Sunday, 30 May 2021

_*💫 నమ్మకం పోయింది..!! 🎊*_

_శిష్యుడు- గురువుగారూ, నేనింక ఈ మంత్రం జపం చేయను._

_గురువు- ఏమైంది నాయనా ?_

_శిష్యుడు- రోజూ క్రమం తప్పకుండా చేస్తున్నాను. ఇంతవరకూ ఏం ఫలితం దొరకలేదు._

_గురువు- ప్రారంభించి ఎంత కాలమైంది ?_

_శిష్యుడు- నెల రోజులైంది. భగవన్నామం ఒక్కసారి చేస్తే చాలు పాపాలన్నీ పోతాయన్నారు.. మరి నాకు రవంత ప్రశాంతతైనా దొరకదేంటి ? మంత్రంలో బలం ఉంటే పని చేయాలి కదా ! కనీసం కాస్తైనా నా లోపలి బరువు తగ్గాలి కదా !_

_గురువు- ఓర్పు పట్టాలి నాయనా. తప్పక కలుగుతుంది. ఇట్టివి నెమ్మదిగా పని చేస్తాయి, కానీ తప్పక పని చేస్తాయి. నీకిచ్చినది మహామంత్రం._

_శిష్యుడు- లేదండి. రోజూ శుచిగా ముప్పూటలా స్నానాలు చేస్తాను. సమస్త నియమాలు పాటిస్తూ, ఏకభుక్తం చేస్తూ, మౌనవ్రతం కూడా అవలంబిస్తూన్నాను. పగలు పడుకోను. చాప మీద పడుకుంటాను. ఎక్కువ మాట్లాడను. అరిషడ్వర్గాలకు లోనవ్వటం లేదు. ఇంద్రియాల తృప్తికోసం జీవించటం మానేశాను._

_గురువు- నాకు తెలుసు నాయనా. నీలో చాలా మార్పు ఉంది. ఇతరత్రా భూమిక సిద్ధమవుతున్న సూచన స్పష్టంగానే కనిపిస్తున్నది. ఫలితం గురించి ఇప్పుడే చూడకు. నీకు కనిపించని స్థితిలో అది పని చేస్తుంది._

_శిష్యుడు- లేదండి. నాకు పూర్తిగా నమ్మకం పోయింది. నేను వదిలేస్తాను. వదలాలంటే ఏంచేయాలో చెప్పండి._ 

_గోవు చెవులో ఊదటమో ఏదో పద్ధతులుంటాయి కదా !_

_గురువు- సరే- తప్పక చెప్తానవి. కానీ ముందు నువ్వొక పని చేయి. ఈ మామిడి టెంక మన ఆశ్రమం పెరట్లో నాటి రా. వచ్చి రేపు కనిపించు._

_శిష్యుడు- అట్లాగేనండి._

_(నాటి వెళ్ళి, మరునాడు వచ్చాడు)_

_శిష్యుడు- మంత్రం విడిచే మార్గం చెప్పండి._

_గురువు- నువ్వు నిన్న నాటిన టెంక నాటుకుందా, చూశావా ?_

_శిష్యుడు- లేదండి, నిన్ననే కదా పెట్టింది._

_గురువు- సరిగ్గా పెట్టావా, లోతుగా తవ్వావా, మట్టి పూర్తిగా కప్పావా ?_

_శిష్యుడు- “ఆఁ.. అన్నీ సరిగ్గానే చేశానండి. సూర్యరశ్మి తగిలే చోటే పెట్టాను. వేరే చెట్టు ఛాయలో కాక విడిచోటే పెట్టాను. తగినంత నీరూ పోశాను. ఇవాళ లోపలకు వస్తూ కూడా నీళ్ళు పోశాను._

_గురువు- అయినా పండు రాలేదా ?_

_శిష్యుడు- అదేంటండి, టెంక నాటుకోవాలంటే సమయం పడుతుంది కదా. అది మొక్కై, చెట్టై, పూసి కాస్తే కదా పండొచ్చేది ?_

_గురువు- నిజమే. కానీ టెంకలో బలం లేదేమో..! లేకపోతే ఈ పాటికి కనీసం చిన్న పిలకైనా బయటకు కనిపించాలి కదా._

_శిష్యుడు- లేదండి. అది మట్టిలో మొదలు ఇమడాలి. దానిలో ఉన్న నాటుకునే శక్తి చైతన్యవంతం కావాలి. చాలా సమయం పడుతుంది._

_గురువు- అవన్నీ నిజమే. కానీ ఇన్ని గంటలైంది కదయ్యా. నాకు నమ్మకం పోయింది. అదింక నాటుకోదేమో..!_

_[శిష్యుడు ఏదో అర్థమైనట్టు తలవంచుకున్నాడు]_

_గురువు- దాన్ని తవ్వితీసి పెరికి అవతలపారేసేయి.. నేనింక ప్రతీక్షించలేను. పో._

_శిష్యుడు- నాకు మీ సమాధానం అర్థమైందండి. ఇంకెప్పుడూ మంత్రం చేయనని వదిలేస్తానని అనను. క్షమించండి..🙏_

🙏🇮🇳😷🥦🔮💉🎊💫🪴

సేకరణ (రచయిత పేరు దొరకలేదు)

రచయిత ఎవరైనా, ఇంత గొప్పగా రాసినందుకు ధన్యవాదాలు. 


No comments:

Post a Comment