Saturday, 22 January 2022

విలువైన బహుమతి

 

       ➖➖➖✍️

*ఈరోజు నా పుట్టినరోజు. అతిథులను స్వాగతించడంలో నా భార్య, పిల్లలు నిమగ్నమై ఉన్నారు. నా స్నేహితులు, కొంతమంది బంధువులు వారి కుటుంబాలతో వచ్చారు. టేబుల్‌ను అలంకరించారు. రంగురంగుల బెలూన్‌లను చూసి పిల్లలు ఆనందంగా, ఉల్లాసంగా ఉన్నారు. చుట్టూ రంగుల బహుమతుల ప్యాకెట్లు ఉన్నాయి. అందరూ ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. టేబుల్ మీద పెద్ద కేక్ అలంకరించబడి ఉంది.*

*నేను మాత్రం చాలా సంవత్సరాల వెనక్కి వెళ్లి, కేవలం 12-13 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పటి, నా జ్ఞాపకాలలో మునిగిపోయాను…*

*నగరంలోని ఓ చెట్టుకింద కూర్చొని దారిన వెళ్లే వారి దగ్గర డబ్బులు అడుక్కునేవాడిని. సాయంత్రం అయ్యేసరికి నాకు, అమ్మకి తిండి పెట్టడానికి సరిపడా డబ్బు వచ్చేది.*

*ఒకరోజు నగరానికి కొత్తగా వచ్చినట్లనిపించిన ఒక పెద్దమనిషి అటునుండి వెళ్తూండడం గమనించాను. అతను తన కార్యాలయానికి కాలినడకన వెళ్లేవాడు.*

*నేను అతని వైపు పరిగెత్తాను, ముకుళిత హస్తాలతో పలకరించాను, భిక్ష అడగడానికి నా చేతులు చాచాను. పెద్ద మనిషిలా అనిపించడం వలన  కొంత ఎక్కువ డబ్బు ఇస్తాడని ఆశించాను ..... కనీసం ఇరవై రూపాయలైనా ఇస్తాడనుకున్నాను.*

*కానీ అలా జరగలేదు. అందుకు భిన్నంగా నేను అడుక్కోవడానికి చేతులు చాచడం ఆయనకు అస్సలు లేదని అతని భావవ్యక్తీకరణ ద్వారా స్పష్టమైంది. అయినా నా అరచేతిలో ఐదు రూపాయల నాణెం వేశాడు.*

*ఒకట్రెండు రోజులు ఆయన దగ్గరకు వెళ్లి డబ్బులు అడిగినా ఏమీ మాట్లాడలేదు. అతను నా చేతిలో రెండు నుంచి ఐదు రూపాయలు మాత్రమే పెట్టేవాడు. కానీ నేను అడుక్కోవడం ఏమాత్రం నచ్చలేదన్న విషయం అతని ముఖకవళికలలో స్పష్టంగా గోచరించింది.*

*ఒకరోజు కోపం వచ్చి నన్ను దారుణంగా తిట్టాడు. "అడుక్కోవడానికి నీకు సిగ్గు లేదా! నువ్వు ఆరోగ్యంగా, బాగానే ఉన్నావు, తిండి సంపాదించుకోవడానికి కష్టపడాలి, నీలాగా అందరూ అడుక్కోవడం మొదలుపెడితే, దేశంలో ఎవ్వరూ సంపాదించరు. మన దేశంలోని బిచ్చగాళ్లందరూ పనిచేస్తే, అప్పుడు మన ఆర్థిక వ్యవస్థ చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది", అన్నాడు.*

*ఆ పెద్దమనిషి మొహంలోని కోపాన్ని పసిగట్టిన నేను నిశ్శబ్దంగా తలవంచుకుని వెనక్కి నా చెట్టు వద్దకు వచ్చాను. ఇప్పుడు ఇంక అతను నాకు డబ్బు ఇవ్వడం మానేశాడు, నేను కూడా అతని వద్దకు పరుగెత్తటం మానేశాను. నేను చెట్టు నీడలో కూర్చునుంటే, ఆ పెద్దమనిషి కూడా నా వైపు చూస్తూ వేగంగా వెళ్ళిపోయేవాడు.*

*ఒకరోజు ఆయనే స్వయంగా నా దగ్గరకు వచ్చి నా పక్కన కూర్చుని నా యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మంచి మూడ్ లో ఉండటం వల్ల, ఇరవయ్యో, యాభయ్యో ఇస్తాడేమోననుకున్నాను. కానీ లేదు....బదులుగా ఒక ప్యాకెట్ ఇచ్చి, "ఈ రోజు, నేను నీ కోసం ఒక బహుమతి తెచ్చాను" అన్నాడు.*

*నేను ప్యాకెట్ తెరిచి చూసాను, అది బరువు చూసుకునే యంత్రం. "ఇక నుండి నువ్వు అడుక్కోవాల్సిన అవసరం లేదు. చాప వేసి, ఈ యంత్రాన్ని ముందు పెట్టుకుని, కూర్చో.. జనం వచ్చి, వారే బరువు చూసుకుని, ఐదు రూపాయలు ఇస్తారు. దీనితో నీవు  భిక్ష కోసం ఎవరి ముందు చేతులు చాచాల్సిన అవసరం ఉండదు, నీ కష్టార్జితంతోనే ఆహారం సంపాదించుకుంటావు" అని వెళ్తూ,వెళ్తూ చిరునవ్వుతో నా చెంప మీద మెత్తగా తట్టాడు. నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి.*

*ఇప్పుడు ఆ పెద్దమనిషి రోజూ నా దగ్గరకు రావడం మొదలుపెట్టాడు. నేను ఎలా ఉన్నాను , రోజుకు  ఎంత డబ్బు సంపాదిస్తున్నాను ఇలా అన్నీఅడిగేవాడు. ‘డబ్బు పొదుపు చేసుకో, నీ పెళ్లికి ఉపయోగపడుతుంది’ అంటూ నవ్వుతూ చమత్కరించేవాడు.* 

*మెల్లగా డబ్బు ఆదా చేయడం మొదలుపెట్టాను. ఆ పొదుపు చేసిన డబ్బుతో టీ దుకాణం తెరిచాను. నా వ్యాపారం పెరిగింది, నేను గౌరవప్రదమైన జీవితాన్ని గడపడం ప్రారంభించాను.*

*ఈ రోజు నాకు కావలసినవన్నీ నా వద్ద ఉన్నాయి - సంతోషకరమైన కుటుంబం, చాలా డబ్బు, కారు, మంచి స్నేహితులు. ఇలా ప్రతిదీ, దేనికీ లోటు లేదు.అయితే ఆ పెద్దమనిషి ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదుగానీ.. నెలరోజుల్లోనే వేరే ఊరికి బదిలీ అయిపోయాడని మాత్రం తెలుసు.*

*"పుట్టిన రోజు శుభాకాంక్షలు!" అని అందరూ పాడుతూండగా, జ్ఞాపకాల దొంతరలోంచి ప్రస్తుత క్షణానికి తిరిగి వచ్చాను. కొవ్వొత్తులను ఊది, నేను కేక్ కట్ చేసాను. అందరూ బహుమతులు ఇచ్చారు, కానీ నా జీవితాన్ని మార్చివేసిన ఆ విలువైన బహుమతిని నేను గుర్తుచేసుకుంటున్నాను. ఆ బహుమతి నన్ను ఈ రోజు నేను ఉన్న స్థితికి తీసుకువచ్చింది.*

*ఆ పెద్దమనిషి ఎక్కడ ఉన్నాడో తెలియదు కానీ.. ఎక్కడ ఉన్నా వందలాది మందికి మార్గనిర్దేశనం చేస్తూ, అందరికీ కొత్త దారి చూపుతాడనే నమ్మకం నాకుంది. నా చుట్టుపక్కల వాళ్లందరిని చూస్తూ నేను నవ్వుతూంటే, ఆయన్ను గుర్తు చేసుకుని నా కళ్లు చెమర్చాయి.*

Wednesday, 19 January 2022

వెంటనే, అంతా మారిపోయింది

 

కథ ♥️
చదవడానికి ముందు ఒక్క క్షణం ఆగి... మెల్లగా కళ్లు మూసుకోండి... మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని అనుభూతి చెందండి... ఆ వాతావరణపు లోతుల్లోకి వెళ్లండి.... చదవడం కొనసాగించండి...
పరిస్థితిని బట్టి అవగాహనలో మార్పు
ఓ రైలులో ఇద్దరు పిల్లలు అటు ఇటు పరుగెడుతున్నారు. ఒక్కోసారి ఒకరితో ఒకరు పోట్లాడుకుంటున్నారు, ఒక్కోసారి సీట్లపైన ఎక్కి గెంతుతున్నారు.
పక్కనే కూర్చున్న వారి తండ్రి తన ఆలోచనల్లో కూరుకుపోయాడు. మధ్యమధ్యలో పిల్లలు తనవైపు చూస్తున్నప్పుడు, ఆప్యాయంగా చిరునవ్వు నవ్వుతున్నాడు, ఆ తర్వాత పిల్లలు మళ్లీ తమ అల్లరిలో మునిగిపోతున్నారు, వారిని అతను ప్రేమగా చూస్తూ ఉన్నాడు.
రైలులో ప్రయాణిస్తున్న తోటి ప్రయాణికులు పిల్లల అల్లరితో విసుగు చెంది, తండ్రి వైఖరిని చూసి చిరాకుపడ్డారు. రాత్రి సమయం కావడంతో అందరూ విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నారు. పిల్లల అల్లరి చూసి ఓ ప్రయాణికుడు ఆపుకోలేక తండ్రితో, "ఏమి తండ్రండీ మీరు.. పిల్లలు అంత అల్లరిగా ప్రవర్తిస్తూంటే, వాళ్ళని ఆపకుండా చిరునవ్వుతో ప్రోత్సహిస్తున్నారు. వారికి వివరించడం మీ బాధ్యత కాదా?", అని అన్నాడు.
ఆ పెద్దమనిషి ఇలా ధైర్యంగా అడగడంతో ఇప్పుడు ఆ తండ్రి సిగ్గుపడి పిల్లల అల్లరిని ఆపుతాడని ఇతర ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
కానీ తండ్రి కొన్ని క్షణాలు ఆగి, "వారికి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను" అన్నాడు.
ప్రయాణికుడు "ఎలా చెప్పాలా.... అంటే అర్థం ఏమిటి ?" అన్నాడు.
ఆ వ్యక్తి ఇలా అన్నాడు, "నా భార్య తన పుట్టింటికి వెళ్ళింది, ఆమె నిన్న ప్రమాదంలో మరణించింది, నేను పిల్లలను అంత్యక్రియల కోసం అక్కడికి తీసుకువెళుతున్నాను, ఇప్పుడు వారు ఎప్పటికీ తమ అమ్మని చూడలేరు అన్న విషయాన్ని వారికి ఎలా వివరించాలా అని నేను అయోమయంలో ఉన్నాను."
ఇది విని అందరూ అవాక్కయ్యారు. అసలు ఏదైనా మాట్లాడడం పక్కన పెడితే, ఎవరూ ఏమీ ఆలోచించలేక అందరూ స్తబ్ధుగా అయిపోయారు.
పిల్లలు ఇంకా తమ అల్లరిలో మునిగిపోయి ఉన్నారు. కంపార్ట్మెంట్ లో ఇంకా అటుఇటు పరిగెడుతూనే ఉన్నారు. తండ్రి మళ్ళీ మౌనం వహించాడు.
వాతావరణంలో ఎలాంటి మార్పు లేదు, కానీ ఇప్పుడు ఆ పిల్లలు, తోటి ప్రయాణీకులకు క్రమశిక్షణ లేని పిల్లలలా కనిపించడం లేదు, ప్రతి ఒక్కరూ వారిపై ప్రేమను కురిపించాలనుకున్న మృదువైన లేతపువ్వుల వలే కనిపిస్తున్నారు.
ఇప్పుడు తండ్రి కూడా బాధ్యత లేనివాడిగా కనిపించడం లేదు, తన జీవిత భాగస్వామిని పోగొట్టుకుని దీనంగా ఉన్న ఇద్దరు పిల్లలకు తండ్రిగా, ఒక తల్లిగా కనిపిస్తున్నాడు.
ఇలాంటిదే మరో సందర్భంలో, రోడ్డు మీద నా ముందు ఒక కారు చాలా నెమ్మదిగా కదులుతోంది, నేను పదే పదే హారన్ కొట్టినా నన్ను ముందుకు దాటనివ్వట్లేదు. నేను నా సహనాన్ని కోల్పోయే సమయంలో, కారు వెనుక ఉన్న చిన్న స్టిక్కర్ ని చూసాను,
అక్కడ ఇలా రాసి ఉంది: "శారీరక వికలాంగులు; దయచేసి ఓపికపట్టండి!"
అది చదివిన వెంటనే, అంతా మారిపోయింది! వెంటనే తేరుకుని కారు నెమ్మది చేసాను. ఆ కారు డ్రైవర్ కి ఇబ్బంది కలగకుండా నేను కూడా ప్రత్యేక శ్రద్ధతో నడపడం మొదలుపెట్టాను. కొన్ని నిమిషాలు ఆలస్యంగా ఆఫీసుకు చేరుకున్నా, మనస్సులో ఒక సంతృప్తి ఉంది.
నిజమైనా, అబద్ధమైనా ఇది కథ మాత్రమే. కానీ ముఖ్యమైన విషయం ఏమిటంటే అనుభూతి/గ్రహణశక్తి/ఆలోచనలో మార్పు మన ప్రవర్తనలో మార్పుకు దారితీస్తుంది. ఒకరి పట్ల మన వైఖరి, అవగాహన ఒక్కక్షణంలో మారిపోతుంది.
మన చుట్టూ ఉన్నవాటిపై మన స్వంత అవగాహనల ఆధారంగా, మనం సృష్టించుకున్న దృష్టి కోణం వల్ల మనమందరం ఒకరకమైన గందరగోళంలో ఉంటాం.
జీవితంలో కష్టాలు ఉండవని కాదు... కానీ నిరాశ లేదా ప్రతికూల ఆలోచనలు, ఆ పరిస్థితులను మార్చడానికి మనకు సహాయపడతాయా?
కావలసింది ఆశ - ఉత్సాహంతో కూడిన సానుకూల ఆలోచన. అప్పుడు మన హృదయంలో మార్పును వెంటనే అనుభూతి చెందుతాం. ఆ సానుకూల దృక్పథంతో వైరాగ్యపు ఎడారి కూడా పచ్చని అడవిలా ఉల్లాసంగా మారుతుంది.
♾️
మనస్సును క్రమబద్ధీకరించి, జీవితంలోని విపత్కర పరిస్థితుల్లో కూడా మనం కాసేపు ఆగి, విశ్లేషించి సరైన చర్య తీసుకునే విధంగా స్థిరత్వానికి తీసుకురావడమే ధ్యానం యొక్క ఉద్దేశ్యం