నిర్ణయాలు తీసుకునే క్షణాన సాధారణంగా ఇంకొకరి సలహా సూచన, బుద్ధి, లేదా సానుభూతి మీద ఆధారపడుతూ ఉంటాం. అలాగే మన భవిష్యత్ జీవితం మనం ఈరోజు తీసుకునే నిర్ణయం పై ఆధారపడి ఉంటుంది.
అయితే మన భవిష్యత్తు ఎవరో అన్యుల సానుభూతి, సలహాల పర్యవసానమేనా? అలాగే మానవ జీవితం ఎవరో అన్యుల బుద్ధి యొక్క పరిణామమేనా? ఈ విషయం ఎప్పుడైనా ఆలోచించారా?
ఇది మనందరికీ తెలిసినదే కదా. ఒకే పరిస్థితిలో వేరు వేరు వ్యక్తులు వేరువేరుగా ఆలోచిస్తుంటారు.
దేవాలయంలో నిలబడ్డ భక్తుడు దానం చేయాలనుకుంటాడు. కానీ ఒక దొంగ అవకాశం దొరికితే దేవుడి నగలు దొంగిలించాలనుకుంటాడు.
మనస్సులో ధర్మం ఉన్నవారు ధర్మబద్ధమైన సలహా ఇస్తారు. ఇక మనస్సులో అధర్మం ఉన్నవారు అధర్మ మార్గాన్ని సూచిస్తారు.
ధర్మబద్ధమైన సలహా స్వీకరించినపుడు మాత్రమే మనిషికి సుఖ సంతోషాలు లభిస్తాయి. కానీ ధర్మబద్ధమైన సలహాను స్వీకరించి ఆచరించడానికి ఏ మనిషికైనా మనస్సులో ధర్మముండాలి. అంటే ఇతరుల సలహాలను కానీ, సూచనలు కానీ స్వీకరించేముందు మీ హృదయం లో ధర్మాన్ని ప్రతిష్టించుకోవాలి. ఇది యదార్ధం కదా.
No comments:
Post a Comment