అంగీరసుడికీ శ్రద్ధకీ బృహస్పతి మొదలగు వారు జన్మిస్తే, పులస్త్యుడు, హవిర్భుక్కుకు అగస్త్యుడు, విశ్రవసువు జన్మించారు. విశ్రవసు, ఇలబిలకు కుబేరుడు జన్మించాడు. విశ్రవసుకు అతని రెండవ భార్య కేకసికీ రావణ, కుంభకర్ణ, విభీషణాది దానవులు జన్మించారు. క్రతువుకీ క్రియకీ వాలఖిల్యాది అరవైమంది మహామునులు జన్మించారు. అరుంధతి వశిష్ఠులకు సురోచి, విరజుడు మొదలయిన తొమ్మిది మంది కుమారులు కలిగారు. వశిష్ఠుని రెండో భార్య శక్తిముఖ పుత్రులను కన్నది. భృగువుకీ ఖ్యాతికీ దాత, విధాత అనే ఇద్దరు కుమారులు, శ్రీ అనే కుమార్తె కలిగారు. దాత విధాతలు మేరువు అనే మునీంద్రుని కుమార్తెలు ఆయతిని, నియతిని పెళ్ళాడారు. ఆయతికి మృకండుడు, నియతికి ప్రాణుడు జన్మించారు. మృకండుడికి మార్కేండేయుడు, ప్రాణుడికి వేదశిరుడు జన్మించారు. ఈ వేదశిరుని కుమారుడే శుక్రాచార్యుడు.దక్షప్రజాపతికీ ప్రసూతికీ పదహారు మంది కుమార్తెలు జన్మించారు. వారిలో పదమూడు మందిని ధర్ముడికి ఇచ్చి వివాహం జరిపించాడు దక్షుడు. ఆ పదమూడు మందిలో చివరిదయిన మూర్తికి నరనారాయణులు జన్మించారు. వీరే లోక రక్షణార్ధం ద్వాపరయుగంలో కృష్ణార్జునులుగా జన్మించారు. దక్షుని కూతురు స్వాహాదేవి అగ్నిహోత్రుణ్ణి పెళ్ళాడింది. దక్షుని ఆఖరి కూతురు, మహాసాధ్వి సతీదేవి పరమ శివుణ్ణి పెళ్ళాడింది. మహాశివుడు అల్లుడు అయినందుకు ఆనందించక, అతనితో విరోధం తెచ్చుకున్నాడు దక్షుడు. కన్నకూతురు సతీదేవిని అవమానించి, అనర్ధం కొని తెచ్చుకున్నాడు.
అదేమిటో తెలుసుకోవాలనుకుంటే...ఒకప్పుడు మరీచుడు మొదలయిన ప్రజాపతులంతా సత్రయాగం చేసేందుకు సిద్ధమయ్యారు. ఆ యజ్ఞాన్ని చూసేందుకు దేవతలూ, మునులూ అంతా తరలి వచ్చారు. దక్షుడు కూడా సపరివారంగా వచ్చాడక్కడకి. అప్పుడు బ్రహ్మ, శివుడు తప్ప అంతా దక్షుని చూసి, గౌరవ సూచికంగా లేచి నిల్చున్నారు. శివుడు లేచి నిల్చోలేదని, తనని గౌరవించలేదనీ కోపం వచ్చింది దక్షునికి. తండ్రి బ్రహ్మకి నమస్కరించి, ఆ అగౌరవానికి అల్లుడు శివుణ్ణి నానా దుర్భాషలాడాడు.‘‘మునులారా! దేవతులారా! చూశారుగా, నేనొస్తే గౌరవంతో మీరంతా లేచి నిల్చున్నారు. ఈ శివుడు మాత్రం, తానేదో అధికుణ్ణన్నట్టుగా కూర్చున్న చోటు నుంచి లేచి నిల్చోలేదు. నిండు సభలో నన్ను అవమానించాడు. దుష్టుడు వీడు. లోకపాలకుడన్న పేరుకే అప్రతిష్ఠ తెచ్చి పెట్టాడు. ఇలాంటి వాడని తెలియక, నా కుతుర్నిచ్చి పెళ్ళి చేశాను. తప్పు చేశాను. కురూపి, భయంకరాకారుడు, దురహంకారి, జడలు విరబోసుకుని, దిగంబరంగా శ్మశానంలో తిరిగేవాడు. భూత పిశాచాలు పరివారం. వల్లకాటి భస్మం గంధం. ఇలాంటివాడు నాకు అమర్యాద చేస్తాడా? వీణ్ణి ఇప్పుడే శపిస్తాను.’’ అన్నాడు దక్షుడు. జలం తీసుకున్నాడు.
‘‘ఇక మీదట ఇంద్రాది దేవతలతో పాటుగా హవిస్సులందు ఈ శివుడికి, ఈ దురాచారికి భాగం లేకుండుగాక.’’ అని శపించాడు. శపించి, అక్కణ్ణుంచి చరచరా వెళ్ళిపోయాడు.తనని మామగారు అనరాని మాటలు అన్నప్పటికీ, తనని శపించినప్పటికీ, నవ్వుతూ కూర్చున్నాడేగాని, మారుమాటాడలేదు శివుడు. దక్షునికి భయపడి మిగిలిన వారూ మాట్లాడలేదు. అంతటా భరించలేని నిశ్శబ్దం నిండుకుంది. దాన్ని భరించలేకపోయాడు శంకరుని పరిచారకుడు నంది. పట్టరాని కోపంతో ఊగిపోయాడతను.‘‘విన్నారుగా దక్షుని కారు కూతలు. విని కూడా మీరంతా ఊరుకున్నారంటే మిమ్మల్నేమనుకోవాలి? శివనింద మహా పాపం అని తెలియదా? అశాశ్వతమయిన సంపద, అధికారం, భోగభాగ్యాలు చూసుకుని, దక్షుడు విర్రవీగుతున్నాడు. అతనికి మీరంతా వత్తాసు పలుకుతున్నట్టుగా ఊరుకున్నారు. తప్పు. లోకపూజ్యుడయిన శంకరుణ్ణి నిందించి, దక్షుడు చేజేతులా కష్టాన్ని కొనితెచ్చుకున్నాడు.త్వరలోనే దక్షుడు మేషముఖుడై పశువులా ప్రవర్తిస్తాడు. ఇది నా శాపం.’’ అన్నాడు నంది.ఆ శాపానికి అక్కడున్న మునులంతా ఒకరినొకరు చూసుకున్నారు. ఏదో మాట్లాడాలనుకుని, మనకెందుకనుకున్నారేమో! వూరుకున్నారు మళ్ళీ. అది గమనించాడు నంది. ఇలా శపించాడు వారిని.‘‘శివనింద చెవులారా వింటూ మారు మాటాడని మీరంతా విద్యలభ్యసించి గొప్పవారయినా, ఉదరపోషణార్థం యాచకులై పోదురుగాక.’’ (సశేషం)
కోదండరాం కూరెళ్ల
https://t.me/koorellaBhagavatham
No comments:
Post a Comment