యోగసమాధిలో ఉన్న శివునికి సంగతంతా తెలిసింది. యోగాగ్నిలో సతీదేవి దేహత్యాగం, ప్రమథుల పరాజయం తెలిసి, కోపం తెచ్చుకున్నాడతను. కళ్ళు తెరిచాడు. దిగ్గున లేచి నిల్చున్నాడు. ప్రళయ తాండవం చేశాడు. ఆ తాండవంలో శిరస్సున జట ఒకటి తెంచి, భూమి మీదకి విసిరాడు. భయంకరంగా సింహంలా గర్జించాడు. చూస్తూండగానే జట నుండి మంటలు చెలరేగాయి. అంతెత్తున లేచాయవి. ఆకాశాన్ని దహించేట్టుగా నాలికలు చాపాయి.
ఆ మంటల్లోంచి అప్పుడు వీరభద్రుడు పుట్టాడు. వెయ్యి చేతులు, భయంకరంగా కోరలు, నల్లటి దేహంతో ఆకాశం అంత ఎత్తుగా నిలిచాడు వీరభద్రుడు. నిప్పులు చెరగుతున్న మూడు కళ్ళు, అగ్ని జ్వాలల్లా ఎగిసిపడుతున్న జటలు, వెయ్యి చేతుల్లోనూ త్రిశూలాది ఆయుధాలు, మెడలో కపాల మాలికలతో అరివీర భయంకరంగా ప్రత్యక్షమయ్యాడు వీరభద్రుడు. శివునికి సాష్టాంగ ప్రణామం చేశాడు.‘‘దేవా! ఆజ్ఞ’’ అన్నాడు.‘‘తక్షణం నువ్వు ప్రమథగణాలతో బయల్దేరి, దక్షుని యజ్ఞం ధ్వంసం చెయ్యి. బ్రాహ్మణ తేజం నిన్నేమీ చేయలేదు. నా అంశతో పుట్టిన నీకు ఎక్కడా ఎదురుండదు. వెళ్ళు.’’ ఆజ్ఞాపించాడు శివుడు.
లేచి నిల్చున్నాడు వీరభద్రుడు. శివునికి ప్రదక్షిణం చేశాడు. పెద్దగా కేకపెట్టాడు. అతని కేకకి సకల లోకాలూ తల్లడిల్లాయి. గాయాలపాలయి, కసితో ఉన్న ప్రమథగణాలను చూశాడు. ‘పదండి’ అన్నట్టుగా కళ్ళెగరేశాడు. కదిలాడక్కణ్ణుంచి. వీరభద్రుడు నడుస్తోంటే మృత్యుధూళి జగం అంతా నిండిపోయింది. దక్షుని యజ్ఞవాటికకు చేరుకున్నాడతను. వీరభద్రుణ్ణి చూస్తూనే దక్షుడు సహా దేవతలూ, మునులూ గజగజా వణకిపోయారు.
వీరభద్రుని అండ చూసుకుని ప్రమథులు రెచ్చిపోయారు. యజ్ఞశాలల్ని ధ్వంసం చేశారు. హోమకుండాల్ని చల్లార్చారు. వేదికల్ని పెకిలించి వేశారు. హోమద్రవ్యాల్ని విసిరి వేశారు.
మునులనూ, దేవతలనూ కసిదీరా కొట్టి తిట్టి బాధించారు. కళ్ళెదుట భర్తలు చావుదెబ్బలు తింటుంటే చూడలేక మునిపత్నులూ, సురాంగనలూ చేతుల్లో ముఖాలు దాచుకుని పరుగెత్తారక్కణ్ణుంచి. యజ్ఞవాటిక అంతటినీ శ్మశానవాటికలా చేసి, భీకరంగా నవ్వుతూ నిల్చున్నాడు వీరభద్రుడు. నందీశ్వరుడు, చండీశ్వరుడు, మణిమంతుడు, శృంగి, భృంగి మొదలయిన ప్రమథులంతా ఇంద్రాది దేవతలనూ, సూర్యచంద్రులనూ అనేక విధాల బాధించి, తీవ్ర అవమానాల పాల్జేశారు. మునులందరినీ తాళ్ళతో కట్టి పడేశారు.
ప్రమథుడొకడు, భృగుమహర్షి మీసాలు లాగివేశాడు. మరొకడు అతని కళ్ళు పెరికి వేశాడు. ఇంకొకడు భృగుని జాలిగా చూస్తున్న సూర్యుని వెంటపడి, అతని పళ్ళూడగొట్టాడు. వెన్నిచ్చి పారిపోతున్న దక్షుణ్ణి చేతులు జాచి అందుకున్నాడు వీరభద్రుడు. బంతిలా అతన్ని కింద పడేశాడు. లేవకుండా అతని రొమ్ము మీద కాళ్ళుంచి, మట్టిని తొక్కినట్టుగా తొక్కిపారేశాడు. కత్తితో శిరస్సు ఖండించాడు. తెగి పడ్డ శిరస్సును చేతిలోనికి తీసుకుని చూసి, ఆనందించి, దానిని దక్షిణాగ్నిలో హోమంలో వేశాడు. దక్ష సంహారంతో వచ్చిన పనయిపోయింది. ప్రమథులతో మరలిపోయాడు వీరభద్రుడు. కైలాసానికి చేరుకున్నాడు.
శివునితో వైరం తెచ్చుకున్న కారణంగా దక్షయజ్ఞానికి బ్రహ్మ, విష్ణువులు రాలేదు. తమ మిత్రుని అవమానం తమదిగా భావించి, ఆహ్వానాలు అందినా ఊరుకున్నారు వారు. బ్రహ్మ, విష్ణువులు వచ్చి ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదనుకుని, జరిగిందంతా విన్నవించేందుకు ముందు బ్రహ్మని సమీపించారు దేవతలూ, మునులూ. అంతా పూసగుచ్చినట్టుగా చెప్పారాయనకి. ఆ తర్వాత శివుని కోపం చల్లారి ఉండదని, ప్రమథులూ, వీరభద్రుడూ మళ్ళీ మీద పడే అవకాశం ఉన్నదని గోలు గోలున విలపించారు. తమని కాపాడమని వేడుకున్నారు.
అంతా విన్న బ్రహ్మ, బాగా ఆలోచించి, ఇలా అన్నాడు.‘‘శివుని కోపం చల్లార్చడం నా వల్ల కూడా కాదు. శాంతించమంటే నా మీదే తిరగబడొచ్చు. అందుకని, ఓ పని చేద్దాం. ఏమయితే అది అయిందని అందరం కలసికట్టుగా కైలాసానికి పోదాం. కాపాడమని ఆ పరమ శివుణ్ణే వేడుకుందాం. పరమ దయాళువు ఆ పరమేశ్వరుడు మన మొర వినకపోడు.’’
శివుని ఉగ్రస్వరూపం వీరభద్రుడు
మన దేశంలో చాలాచోట్ల వీరభద్రుని ఆలయాలు కనిపిస్తాయి. ఏ గ్రామంలో చూసినా వీరభద్రుని పురాతన విగ్రహాలు దర్శనమిస్తాయి. చాలామంది ఈ వీరభద్రుడు ఎవరో గ్రామదేవత అనుకుంటూ ఉంటారు. మరికొందరేమో ఈయనను పరమశివుని కుమారునిగా భావిస్తారు. ఇంతకీ ఈ వీరభద్రుడు ఎవరు? శివునితో ఈయనకు ఉన్న అనుబంధం ఏమిటి?
శివునికి సంబంధించిన గాథలలో దక్షయజ్ఞానికి ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకించి వివరించాల్సిన అవసరం లేదు. వీరభద్రుని ఆవిర్భావం గురించి చెప్పుకోవాలంటే ఈ దక్షయజ్ఞాన్ని తలుచుకోవలసిందే! దక్షునికి మొదటినుంచీ పరమేశ్వరుని పొడ గిట్టేది కాదు. కానీ ఆయన కుమార్తె సతీదేవి మనసు మాత్రం శివుని మీదే లగ్నమై ఉండేది. ఆమెను శివునికి తప్ప వేరెవ్వరికైనా కట్టబెట్టేందుకు దక్షుడు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఆఖరికి సతీదేవి వివాహం చేసేందుకు, శివుని తప్ప మిగతా దేవతలందరినీ స్వయంవరానికి పిలిచాడు దక్షుడు. కానీ అక్కడ శివుని శిల్పం మెడలోనే తన పూలహారాన్ని వేసి, తన మనసులో శివునికి తప్ప అన్యులకు స్థానం లేదని చెప్పకనే చెప్పింది సతీదేవి. ఇక దక్షునికి కుమార్తె మనసుని ఆలకించడం మినహా వేరే గత్యంతరం లేకపోయింది.
శివుని తన అల్లునిగా చేసుకున్నప్పటికీ, అతనని ఎలాగైనా అవమానించాలన్న సంకత్పంతో రగిలిపోయాడు దక్షుడు. అందుకోసం ఒక గొప్ప యజ్ఞాన్ని తలపెట్టాడు. ఆ యజ్ఞానికి సమస్త దేవతలనూ ఆహ్వానించాడు- ఒక్క శివుని తప్ప! శివునికి దక్షుని మనసులో ఉన్న ద్వేషం అర్థం కావడంతో ఆ యజ్ఞానికి తాను కూడా దూరంగా ఉన్నాడు. కానీ సతీదేవికి మాత్రం తన తండ్రి అంగరంగవైభవంగా తలపెట్టిన యజ్ఞంలో పాలుపంచుకోవాలన్న కోరిక కలిగింది. శివుడు ఎంతగా వారించినా వినకుండా ఆ యజ్ఞవాటికను చేరుకుంది. అక్కడ శివుడు ఊహించిందే జరిగింది. దక్షుడు శివుని అనరాని మాటలూ అనడం మొదలుపెట్టాడు. ఆ మాటలకు అవమానం చెందిన సతీదేవి తనను తాను అగ్నికి ఆహుతి చేసుకుంది.
సతీదేవి ఆత్మాహుతి గురించి విన్న పరమేశ్వరుడు క్రోధంతో రగిలిపోయాడు. తన కేశాన్ని పెరికి నేలకేసి కొట్టాడు. అప్పుడు ఉద్భవించిన ఉగ్రరూపమే వీరభద్రుడు. ఆకాశమంత ఎత్తున, కారుమేఘపు చాయతో, పదులకొద్దీ ఆయుధాలను ధరించిన చేతులతో ఆవిర్భవించాడు వీరభద్రడు. ఆ వీరభద్రునికి తోడుగా అవతరించిన శక్తి స్వరూపమే భద్రాకాళి. దక్షవాటికను ధ్వంసం చేయమంటూ వారిని అజ్ఞాపించిడమే ఆలస్యం. ప్రమథగణాలతో కలిసి వారిరువురూ విధ్వంసాన్ని సృష్టించారు
దక్షుని రాజ్యంలో వీరభద్రుడు వేసిన వీరంగం అంతాఇంతా కాదు. అడ్డువచ్చిన వారికి ఘోర అవమానమే ఎదురైంది. చంద్రుడు, అగ్ని, పూషుడు. ఎవ్వరూ వీరభద్రుని ఆపలేకపోయారు. మెడలో కపాలమాలతో వీరభద్రడు, నిప్పులను చిమ్ముతూ భద్రకాళి ఆ రాజ్యం యావత్తునూ రణరంగంగా మార్చేశారు. చివరికి దక్షుని కాపాడేందుకు ఆ విష్ణుమూర్తే వీరభద్రుని ఎదుర్కోవలసి వచ్చింది. ఎదురుగా సాక్షాత్తూ ఆ నారాయణుడే నిలిచినా, వీరభద్రుని నిలువరించడం సాధ్యం కాలేదు. ఇరువురి మధ్యా ఘోర సమరం జరిగింది. ఆ పోరు ధాటికి ముల్లోకాలూ కంపించిపోయాయే కానీ, వారిరువురిలో ఏ ఒక్కరూ వెనక్కి తగ్గలేదు. ఇక విష్ణుమూర్తి తన ఆఖరి ఆస్త్రంగా సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. ఆశ్చర్యం! వీరభద్రుడు ఆ సుదర్శన చక్రాన్ని కూడా మింగివేసి ముందుకురికాడు. ధర్మాగ్రహంతో ప్రళయకారునిలా విజృంభిస్తున్న వీరభద్రుని నిలువరించడం ఎవ్వరి తరమూ కాదని తేలిపోవడంతో, ముక్కోటి దేవతలూ తప్పుకున్నారు. దక్షుని మీ వీరభద్రుడు పగని తీర్చుకునేందుకు అవకాశాన్నిచ్చారు. అంతట వీరభద్రుడు కసితీరా దక్షుని సంహరించి విజయగర్వంతో కైలాసానికి బయల్దేరాడు.
ఇదీ వీరభద్రుని విజయగాథ! శివుని ఉగ్ర స్వరూపంగా ఈ వీరభద్రుని భక్తులు కొలుచుకుంటారు. దేశమంతా ఈ వీరభద్రుని ఆలయాలు ఉన్నప్పటికీ, దక్షిణభారతంలో మాత్రం గ్రామగ్రామానా ఈ స్వామి దర్శనమిస్తుంటాడు. కోరిన వరాలను తీర్చే కల్పతరువుగా, అడ్డంకులను తొలగించే నాథునిగా, నిరాడంబరమైన పూజకు లొంగిపోయే భోళా శంకరునిగా. భక్తుల మనసుని నిలిచి ఉంటాడు.
‘‘అయితే ఆలస్యం దేనికి, పదండి.’’ అన్నారంతా. బయల్దేరారు. కైలాసానికి చేరుకున్నారు. పరమ శివుణ్ణి పలు విధాల స్తోత్రం చేశారు. ప్రార్థించారు.‘‘దేవాదిదేవా! మహాశివా! నీకు యజ్ఞభాగం లేకుండా చేసిన దక్షునికి తగిన శాస్తే జరిగింది. అయిపోయిందేదో అయిపోయింది. ఇక మీదట నీ యజ్ఞభాగం నీదే! ఎప్పటిలా హవిర్భాగాన్ని అందుకొంటావు.’’ అన్నాడు బ్రహ్మ.‘‘కరుణించు దేవా! కటాక్షించు.’’ మొక్కుకున్నారంతా. శివుని కోపం చల్లారిందప్పుడు. కళ్ళు తెరిచి, అందరినీ కరుణించాడు. దేవతల్నీ, మునుల్నీ అనుగ్రహించాడు. తెగిన శిరస్సు స్థానంలో మేక తలని అతికించి, దక్షుణ్ణి బతికించాడు. భృగునికి కళ్ళూ, సూర్యునికి పళ్ళూ ప్రసాదించాడు. యజ్ఞశాలలో ప్రాణాలు కోల్పోయిన వారందరినీ పునర్జీవితుల్ని చేశాడు. అందరికీ ప్రాణాలు పోశాడు. భృగుమహర్షికి మేక మీసాలు పెట్టాడు. యథావిధిగా యజ్ఞం కొనసాగించండన్నట్టుగా యజ్ఞవాటికను శోభిల్ల చేశాడు. తనని క్షమించమని శివుణ్ణి వేడుకున్నాడు దక్షుడు. చేతులు జోడి ంచి, సర్వేశ్వరుణ్ణి స్తుతించాడు. యజ్ఞాన్ని ప్రారంభించాడు. ఎలాంటి అడ్డంకులూ లేకుండా యజ్ఞం పూర్తయింది. యజ్ఞవాటికలో అప్పుడు విష్ణువు ప్రత్యక్షమయ్యాడు. అందరినీ దీవించి ఇలా అన్నాడప్పుడు.‘‘నాకూ శివునికీ భేదం లేదు. శివుణ్ణి నిందిస్తే నన్ను నిందించినట్టే! శివనిందని మించిన పాపం కూడా లేదు.’’‘‘అవునవును’’ అన్నారంతా. విష్ణువుకి సాష్టాంగ పడ్డారు.-ఇదీ దక్షయజ్ఞం కథ. ఈ కథ విన్నా చదివినా సమస్త పాపాలూ పోతాయి. ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. శివుని కరుణా కటాక్షాన్ని అందుకుంటారు.
కోదండరాం కూరెళ్ల
https://t.me/koorellaBhagavatham
No comments:
Post a Comment