ధనం చూడగానే, మనస్సు చలిస్తుంది. ' అని తన పధక రచన చేసాడు. 
ధర్మబుద్ధిది నిష్కల్మష మైన మనస్సు అవడం వలన, అందుకు అంగీకరించాడు. అలాగే వారు ధనాన్ని ఒక చోట పూడ్చిపెట్టి, స్వల్పధనంతో వారి వారి ఇళ్లకు వెళ్లిపోయారు. తరువాత కొద్ది రోజులకే, పాపబుద్ధి ఒక్కడూ తన వ్యూహంలో భాగంగా, అర్ధరాత్రి పూట వెళ్లి ధనం మొత్తం కాజేసి, వెనుకటి లాగానే, గొయ్యిని పూడ్చివేశాడు. 
తరువాత కొద్దిరోజులకు పాపబుద్ధే ధర్మబుద్ధితో, ' స్నేహితుడా ! నాది పెద్ద కుటుంబం నీకు తెలుసుకదా ! నాకు ధనం కావాలి. పద మనం వెళ్లి పూడ్చిపెట్టిన ధనం తీసుకు వద్దాం. ' అని ధర్మబుద్ధిని తీసుకువెళ్లి, వాళ్ళు పాతిపెట్టిన స్థలంలో త్రవ్వగా, ఖాళీ గొయ్యి వారిని వెక్కిరించింది. వెంటనే పాపబుద్ధి పెద్దగా అరుస్తూ, నుదురు కొట్టుకుంటూ, లబో దిబో మంటూ ధర్మబుద్ధిని దొంగగా చిత్రించి నిందించసాగాడు. 
దానికి ధర్మబుద్ధి, ' నీకు అసలు బుద్ధి వున్నదా ? ఈ ధనం నా తెలివితేటలతో సంపాదించి, నేనేపూడ్చిపెట్టి, నేనే దొంగిలిస్తానా ? నా పేరే ధర్మబుద్ధి, తెలివి తక్కువగా మాట్లాడకు. ' అని తిరిగి సమాధానం ఇచ్చాడు. 
ఈ వివాదం న్యాయాధికారి వద్దకు వెళ్ళింది. న్యాయాధికారి, ఎటూ చెప్పలేక, అగ్నిని చేతులో పెట్టుకుని ప్రమాణం చెయ్యమన్నాడు, ఇరువురినీ. ' ఎవరి చెయ్యి కాలకపోతే, వారు నిర్దోషులు. ' అని చెప్పాడు. ఈ ప్రమాణం చేయడానికి పాపబుద్ధి భయపడి, ' ఇంకా ఈ రోజులలో ఈప్రమాణాలు ఏమిటి ? నేను ఏకంగా ఆ చెట్టుచేతనే సాక్ష్యం ఇప్పిస్తాను. అదే సరి అయిన విధానం. ' అని గంభీరంగా చెప్పాడు. 
ఇదేదో బాగుందనుకుని, న్యాయాధికారి ' సరే ' అన్నాడు. రేపే ఆ చెట్టుచేత సాక్ష్యం చెప్పించాలని తీర్మానించాడు. రాత్రికి రాత్రే, పాపబుద్ధి తన వృద్ధుడైన తండ్రిని అనేక విధాలుగా వత్తిడి చేసి, ఆయనను ధనం పూడ్చిన చోట వున్న చెట్టుతొర్రలో దాచి వుంచాడు. 
మర్నాడు ఉదయం ఏమీ తెలియనట్లు పాపబుద్ధి, ధర్మబుద్ధితో కలిసి న్యాధికారిని తీసుకుని వృక్షం దగ్గరకు వెళ్ళాడు. ధైర్యంగా ఆ వృక్షాన్ని, ' ధనం ఎవరు దొంగిలించారో చెప్పు వృక్షరాజమా ! ' అని అడిగాడు. దానికి ఆ వృక్షంలో వున్న పాపబుద్ధి తండ్రి, ' ధనాన్ని గొయ్యిలోనుంచి తీసి, ధర్మబుద్ధి ఎత్తుకెళ్లాడు. ' అని పెద్దగా చెప్పాడు. వృక్షం మాట్లాడడం ఏమిటని, న్యాధికారి, ధర్మబుద్ధి ఆశ్చర్యపోతుండగా, ధర్మబుద్ధి ' దీనిలో ఏదో మోసం వున్నది. ' అని గ్రహించి హుటాహుటిన, ఎండు ఆకులు, ఎండుపుల్లలూ చెట్టు చుట్టూ చేర్చి నిప్పుపెట్టాడు. 
ఇంకేముంది ! ఆ చెట్టు తొర్రలోనుంచి పాపబుద్ధి తండ్రి రోదిస్తూ, ఒక్కయెగురు యెగిరి బయట పడ్డాడు.. అందరికీ నమస్కరిస్తూ, తమ కుమారుడి బలవంతం మీద ఈ విధంగా తప్పుడు సాక్ష్యం యిచ్చాను. అని ఒప్పుకున్నాడు. పాపబుద్ధికి న్యాయాధికారి కఠిన శిక్ష అవిధించాడు. ఎందుకంటే, స్నేహితుని మోసం చేయడం కంటే, నీచమైన పని యింకొకటి వుండదు కదా ! 
చూసారా ! ధర్మబుద్ధి ఏ తప్పూ చేయలేదు కాబట్టి, ఎంతమాత్రం తొట్రు పడకుండా, సమస్యకు పరిష్కారం కనుక్కున్నాడు. కానీ పాపబుద్ధి విపరీతమైన తెలివితేటలు ప్రదర్శించి రాబోయే పరిణామాలు వూహించలేక పోయాడు.
Source: Gandavarapu Prabhakar Garu
(Facbook)

వ్యాస మహాభారతం - 31 (S-16)

ఆదిపర్వం. చతుర్దాశ్వాసం.
సౌతి శౌనకాది మహామునులకు చెబుతున్నాడు.
సత్యవతీ, శంతనుల దాంపత్యఫలంగా, వారికి యిద్దరు కుమారులు, చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు కలిగారు. వారు పెరిగి పెద్దవారు అవుతున్నారు. శంతనుడు కాలం చేసిన తరువాత, భీష్ముడే ఇద్దరు పిల్లలను, పితృసమానుడై, కంటికి రెప్పలా సాకసాగాడు. 
వారు యుక్తవయస్కులైన తరువాత, దాశరాజుకు భీష్ముడు యిచ్చిన మాట ప్రకారం, పెద్దవాడైన చిత్రాంగదునికి రాజ్యాభిషేకం చేసాడు. చిత్రాంగదుడికి దురహంకారం యెక్కువ. చీటికీ మాటికీ పెద్దా చిన్నా లేకుండా, చివరకు దేవతలూ, గంధర్వులను కూడా లక్ష్యపెట్టక, అందరితో తగాదా పడుతుండేవాడు. ఒక రోజు చిత్రాంగదుడు అనే పేరుగల గంధర్వునితో అకారణంగా, ' నా పేరు వున్న నిన్ను బ్రతకనీయను. నీవో నేనో ఒక్కడే చిత్రాంగదుడు వుండాలి. ' అని అతనిని ద్వందయుద్ధానికి ఆహ్వానించి, కురుక్షేత్రంలో యుద్ధం చేసాడు. వద్దని వరించినా భీష్ముని పలుకులను కూడా చిత్రాంగదుడు లెక్కచేయలేదు. పోగాలము దాపురించింది కదా ! మాయా యుద్ధంలో నేర్పరి అయిన గంధర్వరాజు చిత్రాంగదుని ధాటికి నిలబడలేక అతని చేతిలో, అతి చిన్న విషయానికే ఈ చిత్రాంగదుడు హతుడయ్యాడు
ఆ తరువాత భీష్ముడు రెండవవాడు అయిన విచిత్రవీర్యునికి పట్టాభిషేకం చేసి, రాజ్యపాలన తాను చూసుకోసాగాడు. విచిత్రవీర్యుడు కూడా భీష్ముని యెంతో గౌరవించేవాడు. విచిత్రవీర్యునికి వివాహం చేయ సంకల్పించి, కాశీరాజు తన ముగ్గురు కుమార్తెలు అంబ, అంబికా, అంబాలికలకు స్వయంవరం ప్రకటించగా, భీష్ముడు స్వయంగా, తమ్మునికొరకు స్వయంవరానికి వెళ్ళాడు. వెళ్ళీవెళ్ళగానే, స్వయంవర ప్రక్రియ ప్రారంభం కాకుండానే, ' నేను తమ్ముడు విచిత్రవీర్యుని కొరకు ఈ ముగ్గురినీ తీసుకుని వెళ్తున్నాను. నన్ను యెదిరించగల ధీరుడు యెవరైనా వుంటే అడ్డుకోండి. ' అని ప్రకటించాడు. 
అయితే, అందరు రాజులూ ప్రక్కకు తప్పుకోగా, అప్పటికే ఆముగ్గురు కన్యలలో పెద్దదైన అంబను ప్రేమించిన సాళ్వుడు గట్టిగా ప్రతిఘటించాడు. భీకరంగా యుద్ధం చేసాడు. కానీ, భీష్ముని నిలువరించలేక పోయాడు. ఆవిధంగా ముగ్గురినీ యిచ్చి విచిత్రవీర్యునికి వివాహం చేద్దామని భీష్ముడు నిర్ణయించగా, అంబ, ' మహానుభావా ! యింతకుముందే, నేను సాళ్వరాజు పరస్పరం ప్రేమించుకున్నాము. నా తండ్రి కూడా సాళ్వునికి మాట యిచ్చాడు. కాబట్టి నీకు ఏది ధర్మం అని తోస్తే అది చేయి. ' అని అభ్యర్ధించింది. 
ఆమె మాటలకు భీష్ముడు నొచ్చుకున్నాడు. ' ఈవిషయం స్వయంవరంలోనే నీ తండ్రి గానీ, నీవు గానీ ధైర్యంగా చెప్పవలసినది. ఏది ఏమైనా, నీవు కోరుకున్న సాళ్వరాజు వద్దకు నిన్ను యిప్పుడే పంపిస్తాను. ' అని చెప్పి అంబను గౌరవ ప్రదంగా, సకల మర్యాదలతో సాళ్వుని వద్దకు పంపించాడు భీష్ముడు. మిగిలిన ఇద్దరు సోదరీమణులు అంబికా, అంబాలికలను యిచ్చి విచిత్రవీర్యునకు ఘనంగా వివాహం జరిపించాడు. 
అంతా బాగా జరిగిందని భీష్ముడు ఊపిరి పీల్చుకునే లోపే, విచిత్రవీర్యుడు, తనకు లభించిన అతి లావణ్యమైన సుందరీమణులు, యిద్దరు భార్యలతో, విచ్చలవిడిగా కామకేళి జరిపి, పగలనక రేయనక, యెక్కడబడితే అక్కడ, వారితో క్రీడించి, మితిమీరిన కామవాంఛతో, కొద్దిరోజులలోనే క్షయవ్యాధితో మరణించాడు. 
చూస్తున్నాము గదా, మహాభారత గాథలో వేదవ్యాసుడు, అనేకచోట్ల, చెయ్యకూడని పనులు చెయ్యవద్దని, యెంత అంతర్లీనంగా చెబుతున్నారో ! అందుకే ఇది పంచమవేదం అయింది. అలాగే చెయ్యవలసిన విధులు కూడా మనకు కనిపిస్తాయి. అవీ ఇవీ అన్నీ మననం చేసుకుంటూ, వితండవాదాలు చెయ్యకుండా, జీవితం సార్ధకం చేసుకోవాలి. 
ఇప్పుడు భరతవంశం నిర్వీర్యమై, వారసులు లేక అంతరించడానికి సిద్ధంగా వున్నది. బీష్ముడు అతి దుఃఖాన్ని అనుభవిస్తూ కూడా, తల్లి సత్యవతిని, మరదలు అంబికా, అంబాలికలను ఓదారుస్తూ, రాజ్యపాలన చేయసాగాడు. ఈబాధ భరించలేక, సత్యవతి, భీష్ముని వివాహం చేసుకొమ్మని వంశవృద్ధి చెయ్యమని వత్తిడి చేయసాగింది. ఏ సత్యవతి అయితే, లోక విరుద్ధమైన కోరిక కోరి, దేవవ్రతుని ఆజన్మబ్రహ్మచారిగా మార్చిందో, అదే సత్యవతి నోటినుండి, వివాహం చేసుకొమ్మని అభ్యర్ధన రావడం, విచిత్ర పరిణామం కదా ! 
అయితే, భీష్ముడు సత్యవతి వత్తిడికి తలవొగ్గలేదు. తాను వివాహమాడే ప్రసక్తి లేదన్నాడు. ఆవిషయంమళ్ళీ మళ్ళీ యెత్తవద్దని, తల్లిని ప్రార్ధించాడు. ' సూర్యుడు తన ప్రకాశాన్ని కోల్పోవడం సంభవమేమో కానీ, అగ్ని తన ఉష్ణప్రవృత్తిని మార్చుకున్నా మార్చుకోవచ్చేమో కానీ, చంద్రుడు తన వెన్నెలను గ్రీష్మ తాపంగా మార్చవచ్చేమో గానీ, నేను మాత్రం పంచభూతాల సాక్షిగా చేపట్టిన నా బ్రహ్మచర్య వ్రతాన్ని వదులుకోను. ' అని తల్లితో నిర్ద్వందంగా చెప్పాడు. ' శంతనుని వంశం ముందుకు కొనసాగాలంటే, యేమి చెయ్యాలో, ధర్మ శ్రేష్ఠులైన పురోహితులనూ,పండితులనూ పిలిచి చర్చిద్దాము. ' అని తల్లితో చెప్పాడు. 
' ఆప్రకారం ఆలోచిస్తే, పూర్వము పరశురాముడు కారణాంతరాల వలన క్షత్రియులపై కోపించి రాజపత్నుల గర్భాలలోని శిశువులను కూడా ఒక్కళ్ళనీ మిగల్చకుండా చంపివేస్తే, బ్రాహ్మణశ్రేష్ఠులు, ఆ రాజపత్నులకు ధర్మశాస్త్రప్రకారం సంతానాన్ని కలిగించి వారివంశాలను నిలిపారు. '
' అదేవిధంగా, ' గొప్ప మనోనిగ్రహం కలవాడు, ధర్మమూర్తి అయిన బ్రాహ్మణశ్రేష్ఠుని ఆరాధించి, విచిత్ర వీర్యుని భార్యలకు సంతానం కలిగే విధంగా చూడు తల్లీ ! ' అని భీష్ముడు సత్యవతిని కోరగా, ఆమె, పూర్వము పరాశరుని ద్వారా తనకు కన్యత్వ దోషము కలుగకుండా, జన్మించిన వ్యాసభగవానుని జ్ఞప్తికి తెచ్చుకుని, అవసరమైతే పిలువమని చెప్పిన ఆయన మాటలను స్మరించుకుని, వ్యాసుని ఆ సమయంలో అక్కడకు ఆహ్వానించింది. వెంటనే ఇంద్రనీల మణివలె వ్యాసుడు తల్లికి దర్శనమిచ్చాడు. పాదాలకు నమస్కరించాడు. తనను పిలిచిన కారణమేమిటని అడిగాడు. 
సత్యవతీ దేవి కుమారుడైన వ్యాస భగవానునికి జరిగినదంతా పూస గ్రుచ్చినట్లు చెప్పి, దేవరన్యాయాన్ని పాటించి అతని తమ్ముడు విచిత్రవీర్యుని భార్యలైన అంబికా, అంబాలికలకు పుత్రభిక్ష పెట్టి వంశాన్ని కాపాడమని కోరింది. సత్యవతి వ్యాసునితో, రాజులేని రాజ్యం లో యెలాంటి విపత్కర పరిస్థితులు సంభవిస్తాయో చెప్పింది. నీవు ఏమాత్రం ఆలశ్యం చెయ్యకుండా, రాజ్యాన్ని, రాజవంశాన్నినిలబెట్టాలని వేడుకున్నది. 
ఆమె కోరికను మన్నిస్తానని వ్యాసుడు చెప్పాడు. ఇదిచాలా పురాతనమైన వేదాలలో వున్న ధర్మమే ! నేను ఈకాశీరాజు పుత్రికలను ధర్మనీతితో సంతానవతులను చేస్తాను. నేనుచెప్పే వ్రతాన్ని వీరు సంవత్సరం పాటు ఆచరించాలి. అప్పుడే వారి హృదయాలు పునీతమై, వారికి ఉత్తములైన పుత్రులు పుడతారు. ' అని వ్యాసుడు చెప్పాడు. 
సత్యవతీదేవి, చెప్పవలసిన మాటలు అంబికకు కూడా చెప్పి, ఆమెను మానసికంగా తయారుచేసి, వ్యాసుని, ఋతుమతియైన అంబిక వద్దకు వెళ్ళమని కోరింది. 
సత్యవతీ దేవి వంశవృద్ధికి పడుతున్న తాపత్రయం యెలా పరిణమిస్తుందో !
Source: Gandavarapu Prabhakar Garu
(Facbook)

వ్యర్ధమైన వరం.

వెనకటికెవరో ఒక అమాయకుడు, భగవంతుడు ప్రత్యక్షమై, ఏం వరం కావాలో కోరుకొమ్మంటే, ' మా మేనమామ చెవులలో జుట్టు మొలిపించు, స్వామీ ' అని అడిగాడట. అలాంటి అమాయకుడి గురించిన పంచతంత్ర కథ ఇది. 
ఒకానొక వూళ్ళో ' మందరకుడు ' అనే సాలెపని చేసే నేతగాడు వుండేవాడు. ఒకసారి అతను బట్టలు నేస్తుండగా మగ్గంపై వుండే చెక్క విరిగిపోగా, చెక్క కొట్టుకొందామని అడవికి వెళ్ళాడు. వెళ్లినవాడు, మళ్ళీమళ్ళీ రాకుండా, ఒకపెద్దచెక్కను తీసుకు వెళదామని, ప్రక్కన వున్న చెట్టుని గొడ్డలితో కొట్టబోతుండగా, ఒక యక్షుడు, చెట్టుపై నుండి, పెద్దగా కేకపెట్టాడు, ' ఓ నేతగాడా ! ఇదినాకు యిల్లులాంటిది. దీనిని యేమీచేయకు. నేను చల్లగాలి అనుభవిస్తూ, యీచెట్టుమీద యెంతో హాయిగావున్నాను. ' అన్నాడు.
ఆ మాటలకు మందరకుడు ఆశ్చర్యపడి, ' అయ్యా ! తమరెవరో, దేవతలాగా వున్నారు. ఈ చెక్క తీసుకువెళ్లకపొతే, నా మగ్గంపని ఆగిపోతుంది. మేము మాకుటుంబం అంతా ఆకలితో అలమటించాలి, కాబట్టి అడ్డుచెప్పవద్దు. తమరే యింకేదైనా చోటు చూసుకోండి. ' అని వినయంగా వేడుకున్నాడు.
అతను సమాధానం చెప్పిన విధానానికి సంతసించి, యక్షుడు, ' సరే ! నీబాధ నాకు అర్ధం అయింది. నీకు మళ్ళీమళ్ళీ యిలాంటి శరీరకష్టం లేకుండా యేదైనా ఒకవరం యిస్తాను, కోరుకో ! ' అని యెంతో కరుణతో అన్నాడు. దానికి మందరకుడు సంతోషించి, ' నేను నాభార్యకు చెప్పకుండా యిలాంటినిర్ణయాలు తీసుకోలేను. దయచేసి ఒక్కరోజు గడువుయివ్వు. యింటికివెళ్లి నాభార్యను సంప్రదించి వస్తాను. ' అని ఇంటికి బయలుదేరాడు. 
అప్పుడు యక్షుడు ఆ నేతగానిని వెనుకకు పిలిచి, ' మందరకా ! ఒక్క షరతు. ఒక్క వరమే యిస్తాను. బాగా ఆలోచించుకుని రా ' అని చెప్పాడు. .
యక్షుని మాటకు సరే అనిచెప్పి, మందరకుడు, దారిలో, తనస్నేహితుడు క్షురకవృత్తి చేసేవాడు కనబడితే, సంతోషం పట్టలేక, విషయం అంతా చెప్పాడు. ' నాభార్య సలహా కోసం వెళ్తున్నాను. ' అనికూడా అన్నాడు. 
దానికి అతని స్నేహితుడు, ' మిత్రమా !ఇలాంటి విషయాలలో భార్యల సలహాలు యేమూర్ఖుడూ తీసుకోడు. ఆమెకు యివ్వాలనుకుంటే, చక్కటి చీరలు, నగలు, ఆభరణాలు మంచి యిల్లు ఇవ్వు. . ఆమె సంతృప్తి చెందుతుంది. అంతే కానీ, మొత్తంవిషయంలో సలహా అడగవద్దు. నేను రాజుల వైభోగం చూస్తూవుంటాను, వాళ్ళ దగ్గరకు, వృత్తిరీత్యా వెళ్ళినప్పుడు. ఎంతో గొప్పగా వుంటుంది. నామాట విని యేదైనా రాజ్యం కావాలని కోరుకో, నీకష్టాలు గట్టెక్కుతాయి. నన్నుమంత్రిగా పెట్టుకో, ఇలాంటి సలహాలు బోలెడుయిస్తాను. ' అని చెప్పాడు.
అయితే, మందరకుడు దీనికి వప్పుకోకుండా, తాను అనుకున్న ప్రకారం, యింటికి వెళ్లి జరిగినది అంతా పూసగ్రుచ్చినట్లు భార్యకుచెప్పి, తన స్నేహితుని సలహా కూడా చెప్పాడు. దానికి అతని భార్య ' నీ స్నేహితుడు యెంత తెలివితక్కువ వాడు. ఇలాంటి విషయాలలో, భార్యసలహాని తీసుకోవాలి. ఇంకెవ్వరూ పనికిరారు. రాచరికంలో యెన్నో బాధ్యతలు వున్నాయి. కుట్రలు ఉంటాయి. దాని వల్లనే కదా శ్రీరాముడు అడవులకు వెళ్ళాడు. పాండవులు వనవాసం వెళ్లారు. యాదవులు నశించారు, నలమహారాజు అడవులపాలు అయ్యాడు. ఇన్ని తెలిసీ యెవరైనా రాజ్యం కోరుకుంటారా ! అలాంటి చెత్త ఆలోచనలు చెయ్యకు. ' అని గట్టిగా చెప్పింది. 
' అయితే, నీ సలహా యేమిటో చెప్పు, ' అన్నాడు మందరకుడు సాలోచనగా. దానికి అతని భార్య ' అలా అడిగావు బాగుంది. నువ్వు బట్టలు నేయడానికి యెంతో కష్టపడుతున్నావు. అయినా మనకు కడుపునిండా తిండి దొరకడంలేదు. అదే నీకు గనుక యింకో రెండు చేతులు, యింకొక తలకాయవుంటే, యింతకు ఇంత సంపాదించవచ్చు. కుటుంబాన్ని సంతోహంగా వుంచవచ్చు. కాబట్టి యక్షుడిని, యింకో ఆలోచనలేకుండా, రెండో తలా, రెండు చేతులు అదనంగా కోరుకో ! మనము అధిక సంపాదనతో సుఖపడదాం ! ' అని అద్భుతమైన సలహా యిచ్చింది.
మందరకునికి యీ సలహా యెంతో నచ్చి, అదేవిధంగా యక్షుడిని అడిగి వరం పొంది, రెండు తలలతో, నాలుగు చేతులతో నగరం లోనికి ప్రవేశించాడు. ఇంకేముంది, యీ వింత ఆకారం చూడగానే కుక్కలు వెంటబడి తరమసాగాయి. అడవిలో నుంచి నక్కలు ఊళలు వేయసాగాయి. గ్రామస్థులు, యేదో వింతరాక్షసి వచ్చిందని రాళ్లు వేయసాగారు.
ఈ పరిస్థితి వూహించని మందరకుడు, వేగంగా యింట్లొకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. రాక్షసి ఆయింట్లో దూరిందని, వూరివారు గొడవచెయ్యడం ప్రారంభించారు. ఇక చేసేది లేక, ఆ వింత శరీరంతో మందరకుడు బైటకువచ్చి, జరిగిన సంగతి వివరించగా, వెంటనే, వూరి పెద్దలు, ఆశ్చర్యంతో నోళ్లు వెళ్ళబెట్టారు. 
తరువాత తేరుకుని, వూరిపెద్దలు అతనిని, అతనిభార్యనూ, చివాట్లుపెట్టి, యిద్దరినీ కలిపి, యక్షునివద్దకు వెళ్లి మామూలు రూపం యిప్పించమని అడిగి రమ్మన్నారు. మందరకుని భార్య తన సలహా వలన యిదిజరిగిందని, తప్పు వప్పుకుని, తనభర్తకు తిరిగి మామూలు రూపం ప్రసాదించమని యక్షుని వేడుకున్నది.
యక్షుడు అందుకు అంగీకరించి, మందరకునికి మామూలు మనిషి రూపం వచ్చేటట్లు చేసి, వేరే వరం కోరుకోవడానికి,వారికి అర్హతలేదని చెప్పి, చెట్టుమీదనుండి మాయమయ్యాడు.
బిక్కమొహాలతో ఆ అమాయకపు భార్యాభర్తలు ఇంటిదారిపట్టారు. అందలం యెక్కించాలన్నా, అందుకు అర్హులుకాకపొతే, అందుకోలేరని తెలిపే కథ, యిది.
Source: Gandavarapu Prabhakar Garu
(Facbook)

ఆశకు అంతులేకపోతే..

తమకేమి కావాలో తమకే తెలియని యువత, యెంత గందరగోళంలో పడుతుందో చెప్పే పంచతంత్ర కథ !
నలుగురు యువకులు ఒకవూరిలో యెంతో స్నేహంగా వుండేవారు. వారివారి వృత్తులలో నైపుణ్యం కలిగి మంచిపేరు తెచ్చుకున్నారు, ఆ వూరిలో. అయితే, తమ నైపుణ్యానికి తగిన గుర్తింపు రాలేదనీ, తమకు ధనం విషయంలో అనుకున్న సంపాదన లేదని యెప్పుడూ అసంతృప్తితో వుండేవారు.
అట్టి సందర్భాలలో, వున్నవూరుని, కన్నవాళ్ళనీ, వదిలి వెళ్లాలని అనుకొవడం సహజమేకదా ! ఆ వూరు తమ విద్యకు తగినప్రదేశం కాదని, వేరే పెద్దనగరానికి వెళ్ళ్లాలని తలపోసి, బయలుదేరారు, యువకులు నలుగురూ. . ఉజ్జయినీనగరం చేరుకున్నారు.
సిప్రానదిలో స్నానంచేసి, మహాకాళేశ్వరుని దర్శించుకున్నారు. అక్కడ భైరవానంద స్వామి వీరిని పలుకరించి, యోగక్షేమాలు కనుక్కున్నారు. స్వామితో మాట్లాడుతూ వారు ' మేము మాఅభివృధ్ధి కోసం బయలుదేరాము. ఈ అన్వేషణలో మాకు ' విజయమో, వీరస్వర్గమో' అని సంకల్పించి వచ్చాము. సాహసించినందుకు మాకు ఫలితం దక్కుతుందనే అనుకుంటున్నాము. ' అన్నారు .
కొద్దిసేపు వారితో మాట్లాడిన తరువాత, వారి దృఢమైన సంకల్పానికి, సంభాషణా ధోరణికి స్వామి యెంతో సంతోషించి, వారు నలుగురికీ, ఒక్కొక్కరి చేతిలో, ఒకగుళికను వుంచి, హిమాలయాల వైపు ప్రయాణం సాగించామని చెప్పారు. ' ఎక్కడైతే, మీ చేతిలోనుండి గుళిక జారి క్రిందపడుతుందో, అక్కడ సంపదకై వెదకండి. మీకు శుభంకలుగుతుంది. ' అని ఆశీర్వదించి పంపించారు.
కొంతదూరం వెళ్ళగానే, మొదటివాని చేతిలో గుళిక జారిపడింది. అక్కడ కొంత లోతుకు త్రవ్వగానే, చాలా పెద్ద పరిమాణం లో ' రాగి ఖనిజం ' కంటబడింది. మిగిలిన ముగ్గురితో మొదటివాడు, ' మీరు ముగ్గురూ కూడా కావలసినంత రాగి తీసుకువెళ్ళండి. ఇక అందరమూ వెనుకకు వెల్దాము. ' అన్నాడు.. వారు దానికి వప్పుకోక, ' రాగిలో యేముంది ! ఇంకా ముందుకు వెళదాం. ' అని వారు బయలుదేరారు. మొదటివాడు మాత్రం తాను తీసుకువెళ్లగలిగినంత రాగితో, వెనుకకు మరలాడు.
ఇంకొద్దిదూరం వెళ్ళగానే, రెండవవాని చేతిలో గుళిక క్రిందపడింది. అక్కడ త్రవ్వి చూడగా, వెండి ఖనిజం బయటపడింది. రెండవవాడు సంతోషంగా కావలసినంత వెండి పోగుచేసుకుని వెనుకకు మరలుతూ, మిగిలిన యిద్దరినీ వెండి తీసుకుని తనతో వెనుకకు రమ్మన్నాడు. వాళ్ళు ' ససేమిరా ' అని యింకాముందుకు బయలుదేరాడు.
ఇంకా కొద్దిదూరం మిగిలిన యిద్దరూ వెళ్తూవుండగా, మూడవవాని, నాలుగవ వాని చేతులలో గుళికలు క్రిందపడి అక్కడ త్రవ్వగా, బంగారం రాసులు కనిపించాయి. మూడవవాడు, తాను బంగారం పోగుచేసుకుని, నాలుగవ వానిని కూడా తీసుకోమని చెప్పగా, ' నా గుళిక పొరబాటున క్రింద పడినట్లున్నది. నాకింకా యేదో పెద్దదే రాసిపెట్టి వున్నది. నేను ముందుకువెళ్తాను ' అన్నాడు.
ఆ విధంగా చాలాదూరం కొండపై యెగబ్రాకగా , నాలుగవవాడు దారితప్పి, ఎటో వెళ్ళసాగాడు. ఆకలిదప్పులు, తెలిసివచ్చి, అటూయిటూ బిత్తరచూపులు చూడసాగాడు. వెనుకకు బంగారం దగ్గరకు వెల్దామంటే, దారి కనుక్కోలేకపోయాడు. ఇంతలో, ఒళ్ళు రక్తం కారుతూ, తలమీద ఇనుపగుండుమోస్తూ, ఒక వ్యక్తి వేదనపడుతూ నాలుగవ వానికి కనిపించాడు.
' ఎవరు మీరు ? యిక్కడ యిలా యెందుకు వున్నారు ? ' అని నాలుగవవాడు అడిగిన తక్షణం, యెదుటివ్యక్తి తలపైన వున్న యినుపగుండు, ఇతనితలపైకి వచ్చి పడింది. వెంటనే, అవతలి వ్యక్తి సేదతీరుతుండగా, నాలుగవ వాడు, వేదనపడ సాగాడు. అవతల వ్యక్తి గాయాలు మానిపోయి, హాయిగా నవ్వుతున్నాడు.
నాలుగువాడు, ' ఏమిటి ఇదంతా ? మీ తలపై గుండు నాపైకి ఎందుకు వచ్చింది ? నేను యెప్పటిదాకా యిది మోయాలి. అయ్యో భగవంతుడా ! నా దురాశ ఎంతపని చేయించిందీ ! ' అని వాపోయాడు. దానికి ఎదుటి వ్యక్తి, ' నీ తలపై యిది యెంతకాలం వుండాలి అనేదానిపై, నాకూ అవగాహనలేదు. అయితే, నీలాగే, మరియొకడు ఎవరైనా వచ్చి, నిన్ను పలకరిస్తే చాలు, నీకష్టాలు గట్టెక్కుతాయి. నీవు, చదువుకున్నవాడవే అనుకుంటున్నాను. అయినా, దురాశతో నాలాగా చిక్కుల్లోపడ్డావు. ' అని సమాధానం యిచ్చి, కొండ క్రిందకు వడివడిగా వెళ్ళిపోయాడు.
నాలుగవవాడు, ఆశగా యింకెవరైనా తనను యీబంధం నుంచి తప్పించడానికి, తనలాగా రాకపోతారా అని యెదురుచూస్తూనే వున్నాడు. మూడవవాడు, కొండపైకి తన స్నేహితుని గురించి వెదుకుతూ వస్తుండగా, క్రిందకు దిగుతున్న వ్యక్తి, విషయం చెప్పి, వెనుకకు మరల్చాడు మూడవవానిని.
కనబడని అదృష్టాన్ని నమ్ముకుని , కనబడుతున్న సంపదని కాలదన్నుకున్న వాడిని ఎవరు రక్షించగలరు ? చూశారా ! అత్యాశ యెంత అనర్ధాన్ని తెచ్చి పెడుతుందో !
Source: Gandavarapu Prabhakar Garu
(Facbook)

వ్యాస మహాభారతం - 30 (S-15)

ఆదిపర్వం. చతుర్దాశ్వాసం.
సౌతి శౌనకాది మహామునులకు చెబుతున్నాడు.
ఒకరోజు శంతనుడు యమునాతీరంలో వేటాడుతూ వెళ్తుండగా, హఠాత్తుగా అపూర్వమైన సుగంధవాసనలు ఆయన నాసికాపుటాలకు సోకాయి. ఆ వాసనలు వస్తున్న దిక్కుగా శంతనుడు వెతుక్కుంటూ వెళ్ళాడు. 
కొద్దిదూరం వెళ్ళగానే, శంతనునికి అత్యంత సౌందర్యంతో ఆమడదూరం నుండే అత్యంత సుగంధాన్ని వెదజల్లతున్న, ఒక అపూర్వ స్త్రీ, సాధారణ స్త్రీ వలే పడవ నడుపుతూ కనబడింది. ఆమె అందం చూసి మతి చెదిరింది శంతనునికి. కొద్దిసేపటికి తెప్పరిల్లి ఆమెదగరికి వెళ్లి, ' ఆమె ఎవరు ? ఎందుకు పడవ నడిపే వృత్తిలో వున్నది ? ' అని తెలుసుకో కోరి ఆమెను అడిగాడు. దానికి ఆమె, చిరునవ్వు నవ్వుతూ, ' నేను దాశరాజు పుత్రికను, నన్ను సత్యవతి అంటారు. ఇది మా కులవృత్తి, నేను నా తండ్రికి సహాయం చేస్తుంటాను. ' అని చెప్పింది. 
ఆమె అందానికి, పొందికైన మాటతీరుకు శంతనుడు వెంటనే దాసుడై పోయాడు. దాశరాజును వెతుక్కుంటూ వెళ్లి, సత్యవతిని తనకిచ్చి వివాహం చెయ్యమని అడిగాడు. దాశరాజు అందుకు యెంతో సంతోషించాడు. ' చక్రవర్తి స్వయంగా వచ్చి మా అమ్మాయిని చేసుకుంటానంటే కాదంటామా ? ' అన్నాడు. అయితే, అప్పటికే శంతనునికి సంతానం వున్నందున, సత్యవతికి పుట్టబోయే బిడ్డలకు రాజ్యాధికారం రాదు కనుక, సత్యవతికి పుట్టబోయే బిడ్డలకే రాజ్యాధికారం ఇవ్వాలని, ముందరే నియమ నిబంధన విధించాడు. 
కానీ, శంతనుడు తాను జ్యేష్ఠపుత్రుడు గాంగేయుడికి అన్యాయం చేయలేనని భావించి, దాశరాజును అనేకవిధాల, తన స్థాయిని మరిచిపోయి దిగివచ్చి, ప్రాధేయ పడ్డాడు. అయినా దాశరాజు పట్టు విడువలేదు. శంతనుడు చేసేది లేక విచారంగా తమ రాజ్యానికి తిరిగి వెళ్ళిపోయాడు. రాజ్యపాలన ప్రక్కన బెట్టాడు. నిరంతరం సత్యవతీ నామ స్మరణతో ఒంటరిగా దిగులుగా వుండసాగాడు. 
అది చూసి, గాంగేయుడు, సరాసరి తండ్రినే ఆయన విచారానికి కారణం ఏమిటి ? అని అడిగాడు. ఎదిగివచ్చిన కుమారునితో, తన ప్రేమ విషయం యెలా చెప్పాలో తెలియక, ' కుమారా ! వేదవేదాంగాలు చదివిన ఋషులు, ధర్మశాస్త్రాన్ని రచిస్తూ, ఉత్తమ వంశాలలో పుట్టిన వారు, అగ్నిహోత్రాన్ని, సంతానాన్ని, వేదాలను తమ గృహంలో నిరాటంకంగా ఉండేటట్లు చూసుకోమన్నారు. నీవేమో అస్త్ర శస్త్రాలలో సమర్థుడవు. సాహసికుడవు. ఏ సమయంలో ఏ యుద్ధంలో నీకు ముప్పువాటిల్లుతుందో తెలీదు. కాబట్టి ఇంకొందరు పుత్రులను కనాలని మళ్ళీ వివాహం చేసుకుందామనుకుంటున్నాను. ' అని అతి కష్టంగా, తన మనసులోని మాట చెప్పాడు, శంతనుడు. 
అది విని గాంగేయుడు రాజుగారి ముఖ్య అనుచరుల ద్వారా సత్యవతీ దేవిపై రాజుగారి మనసు వున్నదని గ్రహించి, శంతనునికి తెలియకుండా, మంత్రులను వెంట బెట్టుకుని, సరాసరి గాంగేయుడు దాశరాజు ఇంటికి వెళ్ళాడు. తన తండ్రికి ఆయన కుమార్తె సత్యవతిని ఇవ్వవలసినదిగా సూటిగా అడిగాడు. దానికి, దాశరాజు, ముచ్చటపడి, ' గాంగేయా ! ఈ సత్యవతి కారణ జన్మురాలు. ఈమెకు శంతనునితో వివాహము జరుపవలెనని, ముందే నాకు వర్తమానం వున్నది. అందువలన, ఎందరు గొప్పవారు ఈమెను వివాహం చేసుకుంటామని ముందుకు వచ్చినా నేను అంగీకరించలేదు. '
' అయితే, నీవు అసహాయ శూరుడవు. నీవు నీ సవతి తల్లి సంతానానికి రాజ్యాధికారం ఇవ్వడానికి యిష్టపడవు. ఒక వేళ నీవు ఇష్టపడినా, ఉత్తరోత్తరా నీకు జన్మించే సంతానం అందుకు ఒప్పుకోక పోవచ్చును. కాబట్టి ఈ సమస్య పరిష్కారం నీ చేతుల్లోనే వున్నది. ' అన్నాడు. 
అప్పుడు గాంగేయుడు, తన ముందున్న కర్తవ్యం గ్రహించి, ' స్థిరమైన బుద్ధితో యిప్పుడే బ్రహ్మచర్య వ్రతాన్ని స్వీకరిస్తున్నాను. అందువలన, నేను సంతానం లేనివాడిని అయినప్పటికీ, రాబోయే కాలంలో అనేక లోకాలు నన్ను ఆదరించడానికి సిద్ధంగా వుంటాయి. అందువలన జీవితాంతం నేను బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరిస్తానని, అష్ట దిక్పాలకుల సాక్షిగా, పంచభూతాల సాక్షిగా, భీషణ ప్రతిజ్ఞ చేస్తున్నాను. ' అని ఎలుగెత్తి చెప్పాడు. 
ఆవిధరంగా గాంగేయుడు, దేవవ్రతుడు తన ప్రతిజ్ఞను ప్రకటించగానే, అతడి పితృభక్తికి మెచ్చుకున్న దేవతలు, మొదలైనవారు సంతోషించి, అతనిపై పూలవర్షం కురిపించారు. అప్పటి నుండి దేవవ్రతుడు, ' భీష్మ ' నామాంతరం కలవాడు అయ్యాడు. 
అప్పటికప్పుడే, బీష్ముడు సత్యవతిని, రాజధానికి తీసుకు వచ్చి, తనతండ్రి శంతనునితో వివాహం జరిపించాడు. గాంగేయుడు చూపించిన త్యాగబుద్ధికి శంతనుడు పొంగిపోయి, అతనికి ' ఇచ్చా మరణం ' వరంగా అనుగ్రహించాడు.
ఆ తరువాత, భీష్ముడు రాజ్యపరిపాలన ఏ లోటూరాకుండా చూసుకోసాగాడు. శంతనుడు సత్యవతీ దేవితో దాంపత్యసుఖాన్ని నిశ్చింతగా అనుభవించాడు. సత్యవతీ, శంతనుల దాంపత్య ఫలంగా, వారికి ఇద్దరు కుమారులు, చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు కలిగారు. వారు పెరిగి పెద్దవారు అవుతున్నారు. 
ముందు ముందు చూద్దాం ! భీష్ముని త్యాగం కురువంశానికి ఏమాత్రం ఉపయోగపడిందో !
Source: Gandavarapu Prabhakar Garu
(Facbook)

ఎంతవారలైనా...

కోతి ( రక్తముఖుడు ) యొక్క గుండెకాయను తీసుకువెళ్లి భార్యకు సమర్పిద్దామనుకుని మొసలి ( కరాళముఖుడు ) భంగపడిన విషయం గుర్తు వుంది కదా ! అప్పటి నుంచి, ఆ మగ మొసలి, మిత్రద్రోహం చేశాననే అపరాధ భావంతో, కోతితో స్నేహంగా వుండలేక పోతున్నది.
అది గమనించి కోతి మొసలితో స్నేహభావం ప్రకటిస్తూ, అతని మనసు తేలిక పరచాలని, ' కరాళముఖా ! ఎంతటివారికైనా భార్య కోరిక తీర్చడానికి, యెన్ని తిప్పలైనా పడవలసి వస్తుంది. నీవు నాగుండె నీభార్యకు సమర్పించాలనుకోవడంలో నేనేమీ తప్పు పట్టడం లేదులే. ఎందుకంటే గొప్పగొప్ప మహారాజులూ, మంత్రులే భార్యల కోరికలు తీర్చడానికి పడ్డశ్రమ నాకుతెలుసు. ఈ కథ విను. ' అని ఒక చతురత నిండిన కథ చెప్పసాగాడు. :
ఒకప్పుడు ' నందుడు ' అనే గొప్పరాజు వుండేవాడు. ఆయన గొప్ప పరాక్రమవంతుడు. మేధావి. ఆయన దగ్గర ప్రధాన సచివుడిగా ' వరరుచి ' అనే ఆయన వుండేవాడు. ఇద్దరూ ఒకరికొకరు తీసిపోని సమవుజ్జీలు. వీరి యిద్దరు భార్యలు కూడా ఒకేరాజ్యం నుండి వచ్చినవారు అవడంవలన, యెంతో సఖ్యంగా, సరదాగా, ప్రేమగా వుండేవారు.
వీరి భర్తలగురించి ప్రజలు చాలా గొప్పగా చెప్పుకుంటుంటే, వారిద్దరినీ ఆటపట్టించాలని రాజుగారి భార్యా, మంత్రిగారి భార్యా అనుకున్నారు. అనుకున్నట్లుగానే, ఒకరోజు మంత్రిగారి భార్య, అకారణంగా అలిగి, వరరుచి, యెంత బ్రతిమిలాడినా, అలక మాననట్లు నటించసాగింది. అంతటి ప్రధానమంత్రి కూడా, భార్య అలుకకు తట్టుకోలేక, తాను చేసిన తప్పేమిటో చెప్పమనీ, ' ఏ శిక్ష విధించినా అనుభవిస్తానుగానీ, యిలా అలిగి హింసపెట్టకు భార్యామణీ ! ' అని వాపోయాడు.
అతడు చాలాసేపు ఆవిధంగా బ్రతిమిలాడిన తరువాత, ' మిమ్ములను నేను యెప్పటి నుంచో ఒకటి అడగాలనుకుంటున్నాను. కానీ వింటే యేమంటారో అని సందేహిస్తున్నాను. ' అన్నది. ' అయ్యో ! నేనేమీ అనుకోను. చెప్పు, త్వరగా చెప్పు నీకోరిక ఏమిటో ! ' అని వరరుచి తొందరచేశాడు. ' అయితే, మీరు శిరో ముండనం చేయించుకుంటే చూడాలని నాకు కుతూహలంగా వున్నది. మీరు వెంటనే శిరస్సు మీద కేశములు పూర్తిగా తీసివేసుకుని నా దగ్గరకు వస్తే, నేను యెంతో ఆనందిస్తాను. ' 
అన్నది, మంత్రిభార్య. ' దానికేమి భాగ్యం, ప్రియా ! ఇప్పుడే నీకోరిక తీరుస్తాను. ' అని వరరుచి వెంటనే, శిరోముండనం చేసుకుని వచ్చి, తన భార్యకు ఆనందం కలుగచేశాడు.
ఈవిషయం తమ పెంపుడు చిలుక ద్వారా, మంత్రిభార్య, ' అనుకున్నట్లే జరిగింది. ' అని వర్తమానం పంపింది రాణీ గారికి. ఈవార్త తెలియగానే రాణీగారుకూడా, అకారణ బింక౦తో రాజుగారిని అదరగొట్టింది. కథమామూలే. అక్కడా రాజుగారు నానావిధాలా తిప్పలుబడి ఆమెకేమికావాలో తెలుసుకున్నాడు. రాణీగారు, ' మహారాజా ! నాకు మీరు గుఱ్ఱంలాగా నడుస్తుంటే, మీ వీపుమీద కూర్చుని సవ్వారీ చెయ్యాలనివుంది. అయితే, నేను సవారి చేస్తూ, కళ్ళాలు లాగుతుంటే, మీరు గుర్రంలాగా సకిలించాలి. అప్పుడే నాకు సంతోషం. అయినా మీరు మహారాజులు కదా ! వద్దులెండి. నాదోవన నేను యిలా వంటరిగానే వుంటాను. ' అన్నది.
వెంటనే రాజుగారు కంగారుపడి, ' అలాంటిదేమీలేదు దేవీ ! నీ ముందు నా రాజరికం ఎందుకు ? నీఆనందమే, నాఆనందం ' అని ఆమె చెప్పినట్లే గుఱ్ఱంలాగా అభినయించి, ఆమె నోటివద్ద గుడ్డలాగుతున్నప్పుడల్లా, పెద్దగా సకిలించడం ప్రారంభించాడు. అలా కొద్దిసేపు ఆడిన తరువాత, రాణీ గారు సుముఖులైనారు. ఇదంతా, చూస్తున్న మంత్రిగారి భార్య పెంపుడు రామచిలుక, నవ్వుకుంటూ, తుర్రున ఎగిరిపోయింది, రాణీగారికి, జేజేలుచెబుతూ.
అక్కడ మంత్రిగారి భార్య, పైన వున్న గవాక్షం నుండి, రామచిలుక వర్తమానం కోసం యెదురు చూడసాగింది, ఉత్సుకతో. ఆమెను చూడగానే, రామచిలుక, ' రాణీగారి అశ్వారోహణం, మంత్రిగారి శిరోముండనం. బాగు బాగు ! ' అని ఆమెకు నెమ్మదిగా చెప్పింది. అయితే యీమాట, వరరుచి విననే విన్నాడు. అది గమనించి, మంత్రిగారి భార్య, వాతావరణాన్ని తేలికబరుస్తూ, తాము సరదాగా చేసినపని చెప్పి, వరరుచికి కోపం రాకుండా చూసుకుంది.
మర్నాడు కొలువులొ, రాజుగారు వరరుచిని చూస్తూనే, ' ఏమి మహామంత్రీ ! ఈ హఠాత్ శిరోముండనం ! ' అని అడిగారు. ' ఏదోలే మహారాజా ! భర్తలన్న తరువాత, అశ్వ ఆరోహణలు, శిరోముండనములు తప్పవు కదా ! ' అని గుంభనగా జవాబుచెప్పి పక్కకు తప్పుకున్నాడు.
' కాబట్టి, కరాళముఖా ! నీమీద నాకేమీ కోపంలేదులే ! ఎప్పటిలాగే నేరేడుపళ్ల కోసం వస్తూ వుండు.' అనిచెప్పాడు. ' సంసారంలో ఇలాంటి సరిగమలు మామూలే ! ' అని చెప్పే, సరదా కథ !
Source: Gandavarapu Prabhakar Garu
(Facbook)