Wednesday, 16 June 2021

పోతన భాగవతం 0013

నంది శాపానికి భృగుమహామునికి కోపం వచ్చింది. దిగ్గున లేచి నిల్చున్నాడతను.‘‘నందీ! నిష్కారణంగా మా మునులను శపించావు. నేనూ శపిస్తున్నాను, చూడు! కేవలం శివుణ్ణి కొలిచేవారంతా వేద విరుద్ధ కర్మలాచరిస్తూ పాషాండులయి పడి ఉందురుగాక.’’ అన్నాడు.శాపాలు, ప్రతిశాపాలతో సభామండపం అంతా అట్టుడుకుపోవడాన్ని తట్టుకోలేని శివుడు, తన పరివారంతోఅక్కణ్ణుంచి నిష్క్రమించాడు. శంకరుని నిష్క్రమనానంతరం మరీచ్యాదులు వెయ్యేళ్ళు సత్రయాగం చేసి, తృప్తి చెందారు. గంగా యమునా సంగమంలో అవభృధస్నానం చేసి, ఎక్కడి వారక్కడికి వెళ్ళిపోయారు.యాగం పూర్తయినా, ఎవరి మానాన వారున్నా మామా అల్లుళ్ళ మధ్య ఆ యాగం రేపిన విరోధం మాత్రం సమసిపోలేదు. పైగా నానాటికీ పెరిగి పెద్దదయింది.దక్షుడు అనేక యాగాలు చేశాడు. ఆ యాగాలు వేటికీ శివునికి ఆహ్వానించలేదతను. హవిర్భాగం అందివ్వలేదు. తర్వాత వాజపేయం చేశాడు దక్షుడు. దాని తర్వాత బృహస్పతి సవనం ప్రారంభించాడు. ఆ యగానికి దేవతలూ, బ్రహ్మర్షులూ, మహారుషులూ అంతా బంధు మిత్ర సపరివారంగా బయల్దేరారు. వారంతా దక్షాధ్వరం గురించి గొప్పగా చెప్పుకోవడాన్ని వినువీధిన విన్నది సతీదేవి. తనూ కూడా ఆ యజ్ఞానికి వెళ్ళాలనుకుంది. అనుమతి కోసం శంకరుణ్ణి సమీపించిందామె. చేతులు జోడించి, నమస్కరించింది.‘‘ప్రాణనాథా! నా తండ్రి గొప్ప యజ్ఞం చేస్తున్నాట్ట! అంతా సపరివారంగా తరలి వెళ్తున్నారు. నాకూ వెళ్ళాని ఉంది. దయచేసి అనుమతించండి, వెళ్ళి వస్తాను. మీకూ, నా తండ్రిగారికీ సరిపడదని తెలుసు. మీరు రారనీ తెలుసు. అయినా అడుగుతున్నానంటే నన్ను అర్థం చేసుకోండి! నేను ఆ ఇంటి ఆడబిడ్డను. పుట్టింటి మీద మమకారంతో ప్రార్థిస్తున్నాను. పైగా నా తోబుట్టువులంతా ఈ యాగానికి వస్తున్నట్టుగా తెలిసింది. వారిని చూసి, చాలా యేళ్ళయింది. ఈ యాగం రూపేణా వారినీ చూసినదానినవుతాను. మా అమ్మను కూడా చూడాలని ఉంది. దయచేసి అంగీకరించండి.’’ వేడుకుంది. 


సమాధానంగా ముందు సన్నగా నవ్వాడు శివుడు. తర్వాత ఇలా అన్నాడు.‘‘సతీ! నీ మాటను నేను కాదనను. పుట్టింటికి వెళ్తానంటే పంపనని అనలేను. కాకపోతే ఒక్క విషయం ఆలోచించుకో! నీ తండ్రికీ నాకూ బద్ధవైరం. ఐశ్వర్యమదంతో విర్రవీగుతున్నాడు. మన పొడే గిట్టదతనికి. అటువంటి చోటుకి వెళ్తానంటున్నావు. నిన్ను మర్యాదగా చూస్తారంటావా? లేనిపోని తలవంపులు తెచ్చుకుంటావేమో అనిపిస్తోంది. దేనినయినా భరించవచ్చు కాని, అవమానాన్ని భరించలేం. శత్రువు అవమానిస్తే భరించగలమేమో! అయిన వారూ, అమ్మవంక వారూ అవమానిస్తే తట్టుకోవడం కష్టం. నలుగురిలో నవ్వుల పాలవ్వడం దుర్భరం. అంత కంటే మరణమే మేలనిపిస్తుంది.’’ అన్నాడు శివుడు.తల దించుకుంది సతీదేవి.‘‘పైగా ఇది పిలవని పేరంటం. ఎంత పుట్టింటివారయినప్పటికీ, పిలవకుండా వెళితే అవమానం కాదంటావా? అందుకని నా మాట విను. వద్దు. నువ్వు అక్కడికి వెళ్ళొద్దు.’’వినిపించుకోలేదు సతీదేవి. శివుడు ఎన్ని విధాలా చెప్పినా పుట్టింటి మీది మమకారాన్ని చంపుకోలేకపోయిందామె. యజ్ఞానికి వెళ్ళి తీరాల్సిందేనని పట్టుబట్టింది. శంకరుడు సర్వేశ్వరుడు. అతనికి జరగబోయేదంతా తెలుసు. తెలుసు కనుకనే వద్దని వారించాడు. వినడం లేదు సతీదేవి. తప్పదనుకున్నాడప్పుడు.‘‘సరే నీ ఇష్టం. వెళ్ళు.’’ అన్నాడు శివుడు.శివుని ఆనతి లేనిదే చీమయినా కదలదు. తను దాన్ని బలవంతంగా పొందింది. దీని పర్యవసానం ఎలా ఉంటుందో? వెళ్దామా? వద్దా? చాలాసేపు తీవ్రంగా ఆలోచించింది సతీదేవి. ఆఖరికి పుట్టింటి మీది ప్రేమతో వెళ్ళేందుకు సిద్ధమయింది.

(AN జగన్నాధశర్మ - ఆంధ్రజ్యొతి)

కోదండరాం కూరెళ్ల 

https://t.me/koorellaBhagavatham

No comments:

Post a Comment