ఒకానొక గ్రామంలో ఆచారి అనే వైద్యుడు ఉండేవాడు. ఆయన అనేక రకాల మూలికలతో ఔషదాలు తయారు చేసి, గ్రామ ప్రజలకు వైద్యం చేస్తూ ఉండేవాడు.
అయితే అదే ఊరిలో పరమేశు అనే నిరుపేద యువకుడు ఉండేవాడు. పరమేశు అమాయకుడు. ఒకనాడు అతని తండ్రికి ఏదో అనారోగ్యం చేసింది. పరమేశు వెంటనే ఆచారి ఇంటికి వెళ్ళి, తండ్రి అనారోగ్యం గురించి ఆచారితో చెప్పాడు.
ఆచారి పరమేశు తండ్రిని పరీక్షించి, పరమేశు అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని, ఇది సామాన్యమైన రోగం కాదు. దీనిని నయం చేయాలంటే, రాజహంస గ్రుడ్డు కావాలి; అది దొరకడం అసంభవం. అన్నాడు.
అమాయకుడైన పరమేశు ఎలాగైనా రాజహంస గ్రుడ్డుని సాధించి తీసుకు వస్తానని చెప్పి, దాని గురించి వివరాలన్నీ ఆచారిని అడిగి తెలుసుకొని, గ్రుడ్డు కోసం బయలు దేరాడు.
ఎక్కడెక్కడో తిరిగి అలసిపోయిన పరమేశు ఒక చెట్టు క్రింద ఆగి విశ్రాంతి తీసుకోసాగాడు.
అయితే అదే సమయంలో మరో చెట్టు క్రింద విశ్రమించిన ఒక గాడిద... ఒక గ్రుడ్డును పెట్టింది.
ఆ వింతను చూసిన పరమేశు మరింత ఆశ్ఛర్య పోయి, ఆ గ్రుడ్డుని పరీక్షగా చూసేసరికి దానికి ఆచారి చెప్పిన లక్షణాలన్నీ ఉన్నాయి. అయితే రాజహంసకి బదులుగా గాడిద ఎందుకు గ్రుడ్డు పెట్టిందో బోధ పడలేదు.
ఏదైతేనేం మనకు కావల్సింది లభించింది కదా! అని అనుకొని, పరమేశు ఆ గ్రుడ్డుతో పాటు గాడిదను కూడా తన ఇంటికి తోలుకుపోయి గాడిదను పాకలో కట్టేసి, గ్రుడ్డు తీసుకువెళ్ళి ఆచారికి చూపించాడు.
బంగారు ఛాయలో ధగ ధగ లాడే ఆ గ్రుడ్డుని చూసి, ఆచారి మరింత ఆశ్ఛర్య పోయాడు.
అన్నమాట ప్రకారం ఆ గ్రుడ్డుతో ఆచారి ఔషధాన్ని తయారు చేసి, పరమేశు తండ్రి రోగాన్ని కుదిర్చాడు.
ఆ తరువాత పరమేశు నుండి ఆ గ్రుడ్డు ఎలా లభించిందా అని ఆరా తీసాడు.
లోకజ్ఞానం తెలియని అమాకుడైన పరమేశు... మా అయ్య (తండ్రి) రోగాన్ని కుదర్చడానికి ఆ భగవంతుడే రాజహంసని... ఈ భూమ్మీద గాడిదగా పుట్టించి ఉంటాడు. అంటూ తనకు ఆ గ్రుడ్డు ఎలా లభించిందో అన్ని వివరాలూ పూస గ్రుచ్చినట్లు ఆచారికి చెప్పాడు.
అంతా విన్న ఆచారి మరింత ఆశ్ఛర్యానికి లోనై, కావలసినంత డబ్బు తీసుకొని ఆ గాడిదను తనకు అమ్మమని అడిగాడు.
వెంటనే పరమేశు " ఆచారి గారూ! మీరు మాఅయ్య రోగాన్ని కుదిర్చారు. నాకు అదే చాలు. మీ బుుణాన్ని ఈ రూపంగా నైనా తీర్చుకోనివ్వండి." అంటూ పరమేశు ఆ గాడిదను స్వయంగా ఆచారి ఇంటికి తోలుకుపోయి, పాకలో కట్టేసి వచ్చాడు.
అయితే ఆ గాడిద ప్రతీ రోజూ ఒక గ్రుడ్డుని పెట్టసాగింది. ఆచారి బుఱ్ఱలో ఆశా పిశాచం ఆవహించింది. అతని బుద్ది మారిపోయింది. ఇక ఎప్పటికీ నయం కావు అనుకున్న దీర్ఘవ్యాధుల్ని సైతం నయం చేయసాగాడు. రోగ గ్రస్తులైన సంపన్న కుటుంబీకులకు రోగాల్ని నయం చేస్తూ వేలాది వరహాల్ని సంపాదించి గొప్ప శ్రీమంతుడయ్యాడు.
ఇలా ఉండగా ఒకనాడు ఆ దేశాన్నేలే రాజు గారు ఆచారికి కబురు పంపి, యువరాజుకి ఏర్పడిన విచిత్ర రోగాన్ని నయం చేయమని అడిగాడు.
అందుకు గాను వైద్యం నిమిత్తం లక్ష వరహాలు కావాలని అడిగి పుచ్చుకొని ఇంటికి తిరిగి వచ్చాడు ఆచారి. గాడిద ఎప్పుడు గ్రుడ్డు పెడుతుందా..ఎంత త్వరగా ఔషధం చేద్ధామా! అని ఎదురు
చూడసాగాడు.
అయితే నిజానికి ఆ గాడిద ఒక రాజహంస.
ఒకనాడు ఒక రాజహంస గగన మార్గాన పయనిస్తూ, రెట్ట వేసింది. అది సరాసరిగా సూర్య నమస్కారం చేసుకుంటున్న ఒక మహర్షి శిరస్సున పడింది. ఆ మహర్షి మహా కోపిష్టి కావడంతో.. కళ్ళల్లో నిప్పుల్ని కురిపిస్తూ, ఆకసం వైపు చూసి, రాజహంసవై ఉండి కూడా ఇంగిత జ్ఞానం లేకుండా గాడిదలా అప్రాచ్యపు పని చేసావు. భూలోకంలో గాడిదవై జన్మించు. అని శపించాడు.
వెంటనే రాజహంస మహర్షి వద్దకు వచ్చి తన తప్పిదాన్ని మన్నించమని ప్రాధేయపడింది.
మహర్షి ఎంత మాత్రం చలించక పోవడంకో కనీసం శాప విమోచన అయినా ప్రసాగించమని వేడుకున్నది.
మహర్షి కొంత సానుభూతిని కనబరుస్తూ, "నువ్వు రూపానికి గాడిదవైనా... నీ జాతి లక్షణాలనే కలిగి ఉంటావు. నూరు గ్రుడ్లను పెట్టడం పూర్తి కాగానే, తిరిగి రాజహంస రూపాన్ని పొందుతావు." అని శాప విముక్తి తెవిపాడు.
" మహా ప్రసాదం " అంటూ మహర్షికి నమస్కరించి, భూలోకం చేరి గాడిదగా మారి, ఆనాటి నుండి రోజుకి ఒక గ్రుడ్డుని పెట్టసాగింది.
అయితే అది అప్పటికే తొంబై కొమ్మిది గ్రుడ్లు పెట్టింది.
ఇక నూరవ గ్రుడ్డు పెడితే దాని శాపం తీరిపోతుంది. ఆ విషయం తెలియని ఆచారి... గాడిద పెట్టబోయే గ్రుడ్డు కోసం ఎదురు చూస్తుండగా ఆనాటి రాత్రి నూరవ గ్రుడ్డుని పెట్టింది.
ఆచారి ఎంతో ఆనందించాడు. అయితే ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. కారణం...గ్రుడ్డుని పెట్టిన మరు క్షణంలో ఆ గాడిద తనకు శాప విమోచన కలుగబోతున్నది అనే ఆనందంలో
ఆ గ్రుడ్డుని పొరపాటున కాలితో తొక్కేసి, రాజహంసగా మారిపోయి ఆకసంలోకి ఎగిరి పోయింది.
ఈ విషయం తెలియని ఆచారి సమయానికి గ్రుడ్జు దొరక్క పిచ్చి పట్టినట్లయి ఔషధాన్ని తయారు చేయలేక పోయాడు.
సమయానికి చికిత్స జరక్కపోవడంతో యువరాజు మరణించాడు.
ఆచారి లబో దిబో మన్నా వినిపించుకోకుండా ఆచారికి మరణశిక్ష విధించాడు.
ఈ కథ వలన నీతి :
(ఏ మనిషికైనా దురాశ వినాశనాన్ని తెచ్చి పెడుతుంది)