Friday, 1 April 2022

సంతృప్తి

శివపురం అనే ఊరిలో సూరయ్య అనే వ్యక్తి నివసించేవాడు. 


అతనిది మహా జాలి గుండె. పైకి ఎగరలేని పక్షులు, వయసు ఉడిగి పోవడంతో పాలివ్వలేని జంతువులను చేరదీసి అతని ఇంటి పెరట్లో వాటిని పెంచుతున్నాడు. 


పక్షులకు అవసరమైన తిండి గింజలు, జంతువులకు అవసరమైన గడ్డిని పట్నం నుంచి తెచ్చి మరీ వాటికి పెట్టేవాడు. 


పక్షులు, జంతువులు అవి తిని కడుపు నింపుకుంటుంటే సంతృప్తి చెందేవాడు.


ఒకరోజు సూరయ్య జంతువుల, పక్షుల తిండి గింజలు కొనడం కోసమని పట్నం వెళ్లాడు. 


తిరిగి వచ్చే దారిలో గంగులు అనే దొంగ సూరయ్యను వెంబడించసాగాడు. చుట్టూ ఎవరూ లేని సమయం చూసి సూరయ్య మెడ మీద కత్తి పెట్టాడు. ‘మర్యాదగా నీ దగ్గర ఉన్న డబ్బు మొత్తం నాకిచ్చెయ్‌.. లేకపోతే చంపేస్తానుఅని బెదిరించాడు.


 అప్పుడు సూరయ్య మాత్రం భయపడకుండా.. ‘చూడు నాయనా! నా దగ్గరున్న డబ్బుతో జంతువులకు, పక్షులకు ఆహారం కొనేశాను. మా ఇంటికి వస్తే నీకు డబ్బిస్తానుఅన్నాడు.



నిన్ను నమ్మడం ఎలా?’  అడిగాడు గంగులు.


 నేను మాటిస్తే తప్పను. నాతో వస్తే నీకే తెలుస్తుంది!’ సూరయ్య బదులిచ్చాడు.


 సరే!’ అంటూ గంగులు సూరయ్య ఇంటికి నడిచాడు.


 అప్పటికే జంతువులు, పక్షులు ఆహారం కోసం ఆవురావురుమంటూ ఎదురు చూస్తున్నాయి.



అయ్యయ్యో! పట్నం వెళ్లడం వల్ల కొంచెం ఆలస్యమైంది. ఇప్పుడే పెడతాను తినండిఅంటూ పక్షులకు తిండి గింజలు, జంతువులకు గడ్డి వేశాడు. అవి తింటూ ఆకలి తీర్చుకోసాగాయి. 


గంగులు అదంతా చూసి ఆశ్చర్యపోయాడు. సూరయ్యతోవీటిని ఎందుకు చేరదీశావు. భలే అమాయకంగా ఉన్నావే! నిన్ను చూస్తే నవ్వొస్తోంది. జంతువుల్లో నేను వదిలేసిన ఆవు కూడా ఉంది. నిన్న మొన్నటి వరకూ దాని పాలు అమ్ముకుంటూ బతికాను. ఇప్పుడు ఆవు లేకపోవడంతో కష్టపడడం ఇష్టం లేక దొంగతనాలు మొదలు పెట్టాను. వీటిని వృథాగా పోషిస్తున్న నిన్ను చూస్తే జాలి కూడా కలుగుతోంది. నాకు డబ్బిచ్చెయ్‌. వెళ్లిపోతానుఅని వెటకారంగా నవ్వుతూ అన్నాడు గంగులు.



అప్పుడు గంగులుతో సూరయ్య ఇలా అన్నాడు. ‘చూడు గంగులూ! నిన్న మొన్నటి వరకూ జంతువులు, పక్షులు అందరికీ ఉపయోగపడ్డాయి. ప్రకృతి సమతుల్యతను కాపాడాయి. ఓపిక ఉన్నంత వరకూ కష్టపడి పని చేశాయి. ఓపిక లేక ఇక్కడికొచ్చాయి. కానీ కళ్లు, కాళ్లు, చేతులూ చక్కగా ఉండి ఒంట్లో ఓపిక ఉండి పని చేసుకోకుండా దొంగతనాలు చేస్తూ బతికే నిన్ను చూస్తుంటే నవ్వొస్తోందిఅన్నాడు. 


 సూరయ్య మాటలకు గంగులులో పరివర్తన మొదలైంది.


పనికిరాని మూగ జీవుల కడుపు నింపడం కోసం మీరు కష్టపడుతున్నారు. ఓపిక ఉండి కూడా కష్ట పడకుండా దొంగతనాలు చేసుకుంటూ బతుకుతున్న నా మీద నాకే అసహ్యం వేస్తోంది. ఇక ఇప్పటి నుంచి కష్ట పడి పని చేసుకుంటూ బతుకుతాను. దొంగతనాలు చేయనుఅన్నాడు. 


మాటలు విన్న సూరయ్య సంతోషించాడు.



నీలో మార్పు వచ్చింది. డబ్బుతో ఏదైనా వ్యాపారం చేసుకుని బతుకు. ఇంతకు ముందు నా దగ్గర డబ్బు ఉన్నా లేదన్నాను. నీలో మార్పు రావడానికి అలా చెప్పి ఇంటికి రమ్మన్నాను. నా ప్రయత్నం ఫలించిందిఅంటూ గంగులు భుజం తట్టాడు.



 గంగులు సూరయ్యకు నమస్కరించి ముందుకు కదిలాడు.


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹


 అమరుఁజెవి శాస్త్రమున కుండలమునగాదు

 వలయముననొప్ప దీవిచే వెలయుఁబాణి

 ఉరుదయాఢ్యుల మేను పరోపకార

 కలన రాణించు; గంధంబువలన గాదు


చెవులు.. వినడం వల్ల రాణిస్తాయి తప్ప, కుండలాల వల్ల కాదు! చేతులు దానం చేయడం వల్ల రాణిస్తాయి తప్ప కంకణాల వల్ల కాదు. గొప్పవారైన దయార్ద్ర హృదయుల శరీరం.. పరోపకారం వల్ల రాణిస్తుంది తప్ప సువాసనలు గల మైపూతతో కాదు అని సుభాషిత రత్నం అర్థం.

No comments:

Post a Comment