Wednesday, 30 December 2020

పిడికెడు ఉప్పు

ఒక యువకుడు తన గురువు దగ్గరికెళ్ళి ఇలా చెప్పాడు.

"స్వామీ ! నా జీవితమంతా కష్టాలే.

ఈ జీవితాన్ని భరించలేకపోతున్నాను.

దయచేసి నా కష్టాలు తీరే మార్గo చెప్పండి."

అప్పుడు గురువు ఆ యువకుడి వైపు చూశాడు.

ఒక గ్లాసు నీటిలో ఒక పిడికెడు ఉప్పు వేయమన్నాడు.

యువకుడు అలాగే చేశాడు.

ఇప్పుడు ఆ నీటిని "తాగు" అన్నాడు గురువు.

యువకుడు గ్లాసు పైకెత్తాడు..ఆ నీటిని తాగాడు.

వెంటనే ఉమ్మేశాడు.

"అబ్బ... భరిoచలేని ఉప్పు...."

ఇంకో పిడికెడు ఉప్పు తీసుకుని

ఆ యువకుడిని చెరువు దగ్గరకు తీసుకెళ్లాడు గురువు.

"ఈ ఉప్పు ఈ చెరువులో వేసి ఈ నీళ్ళని తాగు అని చెప్పాడు గురువు.

ఆ యువకుడు చెరువు నీటిని గడగడా తాగేశాడు.

"ఎలా ఉన్నాయి ఈ నీళ్ళు ?" అడిగాడు గురువు.

"నీరు తీయగా ఉంది" చెప్పాడు ఆ యువకుడు.

"అదే పిడికెడు ఉప్పు, అప్పుడెందుకు భరించలేకపోయావు ?

ఇప్పుడెలా భరించావు ? అడిగాడు గురువు.

అప్పడు ఆ యువకుడు ఇలా చెప్పాడు.

అది తక్కువ నీరు.

గ్లాసుడు నీరు.

అందుకే ఉప్పగా ఉంది.

ఇది చెరువు.

అంటే ఎక్కువ నీరు.

అందుకే ఉప్పదనం లేదు." అన్నాడు యువకుడు.

అప్పుడు ఆ గురువు ఇలా చెప్పాడు.

"నాయనా!

సమస్యలు పిడికెడు ఉప్పు లాంటివి.

అది గ్లాసులోనూ పిడికెడే.

చెరువులోనూ పిడికెడే.

కానీ నీ జీవితం గ్లాసులా ఉండాలా.

చెరువులా ఉండాలా అన్నది మాత్రం నువ్వే నిర్ణయించుకోవాలి.

నీ ఆలోచనా శక్తి, సహన శక్తి పరిధి పెరిగితే పిడికెడు ఉప్పు తక్కువవుతుంది.

ఆ పరిధి సంకుచితమైతే పిడికెడు ఉప్పు భరించలేనంత అవుతుంది" అన్నారు గురువు. పరిస్థితి అవగాహన చేసుకొని జీవితాన్ని నందనవనం చేసుకున్నాడా యువకుడు.....

No comments:

Post a Comment