Wednesday, 16 June 2021

పోతన భాగవతం 0014

దక్షయజ్ఞం ధ్వంసం:వీరభద్ర జననం

శివుడు ఎన్ని విధాల చెప్పినా వినిపించుకోలేదు సతీదేవి. పుట్టింటి మీది మమకారాన్ని చంపుకోలేకపోయింది. దక్షయజ్ఞానికి వెళ్ళి తీరుతానని పట్టుబట్టింది. అంగీకరించక తప్పలేదు శివునికి. ‘సరే! వెళ్ళు’ అన్నాడతను.సతీదేవి ఒంటరిగా బయల్దేరింది. ఆమె అలా ఒంటరిగా బయల్దేరడం, ప్రమథులకి ఆందోళన కలిగించింది. ఇంత మంది ఉన్నా ఎవరూ లేని దానిలా సతీదేవి ఒంటరిగా పుట్టింటికి పయనమవడం బాధ కలిగించింది వారికి. కాలినడకన వెళ్తున్న సతీదేవిని చూసి కళ్ళు చెమర్చుకున్నారు. తప్పు! ఇది భావ్యం కాదనుకున్నారు. కూడబలుక్కున్నారంతా. కానుకలు, వాహనాలు, వాయిద్యాలు సమకూర్చున్నారు. ఈ లోపు సతీదేవిని చక్కగా అలంకరించారు. నంది వాహనంపై కూర్చోబెట్టారు. ‘పదమ్మా’ అంటూ ఆమె వెంట తరలి వెళ్ళారు. అంతా దక్షుని యజ్ఞవాటికకు చేరుకున్నారు.యజ్ఞం మహా వైభవంగా జరుగుతోందక్కడ. సమస్త దేవతలూ, మునులూ కొలువుదీరి ఉన్నారు. అంతటా వేదఘోష వినవస్తోంది. చూసి పొంగిపోయింది సతీదేవి. యజ్ఞశాలలోకి ప్రవేశించింది. అయిన వారూ, అమ్మ వంక వారూ గుంపులు గుంపులుగా ఉన్నా, సతీదేవిని ఒక్కరూ ‘వచ్చావా తల్లీ’ అంటూ పలకరించలేదు. పలకరిస్తే ప్రమాదం అన్నట్టుగా ఊరుకున్నారంతా. దక్షుడు అసలు పట్టించుకోలేదు. కన్నెత్తి కూడా కూతురిని చూడలేదు. బాధపడింది సతీదేవి. తల దించుకుని నిలబడింది. అంత దూరం నుండి తల్లి గమనించిందది. పరుగున వచ్చింది. సతీదేవిని గట్టిగా కౌగిలించుకుంది.‘‘వచ్చావా తల్లీ! రావేమో అనుకున్నాను.’’ అంది.‘‘ప్రయాణం చేసి అలసిపోయినట్టున్నావు’’ అంది. చీర కొంగుతో కూతురు ముఖాన్ని తుడిచింది.తల్లి ఎప్పుడయితే సతిని చేరదీసిందో అప్పుడు ఇక ప్రమాదం లేదనుకుని, తోబుట్టువులంతా చుట్టుముట్టారామెను. అభిమానంగా పలకరించారు. ‘రా రా’ అంటూ సరసన కూర్చోబెట్టుకునేందుకు సిద్ధపడ్డారు. కూర్చోలేదు సతి. కళ్ళెర్రజేసుకుని నిలబడింది.అమ్మ అక్కున చేర్చుకుంది. తోబుట్టువులు చేరదీశారు. నాన్న రాడే! వచ్చి పలకరించడే! అంత కానిదయిపోయిందా తను? తండ్రి చేసిన అవమానాన్ని తట్టుకోలేకపోతోంది సతీదేవి. తోబుట్టువులంతా కుటుంబసమేతంగా వచ్చారు.

వారందరినీ పేరు పేరునా పిలిచి, తన భర్తనే తండ్రి పిలకపోవడాన్ని భరించలేకపోయిందామె. మండుతున్న కళ్ళను ఒక్క క్షణం మూసుకుని, తెరిచింది. నిప్పుకణాల్లా, నెత్తురు చుక్కల్లా సతీదేవి కన్నీటిబొట్లు జలజలా నేల రాలాయి. చూశారది ప్రమథులు. కోపోద్రిక్తులయ్యారు. దక్షుని వధించేందుకు కత్తులు దూశారు. వారిని వారించింది సతీదేవి. తండ్రిని కోపంగా చూస్తూ ఇలా అంది.‘‘మదాంధుడువై నా భర్త శివుణ్ణి ద్వేషిస్తున్నావు. నీకిది మంచిది కాదు తండ్రీ! సర్వేశ్వరుడు నా భర్త ఎక్కడ? అధమాధముడవి నువ్వెక్కడ? నా భర్తకు హవిర్భాగం లేకుండా చేస్తావా? మమ్మల్ని అవమానిస్తావా? దీనికి ఇంతకింతా అనుభవిస్తావు నువ్వు. నీ తనువున పుట్టిన పాపాన్ని నేను భరించలేను. నాకీ శరీరం వద్దు. ఇప్పుడే ఈ క్షణమే ఈ శరీరాన్ని వదలి వేస్తాను. పవిత్రురాలునవుతాను.’’అయోమయంగా ఆందోళనగా చూస్తున్న మునులనూ, దేవతలనూ కడగంట చూసి, కుశలు పరచింది సతీదేవి. వాటిపై ఉత్తరదిశగా కూర్చుంది. కళ్ళు మూసుకుంది. చిత్తం పరమశివుని అధీనం చేసి, నవరంధ్రాలనూ బంధించింది. మహా మహా యోగులకు కూడా సాధ్యం కాని యోగాన్ని ఆరంభించింది. పంచప్రాణాలనూ వాటి మూలస్థానాల్లోంచి కదలించింది. దాంతో సమాధి స్థితిలో ఉన్న ఆమె శరీరం నుండి మంటలు ఎగసిపడ్డాయి. ఆ యోగాగ్నిలో సతీదేవి దహనమయిపోయింది. ఆమె అలా దహనమయిపోవడం ఏమిటి, ముల్లోకాల్లోనూ హాహాకారాలు చెలరేగాయి. భయంతో సమస్త భూతకోటీ కంపించింది.

దక్షుణ్ణి అంతా అసహ్యించుకున్నారు.ప్రమథులు మరిక ఆగలేదు. యజ్ఞవాటికలో ఉన్న అందరినీ చంపేందుకు సిద్ధమయ్యారు. భృగుమహాముని అది గమనించి, ఋషుల్ని కాపాడేందుకు దక్షిణాగ్నిలో అభిచార హోమం చేశాడు. ఆ హోమ ఫలితంగా ఋభనామకులు దేవతలు వేలాదిగా పుట్టుకొచ్చారు. యజ్ఞశాలలోని కొరవులనే ఆయుధాలుగా ధరించి, దండెత్తి వచ్చిన ప్రమథులను ఎదుర్కొన్నారు. వారిని కొట్టిన చోట కొట్టకుండా కొట్టి, అక్కణ్ణుంచి తరమి కొట్టారు.


(AN జగన్నాథశర్మ - ఆంధ్రజ్యోతి)

కోదండరాం కూరెళ్ల 

https://t.me/koorellaBhagavatham

No comments:

Post a Comment