హిరణ్యాక్షుని కథ ఇలా ప్రారంభమయింది.
దక్షుని కూతురు దితి, కశ్యప ప్రజాపతిని పెళ్ళాడింది.ఒకానొక అసురసంధ్య వే ళ ఆమెకి మన్మథోద్రేకం కలిగింది. భర్తను సమీపించింది. కశ్యపుడు అప్పుడు అగ్నిశాలలో ఉన్నాడు. నియమవ్రతుడై భగవంతుని ధ్యానిస్తున్నాడు. తన కోరికను తీర్చమని అడిగింది దితి.‘‘నాథా! మన్మథబాధను తాళలేకుండా ఉన్నాను. రా! నాతో సంగమించు. నా సవతులు అదితి, వినత, కద్రువ…ఇంకా అనేక మంది గర్భవతులు. నేనే గర్భవతి కానిది. సహించలేకపోతున్నాను. నాకు సంతాన భిక్ష పెట్టు.’’ ప్రార్థించింది. నవ్వాడు కశ్యపుడు. ఇలా అన్నాడు.
‘‘నీ మనోభీష్టం తప్పకుండా నెరవేరుస్తాను. అయితే ఇది మూడు సంధ్యలూ ముడిపడే వేళ. ఇది భయంకరులకు కూడా మహా భయంకరమయిన సమయం. రుద్రుడు భూతగణాలతో సంచరించే సమయం. ఈ సమయంలో సంగమించకూడదు. ఓ ఘడియసేపాగు. తర్వాత నీ కోరిక తీరుస్తాను.’’వినలేదు దితి. మన్మథోద్రేకాన్ని తట్టుకోలేకపోయింది. ఒళ్ళు విరుచుకోసాగింది. కామం కళ్ళు కప్పడంతో కశ్యపుని గట్టిగా కౌగిలించుకుంది. విడిపించుకోజూసిన కశ్యపుణ్ణి కదలనీయక, అధరామృతాన్ని అందించింది.‘అంతా దైవప్రేరణ. తప్పదిక.’ అనుకున్నాడు క శ్యపుడు. నిష్ఠని వదలి వేశాడు. దితిని ముద్దిడితూ తీసుకుని వెళ్ళి ఆమె కోరికను తీర్చాడు. తర్వాత నదికి చేరుకుని స్నానం చేసి శుచి అయినాడు. సంధ్యావందనాదులు పూర్తి చేశాడు. మౌనం దాల్చి, బ్రహ్మోపాసన చేయసాగాడు.కోరిక తీరడంతో శరీరం చల్లబడి, తాను చేసిన తప్పేమిటో గ్రహించింది దితి. చేసిన తప్పుకి సిగ్గుపడింది. ఎంతగానో బాధపడింది. భర్తని సమీపించి మన్నించమని వేడుకుంది.‘‘నాథా! నువ్వు చెబుతూనే ఉన్నావు, వినలేదు. పాపాన్ని చేశాను. రుద్రుడికి కోపం కలిగించానేమో! నా గర్భస్థ శిశివుని హింసిస్తాడేమో! దేవతలు ఏ అపకారాన్ని తలపెడతారో! నువ్వే నాకు దిక్కు.’’ అంది దితి.మౌనాన్ని వీడాడు కశ్యపుడు. ఇలా అన్నాడప్పుడు.‘‘జరిగిందంతా విధికృతం. దీనిని తప్పించడం ఎవరితరమూ కాదు. అసురసంధ్యవేళ నన్ను కోరావు కనుక నీకందరూ రాక్షసులే జన్మిస్తారు. నీ కొడుకులిద్దరు మహారాక్షసులై లోక కంటకులవుతారు. దేవతలనూ, మునులనూ హింసించి, ముల్లోకాలనూ ఆక్రమించుకుంటారు. ఆఖరికి ఆ శ్రీహరి చేతిలో మరణిస్తారు.’’దితి అందుకు చాలా దుఃఖించింది.
అయితే కొడుకులిద్దరూ భగవంతుని చేతిలో మరణిస్తారని తెలిసినందుకు కొంతలో కొంత మేలనుకుంది.‘‘నా కడుపున పుట్టిన బిడ్డలంతా రాక్షసులై లోకకంటకులై నానా అల్లరీ చేసి నాకు అమర్యాద కలిగించడమేనా? అంతేనా నా బతుకు? గొప్పవాడు ఒక్కడు కూడా పుట్టే అవకాశమే లేదా?’’ కన్నీరు మున్నీరయింది దితి.‘‘కొడుకుగా పుట్టే అవకాశం లేదు. గొప్పవాడు నీకు మనవడుగా పుడతాడు. రాక్షసుని కడుపున పుట్టినా అతగాడు గొప్ప హరిభక్తుడై పరమ భాగవతోత్తముడు అవుతాడు. సచ్చరిత్రుడై నీకు ఎనలేని కీర్తి ప్రతిష్ఠలు కలిగిస్తాడు. వాడి కీర్తిని సమస్తలోకాలూ గానం చేస్తాయి. చాలా?’’‘‘చాలు’’ అంది దితి. చేతులు జోడించి నమస్కరించి వెళ్ళిపోయిందక్కణ్ణుంచి. గర్భవతి అయింది. నూరు సంవత్సరాలు గడిచాయి. అప్పుడామె గర్భంలో ఉన్న తేజస్సు దిక్కులన్నిటా అలుముకుంది. ఆ తేజస్సు ముందు సూర్యచంద్రులు వెలవెలబోయారు. ఏది పగలో ఏది రాత్రో తెలియని స్థితి. మునులకీ, దేవతలకీ అంతు చిక్కలేదేదీ. బ్రహ్మని సమీపించారంతా. నమస్కరించారు.‘‘ఏమిటి దేవా, ఏమిటిదంతా?’’ అడిగారు.‘‘ఇదంతా దితి మహిమ. దీనంతటికీ దితి గర్భమే కారణం.’’ అన్నాడు బ్రహ్మ.
తర్వాత జయవిజయులిద్దరూ శాపవశాన ఆమె గర్భాన రాక్షసులుగా జన్మించనున్నారని తెలియజేశాడు. భయపడిన మునులనూ, దేవతలనూ చూసి ఇలా చెప్పాడు.‘‘ఆ రాక్షసులిద్దరినీ శ్రీహరి సంహరిస్తాడు. లోకాల్ని కాపాడుతాడు.’’మునులూ, దేవతలూ అందుకు సంతోషించారు. నిష్క్రమించారక్కణ్ణుంచి.
కోదండరాం కూరెళ్ల
https://t.me/koorellaBhagavatham
No comments:
Post a Comment